అమ్మ చెప్పిన విలువలు

అమ్మ చెప్పిన విలువలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

ఉదయం కాఫీ త్రాగుతూ..భార్య సంధ్యతో ఆరోజు పేపర్ లోని విశేషాలన్నీ చెప్తున్నాడు భాస్కర్. బ్యాంక్ మేనేజరుగా రిటైర్ అయ్యి, రెండు నెలలయ్యింది. వీరికి ఒక్కగానొక్క కూతురు అర్పిత. బి.టెక్ చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యులో జాబ్ కూడా వచ్చింది. తాను సర్వీస్ లో ఉండగానే కూతురి పెళ్లి చేయాలని అనుకున్నాడు భాస్కర్. అనుకున్నట్టుగా ఈలోపు బంధువుల ద్వారా మంచి సంబంధం రావడం, అర్జున్ తో పెళ్లి చేయడం, ఆరునెలల క్రితమే అత్తవారింటికి పంపించడంతో ఇద్దరికీ ఏమీ తోచడం లేదు. అర్పిత, అర్జున్ వాళ్ల నుండి రెండు రోజులుగా ఫోన్ రాలేదు. ఆ విషయాలే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఇంటి ముందు టాక్సీ వచ్చి ఆగింది. అర్పిత రావడం చూస్తున్న సంధ్య, భాస్కర్లకు ఆశ్చర్యం మరియు సంతోషం ఒక్కసారిగా వచ్చేసాయి. గబగబా లేచి వెళ్లి అర్పిత చేతిలో సూట్ కేసు అందుకుని లోపలికి తీసుకుని వచ్చాడు భాస్కర్. సంధ్య వేడిగా కాఫీ కప్పు అందిస్తూ, ఒక్కదానివే వచ్చావు, అర్జున్ రాలేదేంటి సాయంత్రానికి వస్తానన్నాడా? నవ్వుతూ అడిగింది, సంధ్య. కాఫీ త్రాగిన కప్పుటీపాయ్ మీద పెడుతూ అమ్మా! అర్జున్ రాడు. నేనూ అతని దగ్గరకు వెళ్లను అంటుంటే సంధ్య, భాస్కర్ విస్తుపోయి అలానే ఉండిపోయారు, కాసేపు. అర్పిత తన బెడ్ రూము లోనికి వెళ్లిపోయింది. సంధ్య కళ్లనిండా నీళ్లు, దిగులుతో భాస్కర్ చేతులు పట్టుకుని సోఫాలో కూలబడి పోయింది. లే .. లే.. “ముందు భోజనం ఏర్పాట్లు చూడు, మెల్లగా అసలు విషయమేటో కనుక్కుందాంలే సంధ్యా. బెంగ పడకు ఓదార్పు కోసం చెప్పాడు భాస్కర్. సాయంత్రమయ్యింది. అమ్మలూ.. అర్పితా ! నీ చేత్తో టీ ఇవ్వు తల్లీ !
అడిగాడు భాస్కర్, అర్పిత చేసిన టీ కప్పు తీసుకుని, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఏమయ్యింది తల్లీ ? అసలు నీకూ, అర్జున్ కీ ఏమయ్యింది? అడిగారు సంధ్య , భాస్కర్ లు. అర్పిత చెప్తున్న కారణాలు వింటుంటే ఇద్దరికీ మతి పోయింది. ఏమీ లేదు డాడీ! అర్జున్ మంచోడే, కానీ తనతో ఉండడం నా వల్ల కాదు. పొద్దున్నే లేవాలంటాడు. వాకింగ్ కి, జిమ్ములకీ వెళ్దామంటాడు. వంట నేర్చుకోమంటాడు. నాకు నచ్చినట్టుగా కాకుండా అందరూ మెచ్చుకునేలా ఉండాలంటాడు. బట్టలు ఎటువంటివి వేసుకోవాలో కూడా తనే చెప్తాడు. అయినా వంట తనే చేయొచ్చు కదా ! నేనే ఎందుకు చెయ్యాలి? ఇద్దరం సమానంగా ఉద్యోగం చేస్తున్నాము కదా! అంతేకాదు, నాకు ఫ్ర్రీడం లేదు, అన్నీ కలిసిమెలసి చేద్దామంటాడు, ఇవన్నీ చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు తెల్సా! కూతురు చెప్పిన విషయాలు వింటుంటే సంధ్య, భాస్కర్ ఒకరిముఖాలు మరొకరు
చూసుకుంటూ ఉండిపోయారు. ఇంతలో
ఏదో ఫోన్ రావడంతో లేచి బయటకు వెళ్లాడు, భాస్కర్. ఇదంతా ఏమిటనుకుంటూ, సంధ్య వెళ్లి అర్పిత భుజమీద చెయ్యివేసి పక్కన కూర్చుంది. అర్పితా! ఏమిటే ఇదంతా! నేను, మీ నాన్న ఎప్పుడైనా గొడవపడ్డామా? ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా ఎప్పుడూ వాటిని పెద్దవిగా చెయడం మాకు తెలీదు. అసలు నీ గొడవకి నిజంగా సరైన రీజన్ ఉందా? ఏమాలోచిస్తున్నావే? నీవు చిన్నప్పటి నుండి, మా నుండి నేర్చుకున్న విలువలు ఇవా? నిన్ను, నీ ఆలోచనలను చూస్తుంటే మాకు మామీద, మా పెంపకం మీద నమ్మకం పోతోంది. ఎంత సిగ్గు పడుతున్నానో తెల్సా? అసలు జీవితంలో నీకు ఏ విషయాలకి గొడవపడాలో, ఏ విషయాలకి బాధపడాలో అర్ధమవుతోందా? చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అర్పితా! అమ్మగా చెప్తున్నాను, ఒక్క సారి విను. నువ్వే కాదు, మీ తరంలో వారందరూ ఇలానే ఉంటున్నారు, ఇలానే ఆలోచిస్తున్నారు. ఎంతో గొప్ప చదువులు చదువుతున్నారు, ఎంత సంస్కారాన్ని నేర్చుకుంటున్నారో మాకు అర్ధంకావట్లేదు. ఈగోలు పెంచుకోవడం, నువ్వా, నేనా అని వాదనలకు దిగడం తప్ప ఏమి పురోగతి సాధిస్తున్నారు? ఫ్రెండ్స్ మాటలు పట్టుకుని, బంగారం లాంటి భర్తని, సంసారాన్ని పాడుచేసుకోవడమేనా మహిళా సాధికారిత అంటే? పెళ్లిళ్ల కు, మూడుముళ్ల బంధానికి మీరిచ్చే విలువ ఇదేనా! తల్లిదండ్రులు శక్తికి మించి కష్టపడి, డబ్బులు సంపాదించి, పిల్లలు సుఖంగా ఉండాలని మంచి మంచి సంబంధాలు చూసి, లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు చేస్తే, మూడు ముళ్ల బంధాన్ని మూనాళ్ల ముచ్చటగా ముగించుకుని, చిన్న చిన్న కారణాలను భూతద్దంలోంచి చూస్తూ, జీవితాంతం తోడూనీడగాఉంటారనుకున్న భాగస్వామికి, తిలోదకాలిచ్చేయడమా పెళ్లంటే? ఒకప్పుడు అత్తమామలనీ, ఆడబడుచులనీ, వారు పెట్టే ఆరళ్లు అనీ, బాధపడే కారణాలుండేవి. నీకాబాధలేమీ లేవు కదా! అయినా ఇపుడెవ్వరూ అలా లేరు. చాలా ప్రేమగా, స్నేహంగా ఉంటున్నారు. వాళ్లెవరూ పక్కన ఉండడం లేదు. భార్యాభర్తలు మాత్రమే ఉంటున్న సంసారాల్లో ఎందుకీ సమస్యలు? ఒకఇంట్లో ఉంటూ, ఒక్క మనిషితో కూడా నువ్వు సర్దుకుపోవడం లేదంటే స్నేహంగా ఉండలేక పోతున్నావంటే చాలా బాధగా ఉంది. మన జీవితాలను చక్కదిద్దుకోలేని చదువులెందుకు?
అవతలి వ్యక్తి చెడ్డవాడైతే, అతనితోనే కాపురం చెయ్యమని ఎవ్వరూ చెప్పరే. నీ గొడవ నీది, నా గొడవ నాది అని బాధ్యతలేకుండా వున్నవాళ్లూ ఉన్నారు. అలా కాకుండా, ఎంతో ప్రేమగా ఉంటూ, అన్ని విషయాలూ చెప్తూ, ఆప్యాయంగా చూసుకుంటూ తన భార్యను చక్కగా మలుచుకోవాలని, కలిసిమెలిసి స్నేహంగా నిర్ణయాలు తీసుకుందామని బుజ్జగింపుగా చెప్తున్న అర్జున్ ని, నీ అవివేకంతో, అపార్ధం చేసుకుంటున్నావ్. చూడు ! అది కరెక్ట్ కాదు తల్లీ! మీరిద్దరూ చీటికీ మాటికీ గిల్లికజ్జాలు లేకుండా, చక్కగా కలిసి మెలిసి ఉండాలి. అసలు జీవితమంటే ఏమిటి.? ఏమి కావాలి? అని కనీస ఆలోచన లేకుండా అందమైన భవిష్యత్తుకు అనవసర కారణాలతో అడ్డుకట్ట వేస్తున్నారు. అవునా? కాదా? ఆలోచించు! విలువలతో కూడిన చదువూ సంస్కారం కావాలి. నేను, నాది అనికాక,  ‘మనము-మనదీ, అన్న భావనతో ఉంటే అసలిది సమస్యే కాదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదూ! ఇవన్నీ వింటున్న అర్పిత, నిజమే అమ్మా ! అంటూ తల్లి సంధ్య ఒడిలో పడుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. అంతలో అమ్మలూ! అర్పితా ! ఎవరొచ్చారో చూడు ! అంటూ బయటకు వెళ్లిన తండ్రి భాస్కర్, అల్లుడు అర్జున్ని వెంటపెట్టుకుని రావడంతో, పరుగున ఎదురెళ్లి అర్జున్ ని రెండు చేతులతో చుట్టేసింది అర్పిత. అమ్మ చెప్పిన విషయాలు నా కళ్లు తెరిపించాయి, నా అర్జున్ ని ఎప్పటికీ దూరంచేసుకోను, మనసులో అనుకుంది, అర్పిత. అర్జున్ కోసం మంచినీళ్లు, కాఫీ తేవడానికి వంటింట్లోకి వెళ్తున్న సంధ్య వెనకాలే వెళ్లాడు, భాస్కర్. అర్జున్ ఫోన్ చేయడంతో బయటకు వెళ్లి అతన్ని కలిసానని, అతను చాలా నొచ్చుకున్నాడని, నచ్చచెప్పి ఇంటికి తీసుకుని వచ్చాననీ చెప్పాడు భాస్కర్. సోఫాలో ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయి కూర్చున్న అర్పిత, అర్జున్ లను చూసి, ఇదే కదా, మూడు ముళ్ల బంధంవిలువ, వారు చెప్పినమాటలు విని అర్ధం చేసుకుని కలిసినందుకు, హాయిగ ప్రశాంతంగా ఊపిరితీసుకున్నారు సంధ్య మరియు భాస్కర్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!