అమృత ధార

(అంశం : మది దాటని ప్రేమ)

అమృత ధార

రచయిత :: తేలుకుంట్ల సునీత

మధుకృష్ణ కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి బతికేది.ఆశతో “వచ్చే యేడైన పంటలు పండక పోతాయా అప్పుల బాధ తీరక పోతుందా” … అని ప్రతీ సంవత్సరం ఎదురుచూస్తూ.. ఈ సంవత్సరం కూడా దేవునిపై భారం వేసి కాలం గడుపుతున్నారు మధుకృష్ణ తల్లిదండ్రులు.
చిన్నప్పటి నుండి గురువుల మెప్పు పొందుతూ చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తూ, స్వతహాగా బుద్దిమంతుడు ఐన మధుకృష్ణను తామెన్ని కష్టనష్టాలను ఓర్చుకునైనా చదివించాలని ధృఢ సంకల్పంతో ఉన్నారు. ఇంజినీరింగ్ కోర్స్ కోసం ఉన్న పొలం తాకట్టు పెట్టి మధుకృష్ణను పట్నం పంపుతూ బుద్ధిగా చదువుకొని మంచి కొలువుతో తిరిగి రావాలని చెప్పి తల్లిదండ్రులు రైల్ ఎక్కించారు.
చిన్నప్పటినుండి తల్లిదండ్రులను గమనిస్తున్న మధుకృష్ణ వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నిశ్చయించుకొని కాలేజీలో చేరాడు.
హాస్టల్ భోజనం పడక కాలేజీకి దగ్గర్లో ఒక రూమ్ తీసుకొని రోజు కాలేజీకి వెళ్ళి వస్తున్న సమయంలో తనకు జూనియర్ ఐన అమృత పరిచయం అయింది.
మాటల్లో చలాకితనం ఉండటంతో కలివిడిగా ఉంటూ, అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది అమృత.ఉదార స్వభావం గల తల్లిదండ్రులు, చిన్నప్పటినుండి నానమ్మ చెప్పే మానవతా విలువలతో కూడిన కథలు విన్న అమృత, ఎవరికి ఏ చిన్న సహాయం అయినా కల్మషం లేకుండా చేస్తుంది.
మధుకృష్ణ, అమృతలు ఇద్దరిలో ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ అభిరుచుల్లో సామీప్యత ఉండడం వల్ల తొందర్లోనే కష్టసుఖాలు పంచుకుంటూ స్వార్థం లేని మంచి స్నేహితులు అయ్యారు. మధు కృష్ణకు ఇంటి దగ్గర నుండి సమయానికి డబ్బులు అందక పోయేసరికి అమృత ఆర్థికంగా ఆదుకునేది. మధు కృష్ణ పరిచయం అయినప్పటి నుండి చదువులో కొంత వెనకబడి ఉన్న అమృత మధుకృష్ణ సాయంతో అర్థం కాని విషయాలు చెప్పించుకునేది.
చదువుపై ఆసక్తి కనబరుస్తున్న కూతుర్ని గమనిస్తూ, దీనంతటికీ కారణం గుణవంతుడైన మధు కృష్ణనే అని, అతని స్నేహం వల్ల అమృత భవిష్యత్తుపై ఎలాంటి దుష్పరిణామాలకు తావు లేదని నమ్మిన ధర్మారావు మధుకృష్ణను తన ఇంట్లోనే ఉంటూ అమృతకు స్టడీస్ లో హెల్ప్ చేయమన్నాడు.
ముందు మొహమాట పడినా మధుకృష్ణ తనను ఆర్థికంగా ఆదుకుంటున్న అమృత కోసం ధర్మారావు ఇంట్లోనే ఉన్నాడు. ఈ పరిణామంతో ధర్మారావు గారి కుటుంబం పై మరింత గౌరవం పెరిగి తనకు మంచి ఆశ్రయం కల్పించారని, ఎప్పుడు వారి గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లే పనులు చేయకూడదని నిశ్చయించుకున్నాడు.
అమృత ప్రియ మిత్రుడు మధు కృష్ణ తన ఇంట్లోనే ఉండడంతో చనువు పెంచుకుని… మనసులో ఆరాధిస్తూ తనకు తెలియకుండానే మధు కృష్ణను ప్రేమిస్తుంది. ఇది గమనించిన మధుకృష్ణ అమృత పై ఉన్న ఇష్టం, అభిమానంతో అమృతను వదులుకోలేనని, దానికి తన మనసు కూడా అంగీకరించదని మెల్ల మెల్లగా దూరంగా ఉండటం మొదలుపెట్టాడు.
ఒక రోజు అమృత తన మాట తండ్రి కాదనడని, దానికి మించి తన తండ్రి ధర్మారావు కు మధు కృష్ణ పైన సదభిప్రాయం ఉందని… మధు కృష్ణ తో “నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనం పెళ్లి చేసుకుందామని” తన మనసులోని మాటను చెబుతుంది.
తన మనసులో ఇష్టం ఉన్నప్పటికీ తనకు నీడనిచ్చి ఇంత సహాయం చేసిన కుటుంబ పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చి, ధర్మారావుగారు నాపై ఎంతో నమ్మకం పెట్టుకొని నన్ను చేరదీసినందుకు ద్రోహం చేయద్దు అని, తనను పెళ్లి చేసుకుంటే అంత సుఖపడదని, ధర్మారావు గారు తెచ్చే గొప్పింటి కుర్రాడితో అమృత సంతోషంగా ఉంటుందనీ, బాధను దిగమింగుకుని, “చూడు అమృత నువ్వన్నా నీ అభిప్రాయాలు అన్న నాకు ఎంతో ఇష్టం. నీతో స్నేహం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నాకు నీపై అలాంటి ఆలోచన లేదని మనం ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండి పోదామని” అమృత కోరికను మృధువుగా తిరస్కరిస్తాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మారావు గారు మధుకృష్ణను మనసులోనే మెచ్చుకుంటూ తన కూతురు సుఖం కోసం ప్రేమను త్యాగం చేసే గొప్ప స్నేహితుడు మధుకృష్ణ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళి పోయాడు.
కొద్దిరోజుల తర్వాత అమృతకు మంచి వరునితో వివాహం జరుగుతుంది.అమృత గుర్తుగా “అమృతధార” పేరిట మధు కృష్ణ తల్లిదండ్రులు పోగొట్టుకున్న భూమిని కొని, తన కూతురు పెళ్ళి కానుకగా మధుకృష్ణ తల్లిదండ్రులకు ఇస్తాడు ధర్మారావు.
మీ మేలు ఎప్పటికీ మర్చిపోము, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం… అంటూ మధుకృష్ణ తల్లిదండ్రులు ధర్మారావు గారికి చేతులు జోడించి నమస్కరిస్తారు.
ఇది మధుకృష్ణ “మనసు దాటని ప్రేమకు” నా చిరు కానుక.. అంటూ ధర్మారావు మధుకృష్ణను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.
మధుకృష్ణకు కూడా తల్లిదండ్రుల కష్టానికి, అమృత,ధర్మారావు గారి ఆర్థిక ఆదరణకు మరింత మన్ననలు పొందే తగిన ఉద్యోగం పొందాడు.

You May Also Like

3 thoughts on “అమృత ధార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!