నీడ

(అంశం:: “అర్థం అపార్థం”)

నీడ

రచన:: కమల ముక్కు (కమల’శ్రీ’)

ఆఫీస్ లో పనంతా పూర్తి చేసి వాచ్ చూసుకుంది కార్తీక.ఆరు దాటింది.

“అయ్యో! పనిలో పడి సమయం ఎంత అయ్యిందో చూసుకోలేదు.” అనుకుంటూ బయటకు వచ్చి చుట్టూ చూసింది అందరూ ఆపాటికే వెళ్లిపోవడం తో ఎవరి వెహికల్స్ లేవు. తమ ఆఫీస్ సిటీ కి అవుట్ స్కర్ట్స్ లో ఉండటం తో ఆ దారిన వెహికల్స్ కూడా తక్కువ. ఎప్పుడూ తన స్కూటీ లోనే వెళ్ళేది ఆఫీస్. కానీ ఉదయం బయలుదేరి స్కూటీ చూసుకునే సరికి అది పంక్చర్ అయ్యి ఉంది. దానికి పంక్చర్ వేసే సమయం కూడా లేకపోవడం తో ఆ రూట్ లో వెళ్లే బస్ ఎక్కి ఆఫీస్ కి వెళ్లింది.

ఇప్పుడు స్కూటీ కూడా లేదు. పోనీ క్యాబ్ ఏదైనా ఉందేమో అని చెక్ చేసింది.కానీ ఏ క్యాబ్ లూ లేకపోవడం తో ఉసూరు మని అనుకుంటూ ఆటో ఏదో దొరుకుంటుందేమో అనుకుంటూ బస్టాప్ వరకూ వెళ్లి వెయిట్ చేస్తుంది. సమయం గడుస్తున్నా కూడా ఒక్క ఆటో కూడా రావడం లేదు. నిల్చుని నిల్చుని కాళ్లు నొప్పి పెడుతున్నాయి. శీతాకాలం కావడం తో త్వరగా చీకట్లు ముసురుకున్నాయి. ఆటో లో వెళ్ళినా కూడా ఆటో తమ ఇంటి వరకూ వెళ్లదు. రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్లాలి.

కాసేపటికి ఓ ఆటో వస్తూ కనపడింది. “హమ్మయ్యా! ఓ ఆటో వస్తుంది.”అనుకుంటూ చేయి ఊపింది.ఆ ఆటో వాడు ఆమె ముందుకు వచ్చి ఆపాడు. తన అడ్రెస్ చెప్పి కూర్చుంది. అప్పటికే ఆ ఆటోలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతన్ని ఓసారి చూసింది రమారమీ అతని వయసు అరవై, అరవై ఐదేళ్ళ వయసు ఉంటుంది.

తర్వాత తన ఫోన్ లో పాటలు వేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినడం మొదలుపెట్టింది. పాటలు వింటూ ఓసారి ఎందుకో సైడ్ మిర్రర్ వైపు చూసింది. తన పక్కన కూర్చున్న వ్యక్తి తనవైపే తదేకం గా చూస్తూ ఉండటం గమనించి “ఈయనేంటీ నన్నే చూస్తున్నాడు. చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది.త్వరగా స్టాప్ వచ్చేస్తే బాగుండు.” అనుకుంది మనసులో.

కాసేపటికి ఆటో ఓ చోట ఆగింది. “హే ముసలాయనా నువ్వు దిగాల్సిన ప్లేస్ వచ్చింది దిగు” అన్నాడు ఆటో డ్రైవర్.

“లేదు బాబూ ఇక్కడ కాదు కాస్త ముందుకి.” అన్నాడతను.

“అదేంటీ ఎక్కేటప్పుడు ఇదే అడ్రెస్ చెప్పావు కదా.” అన్నాడు ఆటో డ్రైవర్ కోపం గా.

“కాదు బాబూ నేను వేరే అడ్రెస్ చెప్పాను. మీరు ఇది అనుకున్నారేమో. త్వరగా వెళ్లు బాబూ . నాకు ఇప్పటికే ఆలస్యం అయ్యింది.” అన్నాడు ఆ వ్యక్తి.

“ఏం మనిషి రా బాబూ ఎక్కేటప్పుడు ఓ అడ్రెస్ చెప్పాడు ఇప్పుడేమో కాదూ అంటున్నాడు.” అనుకుంటూ బండిని స్టార్ట్ చేశాడు ఆటో డ్రైవర్. ఆటో ముందుకు పోతుంటే కీర్తన లో ఎందుకో ఏదో తెలియని భయం మొదలైయ్యింది.

“ఇదేంటి ఈయన ఈ అడ్రెస్ చెప్పి కాదంటున్నాడా. ఆటో ఎక్కినప్పటి నుంచి నన్ను వింతగా చూస్తున్నాడు. ఇప్పుడేమో తను దిగాల్సిన అడ్రెస్ లో దిగకుండా వేరే అడ్రెస్ అని చెప్తున్నాడు. చూస్తుంటే ఇతని ప్రవర్తన వింతగా ఉందే. దేవుడా నేను దిగాల్సిన స్టేజ్ త్వరగా వస్తే బాగుండు.” అనుకుంది మనసులో.

కాసేపటికి తను దిగాల్సిన ప్లేస్ రావడం తో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి వడి వడి గా నడుచుకుంటూ వెళ్తున్న కీర్తనకి తన వెనుక ఏదో అలికిడిగా అనిపించి వెనక్కి తిరిగి చూసింది.తనతో పాటూ ఆటో ఎక్కిన వ్యక్తి.

“ఈయనేంటీ నా వెనుకే వస్తున్నాడు.” అనుకుంటూ తన ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి “నాన్నా! వస్తుంటే ఎవరో ఓ వ్యక్తి నా వెనుకే నీడలా ఫాలో అవుతున్నాడు నాకెందుకో భయం గా ఉంది.” అంది.

“నీకేం భయం లేదు కీర్తనా నేనూ అన్నయ్యా ఎదురుగా వస్తాము. నువ్వు ఫోన్ ఆఫ్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు.” అంటూ కొడుకు కిషోర్ తో పాటుగా బయలుదేరాడు కీర్తన తండ్రి రాఘవయ్య.

కీర్తన ఫోన్ ఆఫ్ చేయకుండా తండ్రి తో మాట్లాడుతూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడుస్తుంది. ఆ వ్యక్తి వడివడిగా నడుస్తూ కీర్తనా నే ఫాలో అవుతున్నాడు. కాసేపటికి రాఘవయ్య వాళ్లు దూరం గా కనపడేసరికి “హమ్మయ్యా!” అనుకుంటూ పరుగున తండ్రి దగ్గరికి వెళ్లి చుట్టుకుంది కీర్తన. అప్పటికి కానీ ఆమె గుండె దడ తగ్గలేదు.

“నేనూ వచ్చేశాను కదా నీకేం భయం లేదు లేరా.” అంటూ ఆమెని అనునయిస్తూ “అతను నీ వెనుకే వస్తున్నాడు అన్నావుగా ఏడీ!?.”అంటూ చుట్టూ చూశాడు.

“అదిగో వస్తున్నాడు”అంటూ చేయి చూపించింది కీర్తన.

అప్పుడే వీధి మలుపు తిరుగుతున్న అతన్ని చూడగానే “అంకుల్ మీరా…?!” అన్నాడు కిషోర్ ఆశ్చర్యం గా.

“కిషోర్ నువ్వా. ఎలా ఉన్నావు. ఈ మధ్య ఇంటికి రావడం లేదేం.” అన్నాడా వ్యక్తి.

“ఈయనెవరో నీకు తెలుసా కిషోర్?.” అన్నాడు రాఘవయ్య .

“మా ఫ్రెండ్ మహేశ్ తెలుసు కదా నాన్నా. వాళ్ల నాన్నగారు.” అన్నాడు కిషోర్.

“కానీ ఆయనేంటి ఇలా…?!” రాఘవయ్య లో సందేహం.

“అందంతా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం నాన్నా.” అనడం తో ఇంటివైపు సాగిపోయారు అందరూ మహేశ్ తండ్రి తో పాటుగా.

ఇంటికి చేరుకున్నాక మహేశ్ తండ్రి రఘుపతికి టీ ఇచ్చింది కీర్తన. ఆయన ఆ టీ తాగి కాసేపు కిషోర్ తో పిచ్చాపాటీ మాట్లాడి మహేశ్ రావడం తో అతని తో పాటే వెళ్లిపోయాడు.

“కిషోర్ నువ్వు చేసింది ఏమీ బాలేదు రా. అతను కీర్తన నీ ఫాలో అయ్యాడు. పాపం కీర్తన చూడు ఎంత భయపడిందో. అలాంటి వాణ్ని ఉతికి ఆరేయ్యాల్సింది పోయి కామ్ గా ఉన్నావు. నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అతన్ని పంపించేశావు. ఓ అన్నగా నీ భాద్యత నువ్వు విస్మరించావు.” అన్నారు రాఘవయ్య కోపం గా.

“నాన్నా అంకుల్ నీ మీరు అపార్ధం చేసుకున్నారు. ఆయన కీర్తన నీ ఫాలో అవ్వడం వెనుక ఓ రీజన్ ఉంది.” ఆనాడు కిషోర్.

“ఏంటీ వయసులో ఉన్న అమ్మాయిని ఫాలో అవ్వడం, తదేకం గా తననే చూడడం… వీటికి ఉంటాయా రీజన్స్, ఏవిటో అవి…?!.” వ్యంగ్యం ధ్వనించింది రాఘవయ్య గొంతులో.

“తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుడదని.” స్థిరం గా చెప్పాడు కిషోర్.

“ఏంటీ… అసలు ఏం చెప్తున్నావో కాస్త అర్దం అయ్యేలా చెప్పు కిషోర్.” అన్నారు రాఘవయ్య.

“ఆ మధ్య మహేశ్ వాళ్ల చెల్లి సూసైడ్ చేసుకుందని చెప్పాను… మీకు గుర్తుందా నాన్నా.”

“హా అవును.ఆ సమయం లో నేనూ మీ అమ్మా మీ అత్తయ్య ఇంటికి వెళ్లాము. అయితే దానికీ ఈయన ఇలా చేయడానికీ సంబందం ఏంటీ?.”

“ఉంది నాన్నా. అసలు మహేశ్ చెల్లి ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలుసా అత్యాచారానికి గురి అవ్వడం చేత. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తూ ఆటో ఎక్కింది. ఆ ఆటో వాడు ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి ఆమెని తీసుకుని వెళ్లి…ఇక చెప్పలేక కాసేపు ఆగి స్పృహ లేని స్థితి లో ఉన్న ఆమెని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు వాడు. కాసేపటికి స్పృహ వచ్చిన ఆమె ఇంటికి ఎలాగోలా చేరుకుని ఇంట్లో వాళ్లకి విషయం చెప్పి భోరున ఏడ్చింది. వారు ఆమెని సముదాయించి రేపు ఉదయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని, భాద పడకుండా పడుకోమని చెప్పారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అందరూ పడుకున్నాక ఉరిపోసుకుంది.

అందరికీ హెల్త్ బాగోక సూసైడ్ చేసుకుందని చెప్పారు. కానీ నాతో ఓ రోజు అంతా చెప్పుకుని మహేశ్ భాద పడ్డాడు నాన్నా.

పెళ్లీడుకొచ్చిన పిల్ల అలా చనిపోవడం తో ఆంటీ బెంగ తో మంచం పట్టారు. అది అంకుల్ ని మరింత కృంగదీసింది. జాబ్ కూడా రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ రోజు ఏదో పని బయటకు వచ్చిన ఆయనకి ఆటో లో కీర్తన ఎక్కడం, కీర్తన కూర్చోగానే అదే వయసు ఉన్న తన కూతురు గుర్తొచ్చిందేమో. అందుకే తదేకంగా తననే చూసుంటారు. తను ముందే దిగి పోతే కీర్తన ఒక్కర్తే ఉండాల్సి వస్తుందని అప్పుడు ఆటో వాడు తన కూతురు మీద చేసినట్టే ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమో అన్న భయంతో ఆటో దిగలేదు. ఆటో దిగినాక చీకట్లో ఒక్కర్తే వెళ్తుంది ఎవరైనా తన వాళ్లు వచ్చేంతవరకూ తోడుండాలనే ఉద్దేశంతో వెనకే వచ్చుంటారు. అంతేకానీ ఆయనలో మరే ఉద్దేశ్యం ఉండి ఉండదు.

ఈ మధ్య ఇలానే ఆటోలో తనతో పాటూ కూర్చున్న ఆమె వెనకాలే వెళ్లారటా. ఆమె కూడా కంగారుగా తన వాళ్లకి ఫోన్ చేస్తే కోపంగా వెళ్లిన వారికి నవ్వుతూ మాట్లాడుతున్న వారిద్దరూ కనిపించారటా. విషయం కనుక్కుంటే ఆమె దిగినాక ఆ ఆటో డ్రైవర్ ఎవరికీ కనిపించకుండా ఆమెనే ఫాలో అవుతున్న విషయం ఆమె వెనకాలే వెళ్తున్న అంకుల్ గమనించి ఓ కర్రతో వాడిని తరిమి తరిమి కొట్టారటా. వెనక్కి తిరిగి చూసిన ఆమె నిజం తెలుసుకుని తనూ ఓ కర్ర తో ఆ ఆటో డ్రైవర్ ని కొట్టడం తో వాడు పారిపోయాడటా. వాళ్ల కుటుంబానికి అంకుల్ ని పరిచయం చేసింది ఆమె నవ్వుతూ. వారంతా ఆయన్ని క్షమాపణ అడిగారు అంకుల్ ని అపార్థం చేసుకున్నందుకు. ఆయన చేసిన మేలుని మర్చిపోమని కృతజ్ఞతలు తెలిపారటా…” అంటూ చెప్పడం ముగించాడు కిషోర్.

“అయ్యో! అంత మంచి మనిషిని ఎంతలా అపార్థం చేసుకున్నాను. వారు ఏదో దుర్బుద్ధి తో నన్ను ఫాలో అవుతున్నారని అనుకున్నాను కానీ నాకు తోడుగా ఉండటానికి వస్తున్నారని అనుకోలేదు. అన్నయ్యా రేపు ఉదయమే అంకుల్ వాళ్లింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. వీలైతే టైమున్నప్పుడల్లా వాళ్లింటికి వెళ్లి వస్తూ ఉందాం. వారి కూతురు చనిపోయిందన్న బాధనుంచి వారు కోలుకునేలా చూద్దాం.” అంది కీర్తన బాధగా.

“అలాగే కానిద్దాం. అలాగైనా అంకుల్ సంతోషంగా ఉంటారు. ఆంటీ త్వరగా కోలుకోవచ్చు. మహేష్ ఇన్నాళ్లూ అనుభవిస్తున్న మానసిక క్షోభ కాస్తైనా తగ్గుతుంది.” అన్నాడు కిషోర్.

“మంచి ఆలోచన కిషోర్ అలాగే కానివ్వండి. రేపు మీతో పాటే నేనూ వచ్చి వారికి క్షమాపణ చెప్తాను.” అన్నారు రాఘవయ్య గారు తాను ఎంత పొరపాటు గా ఓ మంచి మనిషి కోసం అనుకున్నానో అన్న బాధ ఆ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!