పరిణిత పారిజాతం

పరిణిత పారిజాతం

(తపస్వి మనోహరి అంతర్జాల తెలుగు పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

మారుతున్న కాలంతో బాటు సామాజిక చైతన్యమూ పెరిగింది. లింగవివక్ష లేని సమానధోరణి అనేకమందికి తమ ప్రతిభకి మెరుగుపెట్టే విధంగా ఉంది. ఎక్కడో కాస్త తేడా ఉన్నా దానికి కూడా తట్టుకోగల మానసిక దృఢత్వం ఈ పెళ్ళివయసు పరిమితి పెంపుదలతో వస్తుంది అనిపిస్తుంది.  ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉన్న నేటి చిన్నకుటుంబ వ్యవస్థలో, అమ్మాయిని కూడా గారాబంగా, సున్నితత్వంతో పెంచడమే కనిపిస్తుంది.  20 ఏళ్ళ పిల్లలకి పూట పూటా అన్నం కలిపి పెట్టే తల్లులున్నారు. ఈ  విధానం వల్ల వాళ్ళు బైట కూడా ప్రేమ, ఆప్యాయత ఇంతే స్థాయిలో కోరుకుంటూ ఉంటారు. 18 ఏళ్ళకే చదువు పూర్తి కాదు. ఒకవేళ ఆపివేసినా కూడా, ఇంట్లో స్వయం ఉపాధికి ప్రయత్నం చేస్తూ ఒక ఆత్మ విశ్వాసపు ధోరణిని అవలంబించడానికి ఈ వయసు పెంపు లాభంగా అనిపిస్తుంది.
ఈ దిశగా పెద్దలు కూడా వారిని ప్రోత్సహించినప్పుడు అమ్మాయికి మానసిక నిబ్బరం, మంచి చెడుల బేరీజు తత్వం, శ్రమ చేయడం అలవాటవుతుంది. ‘అతి గారాబం కటిక దరిద్రం’ అనే సామెత ఉండనే ఉంది. సామాన్య మధ్యతరగతి లో 18 ఏళ్ళకు తల్లికి ఇంటి పనుల్లో కొంత సాయం చేయడం, వస్తువుల కొనుగోలు తీరు, వడ్డించే విధానం, ఇంటి అలంకరణ వంటివి యథాలాపంగా వచ్చి ఉంటాయి. ఎంత ఆధునిక ధోరణి వున్నా ఇలాంటి పద్దతి పెద్దలూ పాటిస్తున్నపుడు అమ్మాయికి భవిష్యత్తులో సమస్యలు తక్కువగా ఉంటాయి.
ఇక 18కే పెళ్ళి అంటే పూలతోట నుండి కార్ఖానా లో అడుగు పెట్టినట్టు కావొచ్చు. కొత్త ఇంట్లో వేరే విధంగా అడ్జెస్ట్ కావడం ఇబ్బంది. రెండు మూడేళ్ళ చదువు కొనసాగించాలి. తర్వాత ఉద్యోగం, లేదా స్వయం ఉపాధికి పెద్దల సహకారం ఉండాలి. ఆస్తులు ఉన్నాయని లోకం తెలియని విధంగా పెంచి తర్వాత బాధ పడరాదు. పెరిగిన వయసు ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకోగల దృఢత్వం మరియు తోటి మిత్రులను చూస్తూ అవగాహన పెంచుకోవడానికి ఈ సమయం చాలా ఉపయోగం.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!