మూగ రోదన

మూగ రోదన

రచన :: పి. వి. యన్. కృష్ణవేణి

స్నిగ్ధ పేరుకు తగిన అందంతో పాటు, ఎంతో అనుకువగా  ఉండే అందమైన ఆడపిల్ల. కానీ దురదృష్టవశాత్తు,  పురిటిలోనే తల్లికి దూరమైన పిల్ల.

ఆస్తులో,  అంతస్తులో… అందంలోనూ, అనుకువ లోనూ,  చదువులోనూ,  సంస్కారం లోనూ ఏమాత్రం వేలెత్తి చూపించడానికి వీలుగాని అపురూపమైన ఆడపిల్ల.

కానీ, మానసిక ప్రశాంతత అనేది లేకుండా పురిటిలోనే తల్లిని పోగొట్టుకొని, సవతి తల్లి పెట్టే కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేని అభాగ్యపు సగటు ఆడపిల్ల.

ఏది ఏమైనా, తను ఎన్ని బాధలకు ఓర్చుకున్నా,  ఉన్నత చదువులే చదివి తీరాలి అని పంతం పట్టింది.

ఏ మాటకి ఎదురు చెప్పని గుణవంతురాలు తన కూతురు.  ఈ విషయంలో ఎందుకిలా పంతం బట్టిందో వాళ్ళ నాన్నకి మాత్రం బాగా తెలుసు.  కానీ,  సవతి తల్లి మాత్రం ఆ పిల్ల వైఖరి వింతగానే అనిపించింది.

హా…  ఏదైతే ఏం లే. చెప్పిన మాట వింటూ తనకి ఎదురు తిరగకుండా,  కొంతకాలం తను ఏం చేస్తే నాకే ఎలా పోతే నాకే అనుకుంటూ, చదువే కదా అని కాలేజీలో చేర్పించారు స్నిగ్ధ ని.

చూసే వాళ్ళందరికీ మాత్రం, స్నిగ్ధ పాలరాతి శిల్పం. కష్టం ఎరుగని సున్నితమైన కుందనపు బొమ్మ.  అందరి హృదయాల్లో ఆమెను చూస్తే ఒక రకమైన ఈర్ష్య.

అందం, చదువు అన్ని ఉన్నా, అందరికీ మాటల్లో చెప్పలేని అసూయ ఉండేది ఆమె అంటే.  అందుకే ఎవరూ ప్రాణ స్నేహితులు కాలేకపోయారు.

అంతా సవ్యంగానే ఉంది అనుకున్న సమయంలో స్నిగ్ధ కు కాలేజీలో తనతోనే చదివే మనోహర్ తో పరిచయం ఏర్పడింది.  అందరితో అంటీ ముట్టనట్లు ఉండే తను, మనోహర్ తో మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.

వంటరితనంతో కుమిలిపోయిన తన మనసు,  అతని పై వ్యామోహమో, నిజంగానే మనోహర్ పై ప్రేమో తెలియదు కానీ, అతనితో ఉంటే తన జీవితం మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది.

కానీ, ఏం చేయాలో తెలియని పరిస్థితి.  ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో  అర్థం కాక ఎన్ని రాత్రులు ఆ ప్యాలెస్  లోపల తన బెడ్ రూమ్ లో ఎడ్చిందో తనకే తెలియదు..

కానీ, తన సవతి తల్లి జ్యోతి మాత్రం వాళ్ళ తమ్ముడు సురేష్ కి,  స్నిగ్ధ ని ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచనలతో ఉన్నదని తనకి బాగా తెలుసు.

ఇంకా సురేష్ విషయానికొస్తే …. చదువు లేదు సరి కదా,  మూర్ఖుడు. వాళ్ల అక్క చెప్పిన ప్రతి దానికి ఆలోచనా రహితంగా తానా అంటే తందానా అనే రకం.  అంతేకాకుండా కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత దొరికిన పైకంతో తాగుడు కూడా అలవాటు చేసుకున్నాడు.

కోతికి కొబ్బరి కాయ దొరికిందా అన్న చందాన, వాడి అలవాట్లకు మా డబ్బు కూడా తోడైంది   ఇంకా నేను కూడా వాడితో ఉన్నాను అంటే వాడు ఇంకేం చేస్తాడో అన్న ఆలోచనతో  కుమిలి, కుమిలి ఎడ్వని రోజు లేదు.

ఇంక మనోహర్ విషయం జ్యోతి కి తెలిస్తే, తన పెళ్లి అయిపోతుందేమో అన్న బాధ కంటే, తన ఆస్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది అన్న గుండెగుబులు పట్టుకుంటుంది ఆమెకు.

అమ్మని హింసించినట్టు,  నన్ను కూడా హించిస్తారేమో అన్న ఆలోచన రాగానే గతం గుర్తుకు వచ్చింది స్నిగ్ధకు.

అమ్మ నన్ను కడుపులో మోస్తున్న సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది  కాళ్ళు చేతులు కదల లేని స్థితికి వచ్చేసింది.  అప్పుడు తప్పని పరిస్థితుల్లో తన దూరపు బంధువు అయిన జ్యోతిని ఇచ్చి పెళ్లి చేశారు నాన్నకు.

అప్పటి రోజుల్లో వైద్యం కంటే నాటు వైద్యమే ఎక్కువ అందుబాటులో ఉండేది. అది ఆసరాగా చేసుకున్న జ్యోతి విశ్వాసం లేకుండా,  వేయకూడని మందులు వేసినట్టుగా అప్పట్లో అని చాలామంది చెప్పుకునే వారు. ఆ మందుల ప్రభావం వలన అమ్మకు ప్రాణం మీదకి వచ్చింది.

మీ అమ్మకు కొంచెం చదువు వుంటే, తను బతికుండేది  అంటూ ఉండేవారు చుట్టుపక్కల వాళ్ళు . తెలిసీ తెలియని వయసులో అర్థం అయ్యి, అవనట్టు గా,  ఉండే వి వాళ్ల మాటలు.

ఈ విషయాలు అన్నీ మనోహర్ కి చెప్పుకుంది ఒకరోజు.

ఏది ఏమైనా,  మీ నాన్నగారి అనుమతి ప్రకారమే పెళ్లి చేసుకుందాం అన్న మనోహర్ మాటలకి అతని మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది తనకి. తన ప్రేమ పై పూర్తిగా నమ్మకం కలిగింది.

ఇంకా ఏమి ఆలోచించ కుండా, తన గదిలో నుండీ బయటకు వచ్చి, వాళ్ళ నాన్న గారికి తన ప్రేమ సంగతి వివరించింది.

తన కూతురి పై పూర్తిగా నమ్మకం ఉన్న ఆమె తండ్రి రాఘవ గారు ఏమి అభ్యంతరం పెట్ట లేదు సరి కదా!!! డిగ్రీ పూర్తిచేసిన వెంటనే,  పెళ్లి  కూడా చేస్తామని మాట ఇచ్చారు.

వీళ్ళు మాటల్లో ఉండగానే,  జ్యోతి రానే వచ్చింది.

జ్యోతి వైపు కు తిరిగి,  పిన్ని నీ ఆస్తి బయటికి పోతుందని నువ్వేమీ బాధపడనవసరం లేదు   నాకు నీ ఆస్తి కూడా ఆక్కర్లేదు.  మా నాన్నని కంటికి రెప్పలా కాపాడుకో చాలు.  నేను ప్రేమించిన మనోహర్  వెలకట్టలేని అంత ప్రేమను నాకు ఆస్తిగా ఇస్తున్నాడు. అంది

ఛ.. ఊరుకో  స్నిగ్ధా, అవేం మాటలు.  నాకు నువ్వు కాక ఇంకా ఎవరున్నారు చెప్పు!!! నాకెమన్నా పిల్లలు ఉన్నారా?  నువ్వే కదా మాకు అంది నవ్వుతూ.

ఆమె ఆ మాత్రం నటించకపోతే, మా నాన్న ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేస్తారేమో అన్న చిన్న భయం. అప్పటి నుంచీ  అణిగిమణిగి ప్రేమగా ఉండసాగింది నాతో.

నిజ జీవితంలో మనుషులు,  సినిమాలో లాగా అంత త్వరగా మారుతారని నాకు నమ్మకం లేదు.  అందుకే ఎంత పెళ్లి అయిపోయినా సరే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అన్ని విషయాల్లో.

కానీ నాకున్న భరోసా మాత్రం ఒకటే.  ఏదో ఒక భాద కలిగితే, ఇదివరకు లాగా అంత పెద్ద ప్యాలెస్ లో  ఏడుస్తూ కూర్చో అక్కర్లేదు మూగ రోదన అవసరం లేదు ఇప్పుడు. నాకంటూ ధైర్యం చెప్పే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. నాన్న,  మనోహర్ అని అనుకుంటూ ఉంటే నాకు ఆనందం గా ఉంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!