నాన్నకి ప్రేమతో.

నాన్నకి ప్రేమతో

రచన :: శ్రీదేవి విన్నకోట

నాన్న అంటూ ప్రాణం పెట్టి పిలిచే ఈ పిలుపు నాకెంత మధురమైనది.విన్న ప్రతిసారి నాన్న మోములో చిరునవ్వులు విరుస్తూ కనిపించే మాటల కందని అమూల్యమైన భావం.

నాన్న అనే నా పిలుపు తన చెవులకి చేరగానే స్పందించే తన హృదయ రాగ మానసం
అనురాగం మమకారం ఆత్మీయత అన్ని కలగలిపిన ప్రియమైన పిలుపు నాన్న

తన  శ్రమతో  తనకంటూ ఏమీ
లేకుండా కరిగిపోయే మంచు పర్వతం నాన్న తన ప్రేమనే కొవ్వొత్తి గా చేసి పిల్లల జీవితాల్లో వెలుగుని నింపే  కాంతి కిరణం నాన్న

అనుక్షణం తన బిడ్డల ఉన్నతికై  తహతహలాడుతూ
తను మాత్రం ఎప్పటికీ బీదవాడుగా మిగిలిపోయే దేవుడులాంటి అసమర్ధుడు నాన్న

పిల్లల జాగ్రత్త కోసం కోపం నటించినా ప్రేమలో మనసులో కల్మషం లేని ఉత్తమమైన మనిషి నాన్న తన తన బిడ్డల ఆటపాటల్లో చిరునవ్వుల్లోనే వజ్రవైడూర్యాలు పోగేసే అల్పసంతోషి నాన్న

తన శ్రమని ఓపికని సంతోషంగా తన కన్న వాళ్ళ
కోసం నిత్యం ధారపోసే దాన కర్ణుడు నాన్న తన పిల్లల విషయంలో అన్యాయం జరిగితే జ్వలించి బద్దలయ్యే అగ్నిపర్వతమే నాన్న

అమ్మ నిజమైతే నాన్న నమ్మకం. తన ఆశల్ని కోరికల్ని  పణంగా పెట్టి తాను మాత్రం అనుక్షణం సమిధగా మారుతూ పిల్లల కోసం కమ్మని కలలు కంటూ ఆ కలలను తీర్చడానికి తపిస్తూ నిరంతర అవిశ్రాంత పోరాటం చేస్తూ ఓడిపోని యోధుడే నాన్న.

పిల్లల సాధించే విజయాల కోసం తాను అపజయాల పాలైన పట్టించుకోని మెరుధీశాలి నాన్న.
త్యాగం అంటే నాన్న.
నమ్మకం అంటే నాన్న.
ధైర్యం అంటే నాన్న.
ఆలంబన అంటే నాన్న.
అన్ని కలగలిపిన అపురూపమైన ప్రేమబంధం నాన్న.

మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు నాన్ననై పుట్టి నీ రుణం తీర్చు కోవాలని ఆశగా ఉంది నాన్న,  ప్రేమతో నీ శ్రీ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!