సమానత్వం

సమానత్వం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

సమవర్తికి సరిజోడైన నల్లని మేనిఛాయతో
ఊరి చివరి వెండికొండ నేలే పరమశివుడతను
కర్మబంధాల తనువును కర్మసాక్షి సాక్షిగా
పంచభూతాలకు అర్పణచేసే అగ్నిదేవుడతను
తరాలు మారి తలసరి ఆదాయాలు పెరుగుతున్నా
తలరాత ఇసుమంత మారని దౌర్భాగ్యుడతను
ఆశల, ఆశయాల ఎదను చితిగట్టుకు తాకట్టుపెట్టి
కోరికల జవనాశ్వాన్ని గెడకొయ్యకు కట్టి
కష్టసుఖాలకు జడవని స్థితప్రజ్ఞుడిలా
చతుర్విధ పురుషార్ధాలను వదలివేసిన
దిగంబర అవదూతలా చరిస్తున్నాడు
అతని మౌనం కాదు చేతగానితనం
సునామికి ముందు సముద్ర ప్రశాంతం
అతనిది అలసత్వం కాదు అమాయకత్వం
కుల, మతాల కతీతమైన మరుభూమికి
మహరాజై చరించే మచ్చలేని మనిషికి
సంతర్పణ వేళ సహపంక్తిలో చోటివ్వండి
సమానత్వానికి శుభమస్తు పలకండి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!