మా ఊరి సంక్రాంతి సందడి (సంక్రాంతి కథల పోటీ)

మా ఊరి సంక్రాంతి సందడి
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: బాలపద్మం(వి వి పద్మనాభ రావు)

ఈ రోజు బాలు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ఇంచుమించు పది సంవత్సరాల తరువాత సొంత ఊరికి కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగకి వెళ్తున్నాడు. మరునాడే ప్రయాణం. ఉదయమే తన కారు సర్వీసింగ్ చేయించి పెట్రోల్ పూర్తిగా కొట్టించి అంతా సిద్దం చేసుకున్నాడు.
అసలు ఓ వారం ముందు నుంచే భార్య సుందరి నీ, పిల్లలు అరుణ్, కశ్యప్ నీ తెగ హడావిడి చేసేస్తున్నాడు. ప్రతి ఏటా అమ్మా నాన్నలు తన దగ్గరికే వస్తున్నారు సంక్రాంతికి, బాలు కి ఉద్యోగ రీత్యా వెళ్ళడం కుదరక. కానీ తనకి చిన్న నాటి స్నేహితులు, ఆప్యాయతలు పంచిన వాళ్ళ కుటుంబాలు, ఎంతో సంస్కృతి సంప్రదాయాలు నేర్పిన ఆ ఊరు అంటే తనకి చెప్పలేనంత ఇష్టం. తన భార్యా పిల్లలకు ఆ ముచ్చట్లు చూపాలని ఎంతో కుతూహలం. ఇన్నాళ్ళకు కుదిరింది.
పండుగ కి రెండు రోజులు ముందే ప్రయాణం, పండుగ అయ్యాకా రెండు రోజుల దాకా అక్కడే, అలా ప్రణాళిక చేసుకున్నారు.
ఇక పొతే సుందరయ్య గారికి బాలు తో బాటు హారిక అని ఒక అమ్మాయి. హారిక తన భర్త ప్రమోద్ పిల్లలు హరిణి, ప్రహ్లాద్ తో బాటు బెంగళూరులో స్థిరపడ్డారు. వారు కూడా ఈ సారి ఇక్కడకి వస్తున్నారు.
అంతా అనుకున్న ప్రకారం రాజోలు (కోనసీమ లో, తూర్పు గోదావరి జిల్లా) తమ సొంత ఊరు చేరుకున్నారు. మనమూ వెళ్దామా అక్కడ సందడి చూద్దాము.
మన బాలు కుటుంబం హైదరాబాద్ నుంచి బయలు దేరి సాయంత్రానికి ఊరు చేరారు. అప్పటికే సుందరయ్య గారు, భార్య విమల ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నారు, ప్రతి తల్లి తండ్రి లాగానే.
మరి ఇన్ని సంవత్సరాల తరువాత పండుగ ఎలా ఉందో చూద్దాం మన సుందరయ్య గారికి. తెలిసిన అమ్మాయిని వంట, ఇంటి పనిలో సాయానికి, ఒక డ్రైవర్ నీ, మరో ఇద్దరు పనుల్లో సాయానికి ముందుగానే మాట్లాడి పెట్టుకున్నారు. భోగి మంటలోకి ఎండిన చెట్టు కొమ్మలు, మనుమల చేత వేయించడానికి భోగి దండలు అవీ తయారుగా పెట్టుకున్నారు. వారికి, పిల్లలు మనుమలకి బట్టలు కూడా కొన్నారు.
సుందరయ్య గారు మనుమలని తీసుకుని ఊరంతా చూపించ డానికి బయలుదేరి తెలుసున్న వాళ్ళకి అందరికీ వారిని పరిచయం చేశారు. కిళ్లీ కొట్టు రంగయ్యకి, కిరాణా కొట్టు మంగయ్యకి చెప్పారు తన మనుమలు ఏమి అడిగినా ఇచ్చెయ్యమని ఆఖరున తను డబ్బులు ఇస్తానని. మన బాలు స్నేహితుల కుటుంబాలను కలవడానికి వెళ్ళాడు. ఇక అత్తా కోడళ్ళు, అన్నట్టు వీళ్ళు వరుస కే నండోయ్, నిజానికి తల్లీ కూతుళ్ళు లాగే ఉంటారు. వీళ్ళ ఉల్లాసం సరే సరి. పిండి వంటలూ అవీ తయారు చెయ్యడం లో మునిగిపోయారు. మరునాడు అమ్మాయి, అల్లుడు పిల్లలు చేరుకున్నారు.
భోగి పండుగ:
తెల్ల వారు జామునే ఊరంతా సందడే సందడి. వీధులన్నీ ముందు రోజు రంగవల్లుల తో రమణులంతా అలంకరించారు. గుడి ప్రాంగణాలు మరింత శోభాయమానం గా తీర్చి దిద్దారు. ప్రతి వీధిలో ఓ భోగి మంట. ఎండిన కలప, చెట్ల కొమ్మలతో ఎవరి మంట ఎంత ఎత్తుగా శోభిస్తోందో చూస్తూ పిల్లలంతా కేరింతలు కొడుతున్నారు. చిరు చీకటి కాన రాకుండే, చిరు చలి వెచ్చగా తోచు చుండే. పిల్లలందరూ భోగి దండలు వేయడం, ఆ భోగి మంటల మాటున పాలు కాచే వారు కొందరు. స్నానానికి నీళ్ళు పెట్టుకునే వారు కొందరు.
సాయంత్రం మనుమరాలు హరిణి తో గొబ్బిళ్ళ పేరంటం. చిన్న మనుమలు కశ్యప్, ప్రహ్లాద్ లకు భోగి పళ్ళు పేరంటం తో సందడి పూర్తి అయింది.
మకర సంక్రాంతి:
ఇదే పెద్ద పండుగ. ఆలయాలన్నీ ప్రత్యేక పూజలతో వేద మంత్రాల ఆశీర్వచనాలతో ఎంతో భక్తి పారవశ్యం గా ఉన్నాయి. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు ఊరంతా కాలుష్యం లేని దుమ్ముతో పొగమంచు ను తలపిస్తోంది. ఇక పండుగలు అంటే ప్రత్యేక పిండివంటల గురించి ప్రత్యేకం చెప్పాలా. పొట్టలు చెక్కలవ్వాల్సిందే కదా. అందరూ కొత్త బట్టలు వేసుకోవడం, ఊరంతా తిరిగి పలకరింపుల పులకింతలు, పాత జ్ఞాపకాలు, చిన్నప్పటి అల్లర్లు నెమరు వేసుకోవడం తో గడిచింది. బాలు, హారిక వారికి విద్యా బుద్దులు నేర్పిన గురువులకు, ఆత్మీయులైన పెద్దలకు, వారి స్నేహితులకు ఎన్నో బహుమతులు తీసుకు వచ్చి ఇచ్చారు. సుందరయ్య గారు వేద విద్యార్థులకు భోజన ఏర్పాట్లు కూడా వీరి ఇంట్లో చేయడం తో అసలు పండుగ పెద్ద పండుగ లాగే సాగి పోయింది.
కనుమ:
అసలు ఈ రోజు మా ఊరిలో సందడి చూడాలే గానీ చెప్పనలవి కాదు సుమా. ఎడ్ల బండ్లు కట్టడం, నాగలి పూజలు, హరిదాసులకు, ఇతర కళాకారులకు సంభావనలు ఇవ్వడం అన్నీ అయ్యే సరికి మధ్యాహ్నం అయింది. భోజనాలు చేసి పక్కనే ఉన్న జగ్గన్న తోట వెళ్లి ప్రభల తీర్థం చూడక పోతే పండుగ అసంపూర్ణమే నండోయ్. ఇక పేకాట స్థావరాలు, కోడి పందాలు వేరే కోవకి చెందినవి అనుకోండి.
అలా అత్యుత్సాహం గా ఆనందంగా పండుగ గడిపారు మన సుందరయ్య గారి కుటుంబం మిగతా ఊరంతా కలిసి.
తరువాతి రోజు హారిక వాళ్ళు, ఆ తరువాత రోజు బాలు వీడ్కోలు తీసుకుని బయలు దేరారు. మళ్లీ ఏడాది ఎప్పుడు వస్తుందా అని అనుకుంటూ.
అదండీ రాజోలులో సుందరయ్య గారి సంక్రాంతి సందడి. బాలు తో బాటు అందరూ కూడా ఎంతో ఆనందించారు, అనుకున్న ప్రకారం చక్కగా పండుగ ఏడాదికి సరిపడా సందడి నిలిపినందుకు.

—–

You May Also Like

84 thoughts on “మా ఊరి సంక్రాంతి సందడి (సంక్రాంతి కథల పోటీ)

 1. మరో కధాంశం తో అలరించారు.. ఈసారి పండగని కథగా చెప్పి.. పండగ ఎలా ఉంటుందో చూపించారు మీ కలం తో.

 2. good narration .you put into words what exactly we can see the festival in villages .enjoyed very much reading it.

 3. మీ ప్రోత్సాహానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. Please Keep watching… Reading… Encouraging.

 4. సంక్రాంతి సందడి అంతా కళ్ళకి కట్టినట్టు రాశావు. చాలా బాగుంది.👌

 5. మంచి కధ. . పండుగ వాతావరణం మనసులో నెలకొన్నది.

 6. చాలా బాగుంది. సంక్రాంతి పండుగ ని మనుషుల అనుబంధాలతో కలిపి బాగా చూపించారు.

 7. Konaseema lo Sankranthi panduga deniki sati radu anna vishayam atisayokthi kadu ani cheppaka ne chepparu. Appude kadha ayipoyinda anipinchindhi. Ippatiki eee sampradayalu vunnayi ani teliya cheppi, eee taraniki mana pandugalu, sampradayalu mariyu vinodamu jathaparichi marupurani madhura smruthulu muakatti icharu Balapadmam.

 8. Super చాలా బాగుంది చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు

 9. Wow, చక్కటి కథ. కధనం బాగా నడిచింది. పండుగ చేసుకున్న ఆనందం వచ్చింది

 10. కథ అద్భుతంగా ఉంది.😍
  కానీ మాంసాహారం లేని కనుమ ఊహించుకోలేకపోతున్నా. 😋

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!