సన్నిహితం

సన్నిహితం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

అదృష్టంతో కలిసి వచ్చినవి, రోజులు మారగానే పోతాయి. కష్టంతో కలసి వచ్చినవి కలకాలం
మనతో కలసి ఉంటాయి. అందుకే నేను మొదటి నుంచి కష్టాన్ని నమ్ముకున్నాను. అదృష్టాన్ని నాకు ఆమడ దూరంలో ఉంచాడు ఆ దేవుడు. సుఖంతో వచ్చిన ఆనందం విలువ తక్కువగానే ఉంటుంది.
అదే కష్టం తర్వాత వచ్చిన సుఖం విలువ చాలా గొప్పగా ఉంటుంది. నేను జీవితంలో పడిన కష్టము అంటే చెప్పుకో తగినంత పెద్ద కష్టాలు కాదు కానీ,  మనసు చివుక్కుమనే అంత పెద్ద కష్టాలు అని మాత్రం చెప్పగలను. ఒక్కొక్కప్పుడు జీవితం ఇదేనా, జీవితం అంటే ఇంతేనా అని విరక్తిగా అనుకున్న రోజులు లేకపోలేదు. పెళ్లి కాకముందే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మేము జీవనానికై పడే తపన ఒక విధంగా ఉండేది. జీవించడానికి ఆరాటం, జీవనానికై పోరాటం రంగుల కలయిక ఈ జీవితం. నడిసంద్రంలో చిక్కుకున్న నావలా సాగించాను నా పోరాటం. సరస్వతి ఉంటే లక్ష్మీ ఉండదు. లక్ష్మీ ఉంటే సరస్వతి ఉండదు అంటుంటారు పెద్దలు. అది నా విషయంలో నిజమే అనిపించింది. సరస్వతి మాత వరించింది. లక్ష్మీమాత పక్షపాతం చూపించింది. చాలా గొప్పగా చదువుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో చదువు. మంచి తెలివిగలదానిలా పేరు తెచ్చుకున్నాను. కానీ లక్ష్మీ ఆశీర్వాదం లేనిదే కోరిన ఉద్యోగం రాదు కదా! అలాగే నేను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా ఉండిపోయాను ఓ చిరు ఉద్యోగం చేసుకుంటూ.
ఎన్నో బాధలకు ఓర్చి పెళ్లి జరిపించారు నాన్న. ఏనాటి జన్మ పుణ్యఫలమో అన్నట్టు, చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే, సాఫీగా జరిగిపోతున్న జీవితం నాది. ఇద్దరు పిల్లలు. వాళ్ళని పోషించడానికి మా ఇద్దరికీ చిరు ఉద్యోగాలు. మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేకపోయినా, మనసులో కోరికలు తీర్చుకొనెందుకు సరిపడ సంపద అవసరమని అవగాహనకు వచ్చిన రోజులివి. మా వారి అండదండకు, నా ఓర్పు కూడా తోడయ్యి జీవితం సాఫీగా సాగిపోతున్న రోజులవి. దేవుడు మంచి చేశాడో, చెడు చేశాడో తెలియదు గానీ ప్రపంచం మొత్తాన్ని కరోనా అతలాకుతలం చేసిన రోజులవి. అందరికీ సెలవులు ఏం చేసుకోవాలో తెలియనంత సమయం. పల్లెటూరులో ఖాళీ సమయం గడపడానికి బాగుంటుంది. అలాంటి పరిస్థితుల్లో పల్లెటూరి వాతావరణానికి మించిన వైద్యశాల ఇంకొకటి లేదన్నట్టు భావించి అందరం మా స్వగ్రామానికి బయలుదేరాము. అందరం బెంబేలు పడుతున్న ఆ రోజుల్లో,  మా పిల్లలు మాత్రం అమ్మమ్మ ఇల్లు అంటే ఏదో విహారయాత్రకు బయలుదేరినట్టు సంతోషపడ్డారు. మా వారికి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లోనే బందించేసారు వాళ్ల ఆఫీసు వాళ్ళు. అందుబాటులో ఉండాలన్న నిబంధనతో. నేను అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా గ్రామంలో అతిథి సత్కారం పొందుతున్నాము. అనుకోకుండా మా నాన్నగారు ఫోన్ చేసి, ‘ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళండి అల్లుడుగారు’ అంటూ ఆయనకి ప్రత్యేక ఆహ్వానం అందించారు.
అనుకోకుండా సెలవులు కలిసి రావడం మామ గారి మాట తీయలేక అలాగే బయలుదేరి వచ్చారు మా వారు. రుణానుబంధం ఉంటుంది. ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. సమయం తీరాక ముగుస్తుంది. కన్నీటి సాగరాన ముంచుతుంది.
ఆ నాలుగు రోజులు గడిపిన ఆనంద క్షణాలు మాకు తీపి జ్ఞాపకాలు అయ్యాయి. అప్పటివరకు ఇంటికి అల్లుడులాగా మొహమాటంగా ఉండే మా వారు, మా నాన్నకు ఆ రెండు రోజుల్లోనే సొంత కొడుకులాగా మారి కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. అన్నయ్య ఒకవైపు, నేను ఒక వైపు అల్లుడు, కోడలు ఇంకోవైపు, మా అమ్మ ఇంకోవైపు ఉండగా..నవ్వుతూ..సంతోషంగా ఆకాశయాన పయనం సాగించారు నాన్న. అదృష్టం పోయిన వాళ్ళది. దురదృష్టం ఉన్న వాళ్ళది. ఆశీర్వాదం మనది, ఆనంద భాష్పాంజలీ కన్నుది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!