అంతా శుభం.

(అంశం:: “అర్థం అపార్థం”)

 అంతా శుభం

రచన::శ్రీదేవి విన్నకోట

ఇ రోజు ఉదయం నుంచి మాఇంట్లో గొడవ గొడవగా ఉంది. కొరియర్ బాయ్ ఓ  అందమైన ఎర్రగులాబీల పూల బొకే.  అందమైన గులాబీ రంగు కవరు తెచ్చి ఇచ్చాడు  నాపేరు తోనే వచ్చాయి అవి. అప్పుడు మొదలైంది ఇంట్లో గొడవ. ఎర్ర గులాబీలు అంటే నాకు ప్రాణం.ఎవరు పంపించారు అని ఆలోచిస్తూనే   కవర్ విప్పి పింకు కలర్ లో గులాబీ రేకులా సున్నితంగా ఉన్న ఉత్తరం విప్పి చదివాను.

ఎలా ఉన్నావు నీలి బంగారం. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. నీ పెద్ద పెద్ద కళ్ళు. నీ పొడవైన జుట్టు.
వందన మైన నీ మాట తీరు. ఎప్పుడు నీ మొహం మీద చెదరని చిరునవ్వు. ఇవి చూసే గా నేను నీ వలలో పడి పోయాను. ఏంటో రా ఈ మధ్య అస్తమానం నువ్వే తెగ గుర్తొస్తున్నావు. నిన్ను చూడాలి అనిపిస్తుంది నీలూ.
మనం ఎప్పుడు కలుద్దాం చెప్పు .అప్పుడే వచ్చి నీ ముందు వాలిపోతాను. నేను నీకు గుర్తున్నానా?
నేను మాత్రం నిన్ను అస్సలు మరిచిపోలేదు.
చిన్నప్పుడు నేను నీతో కలిసి నా ఊహల్లోఆడిన ఆటలు
చిలిపి కబుర్లు ఇవి కూడా నా ఊహల్లోనే సుమా.
ఇంకేంటి నీలు బంగారం విశేషాలు.
సరేలే నువ్వు ఏమి చెప్పినా నాకు వినబడదు గా.
నాకు ఉత్తరం రాయడానికి నాఅడ్రస్ నీదగ్గర లేదుగా.
నేనే వచ్చి నిన్ను కలుస్తాను నా కళ్ళారా నిన్ను చూడాలి,నా మనసారా నీతో మాట్లాడాలి. చిన్నప్పటి నా ఊహలు  ఉసులు కలలు  కబుర్లు అన్నీ నీతో పంచుకోవాలి. మరి త్వరలోనే మనం ఇద్దరం కలుద్దాం. కలసి మనసు విప్పి మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నాక ఆపై ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దాం సరేనా బంగారం ప్రస్తుతానికి నిన్నే తలుచుకుంటూ నీ ఊహల్లోనే తేలిపోతూ ఉంటాను. బై నీలూ డార్లింగ్.నీమీద చచ్చేంత ప్రేమ తో నీ మనూ.

ఈ ఉత్తరం చూడగానే నా కళ్ళు ఒక్కసారి బైర్లు కమ్మాయి. నాన్న నా వంక కొట్టినట్టే చూస్తున్నారు.
అమ్మేమో కొట్టడానికి సిద్ధంగా ఉంది. అన్నయ్య కళ్ళల్లో ప్రశ్నార్థకమైన చూపు అలాంటిదేమైనా ఉంటే చెప్పేయ్ చెల్లాయి అని. తమ్ముడైతే నా దగ్గరగా వచ్చి అమ్మ  నన్ను ఎక్కడ కొట్టేస్తుందో అన్నట్టుగా నాకు  అమ్మ కి మధ్య అడ్డుగా నుంచున్నాడు. మర్యాదగా చెప్పు నీలూ ఉత్తరం రాసిన వాడు ఎవడు. అతను ఎవరో నీకు తెలియకుండానే నీకు ఉత్తరం రాస్తాడా. నీకెంతో ఇష్టమైన ఎర్రగులాబీలు ఎలా పంపిస్తాడు అతను ఎవరో నీకు తెలియక పోతే. పిచ్చి వేషాలు వెయ్యొద్దు. ఇప్పటి వరకు మేము నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాము.అంటూ అమ్మ తిట్లదండకం అందుకుంది. ఓరి దేవుడా, వీళ్ళ అపార్థాల వెల్లువలో నేను అడ్రెస్ లేకుండా  కొట్టుకుపోయేలా  ఉన్నాను. నన్ను కాపాడు తండ్రి అంటూ కనిపించని దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కేశా,

ఇంతలో దేవుడు నన్ను కరుణించి నా మొర ఆలకించి
మా నానమ్మ రంగప్రవేశం చేసింది. ఏంటే గొడవ అంటూ మా అమ్మను గదిమేసింది. నాకు నానమ్మ దగ్గర చనువెక్కువ. నానమ్మ ని చూడగానే నా కళ్ళకున్న ఆనకట్ట తెగింది. నానమ్మ అంటూ పట్టుకుని గట్టిగా ఏడ్చేశాను. ఎందుకే ఏడుస్తావు ఊరుకోవే నా తల్లి అంటూ బుజ్జగించింది. ఏంటిది. ఇది ఎవడో బడుద్దాయి వెధవ రాసిన ఉత్తరం కోసం నా బంగారు తల్లి ని ఏడిపిస్తున్నారు. అది ఎలాంటిదో మీకు తెలియదా. మీరు అర్థం చేసుకునేది ఇదేనా
మీ పిల్లని లేక మీ పెంపకం పట్ల మీకు నమ్మకం లేదా అంటూనాలుగు చివాట్లు వేసేసరికి అందరూ ఎవరి దారిన వారు గమ్మున ఉండిపోయారు. ఎవడో ఒక వెధవ ఆకతాయిగా రాసిన ఉత్తరం కోసం  20 ఏళ్లు పెంచిన మన అమ్మాయిని  అనుమానిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు మీకు బుద్ధి లేదా.
అయినా మనం దాని మనసులో ఏమున్నా నిర్భయంగా  మనకి చెప్పే స్వేచ్చని  తనకి ఇచ్చాం. తన మనసులో ఈలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ బావతో పెళ్లి కుదరక ముందే చెప్పి ఉండేది గా.
మీ అనుమానాలు తగలెయ్య మనుషులు పెరిగారు గాని ఒక్కరికి  బుర్ర పెరగలేదు. అంటూ బాగా చీవాట్లు వేసింది. నన్ను చూసి  చూడు అమ్మడు ఆడపిల్లవి కదమ్మా వాళ్ల భయం వాళ్లకు ఉంటుంది. అంతే కానీ నీ మీద నమ్మకం లేక కాదు. వెళ్ళుకాసిన్ని చన్నీళ్లతో మొహం కడుక్కోరా తల్లి అంటూ నన్ను  లోపలికి పంపించింది.

నాకు బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా నాకు కొరియర్ లో లెటరు, గులాబీల బొకే ఎవరు పంపించారో అర్థం కాలేదు,నా చిన్నప్పుడు స్కూల్లో గాని కాలేజీలో గాని మనూ అనే పేరుతో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. మనూ అంటే  బహుశా మనోజ్ ఏమో. ఫోన్ రింగ్ అవడంతో
నా ఆలోచనని కాసేపు పక్కన పెట్టి ఫోన్ ఎత్తాను.
అటువైపునుంచి మా మేనత్త కొడుకు. నాకు బావ.
మరో రెండు నెలల్లో నాకు కాబోతున్న భర్త అయిన
మురళి నుంచి ఫోను. ఏం చేస్తున్నావ్ నీలూ అంటూ
(మీకు నా పేరు చెప్పలేదు కదా. నా పేరు నీలిమ
అందరూ ముద్దుగా నీలూ అని పిలుస్తారు.)
ఏం చేయట్లేదు బావ అని చెప్పాను. ఏమైంది నీలూ.  నీ గొంతు అంత డల్ గా ఎందుకు ఉంది నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అతను ప్రేమగా అడిగేసరికి నా కళ్ళల్లో వరద గోదావరి పొంగింది. ఉదయం నుంచి జరిగిందంతా చెప్పేసాను.

ఎప్పుడూ చిన్న మాట కూడా అనని అమ్మ నాన్న ఎంత కోప్పడ్డారో అన్నయ్య తమ్ముడు నా వంక ఎలా చుసారో నానమ్మ ఎలా నన్ను వెనకేసుకు వచ్చిందో
అన్ని తనకు చెప్పాను. ఏంటి నీలూ  ఇంత చిన్న విషయానికి నీన్నంతగా కొప్పడ్డారా అంటూ అతను నవ్వే సరికి నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను ఇక్కడ ఏడుస్తుంటే నువ్వు వెటకారంగా నవ్వుతావా. పో అసలు నాతో మాట్లాడొద్దు.ఇంకోసారి నాకు కాల్ చేసావ్ అంటే మామూలుగా ఉండదు చెప్తున్నా అంటూ ఇంకో నాలుగు తిట్లు తిట్టి అతను చెప్పేది ఏమాత్రం వినకుండా ఫోన్ కట్ చేశాను. నాలుగు రోజులు గడిచాయి. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. కొరియర్ లో మళ్ళీ ఓ లెటర్  ఓ ఎర్ర గులాబీల పువ్వుల బొకే, లెటర్ లో కూడా సేమ్ మేటర్. అదేంటో చిత్రంగా ఈసారి ఇంట్లో వాళ్ళు ఎవరు కోప్పడలేదు.  బహుశా నాన్నమ్మ బాగా చివాట్లు వేయడం వల్లో  లేక నా మీద  నమ్మకం  వలనో
తెలియదు కానీ నన్ను ఒక్క మాట కూడా అన లేదు.

ప్రతి నాలుగు రోజులకోసారి ఇలా రిపీట్ అవుతూనే ఉంది. ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం మానేశారు.
కానీ వాళ్ల చూపుల్లో ఓ ప్రశ్నార్థకం అయితే కనిపించేది
నాకళ్లకి. ఇంచుమించు నేను పట్టించుకోవడం మానేసాను. మరి కొన్ని రోజుల తర్వాత
నాకు మా మురళి బావ కి పెళ్లి జరగాల్సిన రోజులు దగ్గరికి వచ్చాయి. నేను అతను ఫోన్ చేసినా మాట్లాడడం లేదు. రెండు మూడు సార్లు ఇంటికి వచ్చాడు. అయినా నేను రూమ్ నుంచి బయటకు రాలేదు.  నాన్నమ్మ  ఏమో పెళ్లి కదా మనవడా సిగ్గుపడుతుంది అంటూ కవర్ చేసేసింది.
ఒక్కసారి దాంతో మాట్లాడుతా అమ్మమ్మ అంటూ
నా రూం లోకి వచ్చాడు. ఎందుకు నీలూ నీకు అంత కోపం వచ్చింది. నేను సరదాగా నవ్వాను అంతే.
ఇంత చిన్న విషయానికి నీకు కోపం వస్తుంది అని నేను అనుకోలేదు. ఒకవేళ నీకు ఏమైనా అనుమానాలు ఉంటే పెళ్లికి ముందే అడుగు పెళ్లి అయిన తర్వాత మనం గొడవ పడితే అసహ్యంగా ఉంటుంది అన్నాడు. నేను  అతని మొహం వంక కూడా చూడలేదు. సరే మాట్లాడవా అయితే వెళ్తున్నాలే. మీ నాన్నమ్మ  చెప్పినట్టు నువ్వుసిగ్గు పడుతూ ఉండు. బై అంటూ అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. నేను ఊరికే పంతానికి మాట్లాడలేదు కానీ నాకు అతనంటే చాలా ఇష్టం.ఇంత చిన్న విషయానికి అతని మీద కోపం తెచ్చుకోవడం నాకే సిల్లీగా అనిపించింది.

మా పెళ్లి పదిహేను రోజుల్లో కి వచ్చేసింది.
మా ఇల్లంతా హడావిడిగా ఉంది. ఈ రోజే శుభలేఖలు తీసుకొచ్చారు నాన్న.నేను ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసిన శుభలేఖలు.
ఉంటేఅమ్మ  తీసుకెళ్ళి లోపల పెట్టింది. నా మనసులో నాకేమో కనీసం నన్ను చూడమని కూడా చెప్పరెంటి
అని నా మనసులో అనిపిస్తోంది. కానీ వాళ్ళందరి ఎదురుగా వెళ్లి శుభలేఖ తీసి చూడాలంటే సిగ్గు ముంచుకొస్తోంది. నా ఫీలింగ్స్ మా నానమ్మ గమనించిందేమో.అమ్మడు శుభలేఖ ఎలా ఉందో చూడరా తల్లీ అంది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను లోపలికి పరిగెట్టాను. కవర్ లోంచిశుభలేఖ తీసి తెరవగానే బావ అందమైన నువ్వు మొహం కనిపించింది. పక్కనే   మరో  ఫోటోలో ముద్దొచ్చేలా  ఉన్న నేను.

రెండు నిమిషాలు ఫోటోలు చూస్తూ మైమరిచి  ఉండిపోయాను.చిరంజీవి .లక్ష్మీ. సౌభాగ్యవతి నీలిమనుచిరంజీవి. మురళి మనోహర్ కి ఇచ్చి అని చదవగానే ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నాకు ఇంతవరకు బావ పేరు మురళి అని మాత్రమే తెలుసు. మురళికి తోకగా మనోహర్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు.ఇప్పుడు ఆపేరు  చదవగానే  మంచు తెర విడిపోయినట్టు గా నాకు మొత్తం  అర్థమైంది.

అంటే ఇంట్లో వాళ్లందరికీ బావ  పేరు మనోహర్ అని తెలుసు. ఎవరు నాతో చెప్పకుండా అందరూ నన్ను ఏడిపించారు. వెంటనే బయటికి వచ్చాను. అమ్మని అడిగాను. బావ పేరు మురళీ మనోహర్ అని నాకెందుకు చెప్పలేదు అమ్మా అని. నాకు మొన్నే తెలిసింది నీలూ అదీగాక నాన్నమ్మ  మీ నాన్నగారు  నీకు చెప్పొద్దు అన్నారు నువ్వు ఏమైనా అడగాలనుకుంటే వాళ్ళని అడుగు అంటూ నాతో మాట్లాడకుండా తప్పించుకుని వెళ్ళిపోయింది అమ్మ నాకొస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ వెంటనే బావకి కాల్ చేశాను.ఒక రింగ్ కే ఫోన్ ఎత్తాడు నామీద కోపం పోయిందా నీలూ బంగారం అంటూ. నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక్కసారి ఇంటికి రా బావ అన్నాను. వస్తున్నా బంగారం ఒక గంటలో నీ ముందుంటా  అంటూ ఫోన్ కట్ చేశాడు.

అన్నట్టుగానే గంటలో నాముందు ఉన్నాడు.
ఇప్పుడు ఏమైంది నీలూ అంత సీరియస్ గా ఉన్నావు
అన్నాడు ఏమీ తెలియనట్టు అమాయకంగా
నీకు తెలియదా అంటూ లెటర్స్ అన్ని తెచ్చి అతని ముందు పడేసాను. ఆ ఉత్తరాలు  చూడగానే అతని
పెదవులపై ఓ కొంటె చిరునవ్వు. అతని నవ్వు చూడగానే నాకు కోపం చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నన్నింత మోసం చేస్తావా అంటూ అతన్ని
కొట్టడానికి వెళ్లాను. అతను నా రెండు చేతులు పట్టుకుని ఆపుతూ నన్ను దగ్గరకు తీసుకున్నాడు.
ఎందుకే అంత  కోపం నీకు నీమీద ప్రేమతో ప్రేమ లేఖలు రాయడం తప్పా చెప్పు బంగారు అన్నాడు.
అయినా నాకు ఇంకా కోపం తగ్గలేదు.తప్పే నువ్వు ఎవరో చెప్పకుండా ఇలా ఉత్తరాలు రాయడం తప్పే  ఇంట్లో అందరూ ఎంత అపార్థం చేసుకున్నారో తెలుసా అంటూ నా రెండు చేతులతో అతని గుండెలమీద కొట్టసాగాను అతను నన్ను ఆపుతూ ఒసేయ్ నన్ను చంపేస్తావా ఎంటే.

బావ మరదళ్ళు అంటే ఆ మాత్రం  సరదా. సరసం
ఉండవా ఏంటి. అయినా. పెళ్లికి ముందు ఉత్తరం
రాస్తేనే అదో రకమైన ఆనందం. పెళ్లయ్యాక రాస్తే ఎంp థ్రిల్ ఉంటుంది చెప్పు, మామూలు గా మొగుడు పెళ్ళాలు రాసుకున్నట్లే ఉంటుందిగా అందుకే సరదాగా అలా రాసాను అంతే తప్ప నిన్ను ఏడిపించాలని కాదు
నేను మొదటి ఉత్తరం రాసినప్పుడు మీ ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియదు. తర్వాత నిన్ను మామయ్య వాళ్ళు నిన్ను బాగా తిట్టారు అని తెలిసి  ఆ ఉత్తరం రాసింది
నేనే అని వాళ్ళకి  చెప్పేసాను. అందుకే ఆ తరువాత నేను ఎన్ని ఉత్తరాలు రాసిన వాళ్ళు నిన్ను  ఏమీ అనలేదు.  ఇక నా పేరు  గురించి అంటావా నేను చిన్నప్పుడు చాలా అందంగా ఉండే వాడిని అంటే కృష్ణుడి అంత అందంగా అన్నమాట. (నేను ఇప్పటికి కూడా అందగాడినే అనుకో). అందుకే నాకు మురళీమనోహర్ అని పేరు పెట్టారు. కానీ నాకు అంత పెద్ద పేరు ఇష్టం లేదు అదికాక మనోహర్ అనే పేరు అమ్మాయి పేరుకి చాలా దగ్గరగా ఉంది. నాకు ఆ పేరు నచ్చలేదు. అందుకే నేను నా పేరు లోంచి మురళి ని మాత్రం ఉంచుకునీ  మనోహర్ ని తీసేసాను.
నా ప్రతి ఐడెంటిటీ లో కూడా నాపేరు మురళి అనే ఉంటుంది.  ఈ విషయం మన బంధువుల్లో ఎవరికీ తెలియదు కానీ శుభలేఖల్లో మాత్రం కొసరు పేరు కాకుండా అసలు పేరు పూర్తిగా వేయించాలని పెద్దవాళ్లు పట్టు పట్టడం వల్ల మురళీ మనోహర్ అని వేయించాల్సి వచ్చింది.   అలా వేయించి ఇదిగో నీకు ఇలా దొరికిపోయాను మిస్సెస్ నీలిమ మురళీ మనోహర్ అన్నాడు నాటకీయంగా నన్ను నవ్విస్తూ.
అతని కి నాపై  ఉన్న ప్రేమ. ఆ నవ్వు మొహం చూస్తూ
నేనింక అతని పై కోపంగా ఉండలేకపోయాను.
సరే బావ నాదో షరతు అన్నాను సీరియస్ గా.
మళ్లీ ఏమైందే అన్నాడు. నేను ఈరోజు నుంచి నిన్ను మనూ అనే పిలుస్తాను అన్నాను.అప్పటివరకు నవ్వుతూ ఉన్న అతని ముఖం  మాడిపోయిన పెసరట్టు లా అయిపోయింది. ఏంటి జీవితాంతం నాకు ఇష్టంలేని పేరుతో పిలుస్తావా రాక్షసి అంటూ మరి మాటలు రాక అలాగే స్తబ్దుగా  ఉండిపోయాడు.
నా పెదవుల మీద విజయగర్వంతో కూడిన నవ్వు
వికసించింది. మరి నన్ను అమాయకురాలిని చేసి
ఆడుకొంటావా. బాగా అయింది లే నీకు
అంటూ అతని  మాడిపోయిన మొఖం చూసి
మనసారా నవ్వుకున్నాను.మా అపార్ధాలు అన్ని తొలగిపోయి మంచి అర్థాలు గా మారిపోయాయి ఇలా అంతా శుభం గా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!