అపార్ధం

అపార్ధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

అనంత్, అచ్యుత్ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు అనంత్ ఇంట్లో డబ్బు గురించిన చిన్న గొడవైంది. భార్య ముఖం మీద కోపంగా మనీ పర్సు విసిరికొట్టి మోటార్ బైక్ మీద ఆఫీసుకి వెళ్లి పోయాడు అనంత్.
ఆ రోజంతా టెన్షన్ గానే ఉన్నాడు ఆఫీసులో. చీటికీమాటికీ సహోద్యోగుల మీద మండిపడ్డాడు. ఎందరి మీదో నోరు పారేసుకున్నాడు. అది చూసిన అచ్యుత్, అతన్ని శాంతింప చేయడానికి లంచ్ టైములో ఒక మంచి హోటల్ కి తీసుకుని వెళ్లాడు. మనీ పర్సు తేలేదని హోటల్లోపలికి వెళ్లడానికి సంకోచించాడు, అనంత్. అలా సందేహిస్తుంటే. “మరేం పర్వాలేదు, నా దగ్గర డబ్బు ఉందిలే ..రా ! అని నచ్చజెప్పాడు, అచ్యుత్. సప్లయిర్ ని పిలిచాడు, అనంత్ పొద్దున్న భార్యతో పోట్లాడి తినకుండా వచ్చినందువల్ల అనంత్ కి మాంచి ఆకలిగా ఉంది. చాలా ఐటమ్ లు ఆర్డరు చేసి తెప్పించుకుని తింటున్నాడు. ఫ్రెండ్ డబ్బుతో ఇలా తింటున్నానే అని లోపల ఒక వైపు కొంచెం సిగ్గుగానే ఉంది, అనంత్ కి. సరిగ్గా అప్పుడే – ఆఫీసులో అనవసరంగా అందరితోనూ గొడవపడిన విషయంలో స్నేహితుడిని కాస్తచనువుగా, సున్నితంగా మందలించాలనిపించింది అచ్యుత్ కి.
“ఒరే ! అనంత్ ! నువ్వు నీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిదిరా! ” అని చెప్పబోతుంటే, పూర్తిగా వినకుండానే, తను అతని డబ్బుతో ఎక్కువగా ఆర్డరు చేసి తినడం చూసి సహించలేకనే ఇలా అంటున్నాడని అపార్ధం చేసుకున్నాడు అనంత్. వెంటనే అవమానంతోనూ, కోపంతోనూ ఊగిపోతూ పైకి లేచి, వెనకాముందూ చూడక అచ్యుత్ చొక్కా కాలర్ పట్టుకుని “ఏం కూశావు రా రాస్కెల్ !” అంటూ దెబ్బలాటకు దిగాడు. మాటా మాటా పెరిగింది. ఒకరిమీదొకరు కొట్టుకున్నారు. టేబుల్ మీదనున్న గాజు గ్లాసులు కిందపడి ముక్కలయ్యాయి. వాటిమీద పడిన అనంత్ కి శరీరం నిండా గాజుముక్కలు గుచ్చుకుని ఒళ్లంతా రక్తం చిమ్మింది, అక్కడున్న సిబ్బంది కలుగజేసుకుని, ఇద్దరినీ విడదీసి, అనంత్ ని హాస్పిటల్ లో చేర్చారు.
మంచి చేద్దామని వెళ్లిన అచ్యుత్, “ఒక్క క్షణం నేను కూడా నిగ్రహం కోల్పోయాను కదా!” అని తనని తాను నిందించుకుంటూ ఆఫీసులోకి వెళ్లిపోయాడు.
కానీ, ఈ బాధతో అచ్యుత్ కూడా ఆఫీసులో ఏ పనిమీద దృష్టి పెట్టలేకపోయాడు. మనసు ఊరుకోలేదు, ఆఫీసుకి శలవుపెట్టేసి, అనంత్ ని చూడాలని హాస్పటల్ కి వెళ్లాడు.”ఎలా ఉంది ఒంట్లో?” అని ఎంతో ప్రేమగా పలకరించాడు అచ్యుత్. కానీ, అది తనని ఎగతాళి చేస్తున్నట్టుగానే భావించాడు అనంత్. అచ్యుత్ ని చూడ్డంతోటే అనంత్ కి కోపం కట్టలు తెంచుకుంది. మళ్లీ తనతో దెబ్బలాడాలనే వచ్చాడని అతని బుద్ధి వక్రం గానే ఆలోచించింది. అతన్ని కొట్టడానికి మళ్లీ చెయ్యెత్తాడు, అనంత్. అచ్యుత్ కి స్నేహితుని ప్రవర్తన చూస్తే చాలా బాధేసింది. ఎంత నచ్చజెప్పాలనుకున్నా అనంత్ వినే పరిస్థి తులలో లేకపోవడం దురదృష్టం. “ఇతరులని గురించి మన అంతరంగంలో వేసుకున్న అంచనాలని బట్టే అవగాహన రూపుదిద్దుకుంటుంది. ఆ అంచనాలు తప్పు అయినప్పుడు అనర్ధాలు, అపార్ధాలు తప్పవు. ఎప్పటికైనా వాడు, ఎదుటివారి మాటల్ని ఏ సందర్భంలో ఎలా అర్ధం చేసుకోవాలి. అని తెలుసుకుంటే బాగుండును” అనుకుంటూ నిరాశగా లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అచ్యుత్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!