చుక్క సారె

చుక్క సారె
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

   పిండి రుబ్బించుకోను వచ్చే ఆడవాళ్లు, పిల్లలు కాసేపు వేచి ఉండి టిఫిన్ అక్కడ పెట్టేసి, సరుకు వివరం చెప్పి వెళ్లిపోతున్నారు. ఈ కరెంటు కాస్తా పోతున్నది. ఒక పక్క కరెంటు మీద కన్నేసి, స్నానం చేసి దొడ్లో మందారపూలు కోసుకొచ్చి దేవుడి పటాలకు పెట్టి వత్తి నలిపి దీపం వెలిగించింది రాధమ్మ. అంబికా కడ్డీల పరిమళం హాయిగా ఇల్లంతా వ్యాపించింది. వైరు బుట్టలోఇవాళ్టి నైవేద్యం కోసమే ఉంచిన అమృతపాణి అరటిపళ్ళు రెండూ కడిగి తీసుకొని వచ్చి స్వామికి పెట్టి కర్పూరం వెలిగించి హారతిచ్చి సుబ్రహ్మణ్య షట్కమ్, అయిగిరి నందిని పాడుకోని ఇవతలకు వచ్చింది. అర అంకణం పూజగదిలో గాలిలేక జాకెట్టు తడిసిపోయింది చెమటలతో. రెక్క తలుపులు మూసి గోడగడియారం చూస్తే తొమ్మిది కావస్తుంది. సాయంత్రం టిఫిన్ సెంటర్ల వాళ్ళకి ఇప్పుడే రుబ్బి ఇచ్చేయాల్సిన పని లేదు. కానీ చట్నీలు, మసాలాలు మాత్రం సాయంత్రం నాలుగులోగా ఇచ్చెయ్యాలి. బోండాలు, బజ్జీలు చేసే వాళ్ళకు రెండు సార్లు చట్నీలు అవసరం. ఉల్లి కారం నిల్వ ఉంటుంది రెండ్రోజులు. వాళ్ళు నిమ్మరసం ఉప్పు బాగా వేయడం వల్ల. పల్లి చట్ని మాత్రం ఏరోజు కారోజే.
రిటైరైన పంతులుగా శేషయ్యకు కాలక్షేపం ఏమి లేదు. ట్యూషన్ చెప్పే ఓపిక లేదు. అయినా డబ్బు మనిషి కావడంతో భార్య ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటుందని తీర్మానం చేసి, చెన్నై నుండి రెండు గ్రైండర్లింట్లో తెచ్చి పెట్టేసాడు. చిన్నది చట్నిలకీ, పెద్దది పిండి రుబ్బేదానికీ. కరెంటు కనెక్షన్ ఇచ్చి, అవి వాడే తీరు, శుభ్రం చేయడం దగ్గర ఉండి రెండ్రోజులు నేర్పి, చెన్నైలో ఉన్న చిన్న కూతురు విజయదశిమిముందే పిల్లలతో వచ్చింది. ఆమె చేత కొబ్బరికాయ కొట్టి దసరా రోజు ప్రారంభం చేయిoచాడు. ముందే చుట్టు పక్కల వారికి చెప్పి ఉండడం వల్ల, ఒకటి రెండు రోజులు ఇంట్లోంచి గ్రైండర్ చప్పుడు వినీ, ఆసక్తి తో వచ్చి చూసివెళ్లిన జనాలు, పండుగరోజు శ్రమతగ్గుతుందని గారెల పిండి, మసాలా లు వేసుకొని డబ్బులు ఇచ్చివెళ్లారు. ఇల్లంతా పిండి, చట్నీల వాసన తో గుమ్మెత్తి పోతుంది. దగ్గరలో హోటల్స్ వాళ్ళు, చిన్న టిఫిన్ సెంటర్ లూ, వాకిట్లోనే దోశెలు అంగడి పెట్టుకున్న పేదమహిళలూ క్రమం తప్పకుండ కేజీ కి రెండురూపాయలు చొప్పున ఇచ్చి పిండి వేసుకొని పోవడం జరుగుతుంది. రోజంతా పనే అయి అలిసిపోతుంది రాధమ్మ. ఇదివరకూ ఇద్దరికీ అంత వండేసి అదే సాయంత్రానికీ మొగుడి వీరపొదుపు తో సరిపెట్టి, సాయంత్రం స్నానం చేసి దగ్గరలో ఉన్న గీతా మందిరానికి వెళ్లి కూర్చుని హాయిగా తనచక్కని స్వరం తో భక్తిగీతాలు, కీర్తనలూ పాడుతూ, వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ రాత్రి పదికి హారతి ఇచ్చేవరకూ ఉండి ప్రసాదం తీసుకొని వచ్చేది. అది ఆమె మనసులో ఎంతో శాంతిగా ఉండేది. ఇప్పుడు ఈ గ్రైండర్ సంపాదన లేకుంటే ఏమి? వచ్చే పెన్షన్ తమకు సరిపోతుంది కదా. మగ పిల్లలు దూరంగా వేరే రాష్ట్రం లో ఉద్యోగం కాపురాలు. ఏడాదికోసారి చుట్టం చూపుగా వచ్చి నాల్రోజులు ఉండి పోయేది. అప్పుడు కూడా మనవళ్ల చేతిలో పదిరూపాయలు పెట్టేవాడు కాదు శేషయ్య. ఎలాగూ ఇదంతా వాళ్ళకేగా అనేది ఆయన పాయింట్. అయితే మాత్రం ఒక ముద్దు ముచ్చట అక్కర్లేదా అని ఇంటి ఖర్చుకిచ్చేదానిలోనే మిగిలించి మనవళ్ల చేతిలో పెట్టేది వెళ్ళేటప్పుడు రాధమ్మ. తన వంటిమీద నగలు నిండుగా తన పుట్టింటి వాళ్ళు ఇచ్చినవే ఉన్నాయి. చెరో దండ రెండేసి గాజులు కోడళ్ళకి పెళ్ళిలోనే పెట్టింది రాధమ్మ. ఈమె ఉదారతకి ఆ మనిషిని ఎట్లా ముడి పెట్టాడో దేవుడు అనుకునేవాళ్ళు ఎరిగినవాళ్లు.
తొమ్మిదిపదిహేను టైం వరకూ చూసి లేచి వంట వసారా లో స్టవ్ అంటించి నాలుగు దోశెలు పోసుకుంది రాధమ్మ. శేషయ్య పొద్దున్నే కాఫీ తాగి దగ్గరలో ఉన్న పల్లెలో తమ పొలాలు చూసి వస్తానని సాయంత్రం అవుతుందని చెప్పి వెళ్ళాడు. ఆ ఊర్లోనే తమ దాయాదులున్నారు వాళ్ళింట్లోనే మధ్యాహ్నం భోజనం శేషయ్యకి. స్టవ్ మీద గ్లాసుడు బియ్యం అత్తెసరు పడేసి, హాల్లోకొచ్చి టిఫిన్ చేస్తుంది రాధమ్మ. ఊతప్పంలా పుల్లగా ఉన్నాయి దోశెలు. అందుకే ఉల్లిపాయ ముక్కలు వేసుంది పిండిలో ఈ గ్రైండర్ వల్ల టిఫిన్ ఖర్చులు లేవు. పెద్ద ఎత్తున పప్పులు ఇచ్చినప్పుడు కాస్త పిండి తీసుకోని చిన్న గిన్నెలో పెట్టుకోవడం, చట్నీ, మసాలా కూడా తీసుకోవడం చేసేవాడు శేషయ్య. అది భార్యకిష్టమ్ లేదని తెలిసి ఓసి పిచ్చి దానా. మనమేం వాళ్ళ ఆస్తులు కి పోలేదు. ఇంత పిండి నిముషాలలో శ్రమ లేకుండా రుబ్బితే కరెంటు బిల్లులు కట్టేది మనమెగా? ఏ పిండి మిల్లు, కారప్పొడి మిషన్ చూడు వాళ్ళు తీసుకున్న దాంతో ఇంట్లో కూరలు, ఇంకా ఇతరులకు ప్యాక్ చేసి అమ్మడం అని అరగంట క్లాసు పీకాడు. ఈ సౌకర్యం బాగుందిలే అనుకుందామె. కరెంటు వచ్చింది. గబాల్న లేచి చేతులు కడుక్కొనివచ్చి మొదటి వాళ్ళు ఇచ్చినవి గ్రైండర్ల లో వేసి స్విచ్ ఆన్ చేసింది. గర్ర్ మనే శబ్దంతో పని మొదలైంది. ఒక్కొక్క టిఫిన్ పిండి, మసాలా తో నింపుతూ ఉంది రాధమ్మ. ఇవాళ అరటి కాయ పెసరపప్పు మసాలా కూర చేసుకోవాలి అనుకోని ఒక గరిట మసాలా చిన్న గిన్నేలోకి తీసి వెళ్లి వసారా లో పెట్టి అన్నంలో నీళ్ళు ఇగిరిపోవడం చూసి స్టవ్ కట్టేసి వచ్చింది. మొన్నటి వరకూ కట్టెల పొయ్యే. దసరా కి వచ్చిన పెద్ద కొడుకు తల్లి కష్టం చూడలేక పండుగ తగ్గింపు ధరల్లో  గ్యాస్ స్టవ్, కుక్కర్ తీసిచ్చి వెళ్లాడు. మధ్య తరగతి మనుషులకి సొంత సౌకర్యాల ఆలోచన రాదేం అనుకుంటూ. తండ్రి సరుకులు తెచ్చి పడేయడం తప్ప పది రూపాయలు తల్లిదగ్గర ఇవ్వడం జరగదు. ఏదైనా ఖర్చులు ఉంటాయనే ఆలోచన రాదూ.
అట్లనే సాగుతుంది రాధమ్మ జీవితం. సాయంత్రం దీపాలు పెట్టే వేళకి పిండ్లు రుబ్బే పని అయింది. మళ్ళీ రెండో ఆట సినిమా అప్పుడు కొందరు వచ్చి వేసుకొని పోతారు. చివరి దబరకి పిండి తీసి గ్రైండర్ తుడుస్తూ ఉంటే వజ్రమ్మ వచ్చింది. పిండి దబర చంకన పెట్టుకుంటూ, రేపు రానమ్మో మా అన్నోళ్ల ఊరు పోతున్న అంది కొంగున ముడేసిన డబ్బులు తీసిఇస్తూ. ఏంటి వజ్రమ్మా విశేషo? అన్నది రాధమ్మ అలమారా లో ప్లాస్టిక్ డబ్బా తీసి డబ్బులు ఉంచుతూ. ఈ ఏడు చుక్క సారి, అన్నదమ్ములకే ఇయ్యాలని చెప్తున్నారు. అందుకే చొక్కా, పంచే ఇచ్చి వస్తాను. రేపు పది కల్లా దోశెలకొట్టు మూసేసి. అంటూ వెళ్ళింది వజ్రమ్మ. రాధమ్మకు ఒక్క నిముషం ఆలోచన ఆగిపోయినట్టయిo ది. ఎంత మంచి విషయం. తనకి  తమ్ముళ్లున్నారు. ఇద్దరు దూరంగా ఉన్నారు. పెద్ద తమ్ముడు మాత్రం ఇదే ఊరిలో ఉన్నాడు. తనంటే చెప్పలేనంత ప్రేమా, గౌరవం.. మరదలుకీ అంతే ఇదివరకు ఎన్నో సార్లు తనకు పసుపు కుంకుమలూ చీర సారెలు తెచ్చి ఇచ్చిన వాళ్ళు. మిగతా తమ్ముళ్లు గొప్ప హోదా లో ఉన్నా పలకరింపుకే సొమ్మంతా పోతున్నట్టు ఉంటారు. ఈ వరదరాజులు మాత్రం చిరుద్యోగి, నలుగురు పిల్లలున్న వాడూ అయినా తనమీద గుర్తుగా ఉంటాడు. పొద్దున్న పాలామె కూడా వీధిలో ఎవరితోనో ఈ చుక్క సారె సంగతి అంటూ ఉంది. ముగ్గు పెడుతూ సరిగా వినలేదు. ఆలోచనలో ఉంది రాధమ్మ. ఊరు వెళ్లిన శేషయ్య రాలేదు. ఒకో సారి అలవాటే ఇది రాధమ్మ కు. రేపు ఎలాగైనా తమ్ముడి ఇంటికి పోవాలని నిర్ణయం తీసుకుని, చీరలున్న ట్రంకు పెట్టె అడుగున గుడ్డసంచీ తీసి చూసింది. డబ్బులున్నాయి. నిశ్చతంగా అన్నం తిని నిద్రపోయింది. తెల్లవారేసరికి శేషయ్య దిగాడు. అదీ ఒకమంచికేలే. ఆయనకి తెలీకుండా వెళ్లడం పద్ధతి కాదు అనుకుంది రాధమ్మ. తొందరగా వంట చేసేసి, మా తమ్ముడి ఇంటికి పోతున్నా అని చెప్పి, కాసిన్ని బూడిదగుమ్మడి వడియాలు, ఉప్పు మిర్చి, నూపప్పు పొడి, మురుకులు ప్యాకెట్, బెల్లం సజ్జవడలూ సంచీ లో పెట్టుకుంది. హార్లిక్స్ సీసా కడిగి ఎండబెట్టి దోసావకాయ వేసుకోని బయలుదేరింది. బైట ఎండ మిటమిటలాడుతున్నా రాధమ్మకి వెన్నెల్లో విహారంలా ఉంది. ఇవాల్టికి మూడ్నెల్లో ఏమో తమ్ముడింటికెళ్ళి. గతంలో వాడి చిన్న కూతురు పుష్పవతి అయిందని మేనత్త కూర్చోబెట్టాలని పిలిస్తే వెళ్ళింది. పుట్టు, కొబ్బరి గిన్నెలు, బెల్లం, జాకెట్ బట్టలు ఇచ్చివచ్చింది. ఆలోచనల్లోనే వరదరాజులు వాళ్ళ ఇల్లు వచ్చేసింది. కర్ర గేటు తీసుకొని లోపలకెళ్ళింది. మరదలు జయ ఆదరంగా లోపలనుండి వచ్చి, వంట గదిలో పీటేసి కూర్చో బెట్టింది. పూజ గదిలో శివ స్తోత్రం వినిపిస్తుంది. వాడికి ఆఫీస్ లేదా ఇవ్వాళ? అన్న వదిన గారికి చల్లని మంచినీళ్ళు ఇస్తూ ఉంది వదినా. ఎండకి నలతగా ఉన్నారని పోలేదు. రాత్రి 12 కి వచ్చారు. అంటున్న జయ కి సంచీ లోనుండి అన్నీ తీసి ఇచ్చింది రాధమ్మ. అంతలో తమ్ముడు వచ్చి పలకరించాడు. ఎలా ఉన్నారక్కా అని. తమ్ముడూ ఇలా రారా అంటూ కొంగులో ఉన్న చేతిగుడ్డ మూట అతని చేతిలో పెట్టి,.చుక్క సారె వచ్చిందటరా. నువ్వు నా పేరు చెప్పి కొత్త చొక్కా కొనుక్కోవాలి. అంటున్నది రాధమ్మ ఆపేక్షగా చూస్తూ. స్టూల్ మీద పెట్టి చేతిగుడ్డ మూట విప్పాడు వరద రాజులు. పిండి రుబ్బించుకున్న వాళ్ళు ఇచ్చిన రెండురూపాయల నోట్లు, రూపాయి, అర్ధరూపాయి బిళ్ళలూ, మూట నిండుగా.
పరిధిలేని రక్తసంబంధం విలువ ను కొలిచేదెలా అనుకుంటూ నీళ్ళు నిండిన కళ్ళతో వంగి అక్క పాదాలు తాకాడు వరదరాజులు.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!