వ్యక్తిత్వం నిలువెల్లా అలకరించుకుని,
తనకేం కావాలో, దానికేం చెయ్యాలో,
స్పష్టమైన ఆలోచనలతో,ప్రస్పుటమైన అభిప్రాయాలతో,
ఆత్మగౌరవం పరిధిలో నిర్మించుకున్న
సామ్రాజ్యపు సింహాసనం అధిరోహించేది ఆమె మాత్రమే.
ఆమె రాజ్యంలో ఆమె అధికారాన్ని అంగీకరించలేని అతిధిలు ప్రసాదించిన,
పొగరు గర్వమనే బిరుదులు స్వీకరించి అలా వచ్చిన వారిని ఇలా సాగనంపింది ఆమె.
ఆమె సింహాసనంలో ఆమె స్థానాన్నితిరస్కరించిన వీరులు “ఆడదేనా?” అంటూ,
అసహ్యాన్ని ప్రకటిస్తూ, ఆశ్చర్యాన్ని దాచేస్తూ, తమని చూసి తాము పడే సిగ్గును
పరుల కంటపడకుండా పలాయనం చిత్తగిస్తున్న వారిని చూసి జాలిగా నవ్వింది ఆమె.
ఆమెలో ఆమెను గౌరవించి,
అర్థం చేసుకుని,
ప్రోత్సహించిన వారిని అందలం ఎక్కించి,
ఆత్మీయతను పంచి
తనలోని భాగానికి భాగస్వామిని చేసింది ఆమె.
ఎవరు వచ్చి ఏది వదిలి వెళ్ళినా, స్రవిస్తున్న రక్తాన్ని తుడిచేసుకుంటూ,
గెలుపోటములు లెక్కచెయ్యకుండా యుద్ధం చేస్తూనే ఉంది సమాజంతో,
తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవటం కోసం.
ఆమె కొలువు, రాజ్యం సువిశాలం,
చేతులు రెండూ చాపి స్వాగతిస్తూనే ఉంటుంది,
అతిధులను, వీరులను స్తిరనివాసం కోసం,
ఎంతైనా ఆడది కదా… ఇంతకీ ఎవరామె?
అర్థం చేసుకునే మనసుండి, గౌరవించగలిగే సంస్కారముండి,
అంగీకరించగలిగే ధైర్యం ఉన్ననాడు,
చుట్టుపక్కల చూస్తే కనిపించరూ ఎందరో ఆమెలు?
రెహనా