నేటి భారతం

నేటి భారతం

రచన: వాడపర్తి వెంకటరమణ

ఒడలుపులకించే నినాదాలు
ఆ ప్రదేశమంతా పులుముకుని
హోరాహోరీగా హోరెత్తుతాయి
విచ్చుకున్న వాగ్ధానాల చిట్టా
ఆ గుడెసెల కాగింతంపై
నమ్మకంగా లిఖించబడతాయి

పచ్చనోట్లకు రెక్కలొచ్చి
ప్రేమగా గూడెంలోని గుడిసె చూర్లకు
గబ్బిలాల్లా వ్రేలాడుతుంటాయి

లిక్కరు చుక్కలకు ఉత్సాహమొచ్చి
వాకిళ్ళలో మత్తుగా ముగ్గులేస్తూ
ఉధృతంగా ప్రవహిస్తుంటాయి

ఇన్నాళ్లూ పక్కపక్కన కూర్చున్న
స్నేహపూర్వక మాటలిప్పుడు
ఏ బ్రహ్మ రాక్షసుడో శపించినట్లు
ద్వేషపూరిత కాగితంలో పొట్లంచుట్టి
వైరివనంలోకి విసిరేయబడతాయి

ఇచ్చిన హామీల వర్షం కురవక
ఆశల చట్రంలో బతుకుతున్న పక్షి
మరో అయిదేళ్లు ఎదురుచూస్తుంది
ఎక్కడ వేసిన బతుకుగొంగళి
దీనంగా చూస్తుంటుంది అక్కడే
ఇదంతా నేటి భారతంలో
షరా మామూలే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!