అందమైన అమ్మ(సంక్రాంతి కథల పోటీ)

అందమైన అమ్మ
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: వడలి లక్ష్మీనాథ్ (సుబ్బలక్ష్మి రాచకొండ)

“అమ్మా! లేచి తొందరగా మందులు వేసుకో. నేను ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి. శివయ్య ఈరోజు అమెరికా నుండి వస్తున్నాడు గుర్తుందిగా!” అన్నాడు హర్ష.
“ఈ రోజేనా వచ్చేది శివయ్య” అంది సుశీల.
బాత్ రూమ్ కి వెళ్ళి వచ్చి నిస్సారంగా కూర్చుంది. హర్షని చూస్తుంటే ఎక్కడలేని దుఃఖం వస్తోంది సుశీలకి. వాడి భవిష్యత్తు తనవల్ల నాశనం అయిపోయిందన్న ఆలోచన నిలువునా దహించి వేస్తోంది.
సుశీలకి కాఫీ తెచ్చి, మందులు ఇచ్చి “అమ్మ వాడు ఇండియాలో ఉన్నన్ని రోజులు నేను కొంచెం బిజీగా ఉంటాను. శివయ్య ఉండేది వారం రోజులే. ఈ వారం రోజుల నీ పనులు నువ్వే చూసుకోవాలి. నేను నిన్ను కనిపెట్టుకుని ఉండలేను” చెప్పాడు లాలనగా.
“భోజనానికి వచ్చేస్తారు కదా!” అడిగింది సుశీల.
“వస్తాము కానీ, శివయ్య చాలా పనులు మీద వస్తున్నాడు. కనుక, ఎప్పుడు భోజనానికి వస్తామో తెలియదు. అందుకని నువ్వు సమయానికి తినేసేయ్” చెప్పి బయలుదేరాడు.
కారు డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ, హర్ష ఆలోచనలన్నీ నాలుగు సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాయి. బిటెక్ చదివే రోజులవి. శివయ్య పల్లెటూరి నుంచి వచ్చాడు. ఆ ఊరి పెద్దలు శివయ్యకి చదువు మీద ఉన్న ఉత్సాహం చూసి పట్నంలో కాలేజీలో జాయిన్ చేశారు. శివయ్య అందరిలో కలిసేవాడు కాదు. వాళ్ళ అమ్మ మీద బెంగతో ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడులా ఉండేవాడు. చదువులో చురుగ్గా ఉన్నా, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం అవ్వడం వల్ల తనకి లెక్చరర్లు చెప్పేది అవగాహన అయ్యేది కాదు. బీటెక్ మూడో సంవత్సరంలోకి వచ్చే వరకు కూడా శివయ్యకి, హర్షకి పెద్ద పరిచయం ఉండేది కాదు. బీటెక్ మూడో సంవత్సరంలో ఉండగా శివయ్యకి కామెర్లు వచ్చాయి. మూడో సంవత్సరం పరీక్షలు ఉండడం మూలాన తన ఊరు వెళితే చదువు పాడైపోతుందని హాస్టల్ లో ఉండేవాడు. తినడానికి ఏమి నచ్చేవి కాదు. ఆరోగ్యము మరింత పాడవడం మొదలైంది. అప్పుడు ఓనాడు హర్ష అమ్మతో చెప్పాడు “అమ్మ వాడు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. కొన్నాళ్ళు మన ఇంటికి తీసుకు వచ్చి ఉంచుకుందాము” అని. దానికి వెంటనే ఒప్పుకుంది సుశీల.

శివయ్య సుశీలలో తన తల్లిని చూసుకునేవాడు.
ప్రతి దానికి మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది అనేవాడు. వాళ్ళ అమ్మ గొప్పతనాన్ని అస్తమానము హర్షతో మాట్లాడుతూ ఉండేవాడు. శివయ్యకి అమ్మ మీద ఉన్న బెంగ తగ్గి ఉత్సాహంగా ఉండేవాడు.
శివయ్య అలా వాళ్లమ్మ గొప్పతనం గురించి మాట్లాడడం వలన, హర్షకి ఎప్పుడూ లేనిది అమ్మ సుశీల పట్ల కొత్త రకమైన అభిమానం ఏర్పడడం మొదలైంది.
శివయ్య ఎప్పుడూ తన తల్లి గురించి చెప్పుకునే వాడు. “మా అమ్మ వల్లే నేను ఇంతటి వాడిని అయ్యాను. మా అమ్మ ధైర్యమే నాకు వచ్చింది “అంటూ చెప్పుకునేవాడు.
శివయ్య రావడం వలన హర్ష చదువు కూడా బాగా బాగుపడింది. అన్నీ శివయ్యకి వివరంగా చెప్పడం వల్ల తన చదువు బాగా ముందంజలో ఉండేది. శివయ్య సుశీలకి మరో కొడుకులాగా ఉండేవాడు. ఇంట్లో వండిన వన్నీ ఇష్టముగా తినేవాడు. సుశీల సేవల వల్ల శివయ్య ఆరోగ్యం తొందర్లోనే కుదుటపడింది.
హర్షకి బీటెక్ తర్వాత అమెరికా వెళ్లాలనే కోరిక ఉండేది. దాంతో వాటికి సంబంధించిన పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకునేవాడు. అవి వల్లె వేసుకునేందుకు శివయ్యని కూర్చోబెట్టి వాడికి వివరించేవాడు.
“నువ్వు కూడా అమెరికాకు రావచ్చు కదా!” అనేవాడు హర్ష.
“లేదురా! మాది చాలా బీద కుటుంబం. మాకు ఇలా విదేశాలకు వెళ్లడం కుదరదు. మా అమ్మానాన్నలు కట్టెలు కొట్టి మమ్మల్ని పెంచారు. ఇప్పటికీ వాళ్ళకి అదే జీవనోపాధి. నేను అందరికంటే చిన్న వాడిని. అందువల్ల, నాకు ఇంత చదువు చదువుకొనే భాగ్యం కలిగింది. అమెరికా వెళ్లేంత స్థాయి కాదురా” అనే వాడు.
అప్పుడు హర్ష “నేను అమెరికా వెళ్ళిన తరువాత తొందర్లోనే నేను నిన్ను తీసుకెళ్తాను” అనేవాడు.

ఆలోచనలో ఉన్న హర్ష ట్రాఫిక్కు చూసుకోలేదు. ఉన్నట్టుండి సిగ్నల్ పడడం చూసి బ్రేక్ వేసి ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు. చుట్టూ చూస్తున్నాడు హర్ష.
శివయ్యకి హైదరాబాద్ అంతా తిప్పి చూపించింది తనే. ఇద్దరూ కలిసి తిరగని ప్లేస్ లేదు, చూడని ప్రదేశం లేదు. శివయ్య ప్రతిదీ విచిత్రంగా చూసేవాడు. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం అంటూ ఉండేవాడు.
“నేను ఎక్కడున్నా, ఎప్పుడూ హైదరాబాద్ నా ఫేవరెట్ ప్లేస్” అనేవాడు. తను పుట్టి పెరిగిన హైదరాబాద్ అయినా, శివయ్య అభిమానించడం వల్ల తనకు కూడా హైదరాబాద్ మీద మరింత ప్రేమ పెరిగింది. సిగ్నల్ మారడంతో ముందుకు కదిలాడు హర్ష.
ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ మరింత డెవలప్ అయింది. ఇంకా చాలా కొత్త కొత్త విశేషాలు ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు శివయ్య ఎంత మురిసిపోతాడు హైదరాబాద్ ను చూసి.
ఆలోచనల్లో ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చింది. కార్ పార్క్ చేసి వచ్చి లాంజ్ లో కూర్చున్నాడు. ఫ్లైట్ రావడానికి ఇంకా సమయం ఉంది. చుట్టూ చూశాడు ఎవరి వాళ్ళ రాకకోసం వాళ్లు పూల బొకేలతోనో, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు.
అనుకొన్నట్టు జరిగితే, ఈరోజు తను కదా రావాల్సింది. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాల్సింది పోయి, తను శివయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకొన్నది ఒకటి జరిగింది మరొకటి. మళ్లీ తనకు తనే చెప్పుకున్నాడు మన చేతుల్లో లేని, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకూడదని.
అమ్మ సేవలో నాలుగేళ్లుగా, తనలా అమ్మను చూసుకోవడానికి ఎంత మందికి అదృష్టం ఉంటుంది. తనకు చాలా తృప్తిగా ఉంది అనుకున్నాడు.
అసలు శివయ్య పరిచయం లేకపోతే తను అమ్మ గురించి ఇంత ఆలోచించేవాడు కాదేమో అనిపిస్తుంది. తనలోని అమ్మ మీద ఉన్న ప్రేమను నేర్పించింది మటుకు శివయ్యయే.
అమెరికాలోని అన్ని యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసమని అప్లికేషన్స్ పెడుతున్న టైంలో అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది. హర్షకి అమ్మను వదిలిపెట్టి అమెరికా వెళ్ళాలి అనిపించలేదు. ఆవిడకి వచ్చిన క్యాన్సర్ వల్ల ఎక్కువ రోజులు బ్రతికదని డాక్టర్లు చెప్పారు. దాంతో తను అమ్మ ఉన్నన్నాళ్ళూ ఆమెతోనే కలిసి ఉండాలని, అమ్మతోనే జీవితం గడపాలని ఆలోచించాడు. కానీ, తన చిరకాల వాంఛ అమెరికా వెళ్లడం గురించి ఎటూ తేల్చుకోలేక పోయాడు. అప్పుడు హర్షకి ఒక ఆలోచన వచ్చింది. శివయ్య తో “నువ్వు ఆల్రెడీ పరీక్షలకు తయారుగా ఉన్నావు. నువ్వు పరీక్ష ఇచ్చి, అమెరికా వెళ్ళిపో!” అన్నాడు.
“మేము ఉన్న వాళ్ళం కాదు. మేము ఇంకా చదువు మీద డబ్బులు పెట్టుకోలేము. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. అమ్మ వాళ్ళు కష్టం మీద బతుకుతున్నారు” చెప్పాడు.
“దాందేముంది నాకోసం అన్నీ సిద్ధం చేశారు నాన్నగారు. ఇంటి మీద లోన్ కోసం అప్లై చేద్దాం అనుకున్నారు కదా! అది నీ కోసమే చేస్తారు. నువ్వు బాగుపడరా! నేనైతే ఒకటా, నువ్వు అయితే ఒకటా” అని పంపించాడు హర్ష.

శివయ్య చేయి ఊపుకుంటూ బయటకు రావడంతో ఆలోచనలనుంచి బయటపడ్డాడు హర్ష.
శివయ్యని గట్టిగా ఆలింగనం చేసుకుని తీసుకెళ్ళాడు. శివయ్య బాగా మారిపోయాడు. మంచి రంగు వచ్చి, పట్నం నుంచి వచ్చిన దొరలాగ ఉన్నాడు. కారెక్కి బయల్దేరారు శివయ్య, హర్ష. ఇరువురు ఒకరి క్షేమ సమాచారాలు ఇంకొకరు కనుక్కొన్నాకా, శివయ్య అన్నాడు “ఇంక ఈ దేశం బాగుపడదా? ఏంట్రా! ఈ ట్రాఫిక్ ఏంటి? ఎలా బతుకుతున్నారో ఇక్కడ మీరు? ఈ రోడ్లు, ఈ దుమ్ము ఏంటి? నువ్వు అసలు ఎలా ఉంటున్నావ్ రా? ఇదే అమెరికాలో అయితే ఎవరు లేన్ లో వాళ్లే వెళ్తారు. ఇక్కడ ఏంట్రా ఒకరి మీద ఒకరు దూసుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. షాపులు ఏంటి అన్నీ ఓ పక్కగా ఉండకుండా ఇలా కట్టుకుంటారు. ఒకసారి అమెరికా వెళ్ళి, అక్కడి వాళ్ళని చూసి నేర్చుకుంటారా? అంటే అదీ లేదు” అన్నాడు.
తోవంతా శివయ్య అమెరికా గొప్పతనం అంతా వర్ణించాడు, కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అక్కడ ఉండే బిల్డింగులు, అక్కడ ఉండే శుభ్రత, రోడ్స్, డిసిప్లిన్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉన్నాడు.
“ఇండియన్ డిసిప్లిన్ ఇంతేరా! వీళ్లు మారరు. చూడు రోడ్డుమీద ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎలా పడేస్తున్నారో. ఇదే అమెరికాలో అయితే “అంటూ వరుసగా చెప్తూనే ఉన్నాడు శివయ్య.
“నువ్వు కూడా తొందరగా నాతో పాటు వచ్చేయి, హర్ష. అక్కడే సెటిలై పోదాం. అక్కడున్న సౌకర్యాలు చూస్తే నువ్వు ఆశ్చర్య పోతావు. అంతా ఒక పద్ధతిగా గడిచిపోతుంది. దేనికోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు” చెప్పాడు.
” నాకు అమ్మ బాధ్యత ఉంది కదరా! నేను అమ్మను వదిలి ఎక్కడికి రాను” ముక్తసరిగా చెప్పాడు హర్ష.

ఇంటికొచ్చి సుశీలను ప్రేమగా పలకరించాడు శివయ్య. పక్కనే కూర్చుని మాట్లాడాడు. తర్వాత హర్షతో “ఒరేయ్ ఒకసారి ఊరు వెళ్లి అమ్మను చూసి రావాలి. నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఎక్కువ సమయం వాళ్ళతో గడపలేను. కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండాలని ఉంది, కానీ కుదరదు. నువ్వు కూడా రా రా. మా ఊరు ఎప్పుడూ చూడలేదు కదా!” అన్నాడు.
“లేదురా! నేను అమ్మని వదిలి రాలేను. నువ్వు వెళ్ళు” అన్నాడు హర్ష.
అప్పుడు సుశీల శివయ్యతో “నీతో పాటు హర్షను కూడా తీసుకొనివెళ్ళు. ఈ నాలుగేళ్ల నుంచి నన్ను వదిలి పెట్టకుండా నాతోనే ఉంటున్నాడు. కొంచెం ఊరు మార్పుగా ఉంటుంది, మీ ఊరిని కూడా చూసినట్టు ఉంటుంది. ఇప్పటి దాకా మీ అమ్మగారిని, ఊరును హర్ష చూడలేదు కదా” అంది.
ఇప్పటి వరకు శివయ్య వాళ్ళమ్మని చూడలేదు హర్ష. చూసే అవకాశం రాలేదు. కానీ, వాడు చెప్పిన దాన్ని బట్టి ఆమె చాలా సౌందర్యవతి, చాలా చక్కని వ్యక్తిత్వం గల మనిషిగా అనిపించేది.
రాత్రి పడుకునే ముందు శివయ్య హర్షతో “నీలాగే నాకూ తల్లితండ్రులను చూసుకోవాలని ఉంది. నువ్వు అదృష్టవంతుడివి రా!” అన్నాడు.
మర్నాడు పొద్దున్నే లేచి ఊరు బయల్దేరారు ఇద్దరూ. హర్ష డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాళ్లది హైదరాబాదు నుండి కొంత దూరంలో ఉన్న ఊరు. ఆ ఊరిలోకి వెళుతుండగానే పచ్చటి తివాచీ పరిచినట్లు ఉన్న పొలాలు, పక్షుల కిలకిలారావాలతో చాలా అందంగా ఉంది. మట్టిరోడ్డు మీద వెళుతోంది కారు. “వీళ్ళు ఇంకా మారరా? ఈ మట్టి రోడ్లమీద తిరుగుతారు. ఇక్కడ మంచి రోడ్డు వేయించవచ్చు కదా! వీళ్ళు ఏం పట్టించుకోరు” విసుగ్గా మాట్లాడుతున్నాడు శివయ్య.

శివయ్య చెప్పిన ఆధారాలతో లోపలికి వెళుతుంటే, ఊరి లోపలికి ఒక చిన్న గూడెంలాగ ఉంది. అక్కడ కారు వెళ్ళే దారి లేదు. కాలి బాటన నడుస్తున్నారు స్నేహితులు. దానిలో వీళ్ళు నడుస్తుంటే, ఆ ఊర్లో జనాలు అందరూ వింతగా చూస్తున్నారు. అందరికీ శివయ్య “నేను గుర్తు లేనా, శివయ్యని ” అంటే, “అయ్య బాబోయ్, ఇంత పెద్ద దొరబాబు లాగా ఉన్నావు, నువ్వేనా” అంటూ ఆశ్చర్యపోతున్నారు.
కొంత దూరం వెళ్ళాక ఒక గుడిసె ఉంది. దాని ముందుకెళ్లి “అమ్మ” అని పిలిచాడు శివయ్య.
హర్ష ఎదురుచూస్తున్నాడు ఎన్నాళ్లనుంచో శివయ్య వాళ్ళమ్మని చూడాలని. శివయ్య చెప్పినదాన్ని బట్టి ఊహల్లో సినిమాలో సావిత్రి లాగా ఊహించుకున్నాడు .
లోపలి నుంచి ఒక నల్లటి విగ్రహం బయటకు వచ్చింది. ఆమె చాలా లావుగా ఉంది. ఆమె జుట్టు తైల సంస్కారాలు లేకపోవడం వల్ల కళా విహీనంగా ఉంది.
కట్టలు కొట్టిన శరీరం అవడం వలన మనిషి మొరటుగా ఉంది. ఒంటిపై ఉన్న చీర ముతకగా, చిరుగుపట్టి ఉంది.
“వచ్చింది ఎవరు?” అనుకుంటూ కొడుకుని చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది ఆవిడ.
” ఏంట్రా నువ్వేనా, నా కొడుకు శివయ్య బాబు…..అచ్చు దొరబాబులా అయిపోయావ్” అంటూ దగ్గర కూర్చో పెట్టుకుంది. అన్నంలో ఇంత ఉప్పు, కారం, వెల్లుల్లి కొట్టి నూనె పోసి కలిపి తెచ్చి ఇద్దరికీ తినిపించింది. ఆ భోజనం చాలా రుచిగా ఉంది.
హర్ష ఊహల్లో ఉన్న శివయ్య తల్లికి, ఈవిడ చాలా విభిన్నంగా ఉంది.
రెండు రోజులుండి పొమ్మని ఆవిడ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది. దానికి శివయ్య “నువ్వు రెడీగా ఉండు. పై నెల వచ్చి నిన్ను, అయ్యను అమెరికా తీసుకొనిపోతా” చెప్పాడు.
దానికి ఆమె ” నేను అమెరికా రాలేను. అక్కడ అందరూ ఇంగ్లీషు మాట్లాడుతారుట. ఆ దొరసానుల మధ్య మేము ఉండలేము. మేము ఇక్కడే ఉంటాం. మేము పట్టణంలో ఉన్న మీ అన్న తీసుకెళ్తే, ఉండలేక మళ్లీ ఊరు వచ్చేసాము. నేను ఊరు విడిచి ఉండలేను. నువ్వే వచ్చి చూసి పో” చెప్పింది.
“వచ్చే నెల వరకు మనసు మార్చుకోండి ఇద్దరు. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాను” అని చెప్పి వీడ్కోలు పలికి బయలుదేరాడు శివయ్య.
“వీళ్లు ఎంత చెప్పినా వినరు. రావచ్చు కదా నాతో పాటు. నేను వీళ్లని తీసుకెళ్ళి సుఖ పెడతాను” అన్నాడు.
“నువ్వు చెప్పిన దాని పట్టి , మీ అమ్మ నేను అనుకొన్నట్టుగా లేదు” అన్నాడు హర్ష.
“జీవితం అంతా చెట్లు కొట్టి కొట్టి అలిసిపోయారు. చిన్నప్పటి నుంచి అదే పని చేస్తోంది. ఆ పని చేసేవారు అలా కాకుండా ఎలా ఉంటారు ” అన్నాడు శివయ్య.
అప్పుడు హర్ష అడిగాడు “అమెరికాలో అమ్మలు అందరూ ఇంగ్లీషునే మాట్లాడతారు కదా!” అన్నాడు.
అప్పుడు శివయ్య నవ్వుతూ అన్నాడు” అక్కడ ముష్టి వాడు కూడా ఇంగ్లీషు మాట్లాడుతాడు రా ” అని.
“మరి అక్కడ అమ్మలు చాలా స్టైలిష్ గా తెల్లగా బాగుంటారేమో కదా!” అన్నాడు.
“అవున్రా 80 ఏళ్ళ వాళ్లు కూడా యాక్టివ్గా వాళ్ల గురించి వాళ్లు చూసుకుంటూ, వాకింగ్ చేస్తూ, ఉంటారు. హాయిగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని, ముసలి వాళ్లలా కూడా ఉండరు” చెప్పాడు.
మీ అమ్మవాళ్ళ కోసం ఎందుకురా అంత బాధ పడతావు. ఆవిడ నువ్వు చెప్పినట్లుగా చూడడానికి కూడా అంత బాగా లేదు. కాయ కష్టం వల్లనేమో, మొరటుగా ఉంది. అక్కడ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే, తెల్లగా, బలంగా ఉండే అమ్మలు ఉంటారు కదా! వాళ్ళలో ఎవరైనా అమ్మను, అమ్మగా చేసుకోవచ్చు కదా! రానన్న అమ్మను ఇక్కడే వదిలి వేయవచ్చు కదా!” అన్నాడు హర్ష.
అదేంట్రా మా అమ్మ గురించి అలా మాట్లాడతావు. మా అమ్మ చాలా చక్కనిది. పల్లెలో మాకోసం కాయకష్టంచేసి, మా అమ్మ ఇలాఉంది. అమ్మ అమ్మే కదా! అమెరికాలో ఉన్న వాళ్ళు ఎంత బాగున్నా , మా అమ్మకి సరికారు” అన్నాడు శివయ్య బాధతో.
“నువ్వు అడిగావు కదా! నువ్వు ఈ దేశంలో ఎలా ఉంటున్నావు అని. ఇప్పుడు అర్థం అయిందా? మీ అమ్మ ఎలా ఉన్నా, నీకు ఎలా గొప్పగా ఉందో, నాకు కూడా ఈ దేశం అంతే గొప్పది. ఇంతకు ముందు నేను అమెరికా వెల్దాము అనుకొన్నాను. కానీ, ఇప్పుడు నేను ఇక్కడినుంచి వదిలి రావాలి అనుకోవట్లేదు. నిన్ను చూశాక నా నిర్ణయం మార్చుకొంటున్నాను. నాకు ఈ దేశం అంటే ఇష్టం. అమ్మంత ఇష్టం. దాన్ని నేను వదలి రాను” అని చెప్పాడు.
అప్పుడు శివయ్య కించిత్ చింతతో “నేను ఇలా ఎందుకు ఆలోచించడం లేదు. ఎలా ఉన్నా మన తల్లి మన తల్లి అయినట్టే, ఎలా ఉన్నా మన భూమి మన భూమిరా! నేను తప్పుగా ఆలోచించాను. తల్లితండ్రులు ఊరును వదిలి రాము అంటే, బలవంతంగా అయినా తీసుకొనివెళ్లాలని అనుకొన్నానే, కానీ, నీలా ఇక్కడే ఉంటూ వాళ్ళని చూసుకోవాలని అనుకోలేదు. నేను నెల తర్వాత పూర్తిగా ఇక్కడికి వచ్చేస్తాను” అన్నాడు సంతోషంగా.

*************************

You May Also Like

4 thoughts on “అందమైన అమ్మ(సంక్రాంతి కథల పోటీ)

  1. అద్భుతమైన కధ. మంచి నీతిని క్లుప్తం గా చెప్పారు.

  2. 👏 👏 👏 అమ్మ అందం కనిపించేది కాదు.. ఆమె ప్రేమలో ఉంది.. నిజమైన అందం.. చాలా బాగుంది మీ కథ❤️❤️

  3. తల్లి అంటే జన్మనిచ్చిన ఆడది మాత్రమే కాదు , పుట్టిన నేలకూడా తల్లే అని బాగా చెప్పారు . ఈ రోజుల్లో ఇటువంటి సందేశాత్మక కథలు ఎంతైనా అవసరం .

Leave a Reply to subbu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!