బామ్మవే సత్యభామవే

బామ్మవే సత్యభామవే

రచన: శ్రీదేవి విన్నకోట

మనం ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు ఎంతో మంది వ్యక్తులను చూస్తూ ఉంటాం కొన్ని విషయాలు, కొంతమంది మనుషులు ఎప్పటికీ మరిచి పోలేనంతగా గుర్తుండిపోతారు, కొందర్ని జీవితాంతం మర్చిపోలేము, అలా 12 సంవత్సరాల క్రితం ఒక సంఘటనలో ఎదురైన ఒక వ్యక్తిని నేను ఇప్పటివరకు మరిచి పోలేదు. ఈరోజు ఆ సంఘటనని మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్

నా పేరు అరుణ,నాకు పెళ్లి అయ్యి నాలుగు ఏళ్ళు అయింది,అప్పటికి మా పాప చాలా చిన్నది సంవత్సరంన్నర  అలా ఉంటుంది వయస్సు, మావారు లేకుండానే నేను మా అత్తయ్య కలిసి ఒక బంధువుల పెళ్ళికి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి చాలా బాగా జరిగింది తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కాము, బస్సు లో అసలు ఇసుక వేస్తే రాలనంత జనం బాగా రద్దీగా ఉంది, నాకేమో రైలు ప్రయాణం అంటే ఇష్టం,కానీ అప్పటికప్పుడు వెంటనే విజయవాడ నుంచి మా ఊరు రాజమండ్రి వెళ్ళడానికి సమయానికి ట్రైన్స్ లేకపోవడంతో బస్సుకి రావలసి వచ్చింది. సరే అలాగైతేనెం బస్సులో చోటు సంపాదించి కూర్చున్నాం కానీ ఇద్దరికీ ఒకే చోట సీటు దొరకక నేను ఒక చోట అత్తయ్య మరో చోట కూర్చోవాల్సి వచ్చింది,

పాసింజర్ బస్సు కావడంవల్ల స్లోగా వెళుతుంది,  నా ఎదురుగుండా సీట్లో విండో దగ్గర ఒక  బామ్మగారు ఆవిడకి సెవెంటీ, సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి, ఆవిడ పక్కన 15 ,16 ఏళ్ల అమ్మాయి లంగా ఓణి లో చక్కగా ఉంది, ఆ పాప మొహం లో ఇంకా పసితనమే కనిపిస్తుంది,ఆమె పక్కన ఒక యాభై ఏళ్ళ బట్టతల వ్యక్తి కూర్చున్నారు. నేను వారి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాను, ఎదురుగా కూర్చున్న బామ్మగారు నన్ను చూసి నవ్వుతూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి పాపని ఏం పేరు అని అడిగి ముద్దు చేస్తూ నవ్వించ సాగారు, నాకేమో ముందురోజు రాత్రి పెళ్లిలో మెలకువగా ఉండడం వల్ల పాపని ఒడిలో పెట్టుకునే అలా కునిపాట్లు  పడుతున్నాను, నేను నిద్రకి ఆకలికి అసలు ఆగలేను, అలా ఒక గంట సేపు గడిచింది,

నా ఎదురుగుండా కూర్చున్న పాప ఎందుకో విసుగ్గా భయంగా అస్తమానం చాలా అనీజీగా కదులుతోంది, ఆ పాప మొహంలో చిరాకు కనిపిస్తుంది, ఎందుకే అమ్మాయి అలా కదులుతున్నావ్ సరిగ్గా తిన్నగా కూర్చోలేవు అంటూ కసిరారు బామ్మగారు కూడా,
ఆ పాప అమ్మానాన్న వాళ్ళు బాగా ముందుకి కూర్చున్నారు, ఇక్కడ ప్లేస్ ఉందని ఆ పాపను ఇక్కడ కూర్చోబెట్టారు, ఓ ఐదు నిమిషాలు అలా కళ్లు మూసుకున్నానో లేదో బామ్మగారు టపీమని ఎవర్నో కోట్టినట్టు సౌండ్ వచ్చింది, గబుక్కున కళ్ళు తెరిచి చూసాను, అప్పటికే ఆవిడ ఉగ్ర నరసింహ అవతారం ఎత్తింది, ఆ అమ్మాయి పక్కన కూర్చున్న వాడిని లేపి మరి ఇత్తడి మరచెంబు తో టపటపా బట్టతల మీద వాయించేస్తుంది,
అతను ఆమె దెబ్బలు తట్టుకోలేక చేతులు అడ్డు పెట్టుకుంటు నేనేం చేశాను అండి నన్ను ఎందుకు కొడుతున్నారు అంటున్నాడు, నేను ఆశ్చర్యంగా చూస్తూ  గబుక్కున ఆమె చేతిలో మరచెంబు లాక్కున్నాను, ఏమైంది బామ్మ గారు అని అడిగాను కంగారుగా, మిగిలిన వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు. కానీ ఎవరూ ఆపట్లేదు, ఇంకేం చేయాలి ఈ సన్నాసి వెధవా అంటూ మళ్ళీ కొట్టింది, నేను ఏమైంది బామ్మ గారు ఎందుకు అతన్ని కొడుతున్నారు, అని అడిగాను అర్థం కానట్టుగా,ఏమి అవడం ఏంటి, ఈ అప్రాచ్యపు వెదవ వెనకనుంచి  ఆ పిల్ల ఒంటి మీద చేతులు వేసి ఒళ్లంతా తడుము తున్నాడు, వీడు చేతులు పడిపోను అబ్రాసి సచ్చినోడు, పనికిమాలిన వెధవ, వీడికి జాడ్యం రాను, అంటూ ఇలా ఎన్నో  తిట్లు ఆపకుండా తిడుతూనే ఉంది, ఆ పాప వంక చూసి నిజమా అని అడిగాను నిజమే అన్నట్లు తల ఊపింది కళ్ళనీళ్ళతో, ఛీ 50 ఏళ్లు పైనే ఉంటాయి ఇదేం బుద్ధి అతనికి, ఆవిడ కూడా అలాగే అంటూ మనవరాలు పుట్టే వయసొచ్చింది, నీకు ఇదేం వంకర బుద్ధి రా కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నావ్ ఏంట్రా, ఇలా ఒక చిన్నపిల్ల ఉసురు పోసుకుంటున్నవ్, నీకు పాడే కట్టా, సంస్కారం లేని వెధవ, నీకు పోయేకాలం రాను అంటూ,  ఒకపక్క అతన్ని తిడుతూనే ఏమే పిల్ల, ఆ వెధవ ఏం చేస్తున్నా డో తెలుసు కదా మరి ఎదిరించలేవా, పోనీ కనీసం ఎవరికైనా చెప్పలేవా నోరు పడిపోయిందా అంటూ ఆ అమ్మాయిని కూడా బాగా తిట్టిపోశారు,

పాపం చిన్న పిల్ల ఏం చెప్తుంది, భయపడి పోయి భరిస్తూ ఉండి ఉంటుంది అనిపించింది నాకు, అందుకే భయం భయంగా చూస్తూ ఉంది అనుకున్నాను,
ఈ పిల్ల ఏంటి ఓ తెగ కదిలిపోతుంది సవ్యంగా కూర్చోకుండా అని ఓ ఐదు నిమిషాలు పరీక్షగా చూసా, వేనకాల నుంచి ఈ దొంగ సచ్చినోడు  చేతులతో వళ్లంతా తడుముతూ ఎక్కడ పడితే అక్కడ  నొక్కేస్తున్నాడు,
బస్సు కుదుపులు లేకపోయినా కావాలనే ఆ పిల్ల మీదకి వాలిపోతూ పిల్లని చాలా విసిగిస్తున్నాడు, అంటూ చెప్పుకొచ్చారు, ఇంతలో
ఆ పాప వాళ్ళ అమ్మానాన్న వచ్చి అందరికీ ఒక చోట చోటు దొరకలేదు, దానికి తోడు ఇతను పెద్దతనే కదా అని ఇక్కడ కూర్చోపెట్టాము. అంటూ వాడి వంక అసహ్యంగా చూసి పాపను వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్లి పోయారు, అతను సిగ్గుతో తలవంచుకున్నాడు,

బామ్మగారు అయితే అతన్ని తిడుతూనే ఉన్నారు, బస్సులో అందరూ అతని వంక అసహ్యంగా చూస్తూ ఉంటే అతను భరించి తలఎత్తు కోలేక నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయాడు, కొద్దిమంది మగవాళ్ళు అంతే అవకాశం కోసం చూస్తూ ఉంటారు చిన్న పెద్ద ఇలాంటివేమి వారికి  ఉండవు, ఆడది అయితే చాలు వాళ్ళ వ్యవహారం ఇలాగే ఉంటుంది అనుకున్నాను, బామ్మగారు ధైర్యంగా అతనికి బాగానే బుద్ధి చెప్పారు, ఆ తర్వాత మేము దిగిపోయే వరకు చాలా కబుర్లు చెప్పుకున్నాం, ఆమె ధైర్యం నాకు చాలా నచ్చింది,ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే అనుకున్న, నాకు ఎప్పుడు బస్సు ప్రయాణం చేసిన ఈ సంఘటన ఫైర్ బ్రాండ్ లాంటి ఆ బామ్మ గారు గుర్తు వస్తూనే ఉంటారు, అలా ఆ సంఘటనతో బామ్మగారు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప వ్యక్తిగా నా స్మృతి పథంలో అలా ధైర్యానికి రూపంలా మిగిలిపోయారు,

ఈ సంఘటన  నిజంగా జరిగి నేను చూసినదే, అప్పటికీ ఇప్పటికీ కాలంలో పెద్దగా ఏమీ మార్పు లేదు, ఆడపిల్లల్నీ అలాంటి తోడేళ్ళ బారి నుంచి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కంటికి రెప్పలా అయినవాళ్లు కాపాడుకోవాల్సిందే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!