సూర్యోదయం

సూర్యోదయం

రచయిత: గుడిపూడి రాధికారాణి

రవిబింబం ఉదయించును
విరులన్నీ వికసించును
పక్షుల కలకూజితములు
మధురముగా వినిపించును

వేగుచుక్క పొడుస్తుంది
కోడిపుంజు అరుస్తుంది
జాబిలమ్మ చల్లగా
వీడుకోలు పలుకుతుంది

ముగ్గులేయు ముద్దుగుమ్మ
ఓరచూపు చూసెనమ్మ
వేకువనే ఆ దృశ్యము
కవులమనసు గెలిచెనమ్మ

పాపబోసినోటిలాగ
తాతపలకరింపులాగ
ప్రభాతమే బాగుందోయ్
అరవిచ్చిన పువ్వులాగ

నిన్నటి నైరాశ్యాన్ని
మరిచి పొందు ధైర్యాన్ని
ఉషస్సు ఉత్తేజమివ్వ
మొదలుపెట్టు పయనాన్ని

కలువలన్ని విరిసినట్లు
చెరువంతా నిండినట్లు
వేకువెంత బాగుందో
మనసంతా మురిసెనిట్లు

రహదారులు మేల్కొన్నవి
తారలు కనుమరుగైనవి
ఆదిత్యుని రాకతో
జీవులన్ని జోరైనవి

సూర్యనమస్కారములు
జనుల కోలాహలములు
ఉదయనడక వేళంటూ
కలిసినడిచిన అడుగులు

విషాదవార్త వినకుండ
మనసులు నొప్పించకుండ
ఈరోజూ గడవాలని
దీవించుము ఆదిత్యుడ!

సెగలుపొగలు కక్కకుండ
గగనంలో తిరుగుతుండ
భాస్కరుడా!నీ రాకను
హర్షిస్తాం తప్పకుండ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!