జై కిసాన్

జై కిసాన్

రచన:: రామ్ ప్రకాష్

“ఈ ఏడు పంట బాగా పండినట్టు ఉండాదే… ప్రసాదు.. ఈసారి డబ్బులు లెక్కపెట్టేకి సాయం రావాల్నంటే సెప్పు..” అంటు పరాచకాలాడాడు పక్కా పొలం సుబ్బయ్య..

నా మనసు ఆనందంతో నిండిపోయింది. నిజమే ఈసారి నా పొలంలో పంట చాలా బాగా పండింది. రాత్రింబవళ్ళు నేను, లక్ష్మి కష్టపడి పని చేసాము.
తండ్రికి బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో.. రైతుకు బిడ్డ లాంటి పైరు ఎదుగుతుంటే అంతే సంతోషంగా ఉంటుంది.

సరిగ్గా అప్పుడే ఊరి జమిందారు అక్కడికి వచ్చాడు
“ఎం ప్రసాదు.. ఇంకా నా బాకీ ఎప్పుడూ తీరుస్తావు.”

“ఈసారి పంట అమ్మగానే ఇచ్చేస్తా అయ్యా…”

“నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వారంలోగా మొత్తం డబ్బులు కట్టినావా సరే.. లేదంటే పంచాయితీ పెట్టి నీ ఆస్తులు వేలం వేయిస్తా.. తరువాత నీ ఇష్టం..” అంటు వెళ్ళిపోయాడు.

ప్రతి ఏడు విత్తనాల కోసం, మందుల కోసం తనతో అప్పు. చేస్తూనే ఉన్నాను. అధిక వడ్డీతో అది పెరిగి పెరిగి కొండంత అయ్యింది. అయినా ఈసారి పంట చూస్తుంటే కొంచెం ధైర్యంగానే ఉంది..
ఈసారి పంటకు మంచి ధర కూడా ఉంది. ఇది అమ్మితే చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. మిగిలిన డబ్బుతో ముందు లక్ష్మి కి ఒక చీర అయినా కొనాలి. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకటి కొన్నాను. మళ్ళీ కొనిందే లేదు. పాపం తను కూడా కావాలని నోరు తెరిచి అడిగింది లేదు .  ఇక పిల్లాడికి కూడా కొత్త బట్టలు కొనాలి. రోజు చిరిగిన చొక్కా, లాగు వేసుకొని తోటి పిల్లల ముందు నవ్వులపాలు అవుతున్నాడు.

ఇలా ఆలోచనల్లో ఉండగానే పిల్లాడు కేక వేయడంతో ఈ లోకంలోకి వచ్చాను.
“నాన్న.. మావయ్య ఊరి నుంచి వచ్చాడు. అమ్మ ఇంటికి రమ్మంటుంది “

మరోసారి బాగా పెరిగిన పంటను కళ్ళ నిండా నింపుకొని ఇంటికి బయల్దేరాను.

“ఎం బావా ఎలా ఉన్నావ్?”

“బాగున్నా శేఖర్.. నువ్వెలా ఉన్నావ్? “

“అంతా మంచిదే బావ. ఈ సారి పంట బాగా పండినాది అంటగా. ఇప్పుడే అక్క చెప్పింది. “

” మా రెక్కల కష్టం చూసి ఇన్నేళ్లకు దేవుడికి దయ కలిగిందేమో…. “

” అయినా ఇలా ఇంత కష్టపడే బదులు నాతో వచ్చేయ్ బావా.. సిటీ లో ఏదో ఒక ఉద్యోగం చూస్తాను “

” అవునా… మంచి ఉద్యోగం అంటే… “

“డబ్బులు బాగా వస్తాయి బావా.. సంతోషంగా కాలు మీద కాలేసుకొని తినచ్చు..”

” అలా తినాలంటే ఎవరో ఒకరు పండించాలి కదా.. ”
నా మాటకు తను మౌనంగా ఉండిపోయాడు.

” అవును శేఖర్..  ఎంత మంది రోజు ఎన్ని లక్షలు సంపాదించినా చివరకు అన్నమే తింటారు కానీ ఆ నోట్ల కట్టలు తిని బ్రతకలేరు కదా.. అందరూ ఇలా డబ్బు వెనుకే పరిగెడితే వాళ్లకు బువ్వ పెట్టేది ఎవరు. “

” ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది పండిస్తున్నారు లే బావా.. ఎవరో ఒకరు పెడతారు   “

” ఇలా ప్రతి ఒక్కరు నేను కాకపోయినా ఎవరో ఒకరు ఉన్నారుగా అని అనుకుంటే చివరకు మిగిలేది నువ్వు వెతుకుతున్న కరెన్సీ కట్టలు మాత్రమే…  మా తాతల కాలంలో ఊర్లలో అక్కడక్కడా ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడక్కడా రైతులు ఉన్నారు. ఇలాగే జరిగితే ఇంకొన్ని సంవత్సరాల తరువాత రైతు ఉండేవాడని పుస్తకాల్లో చదువుకుంటామేమో… “

“అబ్బ… మొదలుపెట్టారా మీ పాఠం. రాక రాక మా తమ్ముడు ఇంటికొస్తే…. నువ్వు లోపలకి రారా.. ఆయన గోల ఎప్పుడూ ఉండేదే..” అంటు శేఖర్ ని లోపలకు తీసుకెళ్లింది.

నేను అక్కడే నులక మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూసాను. నేను మాట్లాడింది నిజమే కదా… ఒక పోలీస్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగి, రాజకీయ నాయకుడు…. ఇలా ఏది అవ్వాలన్న ముందు బ్రతికి ఉండాలి. అలా బ్రతకాలంటే మూడు పూటలా ఐదు వేళ్ళు లోపలకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే రైతే కదా కారణం.
అయినా ఈ కాలంలో ఏసీ గదుల్లో చెప్పులు కుట్టే వాడికి ఇచ్చే మర్యాద ఎండలో కూరగాయలు అమ్మే రైతుకు ఇవ్వరు. ఎప్పటికి మారుతుందో ఈ సమాజం…

అలా ఆలోచిస్తునే అలుపొచ్చి అలాగె పడుకునేశాను. మధ్యరాత్రి వేళ మొహం మీద తేమ తగలడంతో మెలుకువ వచ్చింది. చూస్తే చిన్నని వర్షం… అది చూడగానే నా గుండె కాసేపు ఆగిపోయింది. ఇప్పుడు వర్షం పడితే మొత్తం పంట నాశనం అవుతుంది. మనసులోనే వర్షం పెద్దగా అవ్వకూడదు అని దేవుడికి దండం పెట్టుకున్నాను. అయినా దేవుడు వినలేదు. చూస్తూ ఉండగానే వర్షం వరదలా మారింది.
అయినా నా పిచ్చి గాని దేవుడికి ఆకలి వేస్తుందా.. అన్నం తింటాడా.. ఒకే ఒక్కసారి రైతులా మారి పండించి తింటే మా కష్టాలు అర్థమయ్యేవి. అలా అర్థమైతే మాకు ఇలాంటి పరిస్థితులు రావేమో…

ఉదయానికి వర్షం తగ్గింది. కానీ నా గుండెల్లో మాత్రం కురుస్తూనే ఉంది. పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్ళాను. అప్పటికే పంట మొత్తం నేల రాలిపోయింది. నాలో కురుస్తున్న వర్షానికి గుండె నిండి కన్నీళ్ల రూపంలో జారుతునే ఉంది..ఈ వర్షం కూడా మా నోటి కాడ కూడు లాగేసుకుంది. ఇప్పుడెలా బ్రతకాలో అర్థం కావడం లేదు.
కన్నీరు ఆగక దారంతా మసకగా కనపడుతుంటే ఎలా ఇంటికొచ్చనో కూడా తెలీదు..

నన్ను అలా చూస్తుంటే లక్ష్మి, పిల్లాడు ఇంకా భయపడుతున్నారు. కానీ నా భయం వాళ్ళ భవిష్యత్తు గురించే అని ఎలా చెప్పను..

” ఏవండీ. కొంచెమైనా అన్నం తినండి. రాత్రి కూడా భోజనం చేయలేదు. “

” ఇంకేం మిగిలింది అని తినమంటావ్ లక్ష్మి. ఈ సంవత్సరం అయినా పంట పండితే మన కష్టాలు పోతాయి అనుకున్నా.
చేతికొచ్చిన పంట ఇలా కళ్ళ ముందే నీళ్ల పాలు అవ్వడం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను.”

” మీరే ఇలా డీలా పడిపోతే ఎలా అండి. “

“మరేం చేయమంటావ్.. మొన్న సారి నకిలీ విత్తనాల, కల్తీ మందుల వల్ల పంట సరిగా పండలేదు. నిన్న సారి అంతా బాగుంది అనుకుంటే సరైన రేట్లు లేక.. మనం పంట మార్కెట్ దాకా తీసుకెళ్లడానికి అయిన డబ్బులు కూడా చేతికి రాలేదు. మరి ఇప్పుడు… అంతా బాగుంది అనుకుంటే అకాల వర్షాలు….
ఒక ఉద్యోగస్తుడు బ్రతుకు తన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనలాంటి రైతుల బ్రతుకులు మాత్రం విత్తనాలు, మందులు, వర్షాలు, దళారాలు, గిట్టుబాటు ధరలు….. ఇలా ఎన్నింటి మీద ఆధారపడి ఉందో చూడు…”

” మీరు అలా మాట్లాడుతుంటే భయంగా ఉందండి.. “

“నిజమే కదా…రైతు రాజంటారు.. మరి రాజ్యం ఏడుంది.
రైతే దేశానికీ వెన్నెముకంటారు, ఈ రోజు రైతు నడవడానికి కూడా రాకపాయె….”

“మీరు బాధపడకండి.. వ్యవసాయం కాకపోతే ఏంటి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం..” అంటు నన్ను ఓదార్చింది. తరువాత తను ఇంటి పనుల్లో మునిగిపోయింది.

కానీ నా మెదడులో ఆలోచనలు మాత్రం ఆగడం లేదు.

” నాన్న… రేపు కొత్త బట్టలు కొనుక్కోడానికి పట్నం వెళ్తున్నామా.. ” అంటు అమాయకంగా పిల్లాడు అడుగుతుంటే ఎం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా తల ఊపాను.

రేపు ఉదయం అప్పులోళ్ళు ఇంటికొస్తారు. కట్టకపోతే ఊరందరి ముందు వేలం వేసి నా పరువు తీస్తారు. పరువు పోయిన ఊర్లో ప్రాణాలతో తిరగలేను. కళ్ళ ముందు బ్రతకడానికి మరో మార్గం కనిపించడం లేదు. చావడం ఒక్కటే దారి అనిపిస్తుంది. అదే చేయాలని నిర్ణయించుకున్నాను.

చీకటి పడింది… చివరిసారిగా లక్ష్మి, పిల్లాడితో ఆనందంగా కబుర్లు చెప్తూ భోజనం చేశాను. ఇద్దరు నా గుండెల మీద వాలి పడుకున్నారు. కానీ ఈ గుండె కాసేపట్లో ఆగుతుందని వాళ్లకు తెలీదు. ఇద్దరు పడుకున్న తరువాత మెల్లగా వాళ్ళను పక్కకు పడుకోబెట్టి లేచాను. ఒక్కసారి వాళ్ళని కంటి నిండా నింపుకున్నాను.

పొలానికి కొట్టగా మిగిలిన పురుగుల మందు చేతిలోకి తీసుకున్నాను. మెల్లగా తలుపు దగ్గరగా వేసి బయటకు నడిచాను. డబ్బా మూత తెరిచాను. చేతులు వణుకుతున్నాయి. కళ్ళలో కన్నీటి ప్రవాహం ఆగడం లేదు. ఎందుకో గుండెల్లో భయం మొదలైంది. దీనెమ్మ సావాలన్న చాలా ధైర్యం కావాలని అర్థమవుతుంది. కానీ వేరే మార్గం లేదు. మట్టిలో పుట్టాను. మట్టినే నమ్ముకున్నాను. చివరకు మట్టిలోనే కలిసిపోతాను.
నా ముందున్న పురుగుల మందే ఇప్పుడు పానకం లాగా కనిపిస్తుంది..మెల్లగా డబ్బా పైకి లేపాను.

సరిగ్గా అప్పుడే లక్ష్మి, పిల్లాడు ఇద్దరు తలా ఒక గ్లాస్ పట్టుకొని నా ముందు నుంచున్నారు. వాళ్ళని అక్కడ చూడగానే ఆశ్చర్యం, భయం, సిగ్గు ఒకేసారి కలిగాయి. తన కళ్ళలోకి చూడలేక తల దించుకున్నాను.

” ఆగిపోయారు ఏంటండీ. మాకూ గ్లాస్ లో తలా కొంచెం పోయండి. ముగ్గురం ఒకేసారి పోదాం… “

” లక్ష్మి….. ” అంటు కన్నీటితో పలికాను.

“మీరు బ్రతకలేక చావడానికి సిద్దపడ్డారు కానీ మీరు పోయాక మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని ఒక్కసారి అయినా ఆలోచించారా..”

లక్ష్మి చేప్పింది నిజమే అనిపిస్తుంది. నేను పోయాక వాళ్ల జీవితం ఊహిస్తుంటేనే భయంగా ఉంది…

“మన పిల్లాడు పరీక్షలో తప్పితే ఈసారి బాగా చదివి రాయమని చెప్తాం కానీ… చదువు మానేయమనంగా..
ఇది అంతే అండి. రైతు బ్రతుకులు చాలా వాటి మీద ఆధారపడచ్చు. కానీ అందరి బ్రతుకులు రైతు మీదే కదా ఆధారపడుతాయి. మాకు ధైర్యం చెప్పే మీరే ఇలా చేస్తే ఎలా..  ఇది తీసుకొని అప్పు కట్టండి..”
అంటు తన మంగళ సూత్రం నా చేతిలో పెట్టింది. అప్పటిదాకా గమనించలేదు. తన మెడలో ఇప్పుడు పసుపు కొమ్మ ఉంది. నేను షాక్ అయ్యి అలాగే చూస్తున్నాను..

” ఈ ఏడు కాకపోతే మళ్ళీ ఏడైనా మంచి పంట పండిద్దాం అండి.. అది కాకపోతే మన ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉంది కదా . అక్కడ నేను కూరగాయలు పండిస్తాను. ఇంకా నాకు కుట్టు మెషిన్ కుట్టడం వచ్చు కదా. అది కూడా మెదలుపెడతాను. ఇలా ఏదోలా బ్రతుకుదాం అండి.. అందరికి బ్రతుకునిచ్చే మనమే ఊపిరి ఆపేద్దాం అంటే ఎలా..”

తను మాట్లాడిన ప్రతి మాట నాలో ఆలోచనలు రేపాయి. తను నా చేతిలో పెట్టింది తాళి కాదు బ్రతకడానికి కావాల్సిన భరోసా అనిపించింది. ఇప్పుడు ఎలా అయినా బ్రతకగలను అనే ధైర్యం నాలో మొదలైంది. నా ప్రాణం పోకుండా తన ప్రాణం అడ్డెసిన లక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది.
ప్రేమగా తనని పిల్లాడిని దగ్గరకు తీసుకున్నాను….

—–

ఇది కథ కాదు.. చాలా చోట్ల నిత్యం జరుగుతున్నాదే. మా ఇంట్లో కూడా ఒకప్పుడు జరిగినదే…
దేశం ముందుకు వెళ్తుంది. కానీ ఎందుకో రైతు మాత్రం అక్కడే ఆగిపోయాడు. వీలైతే చేయూతనిద్దాం.. అంతే

అలాగే మనం తినే ప్రతీ మెతుకు వెనకాల ఒక కష్టం ఉంటుంది. మనకు తెలియని ఓ కన్నీటి కథ ఉంటుంది. దయచేసి అన్నం వృధా చేయకండి….

జై జవాన్…
జై కిసాన్….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!