ఒసేయ్! బంగారం!

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
ఒసేయ్! బంగారం!   

రచన:: కవి రమ్య

“అమ్మమ్మా! అమ్మమ్మా! మందులు వేసుకున్నావా? భోజనం తిన్నావా?” అని పట్టులంగా బుట్ట చేతుల జాకెట్ వేసుకున్న తన ఏడేళ్ళ మనవరాలు జ్యోతి కళ్ళు తిప్పుతూ అడిగింది.

“తిన్నానే మనవరాలా! భోజనమూ అయింది, మందులూ మింగాను. ఇంతకీ ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నావు? పండగ అయిపోయింది కదా బట్టలు మార్చుకోవా?” అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడిగింది శాంతమ్మ.

“అమ్మమ్మా! మరేమో ఈ బట్టల్లో ఉంటే అమ్మ ఎన్నో రకరకాల పిండివంటలు చేసి పెడుతోంది. పైగా ఫోటోలు కూడా తీసింది. ఒక ఫోటోలో చెంప కింద చేయి, మరో ఫోటోలో చేతులు కట్టుకుని, ఇంకో ఫోటోలో ఇదిగో ఇలా లంగా పట్టుకుని” అని లేచి నిలబడి గిర్రున తిరుగుతూ చూపించింది.

“ఓసి నీ ఇల్లు బంగారంగానూ! నీకు ఆశలు ఎక్కువే. అంటే ఈ బట్టలు ఎప్పటికీ ఇలానే ఉంచేసుకుంటావా ఏంటి? అప్పుడుగానీ సుగంధాలు వెదజల్లవు. వెళ్ళు వెళ్ళు. మార్చుకుని రా” అంటూ ముక్కు మూసుకుని సరదాగా ఆటపట్టించింది.

“అంతే అమ్మమ్మా! పొద్దున వేసుకుంటే మా అమ్మే అని ముద్దుపెట్టుకున్నావు. ఇప్పుడేమో ఇలా ముక్కు మూసుకుని మూతి తిప్పుతున్నావు. అవును అమ్మమ్మా నాకో సందేహం! ఓసి నీ ఇల్లు బంగారంగానూ అంటే ఏంటి?” అని కనుబొమ్మలు ఎగరేసింది జ్యోతి.

“ఆ అంటే నీ ఇల్లు బంగారంలా వెలిగిపోవాలి అని! అంటే నీ ఇల్లు” అని శాంతమ్మ చెబుతుండగా “జ్యోతి! ఇటు రామ్మా! బట్టలు మార్చుకోవాలి. నాన్న పిలుస్తున్నారు. పడుకోవాలి కదా. అమ్మమ్మ నిద్రపోయే సమయం అయింది. రేపు మాట్లాడుకోండి” అని జ్యోతి అమ్మ శారద చెప్పడంతో అమ్మమ్మ ఆపేసి జ్యోతిని ముద్దుపెట్టుకుని శుభరాత్రి చెప్పి నిద్రపోయింది.

పొద్దునే లేచిన జ్యోతి ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా ఏడవసాగింది. కుటుంబ సభ్యులకి ఏమర్ధం గాక తనని ఓదార్చడంలో నిమగ్నమయ్యారు. శాంతమ్మ కూడా కంగారుపడసాగింది. అప్పుడే గుడినుండి వచ్చిన శారద జ్యోతిని శాంతపరిచి నోట్లో ప్రసాదం పెట్టి ఏమైందని నెమ్మదిగా అడిగింది.

జ్యోతి నోట్లోని ప్రసాదం మెల్లగా నమిలి మింగి “అమ్మమ్మా, రాత్రి ఓసి నీ ఇల్లు బంగారం గానూ అంది. మరి నా బొమ్మరిల్లు(డాల్ హౌస్) బంగారం కాలేదే. ఇప్పుడు ఏం చేయాలి? బంగారం అయ్యుంటే ఈ పాటికి నేను దాచుకుని పెద్దయ్యాక నీలాగా చైన్, గాజులు కొనుక్కుందామనుకున్నాను అమ్మా!” అని శారదని గట్టిగా హత్తుకుంది.

ఇంట్లోవారంతా ఒక్కసారిగా పకపకా నవ్వారు.

“ఒసేయ్ బంగారం! అని అప్పుడప్పుడు పిలుస్తాను. అంత మాత్రం చేత నువ్వు బంగారు బొమ్మలా మారిపోతావా? దాని అర్ధం ఏంటంటే బంగారం అంత దగద్ధాయమనంగా మెరుస్తున్నావు మరియు అంత విలువైన దానివి అని అర్ధం రా! అలానే నీ ఇల్లు బంగారంగానూ అంటే నువ్వు ఉన్న ఇల్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో శోభాయమానంగా అదే నిగనిగలాడాలని అర్ధం రా అమ్మడు! ఉష్షో! ఇంకా ఏదో అనుకుని కంగారపడిపోయాం” అని నవ్వుతూనే సమాధానం ఇచ్చింది శాంతమ్మ.

శారదా ప్రేమగా జ్యోతి తల నిమిరి “పెద్దలు చెప్పేవాటిలో అంతరార్థం తొందరగా అర్ధం కాదురా! కాస్త ఆలోచిస్తే బుర్రకి తడుతుంది లేదంటే అడిగి తెలుసుకోవడమే” అని సద్ధిచెప్పింది.

“అమ్మో! నా మనవరాలితో కాస్త జాగ్రత్తగా మాట్లాడలన్నమాట. అన్నీ నేర్చేసుకుంటోంది. మంచి విషయాలే మాట్లాడాలి తనతో” అని మనసులో మననం చేసుకుంది శాంతమ్మ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!