నాన్న

నాన్న

రచన: ఉమామహేశ్వరి యాళ్ళ

ఆనందం , కేరింతలు, ఆహ్లాదం నిండి, ఎందరో విద్యార్ధినీ విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రుల నడుమ ప్రేమానురాగాలు నిండిన ఒక పెద్ద సభా ప్రాంగణమది. సెంట్రల్ యూనివర్శిటీ స్నాతకోత్సవం జరుగుతుంది.ఆ సభలో పి.హెచ్.డి విద్యార్ధులకు గవర్నర్ గారి చేతులమీదుగా పట్టా బహూకరణ మహోత్సవ కోలాహలమది. వ్యాఖ్యాత బంగారు పతక గ్రహీత ఉమేష్ పేరు పిలవగానే ఆనందంతో గుండె లోతుల్లోనుండి ఉబికి వస్తున్న ఆనందభాష్పాలను కట్టడి చేయలేకపోయాడు. ఆ ఉప్పొంగిన తరంగాలలోనుండి తెరలు తెరలుగా జాలువారిన ఉమేష్ అంతరంగంలోని మాటలివి.

నీ ఒడిలో నేర్చిన తొలి అక్షరాలు జ్ఙాపకం
నీ మదిలో కల్లోల సాగరమున్నాకానీ
నీ మోములో చెదరని చిరునవ్వు జ్ఙాపకం
మంచి భవిష్యత్తుని కలగంటూ బడిలోచేర్చి
నీకు దూరమౌతున్నానని బీతిల్లినరోజు జ్ఙాపకం
నీకు సుస్తీ చేసినా బిక్కు బిక్కుమంటామని,
పడుతూ లేస్తూ ఓపిక కూడగట్టిన రోజు జ్ఙాపకం
అమ్మా అవే నాకు ఆత్మస్థైర్యాన్ని నేర్పాయి.

నాన్నా నీ దరిన నేర్చిన కథలు జ్ఙాపకం
నీవు శ్రమించిన ప్రతి రోజు జ్ఙాపకం
నీ వారసుడనని నన్ను చూడగానే
నీ కళ్ళలో కనిపించే కాంతి జ్ఙాపకం
నీ పరువు ప్రతిష్టలు నిలుపుతానని
నాకై ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ
చిన్నలోటైనా రాకుండా చూసుకుని
నీజీవితమంతా శ్రమించిన నాన్నా….
నా అభ్యున్నతే నీ ఆరోగ్యంగా భావించావు.
అపుడే తెలిసింది ఆశయస్ఫూర్తి ఏమిటో!
అంటూ తన అంతరంగాన్నితెలుపుతూ, సభాముఖంగా తన తల్లిదండ్రులకు కృతజ్ఙతలను తెలుపుకున్నాడు. తండ్రి సుబ్బారావు ఆనంద పారవశ్యుడై కొడుకుని ఆలింగనం చేసుకుని పుత్రగాత్ర పరిష్వంగానుభూతిని పొందాడు. సభికిలంతా హర్షద్వానాలు చేశారు.
ఆ ఆనందంతోనే ఇంటికి చేరుకుని తల్లి చేసిన పాయసం త్రాగి స్నేహితులకు ఇంటి చుట్టు ప్రక్కలవారికి బంధువులకు నోరు తీపి చేశాడు , వారి అభినందనలు , ఆశీస్సులు పొందాడు.

మరుసటి రోజు ఉదయం తన స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. అంతలో తలుపు శబ్దం రాగా వచ్చినదెవరా అని చూసిన సుబ్బారావుకి ఎదురుగా మీడియా వారు కనిపించారు వారిని సాదరంగా లోనికి రమ్మని విషయమేమిటనగా వారు ఉమేష్ ఇంటర్వ్యూకోసం వచ్చారని తెలిసి సంతోషపడతాడు‌. ఉమేష్ కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. అంతలో విలేఖరి తన భావాలని తెలపమని అడుగుతాడు అందుకు సుబ్బారావు వారితో రోజు కూలీ సేసుకుని బతికెటోళ్ళంబాబు. ఐనా సదువంటే నాకు పాణం అందుకే మావోణ్ణి టీచర్ చేయించాలనుకున్నాబాబు. ఎవురి జీవితంలోనైనా ఎలుగు నింపేది సదువే కదయ్యా. ఆ సదువు సెప్పే మాట్టారు అంటే ఎలుగులు సిమ్మే దీపమని నా ఉద్దేశమయ్యా. అందుకే ఎంత క్షటపడినా ఏ రోజు కష్టంగా ఆనిపియ్యలేదు బాబు. మా వోడు మంచి మార్కులుతోటి సదివేడు. అంటూ చెప్పూతూండగా ఉమేష్ వచ్చాడు. కేమెరాలన్నీ అటుగా తిరిగాయి. ప్రశ్నల పరంపర మొదలైంది. ఈ విజయానికి కారకులెవరు? మీ అనుభూతి ఏమిటి అంటూ‌ ప్రశ్నించారు.

చిన్నప్పుడు నేను చాలా ఆకతాయిని. అస్సలు చదివేవాణ్ణికాదు. వెళ్ళామా వచ్చామా అనే కానీ హోం వర్క్ చేయడంకానీ చదవడంకానీ చేసేవాణ్ణికాదు. ప్రతి తరగతిలోను ద్వితీయశ్రేణినే పొందేవాణ్ణి. ఇంటర్ ముదటి సంవత్సరంలో మూడు మార్కుల్లో పరీక్ష తప్పాను.నా నిర్లక్ష్యం వల్ల ఐదవసారికానీ ఆ పరీక్ష పూర్తవ్వలేదు.అప్పటికీనాలో మార్పురాలేదు. నాన్నని అతని కష్టాన్ని ఎలా అవహేళన చేస్తున్నానో తెలుసుకోలేదు. కానీ ఒకరోజు మా నాన్న మా టమ్మతో మాట్లాడుతూ ఈణ్ణి మంచి సదువులు సదివించాలనుకుంటాంటే ఈడేంటో ఇలా డింకీలు కొడతాండాడు. ఆడికెలా సెప్పాలో నాకేటి పలుపోట్లా అని. అందుకు సమాధానంగా అమ్మ ఎందుకయ్యా బొముకలన్నీ అరగదీసుకుని ఆణ్ణి అంతలేసి సదువులు సదివిత్తావు. అవుసరమా? ఇగ నీతో పనికి తీసకపోయ్యా అంది. ఆ సంభాషణ విన్న నాకు నాపైననే చాలా అసహ్యం వేసింది. నాన్న మాత్రం వయసు అలాంటిదే కుర్రోడు మంచోడే అన్నాడు. దాంతో లోపలికెళ్ళి నాన్న కాళ్ళమీద పడ్డాను. ఏ పనికీరానని నీ కోరిక తీరుస్తానని మాటిచ్చాను. నన్ను పైకు లేపి నాన్న గుండెలకి హత్తుకుని బాగా సదువుకోరాయ్యా అన్నారు.
డిగ్రీలో మొదటి స్థానం సాధించాను. నాన్న ఆనందానికి అవధుల్లేవు నా కొడుకు పస్టు లో పాసయ్యాడంటూ పొంగిపోయాడు.

ఆసెట్ రాసి 93℅ మార్కులు సాధించి సీటు సాధించుకున్నాను. అప్పటికే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా చదువుకు కావలసిన డబ్బును నేనే సంపాదించుకోవాలని టనుకున్నాను. ఐతే నాన్న మాత్రం సదువు పాడవుద్దిరా అంటూ ఒప్పుకోలేదు. మంచి సదువులు సదుకుని ఉద్యోగం సాధించమన్నారు.
రాత్రింబవళ్ళు తేడా లేకుండా చదివితే 90℅ మార్కులే సాధించగలిగాను.అమ్మా నాన్నా మాత్రం పండుగలా సంబరపడ్డారు. నన్ను నేను నిరూపించుకోవలన్న కసితో పాఠశాలలో చేరతా అన్నాను కానీ నాన్న ఒప్పుకోలేదు. పి.హెచ్.డి చేయాలని తన కోరిక తీర్చాలని అడిగారు.
అందుకే సెంట్రల్ యూనివర్శిటీకి అప్లై చేసుకుని వారు నిర్వహించే ప్రవేశ పరీక్షలో మొదటి స్థానం సాధించాను.
తరువాతిలా మీముందున్నాను అంటూ ముగించాడు.ఇదంతా తన తల్లి దండ్రుల కల్మషంలేని దీవెనల ఫలితమని అంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు. అది చూసిన భార్య ఏమైందండీ అంటూండగా ఆలోచనల్లోంచి తుళ్ళిపడి లేచాడు.

సహానా నిన్ను ప్రేమించి అమ్మా నాన్నల్ని కాదనుకుని వచ్చేశాం. సిరి పుట్టినపుడుకానీ అమ్మాయి ఎదిగినపుడు కానీ మా అమ్మానాన్నలు రాలేదు. ఇపుడు అమ్మాయి పి.జి పూర్తయింది.వారు లేని లోటును సిరివల్ల ఏ రోజూ అనుభవించలేదు.ఇన్నాళ్ళకి వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు అందుకే గతమంతా ఒకసారి నా కళ్ళముందు కదలాడింది అంతే ఏమీలేదు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ…. అందుకు సహాన వారిని ఇక మనతో తీసుకు వెళదామండీ లేదంటే వారు ఒంటరిగా ఈ వృద్దాప్యంలో యాతన పడాల్సి ఉంటుంది అంటుంది దానికి బదులుగా సిరి ఆ నాన్నానేను కూడా తాతయ్యా నాయనమ్మా వస్తే తప్ప కుదరదంటాను అంటూ నవ్వుతుంది అంతలో వారు వాళ్ళ స్వగ్రామం చేరుకున్నారు. ఊరంతా చాన్నాళ్ళకు చూశానన్న ఆనందం తన భార్య సిరి ముదటిసారిగా రావడం ఇంటిని సమీపిస్తున్నకొద్దీ భావోద్వేగం కలిగింది.
తహతహలాడుతూ ఆత్రంగా లోనికి వెళ్ళిన ఉమేష్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.మంచం పై జీవశ్చవంలా పడి ఉన్న తండ్రి కాళ్ళ మీద పడి భోరున విలపించాడు.ఒక్క మాటైనా చెప్పలేదేం అమ్మా అన్న ఉమేష్ మాటలకి తల్లి కోపంతో రగిలిపోయింది. ఎన్ని కష్టాలు పడినా నీ చదువు చూసుకుని మురిసిపోయారు. ఈ స్థితికి కారణం నువ్వు. నీకు నచ్చిన పెళ్ళి చెఎసుకున్నా ఏమీ అనని సహనమూర్తి నీ మీద బెంగతో ఇలా అయిపోయారు. నువ్వు పెద్ద ఉద్యోగివి అవ్వాలనుకున్నారే కానీ నువ్వు అందనంత దూరం పోతావని అనుకోలేదు. అంటూండగా కొడుకుని చూసుకున్న ఆనందం అనుభవిస్తూ ఉండవే రాక రాక వస్తే అంటూ ఆమెను నోరుమెదపనీయలేదు. సిరి నాయనమ్మతో కలసిపోయి మాళ్ళీ మామూలు వాళ్ళుగా మార్చింది.

మరుసటి రోజు ఉమేష్ తండ్రిని హాస్పటల్ కి తీసుకు వెళ్ళి మెరుగైన వైద్యం చేయించాడు. స్నేహితులందర్నీ కలుస్తాడు. వారం రోజులు ఇట్టే గడచిపోతాయి. ఉమేష్ వాళ్ళ తల్లి దండ్రుల్ని తమతో వచ్చేయమని చాలా ఒత్తిడి చేస్తాడు‌కానీ వాళ్ళు అందుకు అంగీకరించరు. చేసేదిలేక వాళ్ళు వెళ్ళేందుకు నిర్ణయించుకుంటారు. సిరి రామ్మా రైలు కదలిపోతుంది అని పిలిచిన ఉమేష్ కి సిరి మాటలతో అంతా శూన్యం అయిపోయింది . కానీ సహాన భర్తని ఓదార్చింది. తనేమి చిన్నపిల్ల కాదుగా మరో వారం రోజుల్లో వచ్చెస్తుందిలెండి అంటూ నచ్చచెబుతుంది. సిరి నాయనమ్మా తాతయ్యల దగ్గర ఉండిపోయింది . వాళ్ళు తన తండ్రి బాల్యం నెమరు వేసుకుంటూ సిరితో ఆనందంగా గడుపుతున్నారు.

ఐతే ఊరెళ్ళిన తరువాత ఉమేష్ సిరిపై బెంగ పెట్టుకున్నాడు. ప్రతీ క్షణం సిరి జ్ఙాపకాలు వెంటాడుతున్నాయి. అపుడే ఉమేష్ కి తన తండ్రిని ఎంతగా బాధపెట్టాడో తెలుసుకున్నాడు. కుటుంబం అంతే తన తల్లిదండ్రులను కూడా కలుపుకుని అని తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డాడు.
శాస్వతంగా తన తల్లిదండ్రులతో కలసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. సహానాతో చెప్పగానే తను చాలా ఆనందించింది. వారం రోజుల్లో తిరిగి వచ్చేసారు. సిరి చాలా ఆనందించింది. మీరు తప్పు చేశారనడం‌ నేను భరించలేకనే ఇలా చేశాను నాన్న నన్ను క్షమించండి నాన్న అన్న సిరి మాటలకు ఉమేష్ ఉప్పొంగిపోయాడు. నువ్వు బంగారు తల్లివిరా అంటూ గుండెలకి హత్తుకున్నాడు. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!