మూలాలు

మూలాలు

రచన :: మంగు కృష్ణకుమారి

ఒక తరం ముందు:

“పెద్దబాబూ, మనింటి పరిస్థితులు చూస్తున్నావు కదూ” మాధవయ్య గారు భారంగా అన్నారు.

నలుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్ళు అతనికి. దివాకరం పెద్దకొడుకు. సిటీలో బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నారు మాధవయ్య గారు.

ఆడపిల్లలు పెళ్ళికి ఎదుగుతున్నారు. మాధవయ్యకి బెంగపట్టుకుంది.

దివాకరం పితృభక్తి పరాయణుడు. ఈలోగా,లలితమ్మ కూడా అక్కడకి వచ్చింది.

“నాన్నా, నేను చేయగలిగినంత చేస్తాను.  మీరు చెప్పండి. ఏం చేయాలో?” దివాకరం భక్తిగా అన్నాడు. “ఆడపిల్లల పెళ్ళిళ్ళ పూచీవో, మగపిల్లల చదువుల పూచీవో ఏదో ఒకటి నువ్వు పడాలి” మాధవయ్యగారు అన్నారు.

దివాకరం ఆలోచించి “నాన్నా ఆడపిల్లల పెళ్ళిళ్ళు మీరు నిర్ణయించాలి కదా, తమ్ముళ్ళని నాతో పంపియండి.  సిటీలో జాయిన్ చేస్తాను” అన్నాడు.

లలితమ్మ “అదే సరైన పనండి, మొదట మన రేవతికి సంబంధం చూద్దాం. దాని పెళ్ళవగానే పెద్దబాబుకి చూడొచ్చు” అంది.

ఆ సంవత్సరం దివాకరంతో‌ మొదట శ్రీనివాస్, చంద్రశేఖర్ వచ్చేసేరు. శ్రీనివాస్ కాలేజ్ లో‌ చంద్రశేఖర్ హైస్కూల్లో జాయిన్ అయేరు. దివాకరం ఓ చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు.

ఓ‌ కిరసనాయిల్ స్టౌ కొని, తల్లి ఇచ్చిన నాలుగు గిన్నెలు సద్దేడు. చిన్నప్పటినించీ, తల్లి కానుపులప్పుడూ,ఆరోగ్యం బాగా లేనప్పుడు తండ్రికి వంటలో సాయం చేయడం అలవాటే.

నెలకోసారి తమ ఊరు వెళ్ళడం కావలసిన సామాన్లు తెచ్చుకొని పొదుపుగా ఉండడం, తమ్ముళ్ళని దగ్గర ఉండి చదివించడం చేసేవాడు.

రేవతి పెళ్ళికి లోన్ పెట్టి తను చేయగలిగిన సాయం చేసేడు.

తల్లీ తండ్రీ చూసిన అమ్మాయి వరలక్ష్మి తోనే దివాకరం పెళ్ళి అయింది.  ‘సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి రా, సీతాదేవేరా’ అని తల్లి పొగిడినట్లు వరలక్ష్మి ఇమిడిపోయింది.

‘భార్య మాటలకి విలువ ఇవ్వకపోతే సంసారాలు సక్రమంగా సాగవు’ అనే తండ్రి మాటనే ఆదర్శంగా తీసుకున్న దివాకరం వరలక్ష్మితో చర్చించే, ఏ పనయినా చేసేవాడు. 

రేవతి పురిటికి వచ్చేసరికి వరలక్ష్మి అక్కడ నెల రోజులుండి అత్తగారికి కుడిభుజంలాగ సాయం చేసింది.

సుందరి పెళ్ళికి రేవతి ఏడాది  కూతురుతో ఉంది. వరలక్ష్మికి అయిదో నెల. శ్రీనివాస్ కి

రైల్వేలో ఉద్యోగం వచ్చింది. దివాకరం చాలా సంతోషించేడు.

మూడో చెల్లి‌ కీ, శ్రీనివాస్ కీ కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేసేరు. ఇటూ, అటూ కట్నాలు లేవు.

నాలుగో చెల్లి జయకి కోరి వచ్చిన సుధీర్ తో పెళ్ళి చేసేరు. అప్పటికి వరలక్ష్మి కి ఇద్దరు కొడుకులు.

చంద్రశేఖర్ పాలిటెక్నిక్ పరీక్షలు పాసయి ఫోర్ మెన్ గా జాయిన్ అయిన రోజు దివాకరం ఆనందానికి హద్దులేదు.అప్పటికి ఆఖరు తమ్ముడు మౌళి ఎమ్.ఎస్సి లో ఉన్నాడు.

ఇన్ని జరగడంలో ప్రతీ ఘట్టంలో వరలక్ష్మి భర్తకీ, అత్తగారికీ అందించిన సహకారం సామాన్యమైనది కాదు. నోరు మెదపకుండా ఎప్పుడూ తక్కువలతో గడుపుకుంటూ బతికింది.తన పిల్లలకి కూడా, బాబాయిలతొ, మేనత్తలతో ఆప్యాయంగా ఉండడమే నేర్పింది.

 

‘మాధవయ్య గారి తెలివి తేటలు ఎవరికీ ఉండవు. ఇటు అల్లుళ్ళు, అటు కోడళ్ళని చాలా బాగా ఎంచుకున్నారు.’అని అందరూ అనుకోడం వరలక్ష్మి కే తెలుసు. 

మాధవయ్య గారికి గుండె నొప్పి తరచూ వస్తూ ఉంటే దివాకరం తల్లితండ్రులని తన దగ్గరకి తెచ్చి, తండ్రిని హాస్పిటల్ లో జాయిన్ చేసాడు. అతనికి సీరియస్ గా ఉందని అందరూ వచ్చారు. భార్యా కొడుకులూ కోడళ్ళు, కూతుళ్ళు అల్లుళ్ళు, మనవలు మనవరాళ్ళు పక్కన ఉండగా ఆఖరి శ్వాస తీసిన‌ మాధవయ్య మీద వాలి లలితమ్మ భోరుమంది. దివాకరంతో పాటు అందరూ వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటే, దగ్గర బంధువులు మాత్రం

“దశరధుడికి ఇంత గొప్ప మరణం రాలేదే? అందరి చేతిమీదా దాటిపోయిన మహానుభావుడు.

రామచంద్రుడి లాటి కొడుకులు. సీతాదేవి లాటి కోడళ్ళు.” అనుకున్నారు.

కుటుంబ వ్యవస్థ మూలాలు రామాయణం తోనే ముడిపడి ఉన్నాయి మరి.

****

You May Also Like

2 thoughts on “మూలాలు

  1. బాగుంది అమ్మా. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ అంటే అంతే బలంగా అలాగే ఉండేది మరి👏👏

Leave a Reply to Parimala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!