యాంత్రికమైన బంధాలు

కథ అంశం: బంధాలు అనుబంధాలు-2080

యాంత్రికమైన బంధాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: P. V. N. S. గాయత్రి

చిట్టి గిమ్మి సమ్ కాఫి (Give me some coffee)( కాఫి తీసుకు రా) అంటూ పొద్దున్నే ఇంగ్లీష్ లో తన చిట్టి రోబోకి చెప్తూ పిలిచింది చిన్నారి లక్స్.ఆ మాట విని యాంత్రికంగానే శబ్దము చేస్తూ, కాఫి తెస్తూ, మధ్యలో చార్జింగ్ అయిపోవడం వల్ల అక్కడే ఆగిపోయింది చిట్టి రోబో.
ఎంతకు చిట్టిరోబో కాఫి తీసుకురాకపోయేసరికి చిరాకుతో మమ్మీ మమ్మీ అంటూ అరవటం మొదలుపెట్టింది.
మర్చిపోయాను అమ్మ ఆఫీస్ కు వెళ్లిపోయింది కదా.. అదే అమ్మమ్మ ఉంటే ఎంతో ప్రేమగా అడగకుండానే అన్ని తెచ్చిచ్చేది.వద్దన్నా అన్నం కలిపి ముద్దలు పెట్టేది. అమ్మమ్మ ని వృద్ధాశ్రమం లో వదిలిపెట్టి సంవత్సరము అయ్యింది ఇప్పటికి ఒకసారి కూడా ఇంటికి రాలేదు: నేనసలు అమ్మమ్మ కి గుర్తున్నానా లేదా అనుకుంటూ స్కూల్ కి చకచక రెడీ అయ్యి నోట్ ప్యాడ్ & మధ్యాహ్నము తినటానికి కావాల్సిన పిజ్జా, రోటి అవెన్ నుండి తీసి హట్ బాక్స్ లో సర్ధుకుంటూ, ఇవన్నీ అమ్మమ్మ ఉంటే తనే సర్ధిపెట్టేది.ఈ పిజ్జాల కన్నా అమ్మమ్మ చేసే అట్లు చాలా రుచిగా ఉండేవి. ఈ రోటి మేకర్ లో కన్నా అమ్మమ్మ చేసిన రోటిలు చాలా కమ్మగా ఉండేవి.అంటూ తన స్కేటర్ సైకిల్ ను తొక్కుకుంటూ కదిలింది లక్స్. ఇంతలో తన స్నేహితురాలు భవ్యను వాళ్ళ తాతయ్య ఎత్తుకుని కబుర్లు చెప్తూ నవ్విస్తూ తీసుకురావడం చూసింది.అది చూసి కాస్త దిగాలుగా మా గ్రాండ్ పా కూడా నన్ను అలాగే తీసుకొచ్చేవారు కదా అనుకుంటూ స్కూల్ కి వెళ్లింది. వెళ్లింది కానీ మనసంతా అమ్మమ్మ తాతయ్యల మీదే. స్కూల్ కి వెళ్లినా క్లాస్ కి వెళ్లకుండా ఒంటరిగా భాధగా గ్రౌండ్ లో కూర్చుని బాధపడుతున్న లక్స్ ను గమనించి అటుగా వెళుతున్న గాయత్రి టీచర్ లక్స్ ను అక్కున చేర్చుకుని విషయం అడిగి తెలుసుకుంది.ఆ భాధను పొగొట్టేందుకు ఆ రోజు మధ్యాహ్నం లక్స్ ను కాసేపు తన అమ్మమ్మ తాతయ్య దగ్గరకు తీసుకువెళ్ళింది.ఆ రోజంతా లక్స్ మునుపటిలా వాళ్ళిద్దరితో చాలా సంతోషంగా గడిపింది. తాతయ్య చెప్పే కథలు వింటూ, అమ్మమ్మ గోరు ముద్దలు తింటూ అక్కడున్న వారు కలిసిమెలిసి తమ పనులు యంత్రాల సహయం లేకుండా తామే చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయింది.సాయంత్రం వేళ ఎలాంటి ఎ.సి లేకుండా అందరూ చల్లగాలిలో కుర్చుని కబుర్లు చెప్పుకోవడం, తనతో కలిసి ఆడుకోవడం చూసి మురిసిపోయింది.
ఇదేమిటి తాతయ్య … ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే కడిగేసుకుంటున్నారు బట్టలు ఉతుక్కుంటున్నారు చీపురుకట్టతో తుడుస్తూ ఉన్నారు ఫ్రిజ్, డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, వాక్యూమ్ క్లీనర్ వంటి మెషీన్స్ లేవు. అమ్మ ఎప్పుడూ ఇవన్నీ తనే చేయడం నేను చూడలేదు. సాయంత్రం అయితే అమ్మ,నాన్న కంప్యూటర్ ముందో, ఫోన్ లలో మాట్లాడుకుంటూనో ఉంటారు. నాతో మాట్లాడే సమయం, ఆడే ఇష్టం కూడా వాళ్ళకి ఉండదు.నాన్న అయితే కధలు చెప్పకుండా నిద్ర పట్టలేదంటూ ఏవో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అంటూ చిన్నబోతూ పలికిన లక్స్ మాటలకు తాతయ్య ఒకప్పుడు ఇవేమి ఉండేవి కాదంటూ ఇలాగే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ మనుష్యులు ఆరోగ్యంగా ఆనందంగా గడిపేవారంటూ, ఇప్పుడు యాంత్రికతకు అలవాటు పడి బంధాలు, ఆ సంతోషాలు మర్చిపోయారంటూ,రోగాల పాలవుతున్నారంటూ, తాతయ్య తనకి నచ్చజెపుతూ చెప్పిన మాటలు లక్స్ మనసులో ముద్ర పడి,అక్కడినుంచి ఇంటికి వచ్చినా సరే ఆమె మనసులో అలానే మెదులుతూ ఉన్నాయి.మరునాడు ఉదయం గాయత్రి టీచర్ పాఠాలు చెపుతూ
పిల్లలూ!…మీ పేరు అర్ధం ఏమిటో మీ అమ్మ నాన్న లను అడిగి తెలుసుకురండి.రేపు అందరూ చెప్పాలి మర్చిపోవద్దు నేను అందరిని అడుగుతాను అంటూ క్లాస్ అయిపోవటంతో వెళ్లిపోయింది. ఆ రోజు స్కూల్ అవ్వగానే ఉత్సాహంగా ఇంటికెళ్లగానే
లక్స్: డాడీ నాకి పేరు ఎవరు పెట్టారు అర్థం ఏమిటి అని ప్రశ్న మీద ప్రశ్న అడగగానే..
బేబి వర్క్ ఎక్కువ ఉంది కాస్త బిజిీ ఉన్నాను అమ్మను అడుగు అనటంతో మరింత ఆసక్తి తో అమ్మని అడగడానికి వెళ్లినా అక్కడా అదే పరిస్థితి ఎదురవటంతో తన పట్టించుకునే వారు లేరంటూ బాధలో మునిగిపోయింది. మరునాడు ఉదయం జరిగిన విషయమంతా గాయత్రి టీచర్ కు చెప్పగా, విషయమంతా గ్రహించిన టీచర్ లక్స్ కన్నీటిని తుడిచి, తను చెప్పినట్లుగా చేయమని, అలా చేస్తే మీరందరూ కలిసిమెలిసి సంతోషంగా ప్రేమగా ఉంటారని చెప్తుంది. అలాగే టీచర్ అంటూ
ఎప్పటిలాగే మరునాడు పొద్దున్నే లక్స్ స్కూల్ కి వెళ్లినట్టుగానే రెడి అయి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది.
సాయంత్రం ఇంటికి ఎంత సేపటికి రాకపోయేసరికి తన తల్లిదండ్రులు లక్స్ గది వెదకగా, పట్టించుకునే వారు లేరంటూ అందుకే ఇంట్లోనుండి వెళ్లిపోతున్నాను అంటూ లక్స్ ఏడుస్తూ రాసిన లేఖ చదివి,కంగారుగా వెతకడానికి లక్స్ స్నేహితులందరింటికి పరుగులు పెడుతూ, అందరిని అడుగుతూ లక్స్ కోసం వెతుకుతూ…వెతుకుతూ…
చివరాఖరిగా గాయత్రి టీచర్ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్తారు.
జరిగినదంతా తెలిసినా ఏమి తెలియనట్లు కూసింత ప్రేమ పంచలేనపుడు కోట్లు కూడబెట్టి ప్రయోజనం ఏముంది చెప్పండి. తను సంతోషంగా లేనప్పుడు తన కోసం ఎంత సంపాదిస్తే ఏముంది. యాంత్రికతకు లోబడి మనుష్యులులను వదిలేయడం మీకు అలవాటేగా అన్న టీచర్ మాటలకు లక్స్ తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది.
సరే బాధపడి ప్రయోజనం ఏముంది వాళ్ల అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉందేమో చూడండి అని టీచర్ అనగానే వృద్ధాశ్రమం దగ్గర కు పరుగు పరుగున వెళ్తారు లక్స్ తల్లిదండ్రులు. వృద్ధాశ్రమంలో అడుగు పెట్టగానే అమ్మమ్మ ఒడిలో పడుకుని మాటలు చెప్తున్న లక్స్ ని చూసి కాస్త స్థిమితపడి… అలా వచ్చేస్తే ఎలా లక్స్ అంటూ అరిచిన నాన్న కోపానికి అమ్మమ్మ కొంగులో దాకుంటూ… నేనిక్కడే ఉంటాను నాకు మీరు వద్దు.. అమ్మమ్మను ఇక్కడ వేసినట్లు, అమ్మమ్మ పేరు పెట్టినందుకు నన్ను కూడా హాస్టల్ పడేస్తారు. నేను రాను. నా పేరు కూడా లక్స్ కాదు లక్ష్మీ అనే బాగుంది నాకంతా ఇక్కడనే బాగుంది..
అమ్మమ్మ తాతయ్య ని ఇక్కడ వదిలేసారని నానమ్మ తాతయ్య ఇంటికి రావట్లేదంట కదా..నాకోసం నిన్న నానమ్మ తాతయ్య వచ్చారు నాకిష్టమైన లడ్డులు కూడా తెచ్చారు. మీకు మెషిన్స్ ఉంటే దేనితో పనిలేదని నానమ్మ చెప్పింది.నేనింక ఇక్కడే ఉండి పోతాను. మీరు నా బదులు అల్లరి చేయడానికి ఇంకో రోబోను కొనుక్కొండి నేను రావాలంటే నాతో పాటు అందరూ రావాలి నాకు అందరూ కావాలి. నాకు కార్టూన్ల ఛానెల్ కన్నా తాతయ్య కధలు, రైమ్స్ కన్నా అమ్మమ్మ పాటలే ఇష్టము. వాళ్లు వస్తేనే నేను వస్తా.. అంటూ చిన్నారి పలికిన మాటలకు లక్స్ తల్లిదండ్రులు కళ్లు చెమర్చి, ఙ్ఞానోదయం అవటంతో లక్స్ తో పాటు అమ్మమ్మ తాతయ్య లను కూడా మునుపటిలా ఇంటికి తీసుకొచ్చి ఆనందంగా గడుపుతారు.అస్తమాను మెషిన్స్ తోనే కాకుండా తీరిక సమయాల్లో ఆడుతూ పాడుతూ ఒకరితో ఒకరు సంతోషంగా గడుపుతూ ఆరోగ్యంగా జీవిస్తారు.
చిన్నారి చేసిన పనితో ఇన్ని రోజులు తమ కోల్పోయిన ప్రేమ అనుబంధాలను ఏ యంత్రం ఎంత మాత్రము తీర్చలేదనే విషయాన్ని గ్రహించి,తమ తప్పులను చక్కదిద్దుకుని బంధాలకు విలువనివ్వటం ఆరంభిస్తారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!