ఊగిసలాడే మనసు

ఊగిసలాడే మనసు

రచన: పద్మావతి తల్లోజు

“సార్”సుదీర్ఘ ఆలోచనలో ఉన్న నాకు ఎవరో పిలుస్తున్నట్టు లీలగా వినిపించింది.

“సార్”ఈ సారి కాస్త గట్టిగానే పిలిచారు

“ఆ..”అంటూ ఆలోచనలో నుంచి ఒక్కసారిగా బయట పడ్డాను నేను.

“వేరుశనగ కాయలు కావాలా సార్”అన్నాడా అబ్బాయి
“ఉహు..”అన్నాను. అంతకుమించి మాట్లాడటం ఇష్టం లేదన్నట్లుగా వాడు మారు మాట్లాడకుండా ముందుకు కదిలాడు ఇంకో బేరం వెతుక్కుంటూ. తన వేరుశనక్కాయలు గొప్పతనాన్ని వర్ణిస్తూ నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నమే చేయలేదు వాడు. అవును, దానికి ఒక కారణం ఉంది.

           నేను, నిషిత రెగ్యులర్గా కలిసే మీటింగ్ స్పాట్ అది. ట్యాంక్ బండ్ మీద తనతో కలిసి ఆ సిమెంట్ బెంచీ పైన కూర్చుంటే పుష్పక విమానంలో పయనిస్తున్నట్టుగా ఫీలయ్యే వాడిని.

        “రాజ్! వేరుశనక్కాయలు తిందామా?”అంది మా సెకండ్ మీటింగ్ లో నిషిత. ఇదిగో… ఈ రోజు వచ్చాడే ఆ అబ్బాయినే పిలిచా.”డబ్బా 5 రూపాయలు”అన్నాడు వాడు డబ్బా చూపిస్తూ.

      డబ్బా సైజు చూసి దోసెడు వేరుశనక్కాయలు వస్తాయనుకున్నా కానీ , చారెడు మాత్రమే వచ్చాయి. నన్ను 5 రూపాయలు ఇవ్వకుండా అడ్డుపడి,” డబ్బా లో  కాగితాలు కుక్కి జనాల్ని మోసం చేస్తున్నా”వంటూ నిషిత వాడితో గొడవ పెట్టుకుంది. అప్పుడు విసుగనిపించినా నిశిత నా భార్య అయ్యాక ఎంత చాకచక్యంగా సంసారాన్ని నెట్టుకురాగలదో తలుచుకుంటే సంతోషం వేసింది. వాడికి మాత్రం ఈ వ్యవహారం అంతా చిరాకు తెప్పించింది. అందుకే మమ్మల్ని చూడగానే వాడి కళ్ళలో అయిష్టత లీలగా కనిపిస్తోంది.

         ఆలోచనల నుండి బయట పడుతూ మరోసారి విషితకు ఫోన్ చేశాను.
“బయలుదేరుతున్నాను రాజ్”అంది.ఏడాదిగా ఇక్కడే కలిసిన ప్రతిసారీ గంటల తరబడి ఎదురు చూస్తున్న ఏనాడూ తాను చెప్పిన టైముకు వచ్చింది లేదు. ఇంకా ఇలాంటి అరగంటలు ఎన్ని గడవాలో… తాను ఈమధ్య నన్ను ఇలాగే నిర్లక్ష్యం చేస్తోంది. మా మధ్య ప్రేమ పుట్టి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయ్యింది. నాకు మాత్రమే గుర్తున్న ఈ రోజు ప్రత్యేకతను ఒక అందమైన బొకేతో ఆమెను సర్ప్రైస్ చేయాలని నాన్నకు అబద్ధం చెప్పి తెచ్చుకున్న ఐదువందల తో బొకే కొన్నాను. నాలో పెరుగుతున్న అసహనానికి గుర్తుగా అందులోని పూలు కూడా వాడి పోతున్నాయి.

        నా దృష్టి రోడ్డు మీదకి మళ్ళింది. పాపం, పక్కనే నాలాంటి ఓ ప్రేమికుడు, ప్రేయసి కోరింది అనుకుంటా… అతి కష్టం మీద రోడ్ క్రాస్ చేసి రెండు ఐస్క్రీములు పట్టుకొస్తున్నాడు. వాడి ముఖంలో ప్రపంచాన్ని జయించిన ఆనందం.. ప్రేయసి కోరాలే గాని ఐస్ క్రీమ్స్ ఏం ఖర్మ! మా ప్రాణాలు ఇచ్చే యము.

      మొన్నీమధ్య వాలంటైన్స్ డే కి కలిసినప్పుడు”నా కోసం ఏం తెచ్చావు రాజ్!”అని నిషిత అడగగానే ఇంకో ఆలోచన లేకుండా, అమ్మ ముచ్చటపడి నాకోసం చేయించిన ముత్యపు ఉంగరాన్ని తన వేలికి తొడిగే శాను. అమ్మ ఉంగరం గురించి అడిగితే ఇంట్లోనే ఎక్కడో పడిపోయిందంటూ అమ్మ పైన, చెల్లి పైన అరిచాను.

       మరోసారి నిషిత పుట్టినరోజు కనీ చెల్లి పాకెట్ మనీ అప్పుగా తీసుకొని తెల్లని తన దేహఛాయకి సరిపోయేటట్లుగా వంగపండు రంగు చీర కొన్నాను. ఆ చీర చూడగానే ఆనందం పట్టలేక నన్ను హత్తుకుపోతుంది అనుకున్నాను. కానీ,”షిట్, ఏంటి రాజ్ ఇది. అమ్మమ్మలా చీర సెలెక్ట్ చేసావు. మోడర్న్ డ్రెస్సెస్ ఏవి దొరకలేదా నీకు?”అనేసింది విసురుగా. ఒంట్లో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించినది. ఏనాడు చెల్లి బర్త్ డే గుర్తుపెట్టుకొని కనీసం విషెస్ చెప్పిన పాపాన పోలేదు. ఆ పాపమే నన్ను ఇప్పుడిలా ఏడిపిస్తుందనిపించింది.

          నాలో జరిగే అంతర్మధనాన్ని నిషిత గుర్తించే పరిస్థితిలో లేదు.”సరే!రాజ్! అయిందేదో అయింది. శారీ ఎక్స్ చేంజ్ చేసి డ్రెస్ తీసుకుందాం పద పద”అంటూ బయలుదేరదీసింది. అక్కడ షాప్ అంతా ఏకం చేసి సేల్స్ బాయ్ కి చెమటలు పట్టించి, ఒక జీన్స్ దానికి సూటబుల్ టాప్ కొనేసింది. తనను ఒక్కసారైనా చీరలో చూడాలని నా కోరిక హృదయాంతరాలలో అలాగే ఇంకిపోయింది.

     మళ్ళీ కలుద్దాం అంటూ పుట్టినరోజు నాడు నాతో కాసేపైన గడపాలనే ధ్యాస లేకుండా కనుమరుగయ్యింది. ఉసూరుమంటూ ఇల్లు చేరుకున్న నాకు అమ్మ ఎదురుగా వచ్చి మంచినీళ్ళు అందించింది. చెల్లి పకోడీ ప్లేటుతో సిద్ధంగా నిల్చుంది. నేను ఏదో ఉద్యోగం కోసం తిరిగి అలిసిపోతున్నానని వాళ్లకు నాపై ఎక్కడ లేని జాలి. అపరాధభావంతో వాళ్ల ముందు నిలబడలేక బెడ్ రూం లోకి వెళ్ళిపోయాను.

     నా వెనకే అమ్మ నాన్నతో అంటున్న మాటలు లీలగా వినిపిస్తున్నాయి.”అబ్బాయి ఎంసీఏ పూర్తి చేసి సంవత్సరం కావస్తోంది. పాపం వాడు ఉద్యోగాల కోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. తిండి కూడా సరిగా తినడం లేదు. ఎవరి ద్వారానైనా రికమండ్ చేయించి వాడికి ఉద్యోగం వేయించొచ్చు కదా”అంటుంది.

“నేనే గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తాగిరి వెలగబెడుతున్నాను. నాకంతటి పరిచయాలు ఎక్కడున్నాయి”అంటూ నాన్న బాధపడుతున్నాడు.

     అన్నట్టు నాన్నంటే గుర్తొచ్చింది. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే మా తాతయ్య చనిపోతే, విధిలేని పరిస్థితిలో అదే ఆఫీసులో నాన్న గుమాస్తాగా చేరాల్సి వచ్చిందట. ఆటల్లో, చదువులో అన్నింట్లో నాన్న ఫస్టే అట. ఉద్యోగంలో చేరాక కూడా పై చదువులు చదవాలని నాన్న చాలా ప్రయత్నం చేశారట. పాపం! తాతయ్య పోయిన బెంగతో నానమ్మ మంచాన పడటం పెళ్లికెదిగిన ఇద్దరు చెల్లెళ్ళు గుండెల మీద కుంపటి నా మారటం, ఆయనను ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా చేశాయట. తల తాకట్టు పెట్టి ఒక చెల్లి పెళ్లి చేస్తే, ఇంకో చెల్లి పెళ్లి కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టాడట మా నాన్న. మా అమ్మను చేసుకోక మునుపు ఒక దూరపు చుట్టాల అమ్మాయిని ఇష్టపడ్డారు నాన్న. నాన్నమ్మ ఈ విషయం గ్రహించి వాళ్లతో పెళ్లి సంబంధం మాట్లాడిందట. కానీ వాళ్లు నాన్న చిన్న ఉద్యోగం, ఆయనకున్న బాధ్యతలు చూసి అబ్బాయి ఇల్లరికం వస్తేగాని పెళ్లి జరగదు అని తేల్చి చెప్పారట. చిన్న అత్తయ్య పెళ్లి చేయటానికి నాన్న తాను ప్రేమించిన అమ్మాయిని కాదని, మా అమ్మను కుండమార్పిడి పెళ్లి చేసుకున్నారట.

        ఆశ్చర్యం వేసింది నాకు. ఈ విషయాలన్నీ అమ్మ చెబితేగాని నాకు తెలియలేదు. తన బాధలన్నీ దాచుకొని, మా సుఖం కోసం మాత్రమే తపించే నాన్న ఎక్కడ? నేను ఎక్కడ? నిషిత నా వెంట రావాలే గాని వీళ్లందరినీ గాలికొదిలేసి ఈ పాటికే పెళ్లి చేసుకుని కాపురం పెట్టేవాడిని.

        “నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇకనైనా”బొమ్మరిల్లు మూవీలోంచి ఓ హార్ట్ టచింగ్ సాంగ్ ఎవరి మొబైల్లో నుండో నా చెవిని తాకగానే ఈ లోకం లోకి వచ్చాను నేను. ఎప్పుడు వచ్చాడో తెలియదు వేరు
వేరుశనక్కాయలు అబ్బాయి నా బెంచి ఇంకో చివర కూర్చుని వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. నిశితకు మరోసారి డయల్ చేశాను”వస్తున్నాను ఆన్ ది వే రాజ్!”అంటూ అదే రొటీన్ డైలాగ్. అసహనాన్ని భరించలేక కాసేపు ఆ వేరుశనగ కాయలు అమ్మేకుర్రాడి తో బాత ఖానీ వేస్తే బాగుంటుంది అనిపించింది.

        “ఏంట్రా ఈ రోజు బాగానే సంపాదించినట్లు ఉన్నావ్ ఎంతొచ్చింది ఏమిటి?”అంటూ చనువుగా పలకరించాను. వాడు నా కేసి అదోలా చూస్తూ అటు వైపు తిరిగి కూర్చున్నాడు. నా అహం దెబ్బతింది.

“ఏంట్రా పిలుస్తుంటే పలకవేంటి? బడికి వెళ్లాల్సిన వయసులో ఈ పనులు చేస్తే నిన్ను మీ అయ్యను కూడా బొక్కలో వేస్తారు తెలుసా?” అన్నాను కోపంతో.

    “నేను పొద్దున్న పూట బడికి పోతా సార్… బడి అయ్యాకనే ఈ పని చేస్తా”అన్నాడు.
వాడి గొంతులో భయం .

నా అహం కాస్త చల్లారింది. “బడికి వెళ్లి వచ్చాక హోంవర్క్ చేసుకొని ఆడుకోక ఇదేం పని రా?”వాడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఎక్కువైంది.

     “అవ్వ. తాత తో కలిసి ఆరుమందిని ఉంటాము సార్ అమ్మ, అయ్యా కూలీకి పోతరు. మా పొత్తకాల కర్సు, మా అందరికీ కూడూ…. చాలా కట్టంగా ఉంది సార్. అందుకే అయ్యకు తెలియకుండా అవ్వని అడిగి ఈ పల్లీలు ఏయించి తెచ్చి అమ్ముతా సార్. ఏదో ఏన్నీల్లకు కాసిన్ని సన్నీళ్ళు. అమ్మ, అయ్యా అట్టా కట్ట పడుతుంటే సూడ బుద్ధి కాదు సార్…”అంటూ వాడు ఏదో చెప్తూనే ఉన్నాడు.

బడిలోగానీ, తల్లి ఒడిలోగానీ నేర్వని ఎన్నో పాఠాలను జీవితమే వాడికి నేర్పినట్టు ఉంది. ఒకసారి బుద్ధుని వైపు చూశాను. మళ్ళీ వాడి వైపు చూశాను. నా మనసులో ఏదో తెరలు తొలగుతున్నాయి. నా కళ్ళు తెరిపించడానికే వచ్చిన బాల బుద్ధునిలా కనిపించాడు వాడు ఆ క్షణంలో. అప్రయత్నంగా రెండు చేతులు జోడించాను. వాడికేం అర్థం కాలేదు. నాకేదో అయ్యిందనుకొని అక్కడి నుండి పారి పోయాడు.

        ఆర్థ్రతతో చెమర్చిన నా కళ్ళను అరచేత్తో తుడుచుకున్నాను. ఇప్పుడు దారి స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో కాలంగా కాల్ సెంటర్ లో జాబ్ కి అప్లై చేయమని ఒత్తిడి చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడా క్షణంలో. తనకి ఫోన్ చేసి చెప్పా… రేపు వచ్చి కలుస్తాను అని. ఇక వెళ్దామని లేస్తుండగా ..,

నిశిత దగ్గర నుండి ఫోన్ “ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను రాజ్! ఇంటికి వెళ్ళి పోతాను. మళ్లీ రేపు కలుద్దామా?” అంటూ.

ఫోన్ లో ట్రాఫిక్ శబ్దం లేదు. నాకు అప్పుడు అర్థమయింది. తానసలు ఇంటి నుండే బయలుదేర లేదని, నన్ను పిచ్చివాడిని చేసి ఆడిస్తోందని.”రేపే కాదు ఇక ముందెన్నడూ మనం కలుసుకో నక్కరలేదు. నిషిత! గుడ్ బై ఫర్ ఎవర్”అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను.

     నా జీవితంలో నాకు తారసపడ్డ వ్యక్తులు మా నాన్న, వేరుశనగ కాయలు అమ్మే కుర్రాడు, ఇంకా మరెందరో… అందరూ ఎంతో ఎత్తులో ఉంటే నేను మాత్రం పాతాళంలోకి కృంగిపోయినట్టుగా అనిపించింది. ప్రేమించడం తప్పు కాదు. దాని కోసం మనల్ని నమ్ముకున్న వాళ్ళను వదిలేయడం, వంచించడం తప్పు. ఉద్యోగం చూసుకొని నాన్న బరువు తగ్గించాలన్న బాధ్యతను మరిచి అమ్మాయిల వెంట బలాదూరుగా తిరగడం నేరం. చేతిలోని బొకే బరువెక్కి సాగింది నా  గుండెలాగే! దాన్ని హుస్సేన్సాగర్లో విసిరేసాను. ఒంటరిగానే కూర్చున్న.., ఇప్పుడక్కడ దుర్వాసన లేదు. చుట్టూ వీచే గాలిలో ఏదో పూల సుగంధం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!