కానున్నది కాకమానదు

కానున్నది కాకమానదు

రచన::ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

అదిగో అందాల గౌతమీ గోదారి ప్రవహించే రాజమహేంద్రవరం. ఎంతోమంది మహామహులకు పుట్టినిల్లు. సీనియర్ సిటిజన్స్ అందరూ గోదారి ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో కలుసుకుని, కబుర్లు, రాజకీయాలు, జోక్స్ మాట్లాడుకుంటూ వుంటారు. స్వవిషయాలపై చర్చ పోయేది కాదు. కానీ అవసరానికి ఆదుకునే స్వభావం కలిగిన వారే.

ఒకరోజు అభ్యుదయ భావాలపై చర్చ జరుగుతోంది. ఇంతలో ఆరోజునే కొత్తగా వచ్చిన పెద్దాయన అభ్యుదయాన్ని మాటలకే పరిమితం చేయండి లేదా ధార్మిక సంస్థలకు విరాళాలు ఈయండి. అంతేకాని ఆదర్శం పేరుతో ఏదో ‘ఘన కార్యాలు’ చేయకండి. ఇబ్బంది పడేది మీరే అని అరిచినట్లు మాట్లాడాడు. మాకు యెవ్వరికీ అర్థం కాలేదు. చీకటి అయిపోతోంది.
ఇక యిళ్ళకు వెళిపోదామండి అని ఒకరు అనడంతో చర్చ అక్కడితో ఆగిపోయింది. అతను ఇంకా ఎవరికి పరిచయం కాలేదు.

***

కొత్తగా రాజమండ్రి వచ్చారు రాజయ్య కుటుంబం. రాజయ్య స్వాతంత్ర్య సమర యోధుడే కాదు, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. అతని కొడుకు పేరు ఏసుయీశ్వరాలి. మతాలను సమత్వం చేసే విధంగా నామకరణం చేసాడు. ఇంకో చిత్రం యేమిటంటే పక్కా సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆ రాజయ్య కుమారుడే గోదావరి గట్టు చర్చిలో ఆవేశంగా మాట్లాడిన వాడు.

****

రాజయ్య మనవడు ఉజ్వల్. తాతగారి భావాలను పుణికి పుచ్చుకున్నాడు. ఒక బాల వితంతువును వివాహం చేసుకున్నాడు. పాపం అతను ఆమెతో తక్కువ కాలమే గడిపినప్పటికి, ఆమె ప్రవర్తన వలన అతని జీవితం సరిగాలేదు. భార్య అందం ఆమెకు శాపమో లేక ఉజ్వల్ కు వరమో తెలియదు కానీ కొత్తగా పరిచయమైన ధనవంతుని కుమారునితో వెళ్ళి పోయింది. శాపం అనడం జరిగింది కాబట్టి ఆమె తరువాత జీవితం గురించి ఆలోచించడం అనవసరం. గలగలల గోదావరి గట్టుపై ఉజ్వల్ తండ్రి ఆవేశానికి అర్థం తెలిసింది.****

ప్రతీ ఆభ్యుదయంతో ఉషోదయం రాదు కదా! అలా అని అభ్యుదయాన్ని ఆశించకుండా, ఉషోదయాన్ని కోరుకోకుండా వుండగలమా. ఉజ్వల్ వ్యక్తిత్వంలో కాని,విశాల దృక్పథంలో కాని మార్పురాలేదు.

ఆదర్శం పేరుతో చేసిన ‘ఆచరణ’, కొన్ని పరిస్థితుల్లో తప్పు అని అనిపించవచ్చు. కానీ తప్పు చేయడం లేదనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి. లేకపోతే ‘ఆదర్శం’ దారి తప్పుతుంది అని రాజయ్య అనుభవంతో కొడుక్కి, మనవడికి తరుచు చెపుతూ వుండేవాడు. ఆ మాట కొడుక్కి రుచించక పోయినా, మనవడు మనసులో నాటుకుపోయింది.

****

అదో మారుమూల జమీందారీ గ్రామం. అలా అని పూర్తిగా సాదాసీదా జనం వుండరని కాదు. ఉజ్వల్ అనుకోకుండా ఆ వూరులో వున్న స్నేహితుని కలుసుకోవడానికి వచ్చాడు. ఈ లోపు అక్కడ మైదానంలో ఎంతోమంది జనం గుంపుగా వున్నారు. ఏమిటో చూద్దాం అని తానూ వెళ్ళాడు. రోజులు బాబును ఎవ్వరో వదిలేసారు. అప్పుడే పాలు పెట్టి వదిలేరేమో నవ్వుతూ ఆడుతున్నాడు. వదిలే తీరు చూస్తుంటే ధనవంతుల బాబు అనిపిస్తున్నాడు. పెద్దా, చిన్నా చూస్తున్నారే తప్ప, ఎవరూ కనీసం ఎత్తుకునే ధైర్యం కూడా చేయడం లేదు. వెంటనే ఉజ్వల్ బాబును తీసుకున్నాడు. వెనకనుండి నీ బాబా,బాబుని నువ్వు తిరిగి తీసుకుని వెళతావా అని వ్యంగ్యంగా అన్నాడు. ఎవరికి అభ్యంతరం లేకపోతే నేను పెంచుకుంటాను అన్నాడు. ఓ పెద్దాయన నాయనా నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు ఈ ఊరుకి, ఎవరైనా ఇక్కడ నీకు తెలుసున్న వారు వున్నారా అనగానే, వెంటనే ఫోన్ చేసి పిలిపించాడు తన స్నేహితుడిని. అతను వూరి వారికి తెలుసున్న వాడే కాబట్టి పోలీసు వారికి సమాచారం ఇచ్చి, బాబుని తీసుకుని వెళ్లి పోయాడు. ఆనవాయితీల గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ఈ బాబు వచ్చిన వేళా విశేషం అతనికి కలిసివచ్చింది. తను చేపడుతున్న సాంఘిక కార్యక్రమాలన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. సంఘంలో గౌరవం లభించింది.

***

ఇంతకీ విషయం ఏమిటంటే ఉజ్వల్ పెంచుతున్న బాబు ఒక జమీందారు గారి మనవడు. ఇతను పుట్టిన సమయంలో జమీందారు ఒక భూతగాదా కోర్టు కేసులో కొంత భూమి మాత్రమే అతనికి చెందినట్లు కోర్టు తీర్పు.

సమాజంలో చుట్టూ వుండే అరిచే కాకులు గురించి అందరికి తెలిసిందే కదా. నష్ట జాతకుడు పుట్టాడు, జమీందారుకు ముందు ముందు యింకా ఇటువంటి నష్టాలు యెన్ని చూడాలో అని చెవులు కొరుక్కున్నారు. మిడిమిడి జ్ఞానం వున్న జ్యోతిష్యుడు కూడా అదే విషయాన్ని బలపరిచాడు. దీనితో భవిష్యత్తులో పరువు పోకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, కొడుకు, కోడలికి నచ్చచెప్పే విధంగా నచ్చచెప్పి, రోజులు పసికూనని ఆ గ్రామం నడివీధిలో వదిలేయడం జరిగింది. తరువాత కాలంలో కూడా తనకు ఎటువంటి మార్పు రాలేదు సరికదా నష్టాలు పెరిగాయి.

రోజులు గడుస్తున్నాయి. ఒకసారి ఒక జ్యోతిష్కుడు భూతభవిష్యత్తులు సరిగా చెపుతున్నారని, వారు తమ గ్రామంలో వచ్చేడనే వర్తమానం అందింది ఆ జమీందారుకు.

ఆ జ్యోతిష్కుడిని సంప్రదించాడు. తను కోర్టులో పొందిన అపజయం, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, యిబ్బందులకు పరిష్కారం తెలుపవలసిందని కోరాడు.

ఆ జ్యోతిష్కుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ‘నువ్వు దురదృష్టం అనుకుని ఒక అదృష్టాన్ని కాలదన్నావు. పాప పరిహారం చేసుకున్నానని పెద్ద ఘోరం చేసావు. నువ్వు చేసిన తప్పు గుర్తు చేసుకో’
అని చెప్పగానే జమీందారు ఆలోచనలో పడ్డాడు.

అవును తాను చేసిన తప్పు మనసులో దొలుస్తూనే వుంది. చెప్పాడు. ‘నువ్వు చెయ్యరాని దారుణం చేసావు. ఆ బాబు పుట్టిన వేళా విశేషం వలనే కోర్టు కేసులో కొంత విజయం సాధించి, కొంత ఆస్తిని చేజిక్కించుకున్నావు. బాబు దోషం లేదు. అతనో అదృష్ట జాతకుడు. నువ్వు చేసిన పనికి కాలమే శిక్షించింది. దోష పరిహారం లేదు, అనుభవించు. నివారణ లేదు. వారసులు లేక నిన్ను నువ్వు చంపుకున్నావు’ అని జ్యోతిష్కుడు చెప్పగానే తలవంచుకున్నాడా జమీందారు.

తప్పుడు జ్యోతిష్యం పేరుతో, ప్రకృతి ప్రసాదమైన మనవడిని దూరం చేసుకొని ఆ జమీందారు ఇహంలోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఏమి చేస్తాం, కానున్నది కాక మానదు కదా!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!