మోడుబారిన బ్రతుకు

మోడుబారిన బ్రతుకు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

రూమ్ లో కూర్చుని స్పెషలైజేషన్ ఎంట్రన్స్ కు  ప్రిపేరవుతున్న హర్షిణి దగ్గరకు మురళీధర్ వచ్చి “అమ్మా హర్షిణి ఏం చేస్తున్నావు బిజీయా” అన్నాడు. ఏం లేదు నాన్న ఎంట్రెన్స్ కు ప్రిపేర్ అవుతున్నాను. అన్నది హర్షిణి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాం నేను మీ అమ్మ. నీకేమో ఎప్పుడు ఏవో పరీక్షలు ఏంట్రెన్స్ లు ఎప్పుడు చూసిన బిజీగా ఉంటున్నావు. ఈరోజు ఎలాగైనా నీతో చర్చించాలని మీ అమ్మ పట్టుబడితే వచ్చాము అన్నాడు తండ్రి.
“చెప్పండి నాన్న” అన్నది పుస్తకాలు మూసేసి. ఇన్ని రోజులు ఎంబిబిఎస్ పరీక్షలతో  బిజీగా ఉండడం వల్ల చెప్పలేకపోయాను. తర్వాత పీజీ అన్నావు ఇలా చదువుకు అంతం అనేది లేదనుకో అయినా నీ చదువు మామూలు చదువు కాదు కదా. డిస్టర్బ్ చేయదల్చుకోలేదు ఇన్నాళ్ళు. కాని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. మొన్న ఒక పెళ్లిలో మన బంధువు ఒకతను ఒక పెండ్లి సంబంధం చెప్పాడు. అబ్బాయి కూడా మెడిసిన్ లో పి.జి చేశాడట.  మంచి కుటుంబం లోని అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమన్నారట తల్లిదండ్రులు. నీవు జ్ఞాపకం వచ్చి నాతో చెప్పాడు. నీవు సరేనంటే వాళ్ళకు కబురు పెడతాను పెళ్ళిచూపులకు రమ్మని అన్నాడు మురళీధర్. “నాన్న మొన్ననే కదా నా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకొన్ని రోజులు పోనీయండి” అన్నది హర్షిణి. నీ చదువు వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇంక ఆగడం అనేది కరెక్ట్ కాదు బాగా ఆలోచించు అన్నాడు మురళీధర్. అమ్మా, నాన్న నేను కూడా మీతో ఎన్నో రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎం.బీ.బీ.ఎస్ లో ఉన్నప్పటి నుండే ఆకాష్ అనే  అబ్బాయిని ఇష్టపడుతున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళికి తొందర పెడుతున్నారట అన్నది మెల్లిగా హర్షిణి. నీవు ఎప్పుడు చెప్పలేదు. అయినా నీకు ఇష్టమైతె మంచి సంబంధమైతే మాకు కూడ ఏమి అభ్యంతరం లేదు. కాని మేము కూడ వాళ్ళ ఫ్యామిలీని ఒక సారి చూడాలి. మాకు ఆ అబ్బాయి నీకు తగిన వాడే అనిపిస్తే సంబంధం సెటిల్ చేసుకుందాము. నీకు నచ్చిన అబ్బాయి ఉంటే ఇంక మాకు కావలసిందేముంది. ఫోన్ నెంబర్ ఇవ్వు మీ నాన్నగారు వెళ్లి వాళ్ళ స్థితిగతులు చూసి మాట్లాడి వస్తారు” అన్నది తల్లి రామలక్ష్మి. వాళ్లు కూడ మనలాగే చాలా సింపుల్ మనుషులు. వాళ్ల తల్లిదండ్రులకు కూడా ఆకాశ్ ఒక్కడే అబ్బాయి. చాలా మంచి ఫ్యామిలీ మీకు ఇష్టమైతే ఒకసారి వెళ్లి మాట్లాడండి అన్నది హర్షిణి. సరేనమ్మా ఆ అబ్బాయి నీకు చాలా రోజుల నుండి తెలుసు అంటున్నావు. కనుక తప్పకుండా రేపు వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడతాను. మా పని చాలా తేలిక చేశావు అన్నారు ప్రేమగా మురళీధర్. మరుసటి రోజే దంపతులిద్దరూ ఆకాష్ ఇంటికి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులు మంజుల, కరుణాకర్ లను కలిశారు. ఇరు కుటుంబాలకి ఒకరంటే ఒకరికి  నచ్చడంతో చకచకా నిర్ణయాలు తీసుకుని నెల రోజులకే పెళ్లి చేసేశారు. కొన్ని రోజులకే ఇద్దరికీ మంచి హాస్పిటల్స్ లో ఉద్యోగాలు దొరికాయి. ఆకాష్ తల్లిదండ్రులు హర్షిణిని చూసి తమ కొడుకుకు తగ్గ భార్య దొరికిందని చాలా సంతోషించారు. అత్తగారు కోడలిని ఎంతో ప్రేమగా చూడసాగింది. హర్షిణి కూడ అత్తమామలతో ఎంతో  గౌరవంగా మెలిగేది. రెండు సంవత్సరాలు సాఫీగా గడిచిపోయాయి. ఒకరోజు ఆకాష్ హర్షిణితో ఇక మన ఇద్దరి మధ్యకు చిన్న బాబో, పాపో వస్తే ఇంకా బాగుంటుంది కదా లైఫ్. మా అమ్మానాన్న కూడా అదే ఆశ పడుతున్నారు. ఏమంటావ్ హర్షిణి అన్నాడు. నీ మాట నేనెందుకు కాదంటాను. రేపే ఏ అనాధ శరణాలయం కన్నా వెళ్లి ఒక పాపనో, బాబునో లేకపోతే ఇద్దరినో దత్తత తీసుకుందాము అన్నది నవ్వుతూ హర్షిణి. అదేంటి అంత అవసరం మనకేం వచ్చింది. మనం తలుచుకుంటే మనకు మన పాపే వస్తుంది కదా అన్నాడు. నాకు పిల్లలను కనడం అసలు ఇష్టం లేదు ఆకాష్ అన్నది సీరియస్ గా. “నీవు అలా జోక్ చేయకు హర్షిణి” అన్నాడు ఆకాష్ కొంచెం కంగారుగా. దీనిలో జోక్ చేయడానికి ఏముంది. నాకు నిజంగానే పిల్లలను కనడం ఇష్టం లేదు అన్నది సీరియస్ గా హర్షిణి. అదేంటి హర్షిణి నీవు పిల్లల డాక్టర్ వై ఉండి పిల్లలను కనడం ఇష్టం లేదంటున్నావు. నాకు నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే కావాలి. నేను మన పెళ్లయినప్పటి నుండి కలలు కంటున్నాను. మనకు చిన్న పాప ఉంటే ఎంత బాగుంటుంది అని. నీ ఆలోచనలు అలా ఉన్నాయని నాకు అస్సలు తెలియదు. అసలు నువ్వు ఎందుకు పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అదేంటి ఆకాష్ మనకు పిల్లలు కావాలి. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లలే అనేముంది. ఏ అనాధ ఆశ్రమం పిల్లలనో ఇద్దర్ని తెచ్చుకుంటే వాళ్లకు మంచి లైఫ్ ఇస్తే మనకు తృప్తిగా ఉంటుంది. వాళ్లకు మంచి జరుగుతుంది అన్నది హర్షిణి. అదే నీకు పిల్లలను కనడం ఎందుకు ఇష్టం లేదు. నీవు చెప్పే కారణం సబబైనది అనిపిస్తే, నీపై నేను ఒత్తిడి తీసుకురాను నాకు అసలు కారణం తెలియాలి కదా అన్నాడు ఆకాష్. హర్షిణి జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నది. చెప్పు హర్షిణి నన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నావా లేక అనారోగ్య సమస్య ఏమయిన ఉందా. నీవు చెప్పే కారణం సబబైనదైతే, నాకు నీవే ముఖ్యం కనుక ఒప్పుకుంటాను. చెప్పు ఏంటి నీ సమస్య అన్నాడు ఆకాష్ అర్ధిస్తున్నట్టుగా. ఆకాష్ నేను పొద్దున లేచినప్పటి నుండి హాస్పిటల్ లో ఎంతోమంది పిల్లలను చూస్తుంటాను. చిన్నవి పెద్దవి ఏవో జబ్బులు రోజుల పిల్లలకు కూడా ఆపరేషన్లు చేసినా జీవితాంతం తగ్గని జబ్బులు అనారోగ్యాలు. ఆ పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రులు పడే బాధ, వారు నిస్సహాయంగా కన్న పిల్లలను ఆ స్థితిలో చూస్తు వాళ్ళు అనుభవించే ఆ నరకం చూస్తుంటే అలాంటి పిల్లలు పగవారికి కూడ వద్దనిపిస్తుంది. అంత చిన్న పిల్లలకి అంత పెద్ద తగ్గని రోగాలు డాక్టర్లు కూడా వాటిని తగ్గించే మార్గం కనిపించని నిస్సహాయత దీనంగా తమ పిల్లల రోగాలను ఎలాగైనా తగ్గించమని వేడుకునే తల్లిదండ్రులను చూస్తే అలాంటి స్థితి నాకు ఎప్పటికీ వద్దు అనిపిస్తుంది. పుట్టిన పిల్లలు ఎప్పటికీ తగ్గని రోగాలతో జీవితాంతం తల్లిదండ్రులపై ఆధారపడి బ్రతకడం, రోజు తమ పిల్లలను చూసి ఆ తల్లిదండ్రులు పడే నరకయాతన, క్షోభ ఎవ్వరికి ఉండకూడదు అనుకుంటా. అందుకే ఇవన్నీ చూసి చూసి నేనసలు పిల్లలని కన వద్దని, మంచి ఆరోగ్యంతో ఉన్న అనాధ పిల్లలను తెచ్చి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నది హర్షిణి. మరి నాకు పెళ్లికాకముందు ఎందుకు చెప్పలేదు ఇదంతా అన్నాడు ఆకాష్. ఇది అంత ముఖ్యమైన విషయం అనుకోలేదు నేను అన్నది హర్షిణి. చూడు హర్షిణి నీవు చూసిన పిల్లలందరూ నీ దగ్గరకు అనారోగ్యంతో ట్రీట్మెంట్ కు వచ్చిన పిల్లలే. కానీ బయట ఆరోగ్యంతో కళకళలాడే పిల్లలు ఎంతోమంది ఉంటారు. కనుక నీ మనసులోని భయాన్ని తీసేసేయ్ అన్నాడు ఆకాష్. ఒకవేళ దురదృష్టం కొద్దీ మనకు అలాంటి పాప పుడితే వదులుకోలేము కదా. అలాంటి పాపను చూస్తూ జీవచ్ఛవాల బ్రతకడం నాకు ఇష్టం లేదు అన్నది హర్షిణి. నీ నిర్ణయం అదేనా! అన్నాడు ఆకాష్. “అవును” అన్నది స్థిరంగా హర్షిణి. నీ నిర్ణయం అదే అయితే, తర్వాత పర్యవసానానికి నీవే బాధ్యురాలివి అన్నాడు సీరియస్ గా ఆకాష్. “అంటే” అన్నది హర్షిణి. నాకు, మా అమ్మా నాన్నలకు కూడ పిల్లలంటే చాల చాల ఇష్టం. మన పెళ్ళైనప్పటి నుండి నేను పిల్లల గురించి ఎన్నో కలలు కంటున్నాను. నేను మా అమ్మ నాన్నలకు ఒక్కడినే నీవు మీ అమ్మ నాన్నలకు ఒక్కదానివే వాళ్లకు కూడా తమ మనవడు మనవరాలునో ఎత్తు కోవాలని ఉంటుంది కదా. అంతెందుకు నాకే నా రక్తం పంచుకుని పుట్టిన నా పాపని నా హృదయానికి హత్తుకోవాలని ఎంతో ఉబలాటంగా ఉంది. దీని వల్ల మనం విడిపోయే పరిస్థితి వస్తుంది. అన్నాడు. అంటే నీవు నన్ను ప్రేమించలేదా. నేను పిల్లలను కని ఇవ్వకపోతే వదిలేస్తావా? అన్నది హర్షిణి రుద్దమయిన కంఠంతో. నేను నిన్ను నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను. దురదృష్టవశాత్తు దేవుడు మనకు పిల్లలను ఇవ్వకపోయి ఉంటే నా ప్రేమ లో మార్పు ఉండేది కాదు. కానీ నీవు నీ సొంత నిర్ణయంతో పిల్లలను వద్దంటున్నావు. కనుక మనం విడిపోక తప్పదు. బాగా ఆలోచించుకో అన్నాడు ఆకాష్. ఈ విషయం తొందర్లోనే ఇద్దరి తల్లిదండ్రులకు తెలిసింది. హర్షిణి తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పాలని చూశారు. నీవు ఇంత చదువుకుని ఇంత మూర్ఖంగా చేస్తావనుకోలేదు. ఇలా ముందే తెలిసి ఉంటే నీకు అసలు డాక్టర్ చదివే చెప్పించే వాళ్ళం కాదు అన్నారు ఆవేదనగా. అదే విధంగా ఆకాష్ తల్లిదండ్రులు కూడా ఎంతో చెప్పి చూశారు. నీవు పిల్లలను కన్నా నీవు చూడాల్సిన పని లేకుండా, మొత్తం బాధ్యత మేమే తీసుకుంటాం. అని ఎంతో బ్రతిమిలాడారు. నచ్చజెప్ప చూసారు. అయినా హర్షిణి నిర్ణయంలో మార్పు రాలేదు. ఎంత చెప్పినా వినక పోయేసరికి కొన్ని రోజులకు ఆకాష్ విడాకులకు అప్లై చేశాడు. అతను మెన్షన్ చేసిన కారణం సరైనదే కనుక తొందర్లోనే విడాకులు మంజూరు అయినాయి. మరో ఏడాదికే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకే పండంటి పాపను కన్నాడు. హర్షిణి తల్లిదండ్రుల కళ్ళ ముందర మోడులా తిరుగుతుంటే జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు హర్షిణిని ఒంటరిని చేసి ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయారు.
కొన్నాళ్ళు తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపించిన హర్షిణికి రోజులు గడుస్తుండగా మెల్లమెల్లగా జ్ఞానోదయం అవ్వ సాగింది. ఒంటరి బ్రతుకు దుర్భరంగా ఉంటున్నది. అందుకే తీరికున్నప్పుడల్ల అనాధాశ్రమం వెళ్లి అక్కడి పిల్లలతో కొంతసేపు గడిపి వాళ్లకు కావాల్సినవి సమకూర్చి రావడం అలవాటు చేసుకుంది.
ఫోన్ చేసి ఒకట్రెండు సార్లు ఆకాష్ తల్లి మంజుల హర్షిణిని తమ ఇంటికి పిలిచింది. ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్లి, ఆకాష్ రెండో భార్య నిధిని పాపను చూసి తాను పోగొట్టుకున్న అదృష్టాన్ని తలుచుకుని చాల బాధపడ్డది. అందుకే మళ్ళీ ఎప్పుడు ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్లకూడదని, వెళ్ళిన రోజంతా మనసు చాలా బాధగా ఉండటం వల్ల మళ్ళెప్పుడు వాళ్ళింటికి వెళ్ళలేదు. ఏళ్ళకు ఏళ్ళు జీవితంలో ఏ మార్పు లేకుండా నిర్జీవంగా, నిశ్శబ్దంగా, నిస్సారంగా గడిచిపోతుంది హర్షిణి జీవితమంతా. ఒంటరి బ్రతుకు విసుగుబుట్టి ఎవరి కొరకు ఇంటికి వెళ్ళాలి. తన కొరకు ఎదురు చూసేవాళ్ళెవరున్నారన్న విరక్తితో ఇంటికి వెళ్ళాలన్న ఆసక్తి తగ్గిపోయింది. అందుకే చాల వరకు హాస్పిటల్ లోనె గడుపుతుంది హర్షిణి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!