తిరిగివచ్చిన బాల్యం! (సంక్రాంతి కథల పోటీ)

తిరిగివచ్చిన బాల్యం! 
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

 

రచన: ఎం.వి.చంద్రశేఖర్రావు

అనురాగ్ కు బాదం చెట్టంటే ప్రాణం. అనురాగ్ చిన్నప్పుడు, సమయం దొరికితే చాలు, బాదం చెట్టు క్రింద చేరిపోయేవాడు. పెద్దపెద్ద ఆకులతో, బాదం
కాయలతో పచ్చదనంతో మెరిసిపోయేది, బాదం చెట్టు.
ఆ చెట్టుక్రింద బాదంకాయలు ఏరుకొని, గండుచీమలతో కుట్టించుకొని బాదంపప్పు తినే వాడు, మిగతా పిల్లలతో కలసి. ఇదంతా 1964 విజయవాడ, లీలామహల్ ఎదురుగావున్న, అనురాగ్ అద్దె ఇంటికథ.
ఆ తర్వాత, వరంగల్ లో 1969లో, ఇంట్లో సపోటా చెట్లు ఉండేవి. వాటిపైకెక్కి, కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళు, తియ్యని సపోటా పండ్లు తినేవాళ్ళు. అప్పుడప్పుడు సపోటా పాలు మీదకారేవి, చేతికంటేవి.
అనురాగ్ కు మామిడిచెట్లన్న , మామిడిపళ్ళన్న మహాఇష్టం. ఆ లేత, లేత మామిడి చిగుళ్ళను తింటూ, గండుకోయిలల పాటలు వింటూ, గుత్తులుగా కాసిన మామిడికాయలను చూస్తూ, ఎంతసేపైనా గడిపేవాడు.
ఇదంతా 1974లో నూజివీడు ఇంటి కథ.
ఆలాగే జామచెట్లు. దోరగా ఊరించే జామకాయలు, కోయటానికి, కర్రలు, రాళ్ళుపట్టుకొని యుధ్ధవీరులులాగా సిధ్ధమయ్యే వాళ్ళు, బాలసైన్యం. ఇదంతా 1976లో రాజమహేంద్రి కథ.
ఇహ, పూలచెట్లంటే, చెప్పేపనేలేదు, రంగురంగుల పూలతో, తలలువుాపుతు ఆహ్వానించే, పూలచెట్లంటే ఎంత ఇష్టమంటే, పుాలను కోయనీయకుండా , చెట్లకేవుంచి విధాత విశ్వసృష్టికి, కైమోడ్పులు అర్పించేవాడు. ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే, బెంగుళూరులో, అనురాగ్ పిల్లల పుణ్యమా అని, తీసుకున్న గేటెడ్ కమ్యూనిటీలో అనురాగ్, తన చిన్నప్పటి నేస్తాలనందరి కలుసుకున్నాడు. బాదం చెట్లు, పూలచెట్లు, క్రోటన్ చెట్లు, అశోకచెట్లు, ఇలా రకరకాలచెట్లు కనువిందుచేసేవి. కానీ, ఒక్క పండ్లచెట్టు కూడా లేకపోవడం, పెద్దలోటుగా ఉండేది. అపార్టుమెంటు సెక్రటరికి చెబితే, “ఈనేలలో అవి పండవు,” అని బదులు ఇచ్ఛాడు. కొన్నివాదనలు విచిత్రంగా ఉంటాయి. ఇన్ని పూలమొక్కలు పెరుగుతున్నప్పుడు, పండ్లమొక్కలు ఎందుకు పెరగవో, అర్ధం అయ్యేదికాదు అనురాగ్ కు.
ఎండాకాలం వచ్చింది. అనురాగ్ బావగారైన, విజయవాడ లాయర్ వియ్యంకుడు,
“బావగారు,మీకు మామిడిపళ్ళంటే చాలా ఇష్టం, బెంగుళూరులో చిన్నరసాలు దొరకవుగదా” అంటూ, కొరియర్ లో చిన్నరసాలు, బంగినపల్లి
పంపించారు.
ఆయనకు”థాంక్స్” చెప్పి, లొట్టలు వేసుకుంటూ, చిన్నరసాలను ఆస్వాదిస్తున్న , అనురాగ్ కు, ఓ ఆలోచన , మెరుపులా మెరిసింది.
వెంఠనే, అపార్టుమెంటు, సెక్రటరీని కలసి “మీకు అభ్యతరం లేకపోతే,మామిడిచెట్లు నాటుతాను, మన అపార్టుమెంటులో” అని చెప్పాడు
దానికాయన, మొహం చిట్లించుకొని “పెరగవు అని చెప్పాను గదా, మీఇష్టం” అన్నారు.
అయినా, ప్రకృతీప్రేమికుడైన అనురాగ్, అపార్టుమెంటంతా, ఓ పది చిన్నరసాల, ఓ పది బంగినపల్లీ మామిడిటెంకలు పాతి, రోజూ నీళ్ళు పోయటం మొదలుపెట్టాడు.
ఆ టెంకలలో నుంచి, మామిడిచెట్లు బయటకు వచ్చి, ఇంతై, ఇంతితై, వటుడింతై అన్నట్లు అనురాగ్ అంత అయ్యాయి.
రోజూవాటిని చూసి, సొంతపిల్లలా, మురిసిపోవడం, అనురాగ్ వంతైయింది. మామిడిచెట్లకు పూత పూసి, పిందెలు కూడ రాసాగాయి. గండుకోయిలలు, లేతమావి చిగురు తింటూ, తీపి రాగాల నాలపించసాగాయి.
దోరగా పెరిగిన మామిడికాయలను చూస్తూ ఊరుకోలేక, ఒకరోజు, అపార్టుమెంటులో బాలసైన్యం, కర్రలు, రాళ్ళతో ఆ చెట్లపైకి దండయాత్రచేశారు.
“ఇక్కడ పండ్లచెట్లు పెరగవు” అన్న అపార్టుమెంటు సెక్రటరీ, తానే స్వయంగా, ఆ పిల్లలందరిని చెదరగొట్టాడు, ఆవకాయకు, మాగాయకు కాయలు అందరికీ కావలనీ.
మామిడిచెట్టుపై, తీపిరాగాలనాలపించే గండుకోయిలలను, గుత్తులు, గుత్తులు కాసిన దోర, దోర మామిడికాయలను కోయాలని, కర్రలతో, రాళ్ళతో యుధ్ధానికి, బయలుదేరిన బాలసైన్యాన్ని చూస్తే, అనురాగ్ కు తన బాల్యం, తిరిగి వచ్చినట్లయింది. అరవైల వయస్సులో కూడా, ఆనందంతో, కేరింతలు వేశాడు.
మీరు కూడా మీఇంట్లో, మీ అపార్టుమెంట్లో చెట్లునాటి, ఆ చెట్లలో విహరించి, మధుర క్షణాలను పంచుకోండి. పర్యావరణాన్ని రక్షించండీ. కాలుష్యాన్ని
పారద్రోలండీ.

జైహింద్!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!