శుభ తరుణం

శుభ తరుణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

సాయంకాల సమయం, సూర్యుడు మెల్లిగా పడమర దిక్కున సేద తీరుతున్నాడు. రాజారావు ఏదో నిర్ణయానికి వచ్చినవాడులా లేచి స్నానం చేసి తయారై రైల్వే స్టేషన్ కి కదిలాడు. ఆటోలో స్టేషన్ కి వెళ్లి ఒక సాధారణ టికెట్ కొని, ప్లాట్ ఫాం మీద సిద్దంగా ఉన్న రైలు ఎక్కుదామని అటూ ఇటూ తిరుగుతూ ఉండగా, వెనుక నుంచి తన మిత్రుడు అయిన టీ.సీ నాగరాజు భుజం మీద చెయ్యివేసి ఏరా రాజా ఎటు ప్రయాణం, ఇలా వచ్చావ్ అన్నాడు. నీ కోసమే చూస్తున్నా రా విజయవాడ వెళ్తున్నా, రేపు రాజీ ని తీసుకు వద్దామని వెళ్తున్నా అన్నాడు. సరే రా, నేను డ్యూటీ ఈ రైలు లోనే పద అన్నాడు నాగరాజు. హా! బెర్త్ లేదురా, ఏ కోచ్ లో ఎక్కను అన్నాడు రాజారావు. నా తోనే రా అని తన సీట్ లో కూర్చో బెట్టి టికెట్ల తనిఖీ కి వెళ్ళిపోయాడు నాగరాజు. రాజారావు బయలు దేరాడు కానీ మనసంతా అస్తవ్యస్తంగా ఉంది. రాజీ తనతో వస్తుందా రాదా అని. దానికి కారణం లేకపోలేదు.
రాజారావు చాలా తెలివైన వాడు. అయితే స్వశక్తి మీద నమ్మకం తక్కువ. బాబాలు అనీ స్వామీజీలు అనీ తిరుగుతూ, సమయం, డబ్బు వృధా చేస్తూ ఉంటాడు. మనిషి మంచివాడు, ఇదొక్కటే చెడ్డ. అతను దీని వలన ఎంతగా అంటే  అంతగా ఇబ్బంది పడుతూ భార్య రాజిని, తల్లిదండ్రులను కూడా లెక్క చెయ్యకుండా వ్యవహరిస్తూ ఉంటాడు. దానితో చెప్పి చెప్పి విసుగుతో ఓ ఏడాది క్రితం పుట్టింటికి చేరింది రాజీ. ఎప్పటికప్పుడు మారతాడు అని చూస్తూ ఉంటుంది. ఈ విషయం పక్క ఊరిలో బురిడీ బాబా కి చెప్పుకుంటే ఆయన విభూది, రక్ష రేకులు ఇస్తూ, నీకు సమయం అంతగా బాగోలేదు. కొన్నాళ్ళు భార్యకు దూరంగానే ఉండాలి లేదంటే శాశ్వతంగా దూరం అయిపోతావు అనీ నమ్మబలుకుతాడు. దానితో మనవాడు రాజీతో పూర్తిగా మాట్లాడం కూడా మానేశాడు. కొత్తలో కొన్నాళ్ళు ఫోన్ చేసి చేసి రాజీ కూడా ఈ మధ్య ఫోన్ చెయ్యడం లేదు. అయితే వారి ఇంటి పక్కనే తన కజిన్ ఉంటే, చూస్తూ ఉండమని చెప్పి రాజారావు యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా రాజారావు మాత్రం ఆ బాబా చెప్పిందే నమ్ముతూ, విధి లిఖితం అనుకుంటూ రాను రానూ మరీ నైరాశ్యంలో గడుపుతూ ఉంటాడు. భార్య రాజీ ఎంత చెప్పినా చెవికి ఎక్కలేదు. ఉన్న తెలివి తేటలు అడవి కాచిన వెన్నెలలా, బూడిదలో పోసిన పన్నీరులా చేస్తూ పకీరులా తయారై ఉన్న ఉద్యోగం కూడా సరిగ్గా చేసుకోకుండా ఈ పద్దతి ఏమిటని ఎంతగానో చెప్పి చెప్పి తనలో మార్పు రావాలని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇలా ఆలోచిస్తూ ఉండగా నాగరాజు పలకరించడంతో ఈ లోకం లోకి వచ్చాడు. హా! ఇప్పుడు చెప్పు ఏమిటీ సంగతి, నీ బాబా ఏమంటున్నారు? రాజీని తీసుకు వస్తున్నావా, అసలు తను రావాలంటే నువ్వు మారావా లేదా? అంటాడు నాగరాజు. అదే ఆలోచిస్తున్నారా, ఆ బాబాలు అదీ అంటూ అంతా అస్తవ్యస్తం చేసుకున్నా. రాజీ, మీరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు నా ఉద్యోగం ఊడే పరిస్తితి వస్తే కానీ నాకు జ్ఞానోదయం కాలేదు. ఇంత తెలివి ఉండి అనవసరంగా వ్యర్థం చేసుకున్నా, ఇప్పుడు రాజీ నన్ను క్షమిస్తుందో లేదో అని దిగులుగా ఉంది కూడా అన్నాడు రాజారావు. రాజీ చాలా మంచిదిరా, తను నీతో వస్తుంది ఏమీ దిగులు పడకు అని ధైర్యం చెప్పి, ఇంతకీ నీలో ఈ మార్పుకి కారణం ఏమిటిరా! అన్నాడు నాగరాజు. థాంక్స్ రా కాస్త ధైర్యం వచ్చింది. అసలు ఒకరోజు ఏం జరిగింది అంటే అని చెప్పడం మొదలు పెట్టాడు రాజారావు. అప్పటికే ఆ బాబా నా దగ్గర చాలా డబ్బులు గుంజేసాడు, ఏదో మంచివాడు అనుకుని నమ్మాను. ఒకరోజు మా దూరపు బంధువు, చెల్లెలు వరస అవుతుంది, కల్యాణి అనీ తను ఈ బాబా దొంగ లీలలు, నమ్మిన వారి దగ్గర డబ్బులు కాజేయడాలు అన్నీ సోదాహరణంగా చెప్పింది. అప్పటికీ నమ్మకం కలగలేదు కానీ మరో రెండు రోజులకే ఈ బాబా గుట్టు రట్టయింది పోలీసుల అదుపులోకి తీసుకున్నారు అని వార్త వచ్చిందిరా. అదీ నా మంచికే అన్నట్టు అయింది. సరేలే నువ్వు మారావు అంతే చాలు, పడుకో ఇక. రేపు సాయంత్రం మళ్లీ ఇదే ట్రైన్ నా డ్యూటీ. రెండు బెర్తులు ఉంచుతా ఇద్దరూ ఇదే కోచ్ ల్ లో ఎక్కండి అని చెప్పి వెళ్ళిపోయాడు నాగరాజు. ఉదయం ట్రైన్ దిగి అత్తగారింటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. మావగారు రా! బాబు అని స్వాగత సత్కారాలు అయ్యాకా అత్తయ్యా రాజీ ఏదీ అన్నాడు. అప్పటికే రాజీకి విషయం తెలిసినా ఏమీ తెలియనట్టు ఉంది.
వెళ్ళు బాబూ పైన గదిలో ఉంది. లేచిందీ లేదూ చూడలేదు. పిలవనా! అంది అత్తగారు.
వద్దు, నేనే వెళ్తా అని పైన గదికి వెళ్ళాడు. పోన్లే అల్లుడు మారి, వాళ్ళిద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటారు అనుకున్నారు అత్తా మామలు.
తలుపు తీసే ఉండడంతో రాజీ! నీతో రాజీకి వచ్చా, క్షమిస్తావా అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు భార్య దగ్గరకి వెళ్లి రాజారావు. ఎవరూ, ఏమిటీ పొద్దున్నే. నా పిచ్చి గానీ ఈయన మారతాడా, నాకోసం వస్తాడా అని దుప్పటి లోంచే చిన్నగా పలవరిస్తున్నట్టు నటిస్తోంది. అది తెలియని రాజారావు మాత్రం లేదు రాజీ నిజంగానే నేను వచ్చా, ఈ రోజే మన ఇంటికి వెళ్లిపోదాం పదా అంటూ మరింత దగ్గరికి జరిగాడు. భర్త మారాలనే తప్ప మరే కోపం లేని రాజీ. అబ్బా , ఇది నిజమా! పొద్దున్నే ఎంత శుభంగా, శాంతంగా, మరింత ఆనందంగా ఉంది అని ఉబ్బి తబ్బిబ్బై గాఢంగా భర్తను అల్లుకుపోయింది. ఇక రాజారావు ఆనందానికి అవధులు లేవు. కాసేపు ఇద్దరూ ముచ్చట్లు ఆడుకుని కిందకు వచ్చారు. ఇద్దరినీ చూసి హాయిగా ఉందర్రా అన్నారు రాజీ అమ్మా నాన్నలు. అవునండీ తప్పంతా నాదే! ఇక మీ అమ్మాయి కాదు నా అర్ధాంగి మాట జవదాటను. ఈ సాయంత్రమే మేము బయలు దేరుతాము అంటాడు. అది కాదు బాబు చాలా రోజుల తర్వాత వచ్చావు, అదీ కాక ఈ రోజు షష్ఠి, రేపు వెళ్దురు గానీ అంటారు మావగారు. అదేం లేదు మంచి పనికి అన్నీ మంచి రోజులే. ఇప్పటికే ఆలస్యం అయింది ఇక మీరు ఏమీ మాట్లాడ వద్దు. లేదంటే మీరూ మాతో రండి అంటాడు రాజారావు. ఇంతలో పక్కనుంచి రాజారావు అమ్మానాన్న వచ్చి మరి మేమూ రావద్దా అంటారు. హా! మీరూ ఇక్కడే ఉన్నారా అంటాడు రాజారావు. అవునురా కోడలు పిల్ల నీ రాక గురించి నిన్ననే చెప్తే, ఊరి లోనే కదా, అయినా నిన్న రాత్రే వచ్చేశాం, ఈ శుభ తరుణం కనులారా చూడాలని. సరే! ఇకనైనా బుద్దిగా ఉండు. దేవుణ్ణి నమ్ముకోవాలి, రోజూ పూజాధికాలు చేసుకుని మన పని మనం చేస్తూ, కృషి చెయ్యాలి. తెలిసిందా! అంతే కాదు ఏడాది తిరిగే సరికి మాకో రాజీ లాంటి మంచి మనుమరాలు కావాలి అన్నారు పెద్దవాళ్ళు నలుగురూ. ఆ! అంతా ఆ బాబా దయ అని కొంటెగా అంది రాజీ. ఓయ్! అదేం లేదు అంతా ఆ దేవుడి దయ అన్నాడు రాజారావు ఒకింత తప్పు తెలుసుకున్న భావంతో. అదండీ రాజా రాజీల కథ.

You May Also Like

5 thoughts on “శుభ తరుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!