మౌనమెంత హాయి కదా

(అంశం: మనసులు దాటని ప్రేమ)

మౌనమెంత హాయి కదా

రచయిత :: గుడిపూడి రాధికారాణి

మద్రాసొచ్చి మెరీనా బీచ్ కి వెళ్ళకుండా ఎలా?
పెళ్ళికి కొత్త ప్రదేశానికి వెళ్తే పెళ్ళి చూసి వెళ్ళిపోతామా ఏంటి? అక్కడి ఫేమస్ ప్లేసులు చూడాలి,పేరు పడ్డ స్వీట్లో బొమ్మలో మరోటో ఉంటే కొనాలి,ఊర్లో అమ్మలక్కలకి ప్రదర్శించాలి,పంచాలి. అబ్బో! అంత తతంగముంటేగాని పనైనట్టుండదబ్బా!
బందరెళ్ళి బందరు లడ్డూ తినకుండానూ కొండపల్లి వెళ్ళి తాటి కల్లుగీత బొమ్మ కొనకుండానూ వస్తామా ఏమిటీ? అలాగే మద్రాసు మెరీనా బీచీనూ..
“మరి పదండీ!”అంటూ ఆ సాయంత్రం మొగుడిని,పిల్లలని బయల్దేరదీసి ఇంకొందరు చుట్టాలు జత కడితే వాళ్ళనీ వెంటేసుకుని ఉత్సాహంగా బీచ్ కెళ్ళింది సుప్రియ.
సముద్రం అలలు చూడగానే పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుతుంటే లోతుకెళ్ళనివ్వకుండా మగవాళ్ళు వారిస్తూ వెంటే ఉన్నారు.
సుప్రియ మిగిలిన వారితో కలిసి పాదాలు మునిగేంత మాత్రం వెళ్ళి సముద్రుడికి పసుపు కుంకుమ జల్లి దండం పెట్టుకుంది.
ఒక నిమిషం కదలకుండా ఉంటే పాదాల కింద ఇసుకని అలలు జర్రున లాక్కెళ్ళిపోతున్నాయి దేవుడు మన బాల్యాన్నెత్తుకు పోయినట్లు.
తమాషాగా కొత్తగా అదే సమయంలో భయంగా ..భలే సరదా..యవ్వనం వచ్చినప్పటిలా..
జనం కేరింతలతో సాగర తీరం మోగిపోతోంది కెరటాల ఘోషను మించి.
కొందరేమో..ఈ సినిమా పాట ఇక్కడే తీశారు.నీకు గుర్తుందా? ఫలానా సినిమాలో ఇక్కడే ..అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు .
ముంత మషాళా,బజ్జీలు,ఐస్ క్రీములు,మొక్కజొన్నపొత్తులు,బొమ్మలు..ఒకటేమిటి? అమ్మేవాళ్ళు,కొనేవాళ్ళు,బేరమాడి వదిలేసేవాళ్ళు, బిచ్చగాళ్ళు,బెస్తవాళ్ళు..కోలాహలంగా ఉందంతా..
ఎటు చూసినా సందడి..సందడి..పిల్లల కేరింతలు,ప్రేమికుల తృళ్ళింతలు,కొత్త జంటల కవ్వింతల పులకింతలు,వృద్దుల బోసినవ్వులు..
సరదాగా ఉంది సుప్రియకి.అందునా తనుండేది మరీ పల్లెటూరేమో..వింతగా కొత్తగా చుట్టూ చూస్తోంది.
ఏవో చూపులు తనను గుచ్చుతున్నట్లు,ఎవరో కన్నార్పకుండా‌ చూస్తున్నట్లు అనీజీగా అనిపించి తల పక్కకు తిప్పింది.
గుండె పాసింజర్ ను చూసిన సిటీ బస్సులా సడన్ బ్రేక్ తో ఆగి పట్టాలపై మనిషున్నా ఆగలేని రైలులా వేగంగా కొట్టుకోసాగింది.
“తేజ!” ఆ పేరు కడలిహోరు కంటే జోరుగా గుండెలో కదలాడసాగింది.
‘ అతనా? అతనేనా? ఎంత మారిపోయాడు?’ నమ్మనంటోంది మనసు.
‘ అతనే.నేను చెప్తున్నాగా’ అంటున్నాయి కనులు.
అతని భావాలూ అవేనంటున్నాయి అతని కళ్ళు.
ఉద్యోగంలో ఏదో పెద్ద పొజిషనే అనుకుంటా.చాలా స్టైల్ గా ఉన్నాడు.ఖరీదైన బట్టలు,కూలింగ్ గ్లాసెస్., నోట్లో సిగరెట్.చుట్టూ ఫ్రెండ్స్ అనుకుంటా..అమ్మాయిలూ ఉన్నారు.సినిమాల్లో హీరోయిన్ల బట్టల్లా వంకర టింకర్లుగా పీలికలుగా భలే ఉన్నాయ్ వాళ్ళ బట్టలు.ఒక్కళ్ళూ తల్లో పువ్వుల మాటటుంచి జడేసుకున్న పాపాన పాలేదు.
కూలింగ్ గ్లాసెస్ నెత్తి మీదకు జరిపి రెండడుగులు ముందుకేశాడు తేజ.
సుప్రియ ఒకడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కేసి విప్పారిన కళ్ళతో అతడినే చూస్తుండిపోయింది.
రంగు తేలాడు.బుగ్గలొచ్చాయ్.కళ్ళకింద ఉబ్బులు తాగుడలవాటుందని చెప్పకనే చెప్తున్నాయ్.చేతిలో సిగరెట్ అయిపోగానే మరోటి ముట్టించాడు..చైన్ స్మోకర్ అన్నమాట.
” అమ్మా!నువ్వూ రా!భలే బాగుంది.” అంటూ వచ్చిన కూతుళ్ళిద్దరినీ వస్తున్నా.పదమని పంపించేసింది.
ఇంతలో భర్తే వస్తే ఇక తప్పదని మౌనంగా అలలవేపు కదిలి వెళ్ళింది.
వాళ్ళనే కాసేపలా చూస్తుండి పోయాడు తేజ.
అతని మనసులో ఎన్నో భావాలు,ఆలోచనలు.శరీరాన్ని వదిలేసి మనసు గతంలోకెళ్ళిపోయింది.
” ఒకటో తరగతి నుండి పదో తరగతి దాకా కలిసి చదువుకున్నారు తేజ,సుప్రియ.
ఒకరంటే ఒకరికి ఇష్టం.ఆ ఇష్టమే ఆమెని ఉమెన్స్ కాలేజీలో వద్దు నాన్నా! బాగా చెప్పరుట.కో ఎడ్యుకేషన్ లో చదువుతా” అని నాన్నని అడిగేలా చేసింది.
అదే ఇష్టంతో ఇంటర్ పూర్తయింది. ఇష్టం ప్రేమగా మారుతోందని ఇద్దరికీ తెలుస్తోంది.
కానీ మనసులు దాటని ప్రేమ అది.ఇంకా బయటపడనే లేదు.
ఇంటరయ్యాక ఇంజనీరింగ్ కోచింగ్ కోసం తేజ సిటీకెళ్ళటం, పరీక్షలు,అడ్మిషన్… రోజులు ఎంత గిర్రున తిరిగాయో తెలీదు. అంతే వేగంగా సుప్రియ పెళ్ళి జరిగిపోయింది.
ఇక పై చదువులు చెప్పించే తాహతు లేని ఆమె తండ్రి పెళ్ళి చేసి పంపించేశాడని మిత్రుల ద్వారా విన్న తేజ చాలా రోజులు బాధ పడ్డాడు.అటు సుప్రియ పరిస్థితీ అంతే. కానీ చేయగలిగిందేముంది కనుక.కాల చక్రం తిరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ కాసేపు అతిథుల్లానో అపరిచితుల్లానో కలిపింది.
” సుప్రియ” తేజ పెదవులు ఆశ్చర్యంగా ఉచ్చరించాయి ఆ పేరుని.
ఎంతలా మారిపోయింది? అంత పెద్ద పిల్లలు, పల్లెటూరి మొగుడు, ఆ చీర, పేద్ద బొట్టు,కొబ్బరినూనె దట్టంగా రాసి నున్నగా దువ్వి అల్లుకున్న జడ,నిండా గుళ్ళో అమ్మవారిలా కనకాంబరం పూలు..బాబోయ్
అతనికి తన భార్య గుర్తొచ్చింది. బాస్ కూతురు. మోడ్రన్ ,స్లిమ్ అండ్ గ్లామరస్ గాళ్.సరదాగా అడిగితే బాల్కనీలో కూర్చోబెట్టి మరీ పెగ్ ఫిక్స్ చేసిస్తుంది.
తన చేతిలోని సిగరెట్ చూడగానే ముడుచుకున్న సుప్రియ కళ్ళు గుర్తొచ్చాయి.
వామ్మో..మనసులో ప్రేమ బయట పెట్టి ఉంటే… నాకీ లైఫ్,ఈ ఆస్తి,ఎంజాయ్ మెంట్ ఏవీ ఉండేవి కాదు. ముద్దపప్పులా బతకాల్సొచ్చేది..
థాంక్ గాడ్!!” ఊపిరి పీల్చుకున్నాడు తేజ.

అదే సమయంలో ఆమెలోనూ మరెన్నో ఆలోచనలు..
” మాట వినే ముత్యాల్లాంటి బిడ్డలు. ఏ దురలవాట్లు లేని రైతు భర్త. తల్లిలాంటి చల్లని పల్లెలో పచ్చని కాపురం. ఆదరంగా పలికే ఇరుగుపొరుగు.
తేజతో నామనసులో ప్రేమ బయట పెట్టి ఉంటే ఈ తాగుబోతుతో ఇతని పద్దతిలో బతకాల్సొచ్చేది. సిటీ లైఫ్ నాల్రోజులుండడానికి బానే ఉంటుంది..పైన పటారం లోన లొటారమన్నట్లు.
రెస్టారెంట్ ఫోర్క్ తిళ్ళూ, ఆడా మగా తేడా లేకుండా హాయ్ బాయ్ అనుకుంటూ తిరగడాలు…బాబోయ్.. ఇంకా నయం..హమ్మయ్య ‘ ఊపిరి పేల్చుకుంది సుప్రియ భర్త చేయి పదిలంగా పట్టుకుంటూ.
మనసులు దాటని ప్రేమ మనసులు దాటకపోవడమే మంచిదనుకుంటున్న వారిని అంగీకరిస్తున్నట్లుగా ఒక చిన్న మబ్బు తునక నాలుగు అక్షతలను రాల్చి పోయింది.

***

 

You May Also Like

One thought on “మౌనమెంత హాయి కదా

  1. నిజమేనండీ…అప్పుడప్పుడూ మనసు మాట
    వినకపోవడం కూడా మంచిదే…!
    బాగుందండీ సందేశం👌👌💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!