నేలంతా రంగు చీర కట్టింది చూడు

వానవిల్లు రంగులను నేలకు తెచ్చి
భువి మేఘమాలలతో జతకట్టి
కలతలే మరిచి కవ్వింతలే పూచి
ఊరు వాడా కలిసి అంబరాన్ని తాకే
సంబరాలతో ఆడుతుంటే హోలీ
నింగి నేల ఏకమై పోదా
నిండు చందమామ మన ఉల్లాసాలే చూసి
మనతో కలిసి ఆడుకోవాలంటూ నేలదిగిరాడా
బతుకే రంగోలి అంటూ
ప్రేమ పసుపును కళల ఎరుపును
ఆనందాల పచ్చదనాన్ని
కలగలపి రంగులే చల్లుకుంటూ
చిన్నా పెద్దా చిందులేస్తూ
వసంతానికి ఆహ్వానం పలుకుతూ
మదిలో మచ్చలని రంగులతో కడిగేస్తుంటే
ఆనందాన్ని అనురాగాన్ని పువ్వులుగా పూయిస్తుంటే
వసంతాలన్ని ఇంట నిలిచిపోవా
పచ్చదనాలన్ని మది గుమ్మానికి తోరణాలై పోవా
ఉల్లాసంగా ఉత్సాహంగా హోలీ మేమాడుతుంటే
నేలంతా రంగు చీర కట్టింది చూడు
ఆకాశమే వసంతాలు పోసుకుంది చూడు
మమతలే రంగులై మమ్మల్లుకున్నవి చూడు
విధులు వేరైనా ఊరకొటేనంటూ
సీతకొకచిలుకల్లా హోలీ ఆడుతుంటే
మా అల్లరి ఆటలు చూసి
మబ్బులే మురిసి రంగులనే వర్షించేనులే
వసంతాలే ముందే వచ్చి అలరించేనులే
కలిసుంటే నిత్యము హోలీనేలే
ఈ హోలీ ఆటలో ఎండలన్నీ వెన్నెల్లేనులే…
రచయిత: ఉదయగిరి దస్తగిరి
