అమావాస్య చంద్రుడు

అమావాస్య చంద్రుడు

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

రఘు ఒక గొప్ప రచయిత. ఎన్నో గొప్ప రచనలు చేసాడు. అతని రచనలు అంటే‌  ప్రజలలో గొప్ప క్రేజ్ ఏర్పడింది. రఘు ఎక్కడికి వెళ్లిన చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ లని, పోటోలని అస్సలు ఊపిరి పీల్చనివ్వరు, జనాలు. అంత క్రేజ్ రఘు అంటే.

   రఘు ఏదైనా ఒక విషయం మీద రచన చేసాడంటే, అందులో  చాలా కొత్త విషయాలు, ఆ దేశచరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎన్నో కొత్త కొత్త, తెలియని విషయాలు సేకరించి, తన రచనల ద్వారా తెలియచేస్తాడు.  వాటిని అనుసరిస్తూ… ప్రజలు తమ జీవితాన్ని మార్చుకునే వారు.

   రఘు రచనలు చదివితే చాలు. ఉపాధి లేని వారికి ఉఫాదిమార్గాలు… పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు తాము కూడా బతకగలమనే ధైర్యం… మోసపోయిన వారికి ఆ మోసాన్ని తిప్పికోట్టే తెలివితేటలు వస్తాయి. అంతెందుకు రఘు రచనలు అంటే‌, సమాజాన్ని అద్దంలా చూపించే, భూతద్దం. బతకడం నేర్పే ఒక గైడ్.

    రానురాను రఘు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తయ్యారయ్యాడు.

   రఘు ప్రాణస్నేహితుడు  రమణ,  కూడా ఒక రచయితయే. స్నేహితుడే కాని, రఘు పేరు చూసి ఓర్వలేక పోయేవాడు. ఎంత బాగా వ్రాద్దామనుకున్న రఘు రచనల ముందు దిగదుడుపుగానే ఉండేవి అతని రచనలు. వారిద్దరి మధ్య ఎన్ని చర్చలు జరిగిన, రఘు నాడీ పట్టలేకపోయేవాడు.

     ఇది సహించలేని రమణ, రఘు కి అజ్ఞాతవ్యక్తిలా రఘు వ్రాసిన  కొన్ని రచనలలో లోపాలు  ఎంచుతూ రకరకాల లేఖలు  వ్రాసేవాడు.

      రాను రాను రఘు లో నమ్మకం సడల సాగింది. ఎంత మంది బాగుందని ఎన్ని రకాలుగా చెప్పిన అవన్ని గాలికి కొట్టుకుపోతూ, రమణ వ్రాసిన లేఖలే  కళ్ల ముందు కదలాడి, తన రచనలలో లోపాలు ఎత్తి చూపేవి.

     రాను రాను రఘు తన మీద  తాను నమ్మకం కోల్పోతుండగా…రమణ వ్రాసిన లేఖలలోని అబద్దాలు నిజాలు కావడం మెుదలైంది.

     ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీసిందంటే, ఏ జనమైతే  రఘు రచనలు పిచ్చిగా ఇష్టపడేవారో, వారే రఘు రచనలను విమర్శించడం మెుదలుపెట్టారు.

       ఇంతలో కొత్త కొత్త రచయితలు వచ్చి రఘు ప్రభావం తగ్గింది.

     దానితో ఎలాగైనా తన పేరు నిలబెట్టుకోవడానికి రఘు ఎక్కువగా రచనలు చేయడం చేస్తూ, నాణ్యత కన్న రచనల సంఖ్యకి ప్రధాన్యత ఇవ్వడం వలన  కొత్తగా చదివే జనాలలో రఘు రచనల మీద సదభిప్రాయం లేక రఘు ఒక రచయిత గా మరణించాడు.

     ఆ తరువాత రఘు స్థానాన్ని రమణ ఆక్రమించి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నాడు.

     ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత రఘుకి ఏమి తోచక కొన్నాళ్లు రమణతో  గడపాలని తలచి, రమణ ఇంటికి వచ్చాడు.

     రమణ తన గొప్పతనం చూపించుకునే అవకాశం వచ్చిందని తలచి తాను వెళ్లిన చోటుకల్లా రఘుని వెంట పెట్టుకుని వెళ్లేవాడు.

       అలా వెళ్లిన ప్రదేశాలలో మధ్యవయసు వారు రఘుని గుర్తుపట్టి, రఘు రచనలను పొగుడుతూ మాట్లాడుతూ ఉండేవారు. అక్కడి వారు,రఘుని చూసి,  “మీరు ఎందుకు రచనలు చేయడం లేదు. మీ పలానా రచన వలన మా జీవితాలను చక్కపెట్టుకున్నాం”

“మాకు  మీ రచనలలో మా సమస్యకు పరిష్కారం దొరికింది”  అని అందరూ చెప్తుంటే, రఘు తెల్లబోయాడు.

        తన రచనలో  ఏ లోపాలనైతే ఆ అజ్ఞాత వ్యక్తి చూపాడో , ఆ లోపాల వలన తమ జీవితాలు బాగుచేసుకున్నామని అందరూ అంటూంటే తాను ఎంత తెలివి తక్కువగా ఆలోచించాడో రఘుకి తెలిసి వచ్చింది.

       తిరిగి  రఘు జనాలలో తిరుగుతూ ,కొత్త వారికి తనని పరిచయం చేసుకోవడం వలన రఘు  పాత నవలలు చదివిన కొందరు రఘుని తిరిగి రచనలు చేయవలసిందని ప్రోత్సాహించడం మెుదలుపెట్టారు.

వారి అభిమానానికి ముగ్ధుడైన రఘు తిరిగి రచనలు చేస్తూ పూర్వ వైభవం పొందాడు.

       ఆ చంద్రుడు అమావాస్య రోజు ఎలా కనపడకపోతాడో, రఘు  జీవితంలో కూడా కొన్ని అమావాస్య రోజుల గడిచిన తరువాత వెన్నెల రోజులు తిరిగి వచ్చాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!