చిన్న ప్రపంచం..! (సంక్రాంతి కథల పోటీ)

చిన్న ప్రపంచం..!
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: రాయల అనీల

జాగృతి అపార్ట్మెంట్ , ఫ్లాట్ నెం : 301

లేలేత భానుడి కిరణాలు గదిలోకి పరుచుకోకుండా ఆపేస్తున్న పరదాలను పక్కకు తప్పించి తులసికోటకి పూజ చేస్తున్న భార్యని శేశతల్పం మీద పవళిస్తున్న విష్ణు మూర్తి వలే మంచం మీద పక్కగా పడుకుని తలకింద చేతిని పెట్టుకొని నవ్వుతూ చూస్తుంటారు రాఘవయ్య…. భర్త చూపులను గమనించినదై
“ఏమిటో అయ్యగారికి అంత నవ్వొస్తుంది.. అంతలా ఏం చూస్తున్నారు” లోనికి వస్తూ తల మీద నుంచి జారిపోతున్న తువ్వాలును సరిగ్గా ముడి వేసుకుంటూ అడుగుతుంది జానకమ్మ
“ఏం లేదు జానకి…. ఒక దేవత మరో దేవతను పూజిస్తుంటే ముచ్చటగా అనిపించి చూస్తున్న” అంటూ లేచి కూర్చుంటారు.
“అయ్యో రామ రామ..తులసి దేవి తో పరాచకాలా కళ్ళు పోతాయ్” అనగానే
“అయ్యో పిచ్చి జానకి నా ఇంటికి నువ్వేగా దేవతవి…దీనికే కళ్ళు పోవులేగానీ కాస్త కాఫీ ఇవ్వండి మేడమ్ ”
“అబ్బో ..సరే ” అని వంటగదిలోకి వెళుతూ “ఇందాక మీ ముసిముసి నవ్వులకు అర్థమేమిటో సెలవివ్వలేదు” అనగానే వెనకనే సతీమణి దగ్గరకు వచ్చి
“ఏం లేదోయ్ ….నువ్వు అలా మడితో తులసి కోటకి పూజ చేస్తుంటే మన పెళ్ళైన కొత్తలో మా అమ్మ చుట్టూ తిరుగుతూ పనులు నేర్చుకుంటున్న చిన్నపిల్ల గుర్తొచ్చి నవ్వొచ్చింది… భలే ముద్దుగా ఉండేదానివిలే అప్పట్లో ”
“అవునా మరెప్పుడూ చెప్పలేదుగా దొరవారు ” అంటూ వెనక్కి చూడగానే
“అప్పట్లో చెప్పాలంటే సిగ్గనిపించేది జానకి…”
“ఆహా! అందుకే ఇప్పుడు అరవైఐదెళ్ళకి చెప్తున్నారా…అప్పుడు తమరికి ఊర్లో వాళ్ళతో ముచ్చట్లకే మీకు సమయం సరిపోయేది కాదాయే ఇంకా మ..” అంటూ ఇంకేదో చెప్పెలోగా ఆ సంభాషణని ఆపడానికి
“అమ్మాయి ఫోన్ చేసింది జానకి… నిన్ను చేయమంది మళ్ళీ ఫోను” అని చెప్పి సెల్ఫోన్ తెచ్చి చేతికిస్తారు.
కూతురి దగ్గరి నుండి అనగానే ఆవిడ కూడా ఆ విషయం వదిలేసి కాఫీ ఇచ్చేసి కూతురికి ఫోన్ చేసి మాటల్లో పడిపోతారు.

*********

జానకమ్మ,రాఘవయ్య గార్లది యాభై వసంతాల  వివాహబంధం. పెద్దగా ఊహ తెలియని పసి ప్రాయంలోనే ఇద్దరికి పెళ్ళి జరగడంతో పైగా వయసు వ్యత్యాసం కూడా లేకపోవడంతో ఒకరికి ఒకరు తోడుగా, స్నేహంగా ఉండేవారు.
ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా వీరికి ఇద్దరు వంశోద్దారకులు, ఒక కూతురు ఉన్నారు.
ఎవరి సహాయం తీసుకొకుండానే తల్లితండ్రులు పంచిన ఆస్తి ని కానీ ,తన భార్య స్రీ ధనాన్ని కానీ అమ్మకుండా తన కష్టాన్ని, సామర్థ్యాన్ని నమ్ముకుని తన ఊరిలోనే ధర్మంగా  ఇంటిని కట్టించుకుని ఇళ్ళు, పొలం, పశుసంపద,ఊరి జనాలు ఇవే ప్రపంచంగా బ్రతికే రాఘవయ్య గారు ఒకవైపు అయితే ఇంటిని మొత్తం ఒంటి చేత్తో నడిపించుకుంటూ, ముగ్గురు పిల్లలను చక్కగా చదివించుకుంటూ, భర్తకి సహాయంగా ఉండే జానకమ్మ గారు మరో వైపు.
కాలం గిర్రున తిరిగి పెద్దకొడుకు చదివిన చదువుకు స్వస్తి పలికి తండ్రి బాధ్యతలను తాను సగం తీసుకుని పెద్దరికం చేస్తూ తన కన్న నాలుగు సంవత్సరాలు చిన్నదైన చెల్లెలికి పెళ్ళి కుదిరించి తన చదువును మధ్యలోనే ఆపించి తల్లితండ్రులకు కనీసం మాటవరసకైనా చెప్పకుండా పెళ్ళి సంబంధం తెచ్చాడు.
వాళ్ళ చేతుల్లోంచి ఆ ఇంటి పెత్తనం అతడి చేతుల్లో కి ఎప్పుడూ మారిపోయిందో కూడా గమనించుకొలేదు ఆ దంపతులు కోడుకు మీదున్న పిచ్చి నమ్మకంతో.. వద్దని  ధైర్యంగా చెప్పలేని కాదు కాదు చెప్పనివ్వనంతగా చెసేసాడు.
“నీకేలాగు చదువబ్బ లేదు….చదువుకునే పిల్లనెందుకురా మధ్యలో ఆపించడం” అన్న తండ్రి మాటలకు
“ఇప్పుడు ఇది పది చదివితే ఇంటర్ చదివిన కుర్రాడిని, ఇంటర్ చదివితే డిగ్రీ చదివినవాడిని, డిగ్రీ చదివితే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాడిని తీసుకురావాలి. అదంతా కుదరదు పది పూర్తయిందిగా చదివిన చదువు చాలు.. ఇదీ మంచి సంబంధమే అన్నీ నాకు తెలుసు.” అని గట్టిగా అరిచి వెళ్ళిపోతున్న కొడుకుని చూస్తుండటం తప్ప ఏం చేయలేకపోయారు.
మనం ఆగిపోయామని కాలం ఆగదు కదా ఇద్దరు కొడుకులు ఎవరికి వారే వాళ్ళకి నచ్చిన సంబంధాలు కుదుర్చుకుని అక్షింతలు వేసే బాధ్యత మాత్రం ఆ దంపతులకు అప్పగించినా వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అని మనసుకి సర్ది చెప్పుకునే లోగానే ఆస్తి పంపకాలు చేయాల్సిందేనని పీకల మీద కూర్చునేసరికి నా కొడుకులే కదా అని తల్లిలా భావించిన ఇంటిని, పొలాన్ని, అన్నిటినీ చెరిసగం పంచి బ్రతకడానికి సరిపడేలా కాస్త స్థలం ఉంచుకుని ప్రాణం పెట్టి మరీ కట్టించుకున్న ఆరు గదుల ఇంటిని వదిలి పక్కనే రెకులతో రెండు గదులను నిర్మించుకున్న ఆదర్శ తండ్రి రాఘవయ్య , భర్త మాటే నా మాట అనుకుని తనకి  పసుపుకుంకుమల కింద పుట్టింటి వారిచ్చిన కోట్ల ఆస్తిని కూడా పంచేసిన  పిచ్చి తల్లి జానకమ్మ.
పిల్లలు వయసుమళ్ళిన తల్లితండ్రులను తమ దగ్గరే ఉంచుకోవడానికి ముఖ్యంగా మూడు కారణాలుంటాయి…
మొదటిది  ప్రేమ.. తల్లితండ్రుల మీద వారికున్న ప్రేమ.
రెండవది ఆస్తి.. వారి పేరు మీదున్న ఆస్తి మీద ప్రేమ.
మూడవది.. పరువు,బాధ్యత.
ఈ మూడు లేని వారు కచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం, కారణం ఉండదు కదా ఆ వంశోద్దారకులు కూడా చేసింది అదే.
అప్పటివరకూ ప్రేమను ఆస్తిని పంచిన ఆ తల్లిదండ్రులే, ఒకప్పుడు దేవుళ్ళలా కనిపించిన ఆ తల్లిదండ్రులే ఇప్పుడు అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత ఇంటిలో కాకుండా కనీసం పక్కన ఉండటాన్ని కూడా సహించలేక అన్నిటినీ కట్టడి చేస్తూ మనుమడు మనుమరాలను  దగ్గరకు కూడా రానివ్వకుండా. చిన్నప్పుడు భుజం మీద కూర్చోబెట్టుకొని ప్రపంచాన్ని చూపించిన వారికే ఈనాడు ఇక్కడే నడవాలి, ఇక్కడే తిరగాలి అనే ఆంక్షలు పెడుతూ మెల్లమెల్లగా మానసిక శోభకి గురి చేస్తూ అందులో ఆనందం చూసుకుంటుంటే ఏం చేస్తారు.
పుట్టి పెరిగిన ఊరిని వదల లేక, అందరికీ తెలిస్తే పరువు పోతుందని ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని అక్కడే ఉంటున్న సమయంలో కలిసొస్తుందని అల్లుడి వ్యాపారంలో చేరి ఆ వ్యాపారంలో నష్టం రాగానే విభేదాలు వచ్చి అతను మరెవరో కాదు చెల్లెలి భర్త అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా అన్నీ మరచి తెగదెంపులు చేసుకుని ఆ సాకును అడ్డుపెట్టుకొని తల్లితండ్రులను వేధిస్తూ ఎన్ని చేసినా అక్కడి నుంచి వెళ్ళడం లేదని ఆడబడుచు ఇంటికి మహాలక్ష్మి అని తెలిసిన వావివరసలు మరచి కూతుర్ని నానా మాటలు అంటుంటే వినలేక, ఆ మాటలు భరించలేక కళ్ళనిండా నీళ్ళతో, గుండె నిండా మోయలేని బరువుతో ఉన్న ఆ కాస్త స్థలమును అమ్ముకొని బతకడానికి సరిపడా డబ్బులు పట్టుకొని పల్లె నుంచి  పట్నం వైపు అడుగులు వేసి అద్దె ఇంట్లో  బ్రతకడం ఇష్టం లేకపోయినా, ప్రశాంతమైన పచ్చని పల్లెలో పుట్టి పెరిగిన వారైనా మనసుకి ధైర్యం చెప్పుకుని పట్నంలో స్థిరపడ్డారు.

@@@@@@@@

కాఫీ తాగి కాలక్షేపానికి అపార్ట్మెంట్ కింద వాకింగ్ కి వెళ్ళొచ్చిన రాఘవయ్య లోపలికి వస్తూనే
“జానకి.. జానకి మన ఎదురుగా ఉన్న ప్లాట్ లో ఉండే పంతులమ్మ ఉందిగా ఆ అమ్మాయి భర్త అంట కింద కలిసాడు.. అతనే పరిచయం చేసుకుని మాట్లాడాడు మాటల మధ్యలో అన్నాడు ‘మీరు మా ఎదురుగా ఉండే ప్లాట్ లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఎప్పుడూ ఎక్కువగా క్యాంపులకి వెళుతుంటాను.. వెళ్ళిన ప్రతి సారి ఇక్కడ నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని కాస్త దిగులుగా ఉండేది వెళ్లకుండా ఉండే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్లు వచ్చారని తెలిసి చాలా ఆనందంగా ఉందండి వాళ్ళకి తోడుగా ఉంటారు అనిపించింది’ అంటూ ఎంత మర్యాదగా మాట్లాడాడో జానకి”.
“అవునయ్య… ఆ పంతులమ్మ నాక్కూడా చెప్పింది వాళ్లది ఇక్కడ కాదంట ఒరిస్సా అంట కానీ ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అవ్వడం వల్ల తెలుగు మాట్లాడటం వచ్చు కానీ అందరితో మాట్లాడాలి అంటే ఆ అమ్మాయికి బెరుకుగా ఉండేదని ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉందని చెప్పింది. మొన్న నేను పెట్టిన ఊరగాయ కాస్త ఇస్తే చాలా బాగుందని ఇవాళ  వాళ్ళాయన టూర్ కి వెళుతున్నారని ఇంకాస్త అడిగి తీసుకెళ్ళింది”  రాగి జావ తీసుకొచ్చి ఇస్తూ “మాట్లాడడానికే భయపడే ఈ అమ్మాయి పంతులమ్మ ఎలా అయిందని నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది”  అంటూ ఎదురుగా కూర్చుని జావ తాగకుండా ఆలోచనలో ఉన్న భర్తని
“ఏంటో ఆలోచనల్లోకి వెళ్ళారు ” అనగానే
“జానకి! మనం సంక్రాంతికి అమ్మాయికి అల్లుడుకి బట్టలు పెడదామా… గృహప్రవేశం నాడు చేతిలో డబ్బులు పెట్టిన తీసుకోలేదు
మనం ఇన్నాళ్లు అక్కడ ఉన్నప్పుడు ఆ గొడవల వల్ల నా బిడ్డ పండక్కి ఏనాడు మన ఇంటికి రాలేకపోయింది పిల్లలకి అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఆడుకునే ఆశ తీరలేదు”
“ఇప్పుడు ఆ చీకటి రోజులు అన్ని ఎందుకండి గుర్తుచేసుకోవడం ”
“అలా కాదు జానకి అక్కడి నుంచి వచ్చి సంవత్సరం పైగా అయినా అద్దె ఇంటిలో ఉండలేక పోతున్నామనగానే అల్లుడు మనకోసం తన పనులన్నీ మానుకొని ఈ ఇంటిని బాగు చేయించి ఇచ్చారు.. ఇలా అయినా కాస్త కృతజ్ఞతలు తెలిపాలని అల్లుడికి, అమ్మాయికి పండక్కి సంతోషంగా బట్టలు పెట్టాలని ఉంది… ఏమంటావ్!” అంటూ భార్య మనసు ఎరిగిన వాడైనా తన అంగీకారం కోసం అడుగుతారు
“మీరన్నది నిజమే.. నాకు ఆ ఆలోచన వచ్చింది. నేను ఇందాకే అమ్మాయితో చెప్పాను కూడా…ఈ పండక్కి బట్టలు తీసుకోవాలనుకుంటున్నామని కానీ ఇప్పటికీ చాలా ఖర్చులు అయ్యాయి ఇప్పుడు మా కోసం ఏమీ అవసరం లేదు ఉన్న ఆ నాలుగు రూపాయలు కూడా మా కొసం ఖర్చు చేయొద్దు అని ససేమిరా వద్దని చెప్పింది”
“అమ్మాయి అలానే అంటుందిలే కానీ… ఏంటీ ఇల్లంతా చిందరవందరగా ఉంది.. అరెరె ఈ బొమ్మ ఏంటి” మంచం మీదున్న ఏనుగు బొమ్మ ని పట్టుకుని అడుగుతారు
“వామ్మో దాని గురించి ఎందుకులేండి మీతోనే పడలేక పోతున్నాను అంటే ఈ పక్క ఫ్లాట్ బుడ్డది ఉంది చూసారూ రాక్షసి అనుకోండి మీరలా కిందకి వెళ్లారో లేదో అమ్మమ్మ అంటూ వచ్చి గోల గోల చేసి పోయింది… ఆ బుడ్డదాందే ఈ బొమ్మ”
“హహహ .. అయితే నీకు బలే టైంపాస్ లే జానకి” అంటూ మనస్ఫూర్తిగా నవ్వుతుంటే భర్త నవ్వుతో శృతి కలిపేస్తారు.

**********

ఆనందాన్ని మరో కోణంలో వెతుక్కోవడానికి ఇరుకుగా అనిపించినా స్వచ్చమైన మనసుల, కూతురి ప్రేమాభిమానాలు, అల్లుడి ఆత్మీయతల మధ్య ఆనందంగా జీవిస్తున్నారు.
ఆనాడు నా కూతురి జీవితం,తన పెళ్ళి మేము చూసుకుంటాము అని గట్టిగా మాట్లాడినా, ఉన్నదంతా పంచకుండా కాస్త ఆలోచించినా, మీ వివాదాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అని నిలదీసినా ఇలా జరిగేది కాదేమో కానీ.. అక్కడ పెద్ద ప్రపంచమైనా చిన్న మనసులున్న వాళ్ళ మధ్య ఉండటం కన్నా , ఇక్కడ చిన్న ప్రపంచంలోనే పెద్ద మనసున్న వాళ్ళ దగ్గర ఉంటే మానసిక ప్రశాంతతతో ఆ దంపతుల ఆయుష్షు మరో పదేళ్ళు పెరుగుతుందేమో.

పుట్టినప్పటినుండి ప్రేమను పంచి, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసి, బ్రతకడానికి ఉన్న ఆస్తిని  అంత పంచేసిన తల్లిదండ్రులకు వాళ్ళ ఆఖరి మజిలీలో వారికి  మనం ఇవ్వగల్గింది ఏమీ లేదు కాస్త ప్రేమను చూపిస్తే చాలు మనం వారి సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు కాని కన్నీటికి మాత్రం కారణం కాకూడదు….అది కొడుకైనా, కూతురైనా ఇద్దరూ సమానమే

…..శుభం…..

You May Also Like

76 thoughts on “చిన్న ప్రపంచం..! (సంక్రాంతి కథల పోటీ)

  1. Telugu lo kuda inni padhalu untaya anesi anipistundhi ni stories chadvthunte..andaru English movies series antu Telugu ni marchipothunnaru.. Ni kathalu manchi kalakshepam anni vayasula vallaku.. Keep rocking dear!!!

  2. బాగుంది అనీల మీ కధ….ఇందులో నా పేరు ఉంది

  3. చాలా బాగుంది సిస్.. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఉన్నారు ఇలా.. బాధతో కృంగిపోకుండా, సంతోషాన్ని వేతుకొని, జీవితాన్నీ ముందుకు సాగించడం అనేది చాలా బాగుంది..

  4. స్వచ్చమైన మనసుల మధ్య కొన్నాళ్ళు బ్రతికినా చాలు…. ఇటువంటి బాధాకరమైనవి మున్ముందు జరగకుండా ఉంటే బాగుండు…. నీ రచన మనసుని ద్రవింపజేసింది అనీల👌👌చాలా బాగుంది

  5. ఆ దంపతులు అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ సంతోషంగా ఉన్నారు…. బాగుంది మీ కధ

  6. ఇటువంటి వారు మారిన నాడే ఆ తల్లి తండ్రుల కు చివరి దశలో కాస్త సంతోషంగా ఉండగలరు…..చాలా బాగుంది మీ రచన

  7. Very Nice Story….Ee generation lo jarigedi kuda ide kadaa…..But Alaa chesinavallaki mathram malli they face it return back …….Very happy to read this nd the nice story to realise the people who did like this

  8. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ఆస్తులు కాదు ….కాస్తంత ప్రేమ ….చాలా బాగుందండి …మనసుకి హత్తుకుంది మీ రచన

  9. ఇలాంటి వారు ఎప్పటికీ మారతారో…. మీ రచనా శైలి బాగుంది అనీల గారు

  10. బాగుంది 💐💐💐. పెద్దలకీ కావలసింది చిన్న ప్రపంచంలో ఆనందమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!