కొనుగోలు

కొనుగోలు

రచన: మంగు  కృష్ణకుమారి

బుల్లెమ్మకి ఇద్దరు అక్కలూ, తరవాత ఒక తమ్ముడు. మళ్ళా ఇద్దరు చెల్లెళ్ళు. తల్లితండ్రులు పిల్లలందరినీ సెటిల్ చేసి మనవలని ఎత్తుకుని మరీ కన్నుమూసేరు. అప్పటికి సెంట్ భూమి గానీ‌ పది తులాల‌ బంగారం గానీ మిగల్లేదు. ఎవరికీ పొదుపు తెలీదని అందుకే పావలా వెనకేసుకోటం లేదని బుల్లెమ్మకి ఒళ్ళు మంట.

అనుకోకుండా, భర్త చనిపోడంతో అతను చేసే దగ్గర వచ్చిన గుమస్తా ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. ఒక్క కొడుకు ఇంజనీరింగ్ చేసి ఎమ్‌ఎస్ చేసిందికి అమెరికా వెళిపోయేడు.

తను కోరుకున్నట్టు పొదుపు మొదలెట్టింది. క్రమంగా అక్కలూ, చెల్లెళ్ళ మధ్య బుల్లెమ్మ పొదుపు ఓ జోక్ అయిపోయింది.

“డబ్బు అవసరం ఉందే…అప్పు చేయాలేమో,” పెద్దక్క అంటే “ఒసే తెలిసీ బుల్లెమ్మని అడగకు సుమా! అది చక్రవడ్డీ అడగగలదు” పెద్దచెల్లి.

“బుల్లెమ్మక్క, వదినకి కంచిపట్టు చీర పెట్టిందిటే” ఆఖరమ్మాయి అంటే
“నీ మొహం అది ఏ ఇమిటేషన్ పట్టో, అది కూడా ఇది వడ్డీకి అప్పులిచ్చే రాజుగారి చీరల షాప్‌నించీ తెచ్చి
ఉంటుంది. బిల్ కడుతుందా? ఏడుపా?” మూడో అక్క నవ్వులు.

“మరే పెద్దత్తా, బుల్లెమ్మత్త ఇంట్లో నెయ్యి అంటే డాల్డావే” చిట్టి మేనల్లుడు పెద్దత్తతో నెమ్మదిగా చెప్పేడు.

ఈ అక్కచెల్లెళ్ళు నలుగురూ పెద్దక్క ఇంట్లో కలిసేరు. ‘జోరు జోరు’ గా కబుర్లు సాగుతున్నాయి.
ఒకళ్ళు కొనుక్కున్న చీరలు ఇంకొకళ్ళకి చూపించుకుంటున్నారు.

“నీది బాగుందే? ఎంతకి కొన్నావు? ప్రశ్నల జోరు. పెద్దక్క ” అవునే బుల్లెమ్మా , ఈ మధ్య ఏవీ కొనలేదే?” అంది మాట కలుపుతూ

“సరి. మా కోపరేటివ్ సంస్థ ద్వారా అందరూ హౌస్ సైట్లు కొనుక్కుంటూ ఉంటే నేనూ ఎడ్వాన్స్ కట్టేను. లాటరీ వేసి ఎలాట్ చేస్తారు.మీలా చీరలూ నగలూ ఎక్కడ కొనీగలను?” సాగదీసింది.

చిన్న చెల్లి ఉదారంగా రెండు కొత్త చీరలు తీసి “ఇవి నువ్వు తీసుకో, అక్కా” అని ఇచ్చేసింది. ఉల్ఫాగా చెల్లి ఇస్తుంటే, ఆనందంగా తీసుకుంది బుల్లెమ్మ.

“అవునే బుల్లెమ్మా, మరిదిగారికి మీ మాఁవగారి ఇల్లు ఒకటి మీ ఊర్లో వచ్చింది కదే… మళ్ళా సైట్ కొన్నావా? ఇబ్బందిపడుతూ మరీ” చిన్నక్క ఎక్కపీకింది.

“ఒకటి ఉంటే ఇంకోటి చేదేమిటే? పిచ్చి ఖర్చులు తగ్గించుకుంటే సరి” బుల్లెమ్మ. సంభాషణలు మళ్ళా నిత్యావసర వస్తవుల ధరలు పెరిగిపోడాలు మీదకి తిరిగింది. “మిగతా ఎలా ఉన్నా బియ్యం ఏమిటక్కా కిలో యాభై పెట్టందే రావు బియ్యం” ఆఖరి చెల్లి ఆవేదన.

‘యాభై పై మాటే’ అని‌ ఒక అక్కా అంతా అవుతుందని ఒక చెల్లీ వగచేరు. “అవునే బుల్లెమ్మా , నువ్వు ఎంత పెట్టీ కొంటున్నావే?” పెద్దక్క అడిగింది.

మనసులో “ఇది కనీసం బియ్యం అయినా ఖరీదయినవి కొనుక్కుంటున్నాదా?” అనుకుంటూ.

“ఓ పూట తినే అన్నానికి అంతంత డబ్బెందుకు అక్కా? మా పనమ్మాయికి వచ్చిన రేషన్ బియ్యం నాకు నెలకి మూడు కేజీలు ఇస్తుంది. కేజీ రూపాయి లెక్కన ఇచ్చేస్తాను. అలాగే పంచదార, నూనె, కందిపప్పు కూడా ఇరవై పదీ ఇచ్చీ తీసుకుంటాను. తనకి అన్నీ ఉచితాలే కదూ” అంది.

అవాక్కయేరు అక్కా చెల్లెళ్ళందరు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!