దూరపు కొండలు

దూరపు కొండలు

రచన: శ్రీదేవి విన్నకోట

ఈ సంఘటన జరిగి నాలుగు సంవత్సరాలు పైమాటే. చాలా రోజుల నుంచి రాద్దామని అనుకుంటున్నాను.
నా పేరు శ్రీ కళ.నేను ఒక అంగన్వాడి స్కూల్లో టీచరుగా పని చేస్తున్నాను.

ఒక రోజు నేను నర్సాపురం మా బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నాను మా ఊరు రాజమండ్రికి. పెళ్లి బాగా జరిగింది దగ్గర బంధువులు కావడంతో పసుపు కుంకుమ బట్టలు పెట్టారు.ఇంట్లో ఎవరికీ రావడానికి కుదరకపోవడంతో నేనొక్కదాన్నే వెళ్లి వచ్చేస్తున్నాను. ఎప్పట్లాగే కిటికీ పక్కన సీట్లో సెటిల్ అయిపోయాను.
కిటికీ పక్క సీట్ సంపాదించడానికి కూడా ఓ టెక్నిక్ ఉంటుంది.ట్రైన్ మెల్లిగా వస్తూ ఉండగానే.కిటికీలోంచి మనది ఒక వాటర్ బాటిలో, లేక చేతి రుమాలో, ట్రైన్ విండో నుంచి కిటికీ పక్క సీట్ లో వేసేయాలి. ఎక్కడ వేసామో కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి.ఖరీదైనవి మాత్రం వేయకూడదు.మనం ట్రైన్ ఎక్కే లోపు పోయే ప్రమాదం ఉంటుంది.

పోయినా పర్లేదు అనుకున్న వాటినే  వెయ్యాలి.రైలు నెమ్మదిగా నడుస్తుంది.వాతావరణం ఉదయమే కావడంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇంతలో తర్వాత స్టేషన్ లో ఒక ఆమె పసి పిల్లాడు తో ట్రైన్ ఎక్కింది. నా పక్కనే చోటు ఉండడంతో వచ్చి కూర్చుంది. నేను పలకరింపుగా ఆమెను చూసి నవ్వాను.ఆమె కూడా నవ్వింది.

తన పేరు స్వరూప అని తాను నిడదవోలులో దిగుతానని అమ్మ గారి ఇంటి నుంచి అత్తింటికి వెళ్తున్నాను అని చెప్పింది. కళగా ఉన్న చక్కని నవ్వు మొఖం.కానీ ఒక్కటే లోపం ఆమెకు పోలియో  ఉంది.

కొంచెం కష్టంగానే ఇడుస్తూ నడుస్తుంది.ఇక్కడ తన అన్నయ్య తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించాడు అని అక్కడ దిగగానే తన భర్త తన కోసం స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పింది.ఆడవాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా, ఎక్కడ ఉన్నా ఇట్టే స్నేహితులం అయిపోతూ ఉంటాము.ఎప్పటి నుంచో తెలిసిన ప్రాణ స్నేహితుల్లా అన్ని విషయాలు మాట్లాడేసుకుంటూ ఉంటాము.ఆమె కూడా కలుపుగోలు మనిషి కావడంతో బాగానే మాట్లాడుతుంది నాతో. బాబు చాలా బాగున్నాడు. వాడి పేరు అఖిల్ అని వాడికి ఇప్పుడు 11 నెలలు అని  తమ పెళ్లి అయిన 9 ఏళ్ల తరువాత చాలా హాస్పిటల్స్ తిరిగి మందులు వాడితే లేక లేక అపురూపంగా పుట్టాడు అని చెప్పింది స్వరూప ఆ పసివాణ్ణి మురిపెంగా చూస్తూ.. మాటల్లోనే భీమవరం వచ్చేసింది. అక్కడ చాలా ఎక్కువ మంది ఎక్కేసారు జనం.క్షణాల్లో అసలు ఖాళీ లేకుండా ఊపిరి సలపనట్టుగా ఉంది రైల్లో. బాబుకి గాలి తగలడం ఇబ్బందిగా ఉంది అని నేను లేచి కిటికీ పక్కన సీట్ స్వరూప కి ఇచ్చేశాను. ఆమె ప్లేస్ లో నేను సర్దుకుని కూర్చున్నాను.ఇంతలో ఒక ముసలావిడ 65 70 ఏళ్లు ఉండొచ్చు ఆమె నిల్చోడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, నేను నుంచుని ఆమెకు నా సీట్ ఇచ్చాను.నా వంక కృతజ్ఞతగా చూసింది. తన పేరు ఆదెమ్మ  అని చెప్పింది.ఇక్కడ ఊర్లో మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతూ ఉంటాను అని, కొవ్వూరు లో ఉన్న కూతుర్ని చూడడానికి వెళ్తున్నాను అని చెప్పింది.

ఆ ముసలావిడ తన పక్కన కూర్చోగానే స్వరూప మొహం అసహ్యంగా పెట్టింది.ఆవిడ మరీ అంత అసహ్యకరం గా ఏమీ లేదు. కాకపోతే పల్లెటూరి మనిషి కావడంతో కట్టుబొట్టు కొంత పాతకాలం మాదిరిగా అనిపించాయి అంతే.కానీ మనిషి నిండుగా శుభ్రంగా గా చాలా బలంగా ఉంది. స్వరూప ఒడిలో బాబు ని చూడగానే ఆ ముసలామె ముఖం ఆనందంతో విచ్చుకుంది.వృద్ధాప్యం కూడా ఒక బాల్యమే అంటారు కదా.ఆ బాబు ని చూడగానే ఆమెకు తన బాల్యం గుర్తొచ్చిందెమో అనిపించింది.

కన్నా చిన్ను బుజ్జి అంటూ వాడి మొహం మీద వేళ్ళతో చిటికెలు వేస్తూ, వాడు నవ్వే బోసి నవ్వులకు మురిసిపోసాగింది. ఆ ముసలామె ప్రవర్తన స్వరూప కి నచ్చలేదు అని ఆమె ముఖం చూస్తే అర్థమవుతుంది.

స్వరూప బాబు ని ముద్దు చేస్తున్న ఆ పెద్దామె చేతుల్ని బాబు మీద నుంచి కొంచెం విసురుగా నే తోసేస్తూ, వాడు పడుకుంటాడు మీరు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్.అంటూ కిటికీ వైపు తిరిగి పోయిందిపూర్తిగా.
ఆమె ప్రవర్తనకి నా మనసు చివుక్కుమంది. కనీసం ఆ పెద్దామె వయస్సుకు గౌరవం ఇవ్వలేని స్వరూప సంస్కారం నాకు నచ్చలేదు.

స్వరూప కు పోలియో కావడంతో బాబుని  అంత సేపు వళ్ళో పెట్టుకొని కూర్చోవడం తనకి కష్టంగానే అనిపిస్తున్నట్లు ఉంది.పాసింజర్ ట్రైన్ కావడంవల్ల ప్రతి చిన్న పెద్ద స్టేషన్లోనూ ఆగుతూనే ఉంది. దిగే వాళ్ళ కంటే ఎక్కే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ట్రైన్ ఊపిరి సలపనంత రద్దీగా మారిపోయింది.

కమ్మిని పట్టుకుని నిలబడడం నాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది.కానీ ఏం చేస్తాం తప్పదు. సీట్ దొరికే వరకు నించోవలసిందే. అలా సమయం గడుస్తుంది, ట్రైన్ నడుస్తుంది నెమ్మదిగా అత్తిలి దాటింది అత్తిలి లో ఒక భార్య భర్తలు ట్రైన్ ఎక్కారు.
మంచి టిప్ టాప్ గా చాలా డబ్బు ఉన్న వాళ్ల లా చాలా హైక్లాస్ గా ఉన్నారు. వాళ్లు ఎవర్ని చూసినా పలకరింపుగా నవ్వుతూ అందరితో మాటలు కలుపుతూ చాలా సరదాగా కలివిడిగా ఉన్నారు.

ఇంతలో అతను స్వరూప వళ్ళో కేరింతలు కొడుతూ ఆడుతున్న బాబును చూసి చిటికెలు వేస్తూ బాబుని ఆడించసాగాడు. రెండు నిమిషాలు అయిన తర్వాత బాబు ని నేను ఎత్తుకుంటాను  ఇవ్వమ్మా నీకు అలా బాబు ని వళ్ళో పెట్టుకుని కూర్చోవడం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది కాళ్లు నొప్పులు పెడుతున్నాయి ఏమో కదా అంటూ ఆ బాబును తీసుకుని భుజాన వేసుకున్నాడు.భార్యభర్తలిద్దరూ వాడిని ముద్దు చేస్తూ ఆడుకోసాగారు.

స్వరూప పక్కన కూర్చున్న ముసలామె ఆ భార్య భర్తల వంక నిర్వికారంగా చూస్తూ కూర్చుంది. అలా నెమ్మదిగా నిండు గర్భిణీ లా నడుస్తోంది ట్రైన్.ఇంకా జనం ఎక్కువ కావడంతో ఆ భార్య భర్తలు కాస్త ముందుకి నడిచారు బాబు తో సహా.  అలా ముందుకు నడుస్తూ డోర్ వరకు వెళ్ళిపోయారు.స్వరూప బాబుని ఇమ్మని అన్నట్టుగా సైగ చేసింది.వాళ్లు పర్వాలేదు మేము ఎత్తుకున్నాము కదా, మీరు దిగేటప్పుడు ఇచ్చేస్తాము అని చెప్పడంతోతను సైలెంట్ గా బాబు వంకే చూస్తూ ఉండిపోయింది.

ఇంతలో ఆమె భర్త ఫోన్ చేయడంతో, బాబు వంక చూడడం మానేసి నవ్వుతూ భర్తతో ఫోన్లో మాటల్లో  పడిపోయింది. ఇంతలో తణుకు వచ్చింది. దిగిన వాళ్ళ కన్నా ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.ఆ భార్య భర్తలు బాబుతో సహా డోర్ దగ్గర నుంచునే ఉన్నారు.
ఒక పది నిమిషాలు ఆగింది అక్కడే ట్రైన్. ఆ తరువాత మెల్లిగా కూత వేసి బయలుదేరింది.
తణుకు దాటిన తర్వాత సత్యవాడ అనే చిన్న పల్లెటూరు వస్తుంది, ఫ్లాట్ఫామ్అంటూ  ఏమీ ఉండదు.చుట్టూ పొలాలు  ఉంటాయి, ఆ స్టేషన్ ఊరికి దూరంగా ఉన్నట్టు ఉంటుంది, ట్రైన్ కూడా  అక్కడ ఆపరు కొంచెం స్లో అవుతుంది అంతే.

అలా ట్రైన్ కొంచెం స్లో అవ్వగానే ఆ భార్య భర్తలు బాబు ని తీసుకుని చాలా తొందరగా ట్రైన్ దిగిపోయారు. మేమెవరం గమనించలేదు. స్వరూప ఇంకా భర్తతో మాట్లాడుతూనే ఉంది. అతను నిడదవోలు స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాడు ఆమెకోసం. కాల్దరి అనే ఊరు దాటితే నెక్స్ట్ వచ్చేది స్వరూప దిగాల్సిన నిడదవోలే, ఇంతలో
ఆ ముసలామె అయ్యో  పిచ్చిపిల్లా చూస్తున్నావా నీ బాబు ని తీసుకుని ఆ డాబుసరి మొగుడు పెళ్ళాం రైలు దిగిపోయారే. ముందు వాళ్లను పట్టుకోండి పట్టుకోండి అని పెద్దగా అరుస్తూ డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి నెమ్మదిగా  నడుస్తున్న ట్రైన్ దూకేసినట్టుగా తొందరగా దిగిపోయింది.

స్వరూప అయితే ఒక నిమిషం అలా స్తబ్దుగా రాయిలా ఉండిపోయింది నోట్లోంచి మాట రావట్లేదు కళ్ళలోంచి నీళ్ళు తప్ప. అందరూ తలో మాట అంటున్నారు కానీ దిగి వాళ్లని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. నేను చైన్ లాగాను కానీ ట్రైన్ ఆగట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వరూప నా బాబు నా బాబు అంటూ బోరుమని పెద్దగా ఏడవసాగింది. చైన్ లాగడం వల్ల ఎలాగైతేనేం కొంచెం లేటుగా కొద్ది దూరం వెళ్లి ట్రైన్ ఆగింది. నలుగురు కాలేజీ పిల్లలు దిగి ఆ భార్య భర్తలని వెతకడం కోసం పరిగెత్తారు. పొలాలకు అడ్డంపడి నడుస్తూ పారిపోతున్న ఆ భార్యాభర్తలకి అప్పటికే
ఆ ముసలామె అడ్డం పడి వాళ్లని పారిపోకుండా ఆపడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది.

అమ్మ దొంగ సచ్చినోళ్ళరా అంత పాలు తాగే పసివాడ్ని ఎత్తుకుపోతారా.మీ జిమ్మడిపోను,మీకు పోయేకాలం రాను, మీ కాళ్లు చేతులు పడిపోను, మీ అమ్మ కడుపులు కాలా అంటూ నోటికొచ్చిన తిట్లు అన్ని తిడుతూ, తన వల్ల కాకపోయినా వాళ్లను పారిపోనివ్వకుండా ఆపుతూ, తన ప్రయత్నం తాను చేస్తుంది. ఇంతలో అతను ఆమెను విసురుగా తోసేయడం తో పక్కనే ఉన్న బురద నీటిలో పడిపోయింది. పడిపోయినా సరే ఆమె చీర కుచ్చిళ్ళు పట్టుకుని లాగుతూ వారిని వెళ్లనివ్వకుండా ఆపసాగింది. బాబు తల్లి కనిపించక కేర్ కేర్ మనీ గుక్కపట్టి ఏడవసాగాడు.ఇంతలో ట్రైన్ దిగిన నలుగురు కాలేజీ పిల్లలు కూడా అక్కడ కి చేరడంతో వాళ్లకు నాలుగు తగిలించి బాబుని వాళ్ళ చేతుల్లోంచి బలవంతంగా లాక్కొని గుండెలు అవిసెలా ఏడుస్తున్న స్వరూప చేతికి అందించారు. స్వరూప బాబుని గుండెలకు అదుముకుంటూ కొంచెం ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేది, నా బాబు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు, అంటూ అందరికీ దండం పెడుతూ అక్కడే కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది,

ఇంతలో ఎవరో పోలీసులకి ఫోన్ చేయమనడంతో ఆ భార్య భర్తలు బలవంతంగా ఆ కాలేజీ కుర్రాళ్ల నుంచి విడిపించుకుని ఆ పొలాల నుంచి పడుతూ లేస్తూ పారిపోయారు.

తర్వాత అందరం నిమ్మదిగా ట్రైన్ ఎక్కాము, స్వరూప ఆ ముసలామెతో నన్ను క్షమించు పెద్దమ్మ బాబుతో ఆడుతున్న నీతో అసహనంగా మాట్లాడాను, అసలు ఈరోజు నువ్వే ట్రైన్ లో లేకుండా ఉండి ఉంటే నా బిడ్డ నాకు దొరికి ఉండేవాడు కాదు, నా బిడ్డను వాళ్ల నుంచి రక్షించడానికి నువ్వు దేవతలా వచ్చావు అంటూ రెండు చేతులు జోడించింది,

ఊరుకో పిల్ల నేను అంత గొప్ప పని నేనేం చేశాను, చూస్తే ఎవరైనా చేయగలిగే సహాయమే అది, కానీ ఈ రోజుల్లో ఎవరు ఎవరిని నమ్మలేము, చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా పసి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరికీ అప్పగించకూడదు.
ఎవరి బుద్ధి ఏ టైం కి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు, అంటూ స్వరూప కళ్ళు తుడుస్తూ ఓదార్చింది ఆదెమ్మ.

ఇదంతా చూస్తున్న నాకు అనిపించింది. కష్టాల్లోనే ఎదుటి మనుషుల గొప్పతనం తెలుస్తుంది.అలాగే ఇప్పుడు ఆదెమ్మ గొప్పతనం కూడా బయటపడింది. కొందరి రూపాల్నో లేదా వాళ్ళు వేసుకున్న బట్టల్నో చూసి  మోసపోకూడదు.ఇలాగే ఇప్పటి రైల్లో భార్యాభర్తలు లాగే కొందరు మంచితనం ముసుగు వేసుకున్న మేకవన్నె పులుల్లా ఉంటారు. అలాంటి వాళ్ల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి తెలివిగా ఉండి, స్వరూప కథ అదెమ్మా వల్ల సుఖాంతం అయినందుకు నాకు ఆనందంగానే ఉంది. ఇవన్నీ తనకు ఏమీ పట్టనట్టుగా రైలు గమ్యం వైపు అలా ముందుకు సాగిపోతూనే ఉంది.
ఈ కథలో సంఘటన నిజంగా ఒకసారి ట్రైన్ లో నేను స్వయంగా చూస్తుండగా జరిగిందే, పేర్లు మార్చి రాశాను,

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!