మలుపు

 మలుపు

రచన:: అలేఖ్య రవికాంతి

గత రెండు రోజులుగా తినడానికి తిండి లేక కాలిన కడుపుతో ఇంట్లోనే ఓ మూలన ముడుచుకుని పడుకుంది వర్ధనమ్మ. తన మాడే కడుపుకి కారణం తన పేదరికం. ఓ పూట నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాలంటే తన రెక్కలను కూలి పనులతో కష్టపెట్టాల్సిందే మరి. ఈ ముసలి వయసు రిత్యా మరియు సరైన తిండి లేక శరీరంలోని సత్తువ తగ్గింది. ఆరోగ్యం కాస్త అటు ఇటుగా పూర్తిగా క్షీణించింది. ఒంట్లో నలత వలన గత వారం రోజుల నుంచి కూలి పనికి పోకపోయేసరికి కాస్త ఏదైనా వండుకుని తిందామని చూస్తే ఇంట్లో సరుకులు మొత్తం నిండుకున్నాయి..

దేవుడా, ఎందుకయ్య నాలాంటి అందరు ఉన్న ఒంటరి ఏకాకిని ఇంకా బతికిస్తున్నావు..? తొందరగా నీ దగ్గరకు తీసుకుపో అనుకుంటు ఆకలితో అలమటిస్తున్న తన కడుపుకు కాసిన్ని నీళ్ళు పోసి భగభగ మండే క్షుద్భాదని నీటితో ఓ నిమిషం చల్లార్చింది.

‘ఇంతలో, దబ్బ్ దబ్బ్ మని’ …, తలుపు చప్పుడయ్యేసరికి ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని మెల్లగా లేచి తలుపు తెరిచింది.

‘ఎమమ్మా…, మనిషన్నాక కాస్త సిగ్గుండాలి.ఇళ్ళు అద్దెకట్టి ఇప్పటికి మూన్నెళ్ళవుతుంది. ఇంకా ఎప్పుడు కడతావు’ …? అంటు వర్ధనమ్మ పై విరుచుకుపడ్డాడు ఇంటి యజమాని గిరీశం…

అయ్యో.! నన్ను క్షమించండి గిరీశం గారు. ఈ మధ్య నా ఒంట్లో బాగోక పనికి సరిగ్గా వెళ్ళడం లేదండి అందుకే ఇంత ఆలస్యం. నన్ను మన్నించండి. మీరు పెద్ద మనసు చేసుకుని దయచేసి ఇంకో వారం రోజులు గడువివ్వండి. ఏదో విధంగా డబ్బు సర్దుబాటు చేసి మీ అద్దె చెల్లిస్తాను అని ధీనంగా వేడుకుంది.

చాల్లేవమ్మా, ఇంకా నిన్ను నమ్మీ మోసపోవడానికి నేనేమన్నా వెర్రివెధవనా…!. తినడానికి తిండి లేక ఓ మూలన పడున్నావు.. ఒంట్లో సత్తువ ఏ మాత్రం లేదు.
ఈ వయసులో నీకెవ్వరు పనివ్వరు. అందుకే చెబుతున్న.., నువ్వు ఈ మూనెళ్ళ అద్దె కూడా కట్టకర్లేదు నా కొంప కాలి చేస్తే చాలు తల్లి అని అన్నాడు చేతులు జోడిస్తూ.

తను ఇంకేం చెప్పిన వినే స్థితిలో గిరీశం లేడని అర్థంమయింది వర్ధనమ్మకు….
ఇక చేసేది ఏమీ లేక మెల్లగా ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఓ ముల్లలో నాలుగు చీరలు, కావలసిన వస్తువులు కొన్ని పెట్టుకుని మిగితావి తూకానికి తీసుకుపోయి అమ్మేసింది…

చేతిలో పాత సామాన్లు కొనే తూకమోడు పెట్టిన కొంత రొక్కాన్ని చూస్తూ.., ‘ఇప్పుడు ఈ వచ్చిన డబ్బే నాకు దిక్కు.. కాస్త ఆరోగ్యం కుదుటపడే వరకు ఏదో విధంగా కొన్ని రోజులు ఈ డబ్బులతోనే కాలం వెళ్లదీయాలి’ అని మెల్లగా నడుస్తూ ఓ గుడి ముందు ఆగింది.

అబ్బా.., బాగా ఆకలిగా ఉంది. గుళ్ళో ఈ సమయానికి అన్నప్రసాద వితరణ చేస్తారుగా…, కాస్త ఎంగిలి పడి ఆ తరువాత ఎటుపోవాలో ఆలోచిద్దాం అని గుళ్ళోకి వెళ్లి అన్నప్రసాదం తెచ్చుకుని ఓ మూలన కూర్చుని కళ్ళకు అద్దుకుని తృప్తిగా ఎంగిలిపడింది వర్ధనమ్మ.

గుళ్ళో తిన్న ప్రసాదం,గుడి ముందు కుళాయిలో తాగిన మంచినీళ్ళతో ఆ పూట కడుపు నింపుకుంది గత రెండు రోజులుగా తిండిలేని వర్ధనమ్మ.

అక్కడే కూర్చున్న మురళీ దృష్టి వర్థనమ్మ పై పడింది..
‘ఈమెని ఎక్కడో చూసానే’ అని తనని తీక్షణంగాా గమనించసాగాడు.

అక్కడక్కడా ఇంకా తెల్లబడని, తైలసంస్కారం లేని రేగిన జుట్టు. ఉతికిన చీరైనా, ఉట్టినీళ్ళతో ఉతకడంతో,పూర్తిగా మురికి వదలని, నలిగి ముడతలు పడిన ముతకచీర. ఎముకల గూడులాంటి శరీరం అయినా…మాసిన బంగారం లాంటి ముఖవర్చశ్శు. ఆమెను పరిశీలినగా చూస్తే ఒకప్పుడు బాగా బతికిన మనిషనిపిస్తుందే.., అనుకుంటూ ఆలోచించసాగాడు. కాసేపటికి ఆమె ఎవరో మురళికి గుర్తొచ్చింది! ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె వద్దకు వెళ్లి వర్ధనమ్మ ఎలా ఉన్నావు..? అని అడిగాడు..

ఆ పిలుపు వినిపించేసరికి మెల్లగా కళ్ళు తెరిచింది వర్ధనమ్మ …

ఎదురుగా ఓ పెద్ద మనిషి నిలుచున్నాడు…

“ఎవరయ్యా మీరు…! మీకు నేను ముందే తెలుసా?” అని అయోమయంగా అడిగింది..

నా పేరు మురళి, వర్ధనమ్మ…!
కొన్ని సంవత్సరాల ముందు మా ఇంట్లో పనిచేసావు.. తరువాత మేము వేరే చోటికి మకాం మార్చాము. అదిగో ఆ తరువాత మళ్లీ ఈ రోజుకి కనిపించావు. అవును ఇంత నీరసంగా ఉన్నావు… ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు…

మురళీ బాబు మీరా?..బాగున్నారా!…ఇంట్లో అందరు కులాసానా!? అంది.

అందరు బాగున్నారు. ఇంతకి నువ్వేంటి ఇలా ఎముకల గూడుల అయిపోయావు. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు అని అడిగాడు.

ఏమి చెప్పమంటావు బాబు.., ఒంట్లో ఇసుమెత్తు సత్తువ లేక , తినడానికి సరైన తిండి లేక, తల దాచుకోనీకి నిలువ నీడలేక.., ఇదిగో ఇలా ఈ గుళ్ళో తలదాచుకుంటున్నాను అంది చెమర్చే కళ్ళని తుడుచుకుంటూ..

అదేంటి నీ కుటుంబ సభ్యులు ఈ పరిస్థితికి నిన్ను వదిలేసారేంటి? ఇంట్లో ఏమన్న సమస్యలా? నీకు అభ్యంతరం లేదంటే నేనొచ్చి మాట్లాడుతాను పద అన్నాడు మురళీ …

నీకు తెలియని ఓ విషయం చెప్పాలి బాబు…!
మీ ఇంట్లో పనికి కుదిరేప్పుడు మాది నిరుపేద కుటుంబమని, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పానుగా అదంతా ఒట్టి అబద్దం బాబు…!

నా జీవితం ఊహించని విధంగా ఎన్నో మలుపులు తిరిగింది బాబు. నేను మొదటి నుంచి అభాగ్యురాలినే. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయాను. అనాథగా అనాథాశ్రమంలో నాబోటి అనాథల మధ్యలో పెరిగా. పదో తరగతి వరకు చదివి ఆ తర్వాత ఎదో పనిచేసుకుంటూ నా అనే వారి ఆదరణ లేక రోజులను భారంగా గడిపేదాన్ని..

అదిగో అప్పుడే నా భర్త రూపంలో అదృష్టం నన్ను వరించింది. మా వారు నన్ను తొలిచూపులోనే నేను పనిచేసే చోటున చూసి ఇష్టపడి పెద్దలను ఒప్పించి, ఎదురించి మరి నన్ను పెళ్ళాడాడు.

అత్తింటి వారు గొప్పింటి వారైన వారి మనసులు చాలా ఇరుకు. ఈ అనాథ కోడలు నచ్చలేదు కాని కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయారు..

మా వారు చాలా మంచి వ్యక్తి. ఆపదల్లో ఉన్న వారికి తన వంతు సహయం చేసేవాడు. నేనంటే ఆయనికి ప్రాణం.నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు.

చిరకా గోరింకల్లా, అన్యోయంగా ఉండేవాళ్ళం. కాలం ఇట్టే గిర్రున తిరిగిపోతుంది. మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు.. బాబు సుందర్,పాప కుందన..! నా ఆనందాల క్షణాలు ఏ చీకు చింతా లేకుండా ఇలా భర్త, పిల్లలతో సంతోషంగా గడిచిపోతుందని మురిసిపోయాను.

ఆ సంతోషం చూసి నా అదృష్టానికి విసుగొచ్చిందో.., లేక దూరదృష్టానికి కన్నుకుట్టిందో కానీ నా జీవితం ఓ చిన్న పొరపాటు వలన అతలాకుతలం అయ్యింది.

అప్పుడు, నాకు కొన్ని రోజులుగా ఆరోగ్యంలో ఏదో మార్పు కనిపించింది. పైకి బాగానే ఉన్నా లోలోన కృంగదీసే ఏదో నలతలా ఉండేది. మా వారికి నా నలత గురించి చెబితే కంగారుపడతారని నేనొంటరిగానే హాస్పిటల్ కి వెళ్ళాను.
‘అదిగో…, నా జీవితం అనుకోని మలుపు తీసుకుంది అప్పటి నుంచి’ …

డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసాక నాకు క్యాన్సర్ అని,చాలా ముదిరిపోయిందని..,ఇక ఎక్కువ కాలం బతకనని తేల్చి చెప్పారు. ఆ కాలంలో మందులు కూడా అంతంతమాత్రమే కదా ఆ మాయ రోగానికి…

అప్పుడు నాకు నా పై కన్నా నా కుటుంబాన్ని తలుచుకుంటేనే భయమేసింది. ఈ శరీరన్ని కుంగదీసే క్యాన్సర్ బాధకంటే నేను చనిపోయాక నా భర్త, పిల్లల పరిస్థితి ఏమవుతుంది, వారు ఈ విషయాన్ని ఎంతవరకూ జీర్ణించుకోగలరు అని తలుచుకుని భయపడ్డాను.

నన్ను క్షణం కూడా విడుచుండని నా భర్త జీవితం నాతోనే అంతం అవ్వడం నాకు ఎందుకో నచ్చలేదు.
నా పిల్లలు తల్లిలేని వారవ్వడం నాకు సహించలేదు. అందులోను ఆడపిల్లకు ఓ వయస్సొచ్చాక తల్లి అవసరం ఎంతగా ఉంటుందో నాకు బాగా తెలుసు.
అప్పూడే నిర్ణయించుకున్నా నా రోగం గురించి దాచాలని.ఇట్టే కొన్ని రోజులు గడిచిపోయాయి.

నా శరీరంలో నెమ్మదిగా మార్పులు పైకి కనిపిస్తున్నాయి. నా శరీరమంతా భరించలేని నొప్పులు, ఎన్నెన్నో మార్పులు రావడం మొదలయ్యాయి…

ఇంకా ఎన్ని రోజులు దాచగలను..! మహ అంటే ఇంకొన్ని నెలలో, రోజులో అంతే. రోగాన్ని దాచిన లక్షణాలు దాచలేనుగా. నా శరీరాన్ని చూస్తే అందరికి అనుమానమొస్తుందని అప్పుడే ఓ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను బాబు.

కొన్ని రోజులు ఇంట్లో ఎవరితో సరిగ్గా మాట్టాడకపోవడం,చిన్న విషయానికి ఎంతో రాదాంతం చేయడం చేసేదానిని. పిల్లల ఆలనపాలన చూడడం పూర్తిగా మానేసాను. మా వారు నాతో ప్రేమగా మాట్లాడుదామని వస్తే ఎదో కారణంతో పెద్ద గొడవచేసి ఆయనను దూరం పెట్టేదాన్ని.

కొన్ని రోజులకు వారికి నాలోని ప్రవర్తన పై చిరాకు వచ్చింది. అత్తింటివారు ఈ వంకతో మా వారికి ఇంకో పెళ్లిచేసుకుని సుఖపడమని ఒత్తిడి తెచ్చారు. నాకు కూడా కావలసింది అదే కదా.

మా వారు మాత్రం నా పై గల ప్రేమతో నాలో మార్పు వస్తుందని తిరిగి అంతా సంతోషంగా ఉంటామనే ఆశతో పాపం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసారు. నేను మానసికంగా బాధపడుతున్నాను అనుకొని డాక్టర్లకు చూపించే ప్రయత్నం చాలాసార్లు చేసారు కానీ నేను వెళ్ళలేదు. నాకు తెలుసు కదా నా రోగానికి మందు అప్పట్లో లేదని.

ఆయన ప్రేమ బలం ముందు నేను ఓడిపోతున్నాను అనిపించింది మరి.., అంతగా ఓపిక పడుతున్నారు నాలో ఏనాటికైనా మార్పు వస్తుందని ఆశతో.

నా పై ప్రేమ ఉన్నంత వరకు ఆయనలో ఎలాంటి మార్పు రాదని నాకు అర్థంమైంది. నా పై గల ప్రేమ పూర్తిగా తుడుచుకుపోతేనే నన్ను మరచి కొత్త జీవితం ఆరంభిస్తారని అనుకుని ఓ నిర్ణయం తీసుకున్నా…

“నాకు ఎందుకో మీతో జీవితం నచ్చడం లేదు…ఈ పిల్లలు, కుటుంబ బాధరబంధి నాకు ఎందుకో భారంగా అనిపిస్తుంది.. కారణం తెలియదు..నేను ఎప్పటిలాగే ఒంటరిగా బతకాలని అనుకుంటున్నాను. ఇల్లాలి పదవి నాకు అవసరం లేదు….పిల్లలను మీరే చూసుకోండి.నా మనసు మారితే నాకు నచ్చిన విధంగా నచ్చిన వ్యక్తితో జీవితం మరల మొదలెడతాను… ఇంటికి మాత్రం తిరిగి రాను.. నా కోసం దయచేసి వెతకవద్దు ” అని ఉత్తరం రాసి కడసారి కళ్ళనిండా భర్త, పిల్లల రూపం, వారితో నేను గడిపిన మధురమైన కాలం అంతా హ్రదయంలో దాచుకుని ఆ ఇంట్లో నుండి వెళ్లిపోయి ఏదో మారుమూల గ్రామంలో చావుకోసం ఎదురు చూస్తూ ముప్పై సంవత్సరాలుగా కాలం ఈడ్చుకొస్తున్నా అంది కళ్ళని తుడుచుకుంటు.

మురళీ జరిగింది విన్నాక బాధపడుతూ… కాని క్యాన్సర్ వస్తే ఇన్ని సంవత్సరాలు ఎలా బతకగలిగావు? అన్నాడు అయోమయంగా…

‘అదే బాబు నా దురదృష్టం’… ,అనుకోకుండా ఓ రోజు క్యాన్సర్ హెల్త్ క్యాంప్ మా ఊరిలో పెడితే నేను వెళ్ళి పరీక్షలు చేయించుకున్న….

“అదీగో.., మళ్లీ అనుకోని మలుపు” ..!

నాకున్నది క్యాన్సర్ కాదు, వేరే ఏదో ఎముకలకు సంబంధించిన రోగమని తెలిసింది.
ప్రాణంపోయే రోగం కాకుంటే ఏంటి, ప్రాణంగా ప్రేమించే కుంటుంబానికి దూరమయ్యాక.., అంది ఏడుస్తూ…

అయ్యో..!, మరి నీకు క్యాన్సర్ లేదని తెలిసాక నీ భర్త దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పి కుటుంబంతో సంతోషంగా ఉండవలసింది అన్నాడు మురళి బాధగా…

” చూడు బాబు..,నేనే ఉత్తరం రాసి వెళ్లిపోయి తిరిగి వెనక్కి వెళితే అందరు నన్ను నాటకం ఆడుతుంది…, ఎవడితోనే పారిపోయింది… వాడు వదిలేసాడు అందుకే తిరిగొచ్చిందనే అనుకుంటారు తప్పితే నేను చెప్పిన నిజాన్ని ఎవరూ నమ్మరు..! ఎందుకంటే పరిస్థితులు అలాంటివి” .

ఇప్పుడు నేను లేకుండా నా కుటుంబం అలవాటు పడి ఉంటుంది. నా పై గల ప్రేమ మొత్తం కోపంగా మారిపోతుంది. ఎప్పటికీ వారిని అలాగే ఉండనివ్వాలి.. నేను తిరిగెళ్ళి అందరి మనసులు పాడు చేయడం అవసరమా, చెప్పు బాబు..!

దేవుడు రాసిన రాతను ఎవ్వరూ మార్చలేరు. ఇది నిజం. ఈ నిజానికి నేను కట్టుబడి ఉండాలి. ఇక ఈ జీవితం పై నాకు ఎటువంటి ఆశ లేదు. ఎక్కడున్న నా కుటుంబం సంతోషంగా ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఈ మిగిలిన శేష జీవితం వారి జ్ఞాపకాలతో వెల్లబుచ్చుతా అంది తన ఎండిన చెక్కిళ్ల పై కారే కన్నీటిని పైట కొంగుతో తుడుచుకుంటూ.

వర్థనమ్మ కథ అంతా విన్నా మురళీ బాధపడుతూ..,
చూడు వర్థనమ్మ నీ గతాన్ని మార్చి నీ జీవితంలో కొత్త మలుపు తేలేను కాని నీకో నీడని మాత్రం నేను ఏర్పాటు చేయగలను.
నాకు తెలిసిన ఓ పెద్దాయన నీలాంటి అభాగ్యుల కోసం ఓ సత్రం నడుపుతున్నాడు. నీకు ఇష్టమైతే నీ శేష జీవితాన్ని అక్కడ నీతోటి వారితో గడపొచ్చు అని ఆశ్రమం అడ్రస్ ఇచ్చాడు మురళి..

నిరాశతో నిండిన వర్థనమ్మ ముఖంలో ఆనందపు ఛాయలు కనబడుతున్నాయి. మురళీ ఇచ్చిన అడ్రస్ కాగితం పట్టుకుని కనీసం దేవుడు ఈ విధంగానైన నా పై దయతలిచాడు… ఆపదల్లో ఆదుకున్నావు…., సల్లంగా ఉండు బాబు అంటూ కృతజ్ఞతలు తెలుపుకుని మెల్లగా లేచింది.

చంకలో చిన్న గుడ్డల మూటా, చుట్ట చుట్టిన చిన్న చింకి చాపతో ఊరి చివర పాడుబడిన సత్రం వైపు బయలుదేరింది నెమ్మదిగా. అక్కడ బైరాగులు, ఆమె వంటి అభాగ్యులు తలదాచుకుంటారు.
వంగి, కర్ర సాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తున్న ఆమెకు ఎప్పటిలా తనవారంతా గుర్తుకు వచ్చారు కానీ చేసేదేమిలేక అలా తన పయనాన్ని కొనసాగిస్తుంది…

వర్థనమ్మని అలాగే చూస్తూ, మురళి తనలో తాను ఇలా అనుకున్నాడు..!
ఎంత దురదృష్టం తనది !?
తనవారందరినీ…తన ఆనందానంతా కోల్పోయింది..తన జీవితం పాపం ఎన్ని మలుపులు తిరిగింది..
ఎండి ముడతలు పడిన కళ్ళల్లో ఇంకా ఆవిరవని తడి కనిపిస్తూనే ఉంది…
ఇకనైన తన జీవితంలోకి ఎలాంటి విషాధ మలుపులు రాకూడదు అని దేవునికి దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు…

**కథ సమాప్తం**

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!