అధైర్యం

(అంశం:మనసులు దాటని ప్రేమ)

అధైర్యం

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా వరుణ్ నడక ఆపలేదు.నేరుగా కిట్టిగాడి టీ బంకు దగ్గర ఆగి చిలకమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు.ఏంచేద్దాం చిలకమ్మ రాలేదు.చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి.కాలికి రక్తం కారడం వల్ల స్పృహ కోల్పోయి టీ బంకు బెంచీ మీదనే పడిపోయాడు.చుట్టు పక్కల ఎవరూ లేరు ఎందుకంటే అప్పుడు టైం తెల్లవారు జాము రెండు గంటలు.పోలీసులు పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తూ బెంచీ మీద మనిషిని చూసి కానిస్టేబుల్ కనకారావు వచ్చి లాఠీతో ఒక దెబ్బ వేశాడు.ఉలుకూ పలుకూ లేకపోవడంతో సార్ వీడు చచ్చినట్టున్నాడు అని ఎస్.ఐ సింహాచలం కి చెప్పడంతో ఎవర్రా నా ఇంటి ఎదురుగా అంటూ అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆస్పత్రిలో చేర్చారు.వరుణ్ ఉదయం పది గంటలకి కళ్ళు తెరిచాడు.ఎదురుగా ఎస్.ఐ సింహాచలం కన్ను గుడ్లు పెద్దవి చేసుకొని వరుణ్ కంట్లోకే చూస్తున్నాడు.వరుణ్ సింహాచలంను చూసి వణికిపోయాడు.ఇప్పుడు నా పరిస్థితేంటి ఏమని చెప్పాలి.నా స్టోరీ వీళ్ళకి తెలిసిపోయిందా అనుకుంటూ బిత్తర చూపులు చూస్తూ ఉండగా సింహాచలం “ఏరా అంత రాత్రప్పుడు అక్కడ నీకేమి పని?అసలు కాలికి దెబ్బెందుకు తగిలింది?”అని అడగడంతో వరుణ్ “బాబాయ్.!ఫ్రెండ్స్ తో గొడవపడి వచ్చాను.ఇంటికెళ్తే అమ్మ తిడుతుందని ఆ బెంచీపై కూర్చున్నాను.నాకే తెలియకుండా జరిగిపోయింది అని అబద్ధం చెప్పేశాడు.సింహాచలం ఎవర్రా నా అన్న కొడుకైన నిన్ను కొట్టిన ఫ్రెండ్స్ పేర్లు చెప్పు వాళ్ళ మక్కెలిరగదీసి కుక్కర్లో కూరొండేస్తా అని కోప్పడ్డాడు.బాబాయ్ ఏదో తాగిన మైకంలో కొట్టారు నేను వాళ్ళని తీసుకొస్తాను బెదిరించి వదిలేయండి సరేనా అంటూ సింహాచలం ఒడిలో పడుకొన్నాడు వరుణ్.ఒరేయ్ ఇంత మంచివాడిగా ఉంటే ఎట్లా బతుకుతావురా అంటూ వరుణ్ తల నిమురుతూ బాధపడుతున్న సింహాచలాన్ని చూస్తూ వరుణ్ అసలు విషయం తెలిస్తే నన్ను కుక్కని కాల్చినట్లు కాల్చేస్తావేమో బాబాయ్ అనుకంటూ నిద్రలోకి జారుకున్నాడు.
వరుణ్ ఇంటికొచ్చాక రాత్రేదో పార్టీ అని చెప్పి వెళ్ళి ఏంట్రా హాస్పిటల్ నుంచి వస్తున్నావ్ అని వరుణ్ అమ్మ లక్ష్మీప్రసన్న బాధపడింది.కాసేపటికి మిత్రుల దండు దిగింది.ఏంట్రా ఏం జరిగింది మాకు ఫోన్ చేసుంటే వచ్చి వాలిపోయే వాళ్ళం కదా అన్నారు.పక్కనే ఉన్న కనకారావు ఏంటి మీకు తెలియదా మీరే రాత్రి తాగిన మైకంలో కొట్టారని చెప్పాడు అని అన్నాడు.ఏంటీ మేమా తాగడమా ఏం మాట్లాడుతున్నావ్ మావా.వాడు చెప్తే మాత్రం మీరెలా నమ్మారు అని గొల్లుమని నవ్వారు.నవ్వండి నవ్వండి తర్వాత నవ్వలేరులే ,కాసేపట్లోసింహాచలం వచ్చాడంటే మక్కెలించి కాకులకి గద్దలకి మేతేసేస్తాడు.
ఫ్రెండ్సంతా ఒక్కసారిగా “ఏంటీ..!సింహాచలం బాబాయ్ కి కూడా ఇలానే చెప్పాడా?మా బతుకులు బస్టాండే అయితే”అంటూ ఆందోళనలో ఉండగా వరుణ్ ఒరేయ్ ఏం కాదులేరా బెదిరించి వదిలేయమని చెప్పా.ఏమనడులే అన్నాడు.”మా మీద నిందలేసేది నువ్వే వదిలేయమని చెప్పేది నువ్వే.అంతా నీ ఇష్టమేనా.అసలు ఏం జరిగింది ఎందుకలా చెప్పావో ఇప్పుడైనా చెప్పు లేకపోతే సింహాచలం బాబాయ్ కి మేం కొట్టలేదని చెప్పేస్తాం “అని ఫ్రెండ్స్ అనడంతో వరుణ్ కనకారావుని బయటికెళ్ళమన్నాడు. కనకారావు అబ్బో అంత సీక్రెటా అన్నాడు.అవును మావా అది తెలిస్తే నీ కొంప కొల్లేరవుద్ది, నా కొంపకూడా ముంచుతావు అందుకని వెళ్ళు ప్లీజ్ అని పంపించేశాడు.ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వింటున్నారు.

“మా పక్కింట్లో చిలకమ్మ ఉందిగా అదీ నేను ప్రేమించుకున్నాం.చిన్నప్పటి నుంచి ప్రేమ కానీ మా ప్రేమ మనసులు దాటలేదు.హద్దులసలే దాటలేదు.చూపులతో మాటాడుతూ,సైగలతో కవ్విస్తూ గడిపేశాం.ఓరోజు ధైర్యం చేసి చిలకమ్మకి ఐ లవ్ యు చెప్పేసి నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్ళి చేసుకోను అని కరాకండీగా కుండబద్దలు కొట్టేశా.దానికి చిలకమ్మ “నేను తల్లిదండ్రులు లేని పిల్లని.నీకు తెలియనిదేముంది.మా మామయ్యే నన్ను చిన్నప్పటి నుంచి పెంచాడు.మా మామయ్యకి చెప్పే ధైర్యం నాకు లేదు.నీకు ఆ ధైర్యముంటే మాట్లాడుకో”అని షాకిచ్చింది “అని చెప్తున్న వరుణ్ ని ఆపి “ఒరేయ్ చిలకమ్మ అంటే సింహాచలం బాబాయ్ బామ్మర్ది కూతురేగా”అన్నారు ఫ్రెండ్స్.”అవునురా ఆ అమ్మాయే.సరే మా ఇద్దరికీ బాబాయ్ ని అడిగే ధైర్యం లేక లేచిపోదామని నిర్ణయించుకున్నాం.లేచిపోయే క్రమంలో ఇలా మా ఇంటి ఎదురుగానే పడిపోయా”అని వరుణ్ జరిగిన కథ చెప్పాడు.అంతా చెప్పావు కానీ దెబ్బలెందుకు తగిలాయో చెప్పనే లేదు అంటూ దొంగచాటుగా కథంతా వింటున్న కనకారావు అడిగాడు.కనకారావు వినేయడంతో ఏంటి మావా పోలీసు అయుండి ఇలా దొంగలా వింటున్నావ్ అన్నాడు వరుణ్.మా పనే అదిరా నీ లాంటి దొంగనాయాళ్ళని దొంగ దెబ్బతీయడం అని అన్నాడు కనకారావు.ఇంట్లోంచి పన్నెండు కాకముందే బయలు దేరా మధ్యలో రాజీ వేరేవాడితో మాట్లాడడం చూసి వాడి కాలర్ పట్టుకొని గొడవ చేశా.వాడి ఫ్రెండ్స్ నా కాళ్ళపై బ్యాటుతో చావ బాదారు.ఆ దెబ్బలకు తట్టుకోలేక పోతుండడం చూసి రాజీ నన్ను వాళ్ళింటి దాకా పట్టుకొచ్చింది.నేనే నువ్వెళ్ళు మీ నాన్న పెట్రోలింగ్ వస్తాడని పంపేశా.వచ్చి టీ బంకు దగ్గర కూర్చొని వెయిట్ చేశా.చిలకమ్మ రాలేదు.తర్వాత కళ్ళు తెరిస్తే ఆస్పత్రి బెడ్ పైన ఉన్నా”అంటూ దెబ్బల విషయాన్ని చెప్పేశాడు.కనకారావు థ్యాంక్స్ రా అల్లుడూ అంటూ ఇంటికెళ్ళాడు.కనకారావు థ్యాంక్సెందుకు చెప్పాడో ఫ్రెండ్స్ కి అర్థం కాలేదు.కనకారావు డల్లుగా థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్తున్నాడు ఏందుకురా అని వరుణ్ ని అడిగారు.
అదా ఆ రాజీ ఎవరో కాదు కనకారావు మావ కూతురే.ఫ్రెండ్స్ షాక్ అయి సరే చిలకమ్మ ఎందుకు రాలేదు అని అడగడంతో ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడా ఒకటిన్నర సమయంలో వచ్చిందంట నేను అప్పటికే పడిపోయి ఉండేటప్పటికి లేపడానికి ట్రై చేసిందంట.పోలీస్ సైరన్ రావడంతో బాబాయ్ వచ్చేస్తాడని ఇంటికెళ్ళిపోయి పైన్నుంచి జరిగేదంతా చూసి రాత్రంతా నాకోసం నిద్రలేకుండా గడిపిందంట రా అంటూ చిలకమ్మ గురించి చెప్పి మేము లేచిపోయి పెళ్ళి చేసుకోవడం పక్కా మీరూ హెల్ప్ చేయాల్రా అని ఫ్రెండ్స్ ని అడిగాడు.”నాయనా వరుణదేవా.! అధైర్యమే ఆయువుగా చేసుకున్న మీమనసులు దాటని ప్రేమకి ధైర్యం తోడులేకపోతే మనసుల్లోనే పువ్వుగా విరిసి వాడిపోతుంది.అందుకే ప్రేమయినా ,ఏ పనైనా ఒక్క ఫ్రెండ్ కైనా చెప్పి చేయాలి.మీ బాబాయ్ మా ప్రాణాలు తీసినా సరే మీ మనసులు దాటని ప్రేమని సారీ సారీ మీ మనసులు దాటేసిన ప్రేమని సరిహద్దుల్లేని విశ్వాంతరాలానికి పరిచయం చేస్తాం అంటూ ఫ్రెండ్స్ భరోసా ఇచ్చి మిత్రుడు వరుణ్ కి అండగా నిలిచారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!