నాన్న మనసు

(అంశం:: “అర్థం అపార్థం”)

 *నాన్న మనసు*

రచన::అలేఖ్య రవికాంతి

“దేవుడా, నాలాంటి ముసలోడిని ఇంకా బతికించే బదలు నా ప్రాణాలను తీసుకుని నా కొడుక్కి ఓ చిన్న ఉద్యోగం ఇప్పియవయ్యా… నీకు పుణ్యముంటుంది”, అంటూ మదిలో కుమిలిపోతూ దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరి కాయ కొట్టాడు శివయ్య.

నాన్న…. ఎక్కడన్నావు, త్వరగా రా…! నీకో శుభవార్త చెప్పాలి అన్నాడు రవి ఆనందంగా.

ఏంటి రవి…, అంత గట్టిగా, పట్టరాని సంతోషంతో కేకలేస్తున్నావు.

ఇంతకి ఏంటా శుభవార్త… ఉద్యోగమేనా..? అన్నాడు ఆశగా కొడుకు మొఖంలోకి తీక్షణంగా చూస్తూ శివయ్య.

అవును నాన్న… నాకు పట్నంలో నేను కోరుకున్న ఉద్యోగమే వచ్చింది కాకపోతే ఆ ఉద్యోగానికి ఓ రెండు లక్షలు కట్టాలంటా అని మొహమాటంగా అడిగాడు రవి…

అవునా… సంతోషం, కానీ అంత డబ్బు మన దగ్గరెక్కడిదిరా అన్నాడు ఆందోళనగా శివయ్య..

ఏమో నాన్న, నాకవన్నీ తెలియవు.ఇంకో నెల రోజుల్లో కట్టాలి లేదంటే ఈ జన్మలో నాకు ఇంత మంచి ఉద్యోగం రాదు. ఇప్పటికే చాలా రోజులు ఇంట్లో కూర్చొని మీరు ఈ వయసులో కష్టపడుతుంటే నేను ఖాళీగా ఉంటూ, తింటూ అందరితో బేవార్సు అనే మాటలు పడవల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇళ్ళు అమ్మైనా, అప్పు చేసైనా సరే ఈ డబ్భు సర్దండని దయచేసి అని చెప్పేసి వెళ్ళిపోయాడు రవి.

శివయ్యకు ఉన్న ఈ ఇళ్ళును అమ్మాలని లేదు. అందుకే తనకు తెలిసిన వారిని అప్పడిగాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. ఓ పది రోజుల తరువాత కొడుకు చేతిలో రెండు లక్షలు పెట్టాడు .

అందని ద్రాక్ష అందినట్టు డబ్బులు చూడగానే రవి మనసు సంతోషపడింది కానీ అంత డబ్బు తన పేద తండ్రికి ఎలా వచ్చింది అనే ఆలోచనే రాలేదు. ఉద్యోగం దొరికిందన్న ఆనందంలో ఎగిరి గంతేసాడు. వెంటనే డబ్బులు కట్టి వారంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు .

ఓ నెల రోజుల తరువాత రవి వాళ్ళ మామయ్య రవికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పాడు .

రవి హుటాహుటిన ఇంటికి చేరుకోగానే ఇంటి ముందు జనం. రవిలో ఏదో తెలియని అలజడి, భయం మొదలైంది. ఆందోళనగా లోపలికి వెళ్ళాడు. ఎదురుగా పాడెపైన తన తండ్రి శవం చూసేసరికి రవికి దుఃఖం ఆగలేదు.

నాన్న…, ఏంటి ఇది..? నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అంటూ బోరుగా ఏడవసాగాడు. రవి మామయ్య వచ్చి తనని ఓదార్చసాగాడు.

అసలు ఏమయ్యింది మామయ్య నాన్నకి, అని ఏడుస్తూ అడిగాడు రవి.

ఏం చెప్పమంటావురా…! నీ ఉద్యోగం కోసమేరా మీ నాన్న చనిపోయింది…

కాదు కాదు బలవంతంగా తన చావును తానే కొనిదెచ్చుకుంది అంటూ కన్నీళ్ళు పెట్టుకోసాగాడు రవి మామయ్య మూర్తి.

ఏం అంటున్నారు మామయ్య…! నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు రవి ఆందోళనగా.

నీ ఉద్యోగానికి లంచం ఇవ్వడానికి డబ్బు లేక, ఉన్న ఇళ్ళుని అమ్మితే రేపు నీ ఉద్యోగం పోతే నీకు ఈ కూసింత నీడైన ఉండదన్న భయం మదిని వీడక, అప్పులు తీసుకున్న వాటిని తీర్చే మార్గం లేక తన కిడ్నీని డబ్బులకి అమ్మేసుకున్నాడురా. ఆపరేషన్ వికటించి చనిపోయాడు. నీకు విషయం చెప్పొద్దని ముందుగానే మాట తీసుకున్నాడు రా. నీకు చెప్తే నువ్వు ఎక్కడ ఉద్యోగం వదులుకుంటావో మళ్ళీ ఇంట్లో ఉంటూ బాధపడతావో అని నీకు ససేమిరా చెప్పొదన్నాడు.

ఆపరేషన్ అయ్యి కాస్త కుదుటపడ్డాక నీకు వివరంగా అంతా చెబుదామని అనుకున్నాడు. ముందుగానే వారి దగ్గర తీసుకున్న అడ్వాన్సు డబ్బు నీకు ఇచ్చాడు . ఇదిగో మీగిలిన డబ్బు ఇరవై లక్షలు తీసుకో అంటూ ఓ బ్యాగ్ రవికి అందిస్తూ “మీ నాన్న చనిపోయి నీకు పునర్జన్మ ఇచ్చాడు రా” , అంటూ ఏడ్చాడు మూర్తి.

నేనెంత మూర్ఖుడ్ని నాన్న…, అంత డబ్బు సంతోషంగా తీసుకుని ఉద్యోగంలో చేరానే కానీ నీకా డబ్బు ఎలా వచ్చిందో కనుక్కోలేదే. ఉద్యోగంలో చేరాక అసలు నీకు ఫోన్ కూడా చేయలేదు. ఎంతటి దరిద్రుడిని, స్వార్థపరుడిని నేను.

” తల్లి లేని నాకు తల్లివై, తండ్రివై నన్ను ఇంత వాడిని చేసిన నీకు నేనిచ్చిన బహుమానం మరణమా” ..! అంటూ కుమిలిపోయాడు.
అంత డబ్బు నీకెక్కడిది నాన్న…,? అని నేను నిన్ను అప్పుడే అడిగుంటే నువ్వు బతికేవాడివేమో.నీ ప్రాణాలను అమ్ముకుని నాకు ఉద్యోగ బిక్ష పెట్టావు.

సంతానం కోసం కొంతైన ఆస్తులు కూడబెట్ట లేదే అని పైకి అనకున్నా లోలోన నీ గురించి చాలాసార్లు తప్పుగా అనుకున్నాను. ఇంత మంచి మనసున్న మనిషిని ‘అపార్థం ‘చేసుకున్నాను. బిడ్డ అవసరాలకి, భవిష్యత్తుకై తన అవయావాలనే శాశ్వత ఆస్తినే తృణప్రాయంగా వదిలేసుకున్న గొప్ప మనసు నీది. నీ తండ్రి ప్రేమని నేడు పూర్తిగా ‘ అర్థం’ చేసుకున్నాను… కానీ ఏం లాభం… పోయిన నిన్ను తీసుకురాలేను. నువ్వు ఓడి నన్ను గెలిపించావు నాన్న… ఇక నువ్వు పెట్టిన భిక్ష అయిన ఈ ఉద్యోగంలోనే నిన్ను వెత్తుకుంటాను అంటూ తండ్రి పార్థివ దేహాన్ని కడసారి హత్తుకుని అంత్యక్రియలు నిర్వహించాడు..

*కథ సమాప్తం*

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!