అబ్బో నాకే తెలీదు

అబ్బో నాకే తెలీదు

రచన::మీసాల చిన గౌరినాయుడు

కాస్త దూరమైనా
మరీ దగ్గరైనా ఎదుటి వారిని పోల్చలేని నా నయనములు
ఇప్పుడు మాస్కేసుకున్న మనిషిని కూడా చక్కగా గుర్తుపట్టేస్తున్నాయి…
నా కళ్ళకు అంత శక్తి ఉందని నాకే తెలీదు.

కాస్త గట్టిగానైనా
మరీ మెల్లగానైనా ఎదుటివారి గొంతును గుర్తించలేని నా శ్రవణములు కప్పేసుకున్న స్వరమును ఎవరిదో ఇట్టే గుర్తుపట్టేస్తున్నాయి…
నా చెవులకు అంత శక్తి ఉందని నాకే తెలియదు.

కనీ కనపడగానే ఒక్క ఉదుటున
ఉరికి కరచాలనం కై ఎగిరే నా చేయి
రెండో చేయిని తోడు తీసుకొనే ఐక్యతాభావం నేర్చి,
దండం పెట్టే క్రమశిక్షణ నేర్చేశాయి నా కరములు…
నా చేతులు అంత సంప్రదాయం అలవర్చుకున్నాయని నాకే తెలియదు.

చూసీ చూడగానే ఒక్క సారి తాకాలనుకునే నా వేళ్ళు
ఎంత బుద్ధయిపోయాయో… ఠక్కున ఆగి విచారణ ఆరంభించాయి…
ముడితే లేపనం రాసుకుంటున్నాయి
లేదా సబ్బుతో కడుకుంటున్నాయి……
నా వేళ్ళు అంత నిబద్ధత పాటిస్తున్నాయని నాకే తెలీదు….

ఇక నా వలువలంటారా…
అవి మరీనూ…
నా మాటే వినడం లేదు…
బయటికెళ్లి వచ్చాయంటే ఇంట్లోకి రావడం లేదు.
స్నానం చేసేస్తున్నాయి
లేకపోతే ఎండలో ఎండిపోతున్నాయి.
యజమాని రక్షణ కోసం… ఎంత త్యాగం
నా దుస్తులు అన్ని విలువలు
కలిగిఉన్నాయని నాకే తెలీదు…
నా చెప్పులూ అంతే అదే బాట…

ఇవన్నీ నన్ను ఇంతగా కాపాడుతున్నాయనే విషయం నాకే తెలియదు
ఇలాంటి త్యాగాలు మనం లేటుగా తెలుసుకుని,తలచుకుంటాం
ఎందుకంటే మనం మనుషులం కదా….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!