నూటికో…కోటికో…

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

నూటికో…కోటికో…

రచయిత :: చంద్రకళ. దీకొండ

“రండి…మీ కోసమే మేమున్నాం”అంటూ…
మైకుల్లో,ప్రచార మాధ్యమాల్లో ఊదరగొడుతూ…
ఆదరించి ఆదుకుంటామంటూ…
దేవాలయాలు,వృద్ధాశ్రమాల పేరుతో చందాలు వసూలు చేసి…
తమ బొజ్జ నింపుకునే మాయోపాయాల మహేంద్రజాలికులు…!

హృదయ విదారక ఛాయాచిత్రాలతో…
చూసిన మనసుల్ని
కకావికలు చేసి…
పైసా వసూల్ అయ్యాక…
ఆసాంతం మ్రింగేసే అనకొండలు…!

అనాథాశ్రమాలలోని పసిపిల్లల
అవయవాలు తెగ్గోసి…
అవతలి మనసుల
జాలి,సున్నితత్వాలను…
క్యాష్ చేసుకునే
మాఫియాలు…!

“ఉపాధి ఇప్పిస్తాం…
ఉచితంగా విమానం ఎక్కిస్తాం”
అంటూ మాయమాటల ఉచ్చులు పన్ని…
అబలలను, బాలికలను
వదిలించుకోలేని ఊబిలోకి నెట్టేసే కర్కశులు…!

“మీ సమస్యల్ని తీరుస్తాం…
మిమ్మల్ని ఇహలోకపు ఈతిబాధలనుంచి “కడ”తేరుస్తాం అంటూ
ప్ర”వచనాలు” చెప్పే దొంగబాబాలు…!

పదిమంది మెప్పుకోసం…
తమ గొప్ప చెప్పుకోవడం కోసం…
అన్నదానాలు,వస్త్ర దానాల ఛాయాచిత్రాలతో…
పదవుల కోసం తిప్పలు
పడే పటాటోపా(పీ)లు…!

ఆకలిగొన్నవానికి అన్నం ముద్దై…
ఆవేదనలోనున్నవానికి
ధైర్యవచనాల తోడై…
ఆపదలో చేయూతనందించే అసలైన మానవత్వం పరిమళించే మనుషులు…
నూటికో,కోటికో ఒక్కరు…!!!

 

You May Also Like

One thought on “నూటికో…కోటికో…

  1. చక్కని పదచిత్రాలు వాడారు.అభినందనలు చంద్రకళగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!