వదలని మత్తు
రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు
“ఏయ్!తలుపు తియ్యే !లోపల ఎవరితో తొంగున్నావే…ఏటి సేత్తున్నావే…తలుపుతియ్య్” తాగొచ్చి రంగయ్య గొడవ .ఇది కాంతానికి నిత్యకృత్యమే.తలుపు తను తీయడానికెల్తుంటే కొడుకు శీను ఆపేశాడు.”వుండు నేను తీస్తా!”అంటూ తలుపు తీసి “నీ కేటీ ఈరోగం?రోజు ఇదే పనా?ఈరోజు నువ్వు ఇంట్లోకి రావద్దు.ఎక్కడికి ఎల్తావో ఎళ్ళు” అంటూ తలుపులు మూసేశాడు.తలుపులు బాది బాది మత్తు తో పడుకొండి పోయాడు బయటే.
తెల్లవారితే మామూలుగా “ఒలే కాంతం ఆకలేత్తుంది కాస్తా చల్దెట్టవే.”అంటూ గారాలు పోయేడు.
“సిగ్గలజ్జలేనీ జన్మ.చీ.ఇంద తిను”అంటూ కంచంలో పెట్టబోయింది కాంతం.ఇంతలో శీనొచ్చి ఆ కంచం లాక్కున్నాడు.”ఈ రోజునుండి ఈ మనిషికి కూడెట్టకు. ఓ నాలుగురోజులు కూడెట్టకపోతేగాని బుద్దిరాదు”.
“నువ్వేట్రా!మద్దిలో.నానోటికాడ లాగేసుకుంతన్నావు? నువ్వేటే ఆడలగా సేత్తుంటే కల్లప్పగించి చూత్తన్నావు. ఆడికి కల్లబడవేటి.ఆడేటి నాకొడుకా రంకుమొగుడా.” అంటూ రంగడు గోల.
“తాగి తాగి నీ పని పొగుట్టుకున్నావు కాదేటి.నాలుగు డబ్బులు తెస్తావంటే ఏటీ లేదు.అమ్మని కొట్టి డబ్బులాక్కెల్తాన్నావు.మేమిద్దరం కష్టపడి డబ్బులు తేస్తే నువ్వు తాగుతావా. సిగ్గు లజ్జాలేదా నీకు.నువ్వు మడిసివేనా”.అంటూ శ్రీనుగాడు తండ్రిని నిలదీశాడు.
“ఈరోజు నువ్వు కూలోనాలో చేసి డబ్బుతెస్తెనే నీకు ఈ ఇంట్లోకి రానిత్తా.నీ డబ్బుతో తాగుతావో ఏటవుతావో నీ ఇష్టం.”ఖచ్చితంగా చెప్పేశాడు శ్రీను.
కాంతం మొగుడు పై ప్రేమే కాని మొగుడు తాగి ఇంటి విషయాలు పట్టించుకోక పోవటంతో మౌనంగా ఉండిపోయింది.ఈ నామొగుడెప్పుడు బాగుపడతాడోనని కాంతానికొకటే దిగులు. అసలు రంగడు చాలా కష్టపడి పని చేసేవాడు. కొడుకు శ్రీనుని పెళ్ళం కాంతాన్ని బాగా చూసుకొనేవాడు.ఒక కర్రల అడితిలో పనిచేసేవాడు. ఆ పని వల్ల వచ్చిన డబ్బులతో కొడుకుకు కావల్సినవి కొనేవాడు.అప్పటికి శీను పదోక్లాసు చదువుతున్నాడు.కొడుకు బాగా చదువుతాడని బడిపంతుళ్ళు చెబితే చాలా సంతోషించేవాడు. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో ఎలా అలవాటైందో సారా తాగడం అలవాటైంది.అది అలా వ్యసనంగా మారి చివరికి అడితిలో దొంగచాటుగా కలపముక్కలను అమ్మి డబ్బులు చేసుకొనేవాడు. ఇదోకరోజు అడితి యజమాని చూసి వెంటనే పని నుండి తీసెశాడు.శీనుగాడుపదోతరగతి తోనే చదువు ఆగిపోయింది.ఎలాగో బతిమాలితే అడితి యజమాని శీనుకి పని ఇచ్చాడు.కాని రంగడు కాంతాన్ని తిట్టికొట్టి డబ్బులు గుంజుకొని పోయి తాగొచ్చి ఇలా అల్లరి చేయడం రోజు అలవాటైంది.శ్రీను తండ్రి చిన్నప్పుడు చూపిన అభిమానానికి సంతోషమే.కాని తండ్రిని దారిలోకి తేవాలనే కఠినంగా మారేడు.ఎప్పటికైనా తండ్రి మారకపోతాడనే నమ్మకంతోనే. రంగడు లో ఎటువంటి మార్పురాలేదు.దొంగతనంగా ఇంట్లో చిన్న చిన్న వస్తువులను అమ్మి తాగడం చేసేవాడు.ఎప్పటిలా ఈ రోజుకూడా తాగి తలుపులు దబదబా బాదడం చేసేడు.కొడుకుగాని పెళ్ళం కాంతం ఎంతగా బాదినా తలుపులు తీయలేదు. అరచి అరచి దగ్గు దగ్గుతోపాటు నోటినుండి రక్తం భళ్ళన వాంతైంది. సొమ్మసిల్లి పడిపోయాడు ఆ గుమ్మం దగ్గరే.తెల్లారి చూస్తే చనిపొయాడు.శ్రీను కాంతం గొల్లుమన్నారు.
***