వసంతం వస్తుందా?

కథాంశం: బంధాల మధ్య ప్రేమ-2080

వసంతం వస్తుందా?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

కన్నీళ్ళతో కళ్ళు వెలారిపోతున్నాయి.
ఆకలితో పేగులు ఎండిపోతున్నాయి.
రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకుల కొందరివి,
ఎందరివో రెక్కలను ఆసరాగా తీసుకుని ఎగిరే పక్షుల లాంటి పశువులు ఇంకెందరో..
రైతుల అవసరాలు వాళ్ళకి ఆసరా అవుతాయి.
పేదల కన్నీటి వర్షమే వారికి సాగు నీరుగా ఉపయోగపడుతుంది.
ఏంటో ఇలా రేట్లు మండిపోతూ ఉంటే వ్యవసాయం ఎలా చేసేది అనుకుంటూ వచ్చారు నాన్న. ఏదో తెలియని అసహనం నాన్న ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాలం ఎంత మారినా, ప్రజల నమ్మకాలు, వారి అవసరాలు ఎప్పటిలాగానే ఉన్నాయి అనుకున్నాను.
ఏమైంది నాన్న అన్నాను నాన్న పక్కన నుంచుని.
అమ్మ తెచ్చిన మంచి నీళ్ల గ్లాసు అందుకుంటూ ఉంది లేరా మా బాధలు ఎప్పుడూ ఉన్నవే అంటూ పేవలంగా నవ్వారు.
ఇంకా అప్పటికి ఆ టాపిక్ మంచిది అనిపించింది నాకు.
అమ్మ అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే, నేను కూడా పక్కన ఉన్నవన్నీ అందిస్తున్నాను.
వీళ్లు అందరూ తినేశారా??? అంటూ పక్కనే ఉన్న మనవళ్ళని, మనుమరాళ్లని చూసి మురుసుకుంటూ అడిగారు నాన్న.
ఆ కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇంట్లో ఉన్న ఆ పండగ వాతావరణం వల్ల గుండెల్లో ఉన్న బాధను బయట పెట్టకుండా, తనను తాను సంతోషంగా ఉంచుకునేలా ప్రయత్నిస్తున్నారు నాన్న. అని నాకు అర్థం అవుతోంది.
ఏదో తెలియని దిగులు ముఖాన్ని కాంతిహీనంగా చేస్తుంటే, ఆనందం పంచుకునే మనుషులు పక్కన ఉన్నంత వరకూ ముఖం చంద్రబింబం కావాల్సిందే.
అలాంటి మనుషుల విలువ,  మనుషుల విలువ, మమతల విలువ, మనసుల విలువ ఇప్పుడు నేటి తరం యువతకు ఆ భావోద్వేగం అర్థం అవ్వదు అని చెప్పాలి.
నేను దీక్షగా నాన్న వైపే చూస్తున్నాను.
ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కొనుకున్న  పండించుకుంటున్న పంటపొలాలు మావి. ఎంతో ఇష్టంగా చేసుకునే వ్యవసాయ పద్ధతులు మా ఊరి వాళ్ళవి. ఎప్పుడూ లేనంత విధంగా నాన్న కళ్ళలోని ఆ అసహనం నా మనసుని కలవరబెడుతోంది.
యధాలాపంగా నాన్న నన్ను చూసి,  మన ఊరి వాళ్ళు ఇప్పుడు నాకు వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్పిస్తున్నారు పాపాయ్ (నాన్న నన్ను పిలిచే ముద్దు పేరు).
కూలి పని వాళ్ళతో ఎలా మెలగాలి?, దాయాదులతో ఎలా మెలగాలో?, అనే విషయాన్ని ఇన్నేళ్ల అనుభవంలో కొత్తగా నేర్చుకోవాల్సిన రోజులు వచ్చినాయి నాకు అంటూ నవ్వారు. జీవం లేని ఓ నవ్వు.
పెదవులపై చిరునవ్వు ఆనందాన్ని తెలియజేస్తే, ఆ నవ్వులోని నిర్లిప్తత తెలియని అసహనాన్ని బయటపడుతుంది.
నేను మౌనంగానే ఉన్నాను. నాన్నే మొత్తం చెపుతారు అని నమ్మకం కలిగింది.
మళ్లీ తనే చెప్పడం మొదలు పెట్టారు.
వ్యవసాయదారుల అంటే ఇదివరకు ఉన్న మర్యాద ఇప్పుడు లేదు పాపాయ్. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ల మమ్మల్ని చేతకాని వాడిలా చూస్తారు. సాటి వ్యవసాయదారులు ఏమో అక్కర్లేని సలహలు చాలా మంది ఇస్తూ ఉంటారు. ఈ రోజులను బట్టి పోతుంటే, పెరిగిన ధరలతో దళారులకు కట్టడానికి సాగుబడి, కట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు.
అలాగని పుడమి తల్లి ముద్దుబిడ్డ లాగా బతకిన మేము ఇప్పుడు ఆ తల్లి కి వెన్నుపోటు పొడవలేము. ఆ పచ్చని నేలను ఎండబెట్టి, జీవంలేని, కళలేని ఓ ఇల్లాలి మోమువంటి ఆ భూతల్లిని నేను ఊహించలేను అని చెబుతూ ఉండగా నాన్న కళ్లు చెమర్చాయి.
ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న ముఖంలో ఈరోజు క్షోభ కనబడుతోంది.
ఏమీ చెయ్యలేని నా మనసు ములిగింది. ఇవ్వన్నీ నాకు మామూలే అన్నట్టు మా నాన్న పొందిన అనుభవం నన్ను శాంత పరచింది.

************

నాన్న, నిన్న మీకు బాలేదు, నలతగా ఉండి, ఒంట్లో బాగాలేదు అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్ కి వెళ్ధామా అంటూ వచ్చాడు అన్నయ్య.
లేదురా ఇప్పుడు బానే ఉంది. నువ్వు ఆఫీస్ కి వెళ్ళి పో. చెల్లి కూడా ఇక్కడే ఉంది కదా!!! అలా నాకు ధైర్యంగానే ఉంది లే అన్నారు.
కాదు నాన్నా, ఒకసారి వెళ్లి చెకప్ చేయించుకోండి. అసలే ప్రపంచమంతా వైరస్ ఉంది కదా. ఏ రోజు ఎలాంటిదో అన్నాను నేను కంగారుగా.
నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. కొంచెం చెస్ట్  పెయిన్ వచ్చింది అంతే అన్నారు చాలా ఉత్సాహంగా. అయినా  ఇప్పుడు  హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే, మళ్లీ నా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోడానికి నాకు టైం దొరకదు అన్నారు  చిన్న పిల్లల్లాగా.
మాకు సెలవులు ఇంకా నెల పైన చాలా టైం ఉంది స్కూల్ తెరవటానికి. ఇవాళ హాస్పిటల్ కి వెళ్లి వచ్చి తర్వాత ఆడుకోవచ్చు అన్నాను మందలింపుగా.
హాస్పిటల్ అని చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టించాను. కానీ విధిరాత నాన్నను మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. మృత్యువు హార్ట్ ఎటాక్ లాంటి రూపంలో చుట్టుకుంది. ఒక గంటలో నాన్న ప్రయాణం కాస్తా అనంతవాయువుల్లో సాగిపోయింది.
మా గుండెలు పగిలేలా విలపించాము. మృత్యువుకు మా ఘోష వినిపించలేదు. కనికరం కలుగలేదు. అందరం ఉండబట్టే ఒకరినొకరు ఒదార్చుకుంటూ,  ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ, ఒకరి భావాలను మరొకరం వింటూ  కాలక్షేపం చేశాము.
పొలాలు బీడు వారతాయా? ఆ పచ్చదనం కనుమరుగవుతోంది. ఆ కొబ్బరి చెట్ల పై నుండి వీచే గాలి మూగబోయింది. రెపరెపలాడడం మానివేసింది. పొలం గట్టుపైన ఉన్న కూరగాయ మొక్కలు ఎండిపోయినాయి.
తలలాడిస్తూ ఆడుకునే ఆ పచ్చని పైరు మొక్కలు నేలవారి నిద్ర పోతున్నాయి. మమ్ము  ఆదుకునే మా తండ్రి తో మేము పయనిస్తున్నామంటూ వీడ్కోలు చెప్తున్నాయి.
నేల తల్లిని విడవడం రైతుబిడ్డనైన నాకు కూడా కష్టంగానే ఉంది.  నేను వ్యవసాయ పనులు కూడా చూద్దాము అనుకుంటున్నాను అన్నాడు మా అన్నయ్య. తన నిర్ణయం చెపుతూ.
సరే అంటూ అందరం చప్పట్లతో అన్నయ్యకు రైతు జీవితంలోకి ఆహ్వానం పలికాము. కానీ, మదిలో చిన్న సంఘర్షణ.
లోతు తెలియని ఊబిలోకి మరొకర్ని తోస్తున్నామా??  లేదా నవ వసంతం యొక్క కుసుమ సువాసనల అందాలకు మరొకడు ముగ్ధుడై పరవశిస్తాడా అన్నది ప్రశ్నార్థకమే.
వసంతం వస్తుందా ??? వీరి జీవితంలోకి.  కాదు వసంతం రావాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఓ రైతు బిడ్డ వ్రాసిన కథ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!