పురుషోత్తముడి ఫోటో

పురుషోత్తముడి ఫోటో (కథా సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్ష: పరిమళ కళ్యాణ్

రచయిత: యండమూరి వీరేంద్రనాథ్

ఈ కథ 1970s లో కథ అన్నారు కాబట్టి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాసినట్టుగా అనిపిస్తుంది. మంచి కథకు ఉండవలసిన లక్షణాలు అన్నీ ఇందులో కనిపిస్తాయి. కథ చదివితే, పాత సినిమా చూసినట్టుగా అనిపించింది. కథలో ట్విస్టులు బాగున్నాయి, అయితే ఈ కాలంలో మనం ఊహించగలిగినట్టే ఉన్నాయి. మనిషి లోపల ఉండే స్వభావాన్ని, డబ్బుతో ప్రతి అంశాన్ని ముడిపెట్టే విధానాన్ని, డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యతను చక్కగా వివరించిన కథ. ఉద్యోగం చేస్తూ లంచం తీసుకుంటూ పట్టుబడి రివర్షన్ పొందిన ఉద్యోగి అంటూ అతని లంచగొండి తనాన్ని ముందుగానే వివరించారు రచయిత. అంతేకాదు, రిటైర్ అవ్వబోతున్నాను కదా అని, ఆ చేతివాటాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాడని చెప్పటం అతని మనస్తత్వాన్ని ప్రేక్షకుడికి తెలియచేస్తుంది. అలాగే అతను ఎప్పుడూ చీవాట్లు పెట్టడానికే పై ఆఫీసర్లు పిలుస్తారని అనటం, అతని ముప్పై ఏళ్ళ సర్వీసులో తిట్లు తినటమే అతనికి తెలుసుననటం అతని ప్రవర్తనకు అద్దం పడుతుంది. అలాగే యుక్త వయసులో జల్సా గా బాధ్యతా రాహిత్యంగా తిరిగిన పురుషోత్తం, ప్రేమించిన అమ్మాయిని కాదని డబ్బు ఆశతో మరొకరిని పెళ్ళి చేసుకుంటాడు, ప్రేమించిన అమ్మాయి తల్లి కాబోతున్న విషయం తెలిసి కూడా అతని వక్ర మగబుద్ధితో, ఆమెని వదిలి వేస్తాడు. తర్వాత ఆమె గురించీ పట్టించుకొనే లేదు. కానీ పాతికేళ్ల తర్వాత కొడుకు కలెక్టర్ అయ్యాడని తెలిసి లేని ప్రేమని చూపారు పురుషోత్తమ్ ఇంకా అతని భార్యా పిల్లలూ. కలెక్టర్ కుమార్ ని చూసి, పురుషోత్తం అతను ఆ వయసులో ఉన్నప్పుడు ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నాడో గుర్తుచేసుకుంటాడు. ఈ కథ మనిషిలోని అత్యాశ, లోభం లాంటి దుర్గుణాలను, డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు డబ్బు కోసం ఏదైనా చెయ్యగలిగే మనుషుల నైజాన్ని ఎత్తి చూపిస్తుంది. కుమార్ తనని ఇంటికి తీసుకుని వెళ్తాను అనటంతో జరగబోయేది ఏమిటో ఊహించగలం, ఏదో బంధుత్వం ఉండే ఉంటుందని. అలాగే కుమార్ ఇంట్లో అతని పెద్ద ఫోటో చూసి అతనిపై తను ప్రేమించి విడిచిపెట్టిన మనిషి అయిన సరోజ కు గల ప్రేమను తెలుసుకోగలుగుతాడు. కొడుకు కలెక్టర్ అవ్వటంతో ఆనందం పొందుతాడు, అలాగే వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళాక ఆ ఇంట్లో జరిగే సంభాషణలు వారి మనస్తత్వాలకు అద్దం పడతాయి. సరోజ భర్త అండ లేకపోయినా కొడుకుని ఎంతో ఉన్నతంగా, మంచి ఆశయాలతో, మంచి నడవడికతో పెంచటం ఆమె పట్టుదలకు, ఆమె కష్టానికి తార్కాణం. కుమార్ సరోజను వంట మనిషి అని చెప్పటం పెద్ద షాక్ పురుషోత్తంకే కాదు, చదువరులకు కూడా. అప్పుడే వారి అసలైన ప్రవర్తన బయటపడుతుంది. పురుషోత్తం నిజ స్వరూపం బయట పడ్డాక, కుమార్ మళ్ళీ వచ్చి, సరోజను అతని తల్లిగా చెప్పటం, అదంతా అతని గురించి తెలియచేయటానికి ఆడిన నాటకం అని చెప్పటం లాంటి చివరి ట్విస్ట్ కథని ఉన్నతంగా నిలబెట్టింది. సరోజ నిజం తెలుసుకుని పురుషోత్తం ని కొట్టడం ఆమె నమ్మించి మోసం చేసినందుకు తగిన శాస్తి అనిపిస్తుంది. ఏదేమైనా పాత కాలం నాటి సెంటిమెంటల్ సినిమాను గుర్తు చేసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!