పట్నవాసం

(అంశం:: “అర్థం అపార్థం”)

పట్నవాసం

రచన::వడలి లక్ష్మీనాథ్

“సర్, నా పేరు మాణిక్యం, ఈమె నా భార్య సుశీల. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మాపాప పేరు హంసిక, కనిపించడం లేదు” ముప్పయ్యేళ్ల లోపు వ్యక్తి పోలీసు స్టేషనులో హడావుడిగా చెబుతున్నాడు.

“వయస్సెంత ? ఎప్పటి నుండి కనిపించడం లేదు, ఎక్కడ తప్పిపోయింది?” అడిగాడు పోలీసు.

“మూడు సంవత్సరాలు నిండాయి. ఇంటి ముందు ఆడుకొంటూ, మధ్యాహ్నం నుండి కనిపించడం లేదు” చెప్పాడు మాణిక్యం.

పోలీసు “ఇంటి చుట్టుపక్కల వెతికారా?”

“హా., వెతికాము… లేదని నిర్ధారించుకున్నాకనే, మీ దగ్గరకు వచ్చాము”

పోలీసు, “చివరి సారిగా ఎప్పుడు చూశారు?”

మాణిక్యం,”ఉదయం పదకొండు గంటలకు. హంసిక, తన ఐదు సంవత్సరాల అక్క కోకిల ఇద్దరూ వాకిట్లో ఆడుకొంటున్నారు. కోకిల వాష్రూమ్ కోసం లోపలికి వచ్చింది. ఆ తర్వాత హంసికను ఎవరూ చూడలేదు”.

పోలీసు, “ఎవరి మీదనైనా అనుమానం ఉందా?”

“పక్కింటి జానకమ్మ మీద. అనుమానం కాదు పక్కా, ఖచ్చితంగా ఆవిడనే ఎత్తుకెళ్ళింది” చెప్పాడు మాణిక్యం.

పోలీసు, “మీకు ఆవిడకు విభేదాలు ఉన్నాయా? ఆవిడ నుండి ఏదైనా బెదిరింపు కాల్ లాంటివి వచ్చాయా? “

“విభేదాలు లేవు……ఆవిడ, మా అమ్మగారు కాంతం స్నేహితులు” అన్నాడు మాణిక్యం.

“ఆవిడేనని ఎలా చెప్పగలరు?” అడిగాడు పోలీసు.

“ఆవిడ దృష్టి ఎప్పుడూ మా ఇంటి మీదే ఉంటాయి. మా ఇంట్లో జరిగే విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ఒక c c టివి లాగా మా ఇంటిని గమనిస్తూ ఉంటుంది.

ఆవిడ కొడుకుకు పిల్లలు పుట్టే అవకాశం లేదు….మాకు రెండో సంతానంగా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని బాధపడ్డ మాట వాస్తవమే.
అప్పుడున్న మానసిక పరిస్థితిలో మేము హంసికను వాళ్ళకి ఇద్దామని అనుకొన్నాము. కానీ, ఆ తరువాత పాపను మేము వదలలేక, ఇచ్చేది లేదని చెప్పాము. మా పాపను మేము బాగానే చూసుకొంటున్నాము. ఆవిడ మటుకు అప్పటి విషయం పట్టుకొని హంసికను నా మనవరాలు అంటూ మాట్లాడేది. మేము గట్టిగా హంసికను గదమాయించినా, ఇలా అయితే హంసికను మా అబ్బాయి దగ్గరకు పంపించేస్తానంటూ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళేది. ఎవరూ లేని సమయం పసిగట్టి ఆ పిల్లను పట్టుకొని వెళ్ళిపోయుంటుంది” అంది సుశీల.

పోలీసు “మీ అమ్మగారు వచ్చారా?”

“అదిగో అక్కడ ఉన్నారు” అంటూ కాంతంను రమ్మని సౌజ్ఞ చేసాడు మాణిక్యం.

“కాంతం గారు! జానకమ్మ అనే ఆవిడ మీ స్నేహితురాలని, మీ మనవరాలుని ఎత్తుకొని పోయిందని మీ పిల్లలు ఆరోపిస్తున్నారు….మీకే మైనా చెప్పి తీసుకొని వెళ్లారా? ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? కాస్త వివరంగా చెప్పండి” అన్నాడు పోలీసు కానిస్టేబుల్.

“నేను జానకమ్మ, ఇద్దరూ చిన్ననాటి మిత్రులం. ఉన్న ఊళ్లో చుట్టాలందరు పట్నవాసానికి వలస రావడం తో, ఈ మధ్యనే వాళ్ల కొడుకు అమెరికా వెళ్ళిపోతూ, మా ఇంటి పక్కన ఇల్లు కొని, ఆవిడని ఇక్కడ పెట్టి వెళ్లాడు. తను మొదటినుంచి పల్లెటూరులో పెరగడం వలన ఈ పట్నవాసంలో ఎలా మసులు కోవాలో తెలియదు.

ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో, ఊరి పద్ధతుల్లో తరచుగా మా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతుంది…. అందునా, నేను చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిని కాబట్టి, కొంత చనువుగా ఉంటుంది. పక్క ఇంట్లో జరిగే విషయాల మీద ఆసక్తి తప్ప, ఎవరికీ హానీ కలిగించే స్వభావం మటుకు కాదు” మాట్లాడుతున్న కాంతం మాటలకి
అడ్డుపడ్డ కోడలు సుశీల,

“ఎప్పుడూ మా ఇంటి పైనే దృష్టి. చచ్చిపోతున్నాము. మా ఇంట్లో వండుకొనే ప్రతి వంట రుచి చూపించాల్సిందే….ఇదిగో మా అత్తగారు వల్ల ఆవిడని భరిస్తున్నాము” అక్కసుగా అంది.

“ఆవిడకి ఏదైనా రుచికి ఇచ్చినా, తిరిగి మనకి వెంటనే ఇచ్చే పచ్చళ్ళు, పొడులు లొట్టలేసుకుని మరీ తింటారుగా” అంది కాంతమ్మ.

“అదే మా ప్రాణం మీదకు తెచ్చింది” ఏడుస్తోంది సుశీల.

“ఇప్పుడు ఏడ్చి ఏమీ లాభం లేదు, చంటిపిల్లలని కంటిపాపలా కాపాడుకావాల్సింది పోయి గాలికి ఒదిలేస్తారు…. తీరా ఏదైనా జరిగితే ఇలా మా ప్రాణాలను తీస్తారు. పదండి, పాప తప్పిపోయిన ప్రాంతానికి వెల్దాము” అంటూ పోలీసులు, అందరూ కలిసి ఇంటి దగ్గరకు వెళ్లారు.

అది అప్పుడే కడుతున్న కాలనీ….చుట్టూ కొన్ని ఇళ్లు ఇంకా నిర్మాణంలో వున్నాయి….కొన్ని సగంలో కట్టి ఆపేసిన ఇళ్లు.

పోలీసు కానిస్టేబుల్ ఇద్దరి ఇళ్లు పక్క పక్కనే ఉండడంతో పరిసరాలను పరిశీలించారు…..పాప ఎక్కడైనా దొరుకుతుందేమోనని.

కొంచం ముందుకు వైపుకు వెళ్ళి అక్కడ కొత్తగా కడుతున్న ఇంటి పని వాళ్ల దగ్గరకు వెళ్లి “ఇక్కడ ఎవరైనా ఈ ఫోటో లో ఉన్న చిన్న పాపను చూసారా?” అని అడిగాడు పోలీసు కానిస్టేబుల్ .

“లేదు ” అని సమాధానం చెప్పారు.
“పోనీ ఎవరైనా పెద్దావిడ పిల్లని పట్టుకొని వెళ్లడం చూసారా?” అడిగాడు పోలీసు.

ఆ పనివాళ్లలో ఒకడు “ఉదయం పని చేసుకుంటున్నప్పుడు ఒక పెద్దామె ఈ ఫోటోలో లాంటి పాపను తీసుకుని ఇటు హడావుడిగా పోవడము చూసాను”అన్నాడు.

వెంటనే సుశీల “నేను చెబుతూనే ఉన్నాను….ఆమె గురించి నన్ను ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నా కూతురుని నాకూ ఎవరు తెచ్చిస్తారు” ఏడుస్తోంది.

“ఆపుతారా” గట్టిగానే అన్నాడు పోలీసు.

“ఎటువైపుకు వెళ్ళింది?” అడిగాడు పోలీసు.

“అటు వైపు” అంటూ రోడ్డు వైపు చెయ్యి పెట్టి చూపించాడు. అప్పుడే అటుగా వస్తున్న ఒక పెద్దావిడని చూపించి,”అదిగో ఆవిడే….. కానీ, ఇప్పుడు చేతిలో పాపలేదు” అన్నాడు ఆ కార్మికుడు.

సుశీల గట్టిగా “చంపేసిందా ! వట్టి చేతులతో వస్తోంది….హంసికా….నా తల్లీ” అంటూ ఏడవడం మొదలు పెట్టింది .

మాణిక్యం ఒక్క ఉదుటున నాలుగడుగులు ముందుకు వేసి, “చెప్పు నా కూతురిని ఎక్కడకి తీసుకెళ్ళావు” అంటూ జానకమ్మ మీదకు దాడికి తెగ పడ్డాడు.

పోలీసులతో కలిసి కుటుంబ సభ్యులను చూసి జానకమ్మ ఒణికి పోతోంది.

పోలీసు, వారి నుండి ఆవిడని వేరు చేసి, ” హంసిక ను ఎక్కడకి తీసుకెళ్ళావు, ఎక్కడ దాచిపెట్టావు. ఎవరికైనా అమ్మేసావా?” నిలదీసాడు.

జానకమ్మకు కళ్ళల్లో నీళ్ళు నిండి పోయాయి….మాట కంటే ముందు ఎక్కిళ్ళు వస్తున్నాయి. అప్పుడు కాంతం, జానకమ్మ దగ్గరకు వెళ్ళి,

“హంసిక బాగానే ఉంది కదా!” అడిగింది.

జానకమ్మ కాంతంని పట్టుకొని, “నీ మనవరాలుని, నా మనవరాలు అనే అనుకొన్నాను. నేను పొద్దున వంట చేసుకొని జుట్టు ఆరపెట్టుకుందామని బయటకు వచ్చాను….అప్పుడు హంసిక ఒక్కతే పక్కన కడుతున్న ఇంటి వైపుకు వెళ్లడం చూశాను.
పిల్లకు పొంచి ఉన్న ప్రమాదం ఊహించుకొని నేను అటు వైపుకు వెళ్లాను. చాలా వెదికాను. మీ కోసం అరిచాను…మీరు టి వి గట్టిగా పెట్టుకోవడం వల్ల నా గొంతు మీకు వినబడలేదనుకొన్నాను”

సుశీల అందుకుంది “నా కూతురుకి ఏమైయ్యింది….మీరే తీసుకొని వెళ్లారని వీళ్ళు చెబుతున్నారుగా!” అని

“అవును నేనే తీసుకొని వెళ్లాను, ఆసుపత్రికి .. నేను వెతికిన చాలా సేపటికి, చంటిది అదిగో ఆ నీళ్ల సంపులో పడి కొట్టుకొంటోంది. నేను బయటకి లాగే సరికి ఊపిరి సరిగా లేదు….మన ఇంటికి తెచ్చే సమయంలో ఆసుపత్రికి వెళితే పిల్లను కాపాడుకోవచ్చనుకొని, ఆసుపత్రికి తీసుకొని
వెళ్ళాను. నేను తీసుకొని వెళ్లినప్పుడు పాప ప్రాణానికి నమ్మకం చెప్పని డాక్టర్, ఇప్పుడే పిల్ల బ్రతికి బయట పడింది అని చెప్పడంతో ఊపిరి
పీల్చుకొని మీకు చెబుతామని ఇలా, కానీ మీరు నా మీద పోలీసులు దాకా వెళ్లారు. నేను పల్లెటూరు దాన్ని. అక్కడ లాగా పట్నంలో కూడా మన చుట్టూ ఉండే అందరూ నా వాళ్ళనుకోవడం తప్పైపోయింది” అంటూ కాంతంని పట్టుకొని ఏడుస్తోంది.

“పిన్నీ, నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించు, పాపని నువ్వే మాకు చూపించు. దాని ప్రాణాన్ని కాపాడిన నీ రుణం మేము తీర్చుకోలేను” అంటూ అందరూ కలిసి ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.

వాళ్ళకి హంసికను చూపించిన డాక్టర్, “మీరు చాలా అదృష్టవంతులు…ఈవిడ సమయానికి తేవడం వల్ల ఈ పాప బ్రతికింది. ఏ మాత్రం ఆలస్యం అయినా పిల్ల మనకి దక్కేది కాదు” అన్నాడు.

“మా పిల్లకు పునర్జన్మ ప్రసాదించావు… పిన్నీ, నిన్ను అర్దం చేసుకోలేదు మమ్మల్ని క్షమించు” అంటూ మాణిక్యం, సుశీల….జానకమ్మ కి కృతజ్ఞతలు తెలిపారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!