వీడిన మబ్బులు

వీడిన మబ్బులు

 రచన:-  సావిత్రి కోవూరు 


“అత్తా నాన్న రమ్మంటున్నారు” అన్నది, అన్నయ్య కూతురు దీప్తి.

చీర ఇస్త్రీ చేసుకుంటున్న అఖిల “వస్తున్నానని చెప్పమ్మా” అన్నది.

“ఏంటి అన్నయ్య పిలిచావట” అంటూ వచ్చింది. హాల్ లో సాయంత్రం టీ తాగి కూర్చున్న ప్రవీణ్ దగ్గరకు. అక్కడే ఆయన భార్య వైదేహి కూడా ఉంది. వాళ్లని చూసి అఖిలకు ఏదో సీరియస్ విషయమే మాట్లాడటానికి పిలిచాడు అని అనిపించింది.

అప్పటికే అఖిల వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఎన్నో ఏళ్లు అయింది. వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు పిల్లలు వాళ్ళ కాలేజీ విషయాలు, ఆఫీస్ పని తో బిజీ అయిపోయి, ఎప్పుడో ఒకసారి చెల్లెళ్లతో మాట్లాడేవాడు ప్రవీణ్. ఆయనకు నలుగురు అక్క చెల్లెలు ఒక తమ్ముడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్ళకు పిల్లలు,సంసారాలు. ఎవరి సంసారాల్లో వాళ్ళు మునిగిపోయారు. తమ్ముడు కూడా పెద్దక్క కూతురును  చేసుకుని విడిగా ఉంటున్నాడు. ఇక మిగిలింది చెల్లెళ్ళు జ్యోతి, అఖిల.

వాళ్ళిద్దరికి ముప్పై సంవత్సరాలు దాటినా పెళ్లిళ్లు కాలేదు, అనే దాని కంటే వాళ్ళకు సంబంధాలు చూసే తీరిక ఎవరికీ లేదు అంటే కరెక్టుగా ఉంటుంది. ఇద్దరు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ, వాళ్ళ అవసరాలకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కనుక వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఇల్లు వాళ్ళ నాన్న కట్టించిందే. తిండి మాత్రం అందరూ కలిసి తింటారు.

ప్రవీణ్ కూతురు కూడా చదువు అయిపోయి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది. మంచి సంబంధాలు వస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు పెద్ద పెద్ద చెల్లెళ్ళను  పెట్టుకుని, తన బిడ్డ పెళ్లి చేస్తే బంధువులు ఏమంటారో, అన్న భయానికి ఈ మధ్యనే ఒక పెళ్లిళ్ల పేరయ్యకు సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పాడు. ఆ పెళ్లిళ్ల పేరయ్య ఉదయము ఏదో సంబంధం గురించి ప్రవీణ్ తో చెప్పడం వల్ల, దాని గురించి చెల్లెలుకు చెప్పడానికే పిలిచాడు.

ప్రవీణ్ “ఏం లేదమ్మా నీకు, అక్కకు ఏవైనా సంబంధాలు చూడమని ఆ మధ్య ఒక అతనికి చెప్పాను. అతను ఈరోజు కలిసి ఏదో సంబంధం ఉందట, అబ్బాయి స్టేట్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్ చేస్తున్నాడట. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల, తల్లి పెంచి పెద్ద చేసిందట. ఇన్ని రోజులు అబ్బాయి పెళ్లిని వాయిదా వేస్తున్నాడట. ఈ మధ్యనే  చేసుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి నీ గురించి చెప్తే ఫోటో చూసి, పెళ్లి చూపులకు ఈ ఆదివారం వస్తామన్నారు. అది చెప్పడానికే పిలిచాను” అన్నాడు

“అదేంటన్నయ్య అక్క పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకుంటాను. మొదట తనకు చూడండి. అయినా మాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక కూడ లేదు. ఇలాగే గడిస్తే చాలు అనుకుంటున్నాం.” అన్నది అఖిల.

వెంటనే పక్కనే ఉన్న వైదేహి “మీరు ఎలాగైనా ఉండగలరమ్మా కాని లోకం ఊరుకోదు కదా” అన్నది.

“అదేంటి ఒదినా ఇన్ని రోజులు ఏమి అనని లోకం ఇప్పుడు అంటుందా?” అన్నది అఖిల.

“ఇన్ని రోజులు వేరు. ఇప్పుడు వేరు. మా అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి. మిమ్మల్ని ఇలా పెట్టుకుని దానికి పెళ్లి చేస్తే, బంధువులు మాపై దుమ్మెత్తి పోయరూ? మీ అక్కలు, తమ్ముడు మీ గురించి ఎలాగూ పట్టించుకోరు. మాకు తప్పదు కదా” అన్నది వైదేహి నిష్ఠూరంగా.

“సరే వదినా మీ ఇష్టం కానీ ఇప్పటికే వయసు పెరగడం వల్ల సంబంధాలు ఎలాగు రావు. దాంట్లో చిన్నదాని నాకు పెళ్లయి, నేను వెళ్లి పోతే అక్కకి ఈ జన్మలో పెళ్లి కాదు. తను పెళ్లి అవ్వక ఒంటరిగా మిగిలిపోతుంది. అందుకే మొదట అక్క పెళ్లి చేసినాక నేను చేసుకుంటాను. ఎవరైనా కుదిరితే” అన్నది అఖిల.

అప్పుడు ప్రవీణ్ కల్పించుకుని “అది కాదు అఖిలా ఆ అబ్బాయి జ్యోతి కన్నా చిన్నవాడు, అందుకని నీకు కుదిరితే, నీకు చేసిన తర్వాత, జ్యోతికి తగిన సంబంధం వస్తే అలాగే చేస్తాను” అన్నాడు.

“అన్నయ్య మీరు ఎన్ని అయినా చెప్పండి మొదట అక్క పెళ్లి కాకుండా నేను చేసుకోను” అన్నది.

“సరే మరి. ఆ మధ్యవర్తి తో ‘మా చెల్లి అక్కపెళ్ళి జరిగే వరకు చేసుకోదట’ అని చెప్పేస్తాను” అన్నాడు.

“మీ ఇష్టం అన్నయ్య” అని తన రూమ్ లోకి వెళ్ళిపోయి జ్యోతితో జరిగిందంతా చెప్పింది అఖిల.

“అఖిలా, నా వయసు మీరి పోయింది ఇప్పుడేమి సంబంధాలు రావు. కనీసం నీకైన సంబంధం వచ్చింది. నీవైనా చేసుకో. నాకేమీ పెళ్లి చేసుకుని సంసారం చేయాలన్న కోరిక లేదు. ఇలాగే ఉంటాను” అన్నది జ్యోతి.

“తోడబుట్టిన వాళ్ళందరి లాగా నేను కూడా వెళ్ళిపోతే నిన్ను పలకరించే దిక్కే ఉండదు. అందుకే నేను కూడా నీలాగే ఉండిపోతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీకంటే ముందు నేను పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. ఇక దాని గురించేమి మాట్లాడకు. ఇద్దరము ఒకరికొకరం తోడుగా ఉండి పోదాం” అన్నది అఖిల.

జ్యోతి ఏమీ మాట్లాడలేక పోయింది. మూడు రోజుల తర్వాత ప్రవీణ్ “అఖిల వాళ్లకు నీవు చెప్పినట్లే చెప్పానమ్మా. వాళ్లు ‘మీ చిన్న చెల్లెల్ను మేము చూస్తాము. మాకు నచ్చితే ఎంగేజ్మెంట్ చేసుకొని, ఒక సంవత్సరం తర్వాతనే పెళ్లి చేద్దాం. ఈ లోపల మీ పెద్ద చెల్లెలికి సంబంధాలు వెతకండి’ అన్నారు” అని చెప్పాడు.

అఖిల “ఒకవేళ అక్కకి కుదరకపోతే నేను మాత్రం చేసుకోను అలాగైతేనే పెళ్లి చూపులకు కూర్చుంటాను” అని చెప్పి మరుసటి రోజున జరిగే పెళ్లి చూపులకు ఒప్పుకొంది.

మరుసటి రోజు అబ్బాయి మురళీ,తల్లి సరస్వతమ్మతో కలసి వచ్చి అఖిలను చూసి, నచ్చడంతో నెల రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజు కూడా అఖిల, జ్యోతి గురించి ఆలోచిస్తూ అన్యమనస్కంగానే ఉన్నది. పెండ్లి కొడుకు మురళి అందంగానే ఉండడంవల్ల, ఉద్యోగం కూడా మంచిదే అవ్వడం వల్ల వద్దనడానికి ఏమి కారణం కనిపించలేదు అఖిలకు.

ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజు నుండే మురళి అఖిలకు ఫోన్ చేసి, బయటకు రమ్మని అడగడము, తల్లిని తీసుకొని ముగ్గురు కలిసి షాపింగ్ కి వెళ్ళడము చేసేవాడు. ప్రవీణ్ కూడా ఒప్పుకోవడం తో వారం వారం ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లేవారు. సరస్వతమ్మ కూడ అఖిలతో చాలా క్లోజ్ గా ఉండి, ఎక్కడికి వెళ్ళినా అఖిలను తీసుకు వెళ్ళేది. బంధువులందరికీ “మా కోడలు”అని పరిచయం చేసేది. ఒక్కొక్కసారి జ్యోతి కూడా వెళ్ళేది.
కాబోయే అత్తగారు స్నేహితురాలు లాగా ఉంది. మురళి కూడా సరదాగా ఉండడంతో అఖిల లేట్ గా పెళ్లి అవుతున్నా, మంచి ఫ్యామిలీ దొరుకుతుందని ఎంతో సంతోషించింది.

అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. జ్యోతికే సంబంధం కుదరలేదు. సరస్వతమ్మ కొడుకు పెళ్ళికి తొందరపెట్టడం మొదలుపెట్టారు.ఇంకా ఆలస్యం చేస్తే కుదిరిన సంబంధం కూడ తప్పిపోతుందేమోనని ప్రవీణ్ చాలా సీరియస్ గా వెతికి చివరికి ఒక సంబంధం కుదిర్చాడు. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ముసలి వారైనారు. చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత ఉండడం వల్ల వాళ్ళకి చేసి, తనకు మంచి ఉద్యోగం వచ్చే వరకు ఆగవలసి వచ్చిందట.

అఖిలకు ఎలాగూ రెడీగా ఉన్న సంబంధం కనుక ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలో చేసేసాడు ప్రవీణ్.

అఖిలను వాళ్ళ అత్తగారు అపురూపంగా చూసుకుంటుంది. షాపింగ్ కి వెళ్ళినప్పుడు తనకి, కోడలికి ఇష్టమైనవన్నీ కొని పెడుతూ కూతురు లేని లోటు తీర్చుకునేది. అసలు వాళ్ళు అత్తకోడళ్ళలా గాక తల్లీకూతుళ్లలా ఉండేవారు. కొడుకును కూడా ఒక మాట అననిచ్చేది కాదు సరస్వతమ్మ.

అఖిల కూడా వాళ్లకు తగ్గట్టుగానే మెలిగేది. ఇంత మంచి మనుషుల మధ్యకు తనను పంపినందుకు భగవంతుడికి ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకునేది.

అలా సంవత్సరం గడిచింది అఖిల, మురళితో  తను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానని అడిగింది. మురళి వాళ్ళ ఆఫీసర్, మాటల మధ్యలో తమ ఆఫీసులో ఒక టెంపరరీ పోస్టు ఖాళీగా ఉన్నదని చెప్పాడు. దానికి తన భార్య చేత అప్లై చేయించడానికి, అవసరమైన సర్టిఫికెట్స్ తీసి చూసిన మురళీ,అఖిల తన కంటే రెండు నెలలు పెద్దదని తెలుసుకొని, ఏవో మట్లాడుతూ మాటల మధ్యలో తల్లితో చెప్పాడు.

ఆ రోజు తల్లి కొడుకులు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఆ రోజు నుండి అఖిలతో ఇద్దరూ మాట్లాడడం తగ్గించేశారు. వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో అర్థం కాక, భర్తని ఎంత అడిగినా తల్లిని అడగమని చెప్పాడే కానీ తను చెప్పలేదు.

రెండు రోజుల తర్వాత అత్తగారిని అడిగింది ఎందుకలా ఉంటున్నారో చెప్పమని. అప్పుడామె “నీవు మా అబ్బాయి కన్నా పెద్దదానివి. మీ అన్నయ్య వాళ్ళు మాకు, మా అబ్బాయి కంటే చిన్నదానివని అబద్ధం చెప్పి, పెళ్లి చేశారు. భార్య పెద్దదైతే భర్తకు మంచిది కాదు. కనుక నీకు ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. మీ ఇంటికి వెళ్ళిపో తొందరలోనే డైవర్సు పేపర్స్ పంపిస్తాము.”అని చెప్పింది.

అఖిలకి భూమి బద్దలై తను దాన్లో కూరుకు
పోతున్నట్టు అనిపించింది. తను చేయని తప్పుకీ ఎందుకీ శిక్ష అని ఎంతో సేపు ఏడ్చింది. అత్తగారితో ఏం మాట్లాడాలో తెలియట్లేదు.

చివరికి “అదేంటి అత్తయ్య నా తప్పేమైనా ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాను. మూడు సంవత్సరాల నుండి నన్ను చూస్తున్నారు కదా! నేను ఎలాంటి దానినో మీకు తెలుసు. నాకు కూడా మా అమ్మ లేని లోటు తీర్చారు. హఠాత్తుగా ఇలా చెప్తే నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికెళ్తాను. ఇంత ఆప్యాయత చూపించిన మీరు, ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది.” అన్నది అఖిల.

“మీ అన్నయ్య, మధ్యవర్తి కలసి నీ వయసు తక్కువ చేసి చెప్పారు. నాకు భర్త లేడు. ఈ విధంగా చేయడం వల్ల వరహీనం జరిగి మా అబ్బాయికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. ఇలా చెప్పవలసి రావడం నాకే చాలా బాధగా ఉంది. ఇప్పుడు కూడా మేము నీ సర్టిఫికెట్స్ చూడకుండా ఉంటే బావుండేది అని అనుకుంటున్నాము” అన్నది సరస్వతమ్మ.

“ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారా అత్తయ్యా. ఎంతమంది తమకంటే చిన్నవాళ్లని చేసుకోవట్లేదు. అంతెందుకు సచిన్ సంగతే తీసుకోండి. మీకు నేను చెప్పవలసిన దాన్నా. మీకు ఉన్న నాలెడ్జ్ కి నేను చెప్పవలసిన పని లేదు. ప్లీజ్ అత్తయ్య దయచేసి నన్ను మీకు దూరంగా పంపించకండి.” అని బ్రతిమిలాడుతూ ఏడ్చేసింది అఖిల.

“అఖిలా నీవంటే నాకు కోపం లేదు. నాకు కూతురు లేని లోటు తీర్చావు. నిన్ను దూరం చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నా కొడుకు క్షేమం కోరి నిన్ను వేడుకుంటున్నాను. ఎలాగైనా నా కొడుకు జీవితంలోంచి దూరంగా వెళ్ళు. నీకు వారం రోజులలో డైవర్స్ పేపర్స్ పంపిస్తాం. నీకు ఏమి లోటు రాకుండ ఏర్పాట్లు చేయిస్తాను. నీవు ఏం చేస్తావో నీ ఇష్టం” అని లోపలికి వెళ్ళిపోయింది

అఖిల భర్త దగ్గరికి వెళ్లి “ఏవండీ అత్తయ్య చెప్పేదంతా విన్నారు కదా! మీ నిర్ణయం కూడా అదేనా? నేను లేకుండా మీరు సంతోషంగా ఉండగలుగుతారా?  మీరు లేకుండ నేనయితే సంతోషంగా ఉండలేను. మీరు కూడా ఈ మూఢనమ్మకాలను నమ్ముతున్నారా? ప్లీజ్ నాకు పెళ్లి కాదని అనుకున్న టైంలో దేవుడి దయవల్ల మీ భార్యనయ్యాను. మీకు గాని మీ అమ్మకు గాని ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోష పెట్టాలని నిర్ణయించుకుని వచ్చాను. నా శాయ శక్తుల ప్రయత్నించి సఫలీకృతురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా జీవితం చూసుకుని నేనే మురిసిపోయే దాన్ని. కానీ ఇంత తొందరగా ఆ జీవితం నాకు దూరమయ్యి మళ్లీ మోడువారి పోతుందనుకోలేదు. అత్తయ్య గారిని ఎలాగయినా ఒప్పించండి. ప్లీజ్ మీరు లేకుండా నేను ఉండలేను” అని ఏడ్చేసింది అఖిల.

“నీవు నా దేహంలో ఒక భాగంలా అయిపోయావు అఖిలా. నిన్ను దూరం చేసుకోవడం అంత సులభం కాదు. నా కంటే ఎక్కువ మా అమ్మ నిన్ను ఇష్టపడింది. మనిషికి ఏదో ఒక లోపం ఉన్నట్టు, మూఢనమ్మకాలను పూర్తిగా నమ్మడమే మా అమ్మ లోపం. ఆమె మాట వినకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నదంటే, ఆమె నమ్మకం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకో.

నేను నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడే మా నాన్న పోతే తన జీవితమంతా నా సంతోషాలకు అంకితం చేసింది. అలాంటి అమ్మ చావు నైతే కోరుకో లేను కదా. నీవే చెప్పు నేనేం చేయాలి” అని, ఎంతో ఆవేదనగా “నన్ను క్షమించు” అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

ఇక చేసేదేమి లేక ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకోవాలి, అన్నా ధ్యాస కూడా లేకుండా, ప్రాణం లేని మనిషిలా వాళ్ల మూఢత్వానికి మూఢనమ్మకాలకు బలై మూడు సంవత్సరాల సాన్నిహిత్యాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకొని కడప దాటింది అఖిల.

అప్పుడే సరస్వతమ్మ అన్నయ్య మాధవరావు,వదిన లక్ష్మీ గేటు లోపలికొస్తూ కనిపించారు. వాళ్ళని చూసి గబగబా కళ్ళుతుడుచుకొని, ముఖంపై నవ్వును పులుము కొని రండి రండి బాబాయ్ గారు, పిన్ని గారు బాగున్నారా? అన్నది.

“ఏమ్మా అఖిల గుర్తుపట్టావా? నేను మీ అత్తయ్యగారి అన్నయ్యను. ఎక్కడికైన బయలుదేరుతున్నావా? అన్నారు మాధవయ్య గారు.

“అదేంటి బాబాయ్ గారు? మిమ్మల్ని గుర్తు పట్టక పోవడం ఏంటి? మా పెళ్లిలో హడావుడంతా మీదే కదా!” అని  “అవును బాబాయ్ మా అన్నయ వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దామని బయలుదేరాను” అన్నది.

“అదేంటమ్మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తే హుషారుగా వెళ్లాలి. అంత దిగులుగా వెళ్తున్నావేంటి? మీ ఆయనను, అత్తగారిని వదిలి వెళ్లలేక పోతున్నావా. పోనీ మేమున్న రెండురోజులు ఉండి పోతే మాకు చాలా సంతోషం తల్లి. ఏమనుకోకుండ మా కొరకు ఈ రెండు రోజులు నీ ప్రయాణాన్ని వాయిదా వేసుకో” అన్నారు మాధవయ్యగారు.

వెంటనే అఖిల అత్తగారు ఏమంటారోనని ఆమె వైపు చూసింది. “అవును అఖిలా, లేక లేక మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా! వాళ్ళు వెళ్ళాక వెళుదువు కానీలే. రా లోపలికి అంది.

“సరే అత్తయ్య” అని లోపలికి వచ్చేసింది అఖిల. రాత్రి భోజనాలు అయిన తర్వాత హాల్లో తీరికగా కబుర్లు చెప్పుకుంటు కూర్చున్నారు. మధ్యలో మాధవరావు భార్యతో ” కొంచెం మంచి కాఫీ ఇస్తావా లక్ష్మీ” అన్నారు.

“నేను తెస్తాను బాబాయ్ గారు” అని లేచింది అఖిల.

లక్ష్మీ “నీవు కూర్చోమ్మా” అని “ఇంత రాత్రి కాఫీ ఏంటండీ? ఆరోగ్యం పాడవుతుంది. కావాలంటే పాలు కలుపుకొస్తాను త్రాగండి.” అన్నది నవ్వుతూ.

“నీకు రోజురోజుకు నేనంటే గౌరవం లేకుండా పోతోంది ఎంతైనా నీకంటే చిన్నవాడినని చులకన.” అన్నారు నవ్వుతూ భార్యతో.

“అవును మరి నేను మీ కంటే రెండు సంవత్సరాలు పెద్ద. మీరే నా మాట వినాలి కానీ, నేను మీ మాట వినను. మీరే నాకు అన్ని చేసి పెట్టాలి. ఏదో ఇన్ని రోజులు భర్తగా గౌరవించాను. ఇక ఇప్పటి నుండి మీరే నేను చెప్పిన పనులు చేయాలి.” అన్నది సరదాగా నవ్వుతూ ఆయన భార్య లక్ష్మి.

అఖిల, మురళి, సరస్వతి కళ్ళు పెద్దవి చేసుకుని మాధవరావు గారి వైపు చూశారు.

సరస్వతమ్మ “ఏరా అన్నయ్య నిజంగా వదిన నీ కంటే  పెద్దదా?” అన్నది ఆశ్చర్యంగా.

“అవునే ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా తెలియదు. మాది లవ్ మ్యారేజ్ కదా! నాకంటే మీ వదిన రెండేళ్ళు పెద్దదంటే ‘వరహీన’మని పెళ్ళికి ఒప్పుకోరని అమ్మ వాళ్లకు చిన్నదని చెప్పి, పెళ్లి ఏ గొడవా లేకుండా చేసుకున్నాను. మా పెళ్లయ్యి నలబై సంవత్సరాలు అయింది. చక్కగా కాపురం చేసుకుంటున్నాం. అసలు వయసు అమ్మకు తెలిస్తే మాపెళ్ళి జరిగేదే కాదు.” అన్నారు మాధవరావు గట్టిగా నవ్వుతూ.

సరస్వతమ్మ ఏదో ఆలోచనలో పడిపోయారు మురళి ఎటో చూస్తూ కూర్చున్నాడు.

మాధవరావుగారు వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో “ఏరా మురళి మీ అమ్మకి ఒక మనవడినో, మనవరాలినో ఎప్పుడిస్తున్నావ్? పాపం నీ భార్య వచ్చినప్పటినుండి పని లేక బోర్ కొడుతుందని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది ఫోన్ లో” అన్నారు.

ఆ మాటలకు అందరి ముఖాలు ప్రసన్నంగా మారినాయి. “సరస్వతి మేము ప్రయాణం చేసి బాగా అలసిపోయాము వెళ్లి పడుకుంటాము.”  అని బెడ్ రూం లోకి వెళ్ళిపోయారు ఇద్దరు.

సరస్వతమ్మ లేచి అఖిల దగ్గరకొచ్చి ఆమె తలపై చేయి పెట్టి “అఖిలా మమ్మల్ని క్షమించు తల్లీ. తొందరపడి నీ కాపురం చెడకొట్టేదాన్ని. అనవసరంగా విడాకులు కూడా ఇవ్వమని బలవంతం చేశాను. ఈ రోజు మా అన్నయ్య వచ్చి నా కళ్ళు తెరిపించాడు. లేకపోతే మిమ్మల్ని విడదీసిన పాపం నాకు చుట్టుకునేది.” అన్నది ఎంతో బాధపడుతూ.

అఖిల తేలిక పడ్డ మనసుతో అలాగే కూర్చుండిపోయింది.

మరుసటి రోజు ఎవరూ లేనప్పుడు అఖిల మాధవయ్యగారి కాళ్ళపై పడి “మీ మేలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను బాబాయ్ గారు” అని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసింది.

“అంత మాట అనకు అఖిలా మీ అత్తయ్య నిన్ను వయసులో పెద్ద దానివని వెళ్ళిపోమని చెప్పేకంటె  ముందే, నాతో ఫోన్లో మాట్లాడింది.పొరబాటున ఫోన్ కట్ చేయకుండా అలాగే పెట్టింది. ఏవో మాటలు వినబడితే నాతోనే మాట్లాడుతుందేమొ అనుకుని వినడం మొదలుపెట్టాను. తర్వాత తెలిసింది తను నీతో మాట్లాడుతుందని. ఫోన్ అలాగె చెవి దగ్గర పెట్టుకున్నాను. అప్పుడే సరస్వతి నీవు మురళి కంటే పెద్దదానివని వాడిని వదలి దూరంగా వెళ్ళమని నీకు చెబుతున్నట్టు నాకర్థమైంది. వెంటనే ప్రయాణమై నేను లక్ష్మి నీ కాపురం ఎలాగైనా నిలబెట్టాలని వచ్చేసాం. మామూలుగా చెప్తే మీ అత్తయ్య నమ్మదని నాకంటే లక్ష్మీ రెండేళ్లు పెద్దదని రుజువు చూపితే కానీ నమ్మదని నాకు తోచిన విధంగా చేశాను. నా వల్ల మీ కాపురం నిలబడితే నాకు చాలా సంతోషంగా ఉంది.” అన్నారు.

అఖిలకు తన కాపురాన్ని నిలబెట్టిన మాధవరావు గారు, ఆయన భార్య లక్ష్మీ ‘సాక్షాత్ లక్ష్మీనారాయణు లే’ తన కాపురం నిలబెట్టడానికి వచ్చినట్టుగా అనిపించి, రెండు చేతులెత్తి నమస్కారం చేసింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!