అమ్మని మార్చిన పిల్లలు

అమ్మని మార్చిన పిల్లలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

హై పిల్లలూ రండర్రా అంటూ మనుమలని పిలిచింది సావిత్రమ్మ. హా బామ్మా హా హా అంటూ కేరింతలు కొడుతూ ఆవిడ మంచం చుట్టూ చేరారు పిల్లలు. బామ్మ గారు చెప్పే కథ వింటూ నిద్రలోకి జారుకుంటారు వీళ్ళు రోజూ.
పిల్లలూ ఈ రోజు మీకు అమ్మని మార్చిన పిల్లలు కాదు, పిడుగులు వాళ్ళు, ఆ కథ చెబుతాను వినండి
అనగనగా కొండాపురం అని ఒక ఊరు ఉండేది. ఊళ్ళో సింగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, కోడలు, ఇద్దరు మనుమలు ఉన్నారు. సింగన్న కి తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ.  కొడుకు అంటే పంచ ప్రాణాలు కూడా, అందుకే మేన కోడల్ని కోడలుగా తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళు బానే ఉండేది ఆ కోడలు. తరువాత ఏమైందో ఏమో సింగన్న ని జాగ్రత్తగా చూసేది కాదు. అది కొడుక్కి తెలిసి ఎన్ని సార్లు మందలించినా ఆమె మారలేదు.
ఇలా ఉండగా మనుమలు కూడా పెద్దవాళ్ళు అవడం వాళ్ళకి కూడా పాపం తాతని చూస్తే జాలి వేసేది. ఎలాగైనా అమ్మకి తెలిసి వచ్చేలా చేసి బుద్ది చెప్పాలి అనుకున్నారు. వాళ్ళ నాన్నకీ తాతకీ ఈ విషయం చెప్పి ఒక పథకం వేస్తారు. దాని ప్రకారం ఒకరోజు అర్ధరాత్రి లేచి అమ్మా అమ్మా అంటూ కేకలు వేస్తారు, భయంతో. ఏమైంది అంటూ ఉలిక్కిపడి లేస్తుంది ఆ కోడలు. పిల్లలు అమ్మా మాకు ఇక్కడ నానమ్మ కనిపించింది. ఏదీ ఏది అంటూ వణుకుతూ చెప్పారు. నానమ్మ లేదు ఏం లేదు పడుకోండి అంది. ఇంతలో ఓయ్ కోడలు పిల్లా ఏమిటే నన్ను లేను అంటావా, ఇప్పుడే నీ చిన్న కొడుకులో దూరతా, నీ తాట తీస్తా-అని వినిపించే సరికి ఈమె కూడా భయపడుతుంది. అయ్యో వద్దు అత్తమ్మా నీకేం కావాలి చెప్పు అంది. మీ మావయ్యకి సరిగ్గా తిండి పెట్టడం లేదు, చూడడం లేదూ, ఏం ఎలా ఉంది ఒళ్ళు అంది. అయ్యో అదేం లేదు రేపటి నుంచి చక్కగా చూసు కుంటా. నువ్వు వెళ్ళు, నా పిల్లల్ని ఏం  చెయ్యొద్దు, వాళ్ళు కూడా నీ మనుమలే కదా అంటుంది. సరే ఇప్పుడు వెళ్తున్నా కానీ ఇక్కడే తిరుగుతూ ఉంటా, ఏమైనా తేడా వచ్చిందా, ఈ సారి చెప్తా నీ సంగతి అని అత్తగారు వెళ్ళి పోతుంది.
హమ్మయ్య అనుకొని అప్పటికి పడుకుంటారు అందరూ. మరునాడు లేచాక షరా మామూలే. దెయ్యం లేదు అత్తగారు లేదు అనుకుంటుంది ఆ కోడలు. పిల్లలిద్దరూ ఇక లాభం లేదు, కొంచెం మోతాదు పెంచాలి అనుకుని, ఆ రోజు సాయంత్రమే చిన్నోడు ఒసేయ్ కోడలూ ఇలా రావే అని పిలుస్తాడు వాళ్ళ అమ్మని. ఏమిట్రా వెధవా! నేను నీకు కోడల్నా అంటూ చెయ్యెత్తి వస్తూ ఉంటుంది కోడలు. ఏమిటే కోడలు కాకపోతే నువ్వు నా అత్తవా, రా ఇటూ అంటూ అరుస్తాడు కొడుకు. అప్పుడు గుర్తు వస్తుంది ఆ ముందు రోజు రాత్రి జరిగింది. భయ పడుతూ దగ్గరికి వస్తుంది. అత్తగారి రూపంలో ఉన్న కొడుకు అమ్మ అదే కోడలు చెవి నులిమి నీకు ఏం చెప్పాను నువ్వు మారవా? ఇప్పుడు నా మనుమడు నీ, మీ మావ గారిని తీసుకుని నేను వెళ్లిపోతున్నా, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది. దానితో నా కొడుకు నీకు ఎందుకు, కావాలంటే మావ గార్ని తీసుకుపో అంటుంది మనసులో పీడా పోతుంది అనుకుంటూ. దానితో అత్తగారు అబ్బా ఆయన్ని తీసుకు వెళ్తే నువ్వు గొడవ ఉండదు అనుకుంటున్నావా, అదేం కుదరదు. నీ కొడుకు నీకు కావాలి, మావయ్య వద్దా! వీడ్ని కూడా తీసుకు పోతా, తగ్గేదే లే… అంటుంది. దానితో బుద్ది తెచ్చుకుని ఇంకెప్పుడూ అలా చెయ్యను ఇది ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వు, రేపటి నుంచి నువ్వే చూడు అని ప్రాధేయ పడుతుంది. సరే మరి, ఈ సారి తేడా వస్తే చెప్పేదే లే, ఇద్దర్నీ తీసుకుపోతా! జాగ్రత్త అని బుద్ది చెప్పి వెళ్లి పోతుంది. ఇక ఆ రోజు నుంచీ తన మావయ్య నీ జాగ్రత్తగా, మంచిగా చూసుకుంటూ కుటుంబం అంతా అన్యోన్యంగా ఉంటారు. హమ్మయ్య అమ్మకి బాగా బుద్ది వచ్చింది అని పిల్లలు, ఆపై ఆ తండ్రీ కొడుకులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
అదీ పిల్లలూ… దెయ్యం వేషం ఎంత మంచి పని చేసిందో చూసారా! కథ కంచికి మనం ఇంటికి.
అనే సరికి కాసేపు కేరింతలు కొట్టి పిల్లలూ, తరువాత మన సావిత్రమ్మ గారు హాయిగా నిద్ర లోకి జారుకున్నారు.

You May Also Like

8 thoughts on “అమ్మని మార్చిన పిల్లలు

  1. పిల్లలకి తగ్గట్టుగానే భలే మలిచారు కథని😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!