అమ్మ నా మనవరాలా!

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
అమ్మ నా మనవరాలా!   

రచన::అరుణ చామర్తి ముటుకూరి

“బామ్మ.. బామ్మా..” గుసగుసగా వినిపించింది బ్రాహ్మణి అమ్మకి.
“త్రిపుర గొంతులా ఉందే..”అనుకుంటూ చుట్టూ చూసింది ఆవిడ.
మొక్కలకు నీళ్ళు పోస్తున్నట్టు గా నిలబడి నెమ్మదిగా తనని పిలుస్తోంది త్రిపుర.

“నా చెవులు బాగానే పని చేస్తున్నాయయితే.. ఏమే పిల్ల ఏంటో కథ.. చెప్పవే తొందరగా “అల్లరిగా అడిగింది ఆవిడ

“మరేం లేదు సత్యనారాయణ స్వామి గుడి కి వెళ్ళొద్దామా..” లో గొంతుతో సన్నగా చెప్పింది.

“ఈ వయసులో ఇంత దైవభక్తి.. ఇదంతా దేవుడికి పూజ కోసమేనా! లేకా.. “ఆర్థోక్తిగా ఆపేస్తూ.

అందుకు కారణం లేకపోలేదు. త్రిపుర చూడచక్కని రూపమే కాదు, అణకువ, తెలివి ఈ సమ పాళ్లు గా కలబోసి బ్రహ్మ ప్రత్యేకంగా సృష్టించినట్టుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి బామ్మ దగ్గరే చనువెక్కువ. అమ్మ ఉద్యోగానికి వెళ్లడం, బామ్మ కథలు చెప్తూ దగ్గర తీయడం వెరసి బామ్మకూచే అనుకోవాలి. ఎం.బి.ఏ ఆఖరు సంవత్సరం లో ఉండగా, చక్కని కంపెనీలో ఉద్యోగం రావడం.. అన్ని అలా అలా జరిగి పోయాయి. అయితే చదువు అయిపోయి ఉద్యోగం కూడా వచ్చింది అనగానే పెళ్లి అన్న మాట గుర్తుకొస్తుంది తల్లిదండ్రులకు వెంటనే. ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలియగానే కనీసం రెండేళ్లన్నా, పిల్లని ఊపిరి పీల్చుకో నివ్వండి. అప్పుడే బాధ్యతలని అంట కట్టకండి అని బామ్మ చేత చెప్పించింది.
అత్తగారితో త్రిపుర వాళ్ళ అమ్మ స్నేహితురాల్లానే ఉంటుంది కాబట్టి, తల్లిదండ్రులిద్దరూ ఆవిడ మాట మన్నిస్తారని త్రిపుర కు బాగా తెలుసు. ప్రయత్నం ఫలించి వాళ్లు కొంత విరామం ఇచ్చారు.
అయితే చిక్కల్లా ఎక్కడ వచ్చిందంటే, ఆడుతూ పాడుతూ సంవత్సరంన్నర ఉద్యోగం చేసేసింది. చూడ్డం మొదలు పెడితే కుదిరే సరికి టైం పడుతుంది అని ఈసారి ఏ కారణం చెప్పే వీలు లేకుండా, ముందరి కాళ్లకు బంధాలు వేసేశారు. ఎందుకంటే త్రిపుర వాళ్ళ అమ్మ పని చేసే ఆఫీసులో, కొలీగ్ వాళ్ల అబ్బాయి చక్కటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఎప్పటినుంచో అతన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఆవిడ కి కూడా త్రిపుర అంటే ఇష్టమే కాబట్టీ, ఆమె అదే అభిప్రాయం లో ఉంది. చక్కగా తెలిసిన సంబంధం, కోరి వచ్చిన సంబంధం కాదనే ందుకేముంది అని వాళ్ళ ఉద్దేశం.
వాళ్లు వారం క్రితం పెళ్లి చూపులకు వచ్చారు. అబ్బాయి నిజంగానే చక్కగా కలుపుగోలుగా కూడా ఉన్నాడు. అందరికీ నచ్చేశాడు. త్రిపుర ఉద్దేశం ఏంటో మాత్రం బామ్మకి కూడా తెలియలేదు. అందుకే పిల్ల కాదు అనకుండా, అబ్బాయి పట్ల ఆసక్తి కలిగేలా.. పెద్దా విడిలా ఏడిపిస్తూ ఉంటుంది.
“ఓ ముసలీ! కలలు కనాల్సింది నేనే. నువ్వు కలలు కంటున్నావా?..” అప్పుడప్పుడు త్రిపుర కూడా ఆవిడతో అలాగే మాట్లాడుతుంది. ఆవిడకి త్రిపుర అలా అంటే ఇష్టం.
“ఇంతకీ గుడికి వెళ్దామా? వస్తున్నావా?” గట్టిగా అడిగేసింది.

“ఈ వయసులో నేను కృష్ణా రామా అనుకోవాల్సిందే కదా. నీకెందుకే తల్లి. కలలు కంటూ కూర్చో. ఓహో అంత చక్కటి వాడిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతగా దండం పెట్టుకుంటావా! దానికి అక్కడిదాకా ఎందుకు ఇక్కడినుంచి పెట్టుకోవచ్చు” మరింతగా టీజ్ చేస్తోంది బామ్మ.

“ఛీ పో బామ్మ!” సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళింది మొహం ఎర్రబడగా.

సరేనంటూ ఇద్దరు సత్యనారాయణ స్వామి గుడికి వెళ్లారు. గుడి లోపలికి వెళ్లకుండా ప్రాంగణంలో అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తూ అటు ఇటు చూస్తోంది.

“ఏంటి సంగతి ఏదో ఎదురుచూస్తున్నట్లు ఉన్నావ్ ఎవరికోసమో”

“అయ్యో మళ్లీ మొదలు పెట్టావా బామ్మ”

మాటల్లోనే తిలక్ వచ్చాడు.
“నమస్కారం అమ్మమ్మ గారు” ఇబ్బంది గా చెప్పాడు
త్రిపుర చెవి దగ్గర సన్నగా “నిన్నొకదాన్నేగా రమ్మన్నాను” అని గుసగుసలాడేడు.
“ఫర్వాలేదు లే బాబు. పిల్ల మొహమాటపడిందో సిగ్గు పడిందో.. నేను దానికి స్నేహితురాల్లాంటి దాన్ని. నా వల్ల నీకు ఏమి ఇబ్బంది ఉండదు మాట్లాడుకోండి” అంటూ చెప్పింది.

“సారీ బామ్మ !”అన్నట్టుగా
చెవులు పట్టుకుంది త్రిపుర.

“ఒక నిమిషం బాబు” అంటూ త్రిపురని పక్కకి తీసుకువెళ్ళింది.

“ఏంటే పోయి పోయి గుడిలోన మీరు కలవాలనుకున్నది”

“తిలక్ కాఫీ డే లో కలుద్దాం అన్నారు బామ్మ. కానీ నేనే … ఇక్కడికి.,మొన్న సరిగా మాట్లాడుకున్నట్టు లేదు రమ్మని చెప్పాడు ఎందుకో కొంచెం కంగారు గా అనిపించి గుడి కి తీసుకు వచ్చా అదీ నువ్వు తోడుగా ఉంటావని”

అదీకాక! ఇంకో విషయం కూడా ఉంది. తిలక్ నాకు ముందే తెలుసు. ఎంబీఏలో కొన్ని క్లాసులు చెప్పారు పార్ట్ టైం గా. అప్పుడే నేను నచ్చానని కాలేజ్ నుండి వెళ్లిపోయేటప్పుడు చెప్పారు. అమ్మ కొలీగ్ వాళ్ళ అబ్బాయిని అర్థమయింది మాటల్లో. అయితే అమ్మ వాళ్లకి ఇష్టమైతేనే అని చెప్పాను”

“ఓసి నీ ఇల్లు బంగారం గాను, అన్నీ నాతో చెప్పే దానివి ఇలా మీరు మాట్లాడుకున్న విషయం నాకు చెప్పనేలేదు సుమీ! అప్పుడే నన్ను దూరం పెట్టేస్తున్నావ్”అనిమేల మాడి..

“సరే తల్లి !నువ్వు మాట్లాడుతూ ఉండు. నీ పేరిట నేను పూజ చేయించుకొని వస్తాను.” అంటూ గుడిలోకి దారితీసింది బామ్మ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!