వింత ప్రేమ

వింత ప్రేమ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

    “హలో ఎవరండీ లోపల” అన్నది డోర్ బయట నిలిచున్న రమణి.
“ఎవరు మీరు. ఏం కావాలి” అన్నది మధుర.
“చూడు పాప, మీ ఇంట్లో పెద్దవాళ్ళని పిలువమ్మా” అన్నది రమణి.
“అమ్మా, ఎవరో ఆంటీ వచ్చారు” అన్నది లోపలున్న తల్లికి వినపడేలాగ మధుర.
“ఎవరే” అంటూ బయటకు వచ్చిన పరిమళ.
“ఏంటమ్మా తొందరగా చెప్పు లోపల పని ఉంది నాకు” అంటూ తల ఎత్తిన పరిమళకు ఎదురుగా తన స్నేహితురాలు రమణి కనిపించింది.
“ఏయ్ రమణి నీవా! ఇలా వచ్చావేంటే?” అన్నది ఆశ్చర్యంగా పరిమళ.
“ఏం లేదు. చాలా రోజులైంది కదా నిన్ను చూసి. అందుకే ఒకసారి చూద్దామని వచ్చిన” అన్నది రమణి.
“అది కాదులే ఏదో పని మీద వచ్చి ఉంటావు. రా లోపలికి” అంటూ చేయిపట్టి లోపలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది.
“ఊ ఇప్పుడు చెప్పు ఏంటి సంగతులు” అన్నది పరిమళ.
“ఏమి చెప్పను నీ ఉద్యోగంలా కదలకుండ సీటులో కూర్చుని చేసుకునే ఉద్యోగం కాదు నాది. స్కూల్లో పిల్లలతో అరచి అరచి పాఠాలు చెప్పడమే కాకుండ, మధ్య మధ్యలో ఎలక్షన్ డ్యూటీలు, జనాభా లెక్కల డ్యూటీలు, ఎకనామికల్ సర్వేలు, ఈ సర్వేలని ఆ సర్వేలని రోడ్ల మీద తిరిగే ఇలాంటి డ్యూటీలు కూడ ఉంటాయి మాకు. ఇదిగో అలాంటి డ్యూటీ పైన వచ్చాను. ఎకనామికల్ సర్వే చేస్తున్నాను. ఇది మీ ఇల్లని తెలియదు. నీవు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పు తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం” అన్నది రమణి.
“సరే అడుగు” అన్నది పరిమళ.
“ఇంటి యజమాని పేరేంటో చెప్పు” అన్నది రమణి.
“యజమాని పేరు పరిమళ. రాసుకో” అన్నది పరిమళ.
“అది కాదు మీ వారి పేరు, పిల్లల పేర్లు వగైరా చెప్పు” అన్నది రమణి.
“నేను చెప్పినట్టు రాసుకో. యజమాని పేరు పరిమళ. పిల్లలు మధుర, మధు. వాళ్ళ నాన్న పేరు రాజేందర్” అన్నది పరిమళ.
“మీ వారు ఏం చేస్తుంటారు” అని అడిగింది.
“ఏమీ చేయరు”
“మరి ఇల్లు ఎలా గడుస్తుంది” అన్నది రమణి.
“నేనే యజమానినని చెప్పానుగా. నేనే బ్యాంకులో జాబ్ చేసి నా భర్తను, నా పిల్లలను పోషిస్తున్నాను”
“అంటే మీ వారి ఆరోగ్యం బాగుండదా? ఏమి పని చేయలేకపోతున్నారా!?” అన్నది రమణి.
“మా వారి ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు, శుభ్రంగా ఉన్నారు” అన్నది పరిమళ.
“మరి ఏదైనా పని చేయొచ్చు కదా!”
“నేను మా ఆయనను బయటకు పంపను”
“ఎందుకు” అని అడిగింది రమణి.
“మా వారి చేయి వణికి మా వారు పనిచేసే దగ్గర చేయి మిషన్లో పడితే, కంపెనీ పై కేసు పెడతామని వాళ్ళు పనికి రానివ్వట్లేదు”.
“చేయి ఎందుకు వణుకుతుంది” అన్నది రమణి.
“మా వారు బాగా డ్రింక్ చేస్తారు. అందుకే చేతులు వణుకుతాయి” అన్నది పరిమళ. “మరి నీవు ఆయన్ని తాగకుండా చూసుకోవచ్చు కదా!” “నేను అతనికి కాపలా కాస్తూ కూర్చుంటే మాకు తిండికి ఎలా గడుస్తుంది. అయినా అతనేమన్న చిన్న పిల్లవాడా కాపలా కాయడానికి. నేను నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. ప్రతి రోజు నా పిల్లలను స్కూల్లో వదిలిపెట్టి డ్యూటీకి వెళుతుంటాను. నేను ఇంటికి వచ్చేసరికి మా ఆయన సారాయి దుకాణంలోనో, బార్లోనో దూరతాడు. అందుకే ఇంట్లో పెట్టి తాళం వేసి వెళతాను లేకపోతే సారాయి దుకాణానికో బార్ కో ఆయన కొరకు వెళ్ళానంటే తాగిన మత్తులో అక్కడనే నన్ను అమ్మేసి ఆ డబ్బులతో తాగేసే ఆవకాశాలున్నాయి” అన్నది పరిమళ నవ్వుతూ. “అదేంటే అంత వింతగా మాట్లాడుతావు. అతను తాగకుండా ఏదైనా ఉపాయం చూడాలి. కానీ అలా ఇంట్లో ఉంచి తాళం వేసేసి వెళ్లడం బాగుందా!” అన్నది రమణి. “అతనేమీ చిన్నపిల్లవాడా? తాగకుండా చూడడానికి. ఆ వ్యసనానికి లోనై డబ్బులు దొరకక పోతె ఇంట్లో విలువైన వస్తువులన్నీ అమ్మేసి తాగేసేవాడు. అయినా అతని ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం కదా!. యాభై లక్షలు పెట్టి కొనిచ్చారు ఈ మనిషిని మా అమ్మ వాళ్లు” అన్నది పరిమళ. “అదేంటి అతన్ని యాభై లక్షలు పెట్టి కొన్నావా!. అదేంటి”.
“అవును. యాభై లక్షల కట్నం ఇచ్చి కొన్నారు నా భర్తని నా కొరకు. నాలుగు వేల రూపాయలు పెట్టి కొన్న చీరనే మనము జాగ్రత్తగా మడత పెట్టి బీరువాలో దాచుకుంటాం…అలాంటిది 50 లక్షలు పెట్టి కొన్న సరుకు కదా! నా భర్త. అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఇంట్లోనే దాచి పనికి వెళ్తాను.” అన్నది పరిమళ నవ్వుతూ. “అదేంటి అతనేమైన ఖైదీనా. అలా తాళం వేసి వెళ్లడానికి. అది నేరం కదా”! అన్నది రమణి. “ఖైదీ ఎలా అవుతాడు. అతనికి రూమ్లో కావలసిన సౌకర్యాలు అన్ని కల్పించే వెళతాను నేను. టీవీ, సెల్లు, రేడియో, పేపరు, తినడానికి చిరుతిళ్ళు, తాగడానికి మజ్జిగ, పాలు, ఫ్రూట్ జ్యూస్ లు చదువుకోడానికి పుస్తకాలు అన్ని అమర్చి వెళతాను. ఇంకేం కావాలి అంతకంటే” అన్నది పరిమళ. “అదేంటి అలా అంటావ్. అతను మనిషి. అతనికి ఫ్రెండ్స్ ని కలవాలని, తల్లిదండ్రులను కలవాలని, ఫంక్షన్స్ కి వెళ్లాలని, బంధుమిత్రులను కలవాలని ఉండదా!. బందీ చేసేస్తున్నావేంటి నీ భర్తని. నీవేమైన అనుకో నీ ప్రవర్తన కౄరంగా ఉంది” అన్నది రమణి.  “అలా అనుకునే కొన్ని రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. వాళ్ళు వస్తూ వస్తూ పెద్ద, పెద్ద బాటిల్స్ తెచ్చి మా వారిని  చెడగొట్టడానికి ప్రయత్నించారు. అందుకే వాళ్ళు ఎవ్వరిని రాకుండా కట్టడి చేశాను. ఆయన తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. కానీ అతను మాత్రం బయటకు పోవడానికి వీల్లేదని కచ్చితంగా చెప్పాను’ అన్నది పరిమళ. “మరి వాళ్ళు తమ కొడుకుని ఇలా తాళం వేసి బంధిస్తే ఏమనరా” ఎందుకంటారు. వాళ్ళు అతన్ని నాకు 50 లక్షలకు అమ్మేశారు. ఇంక వాళ్లకేమి హక్కుంది. అయినా వాళ్ళు అతనితో “కోడలు వచ్చేవరకు ఇంటి పనులు, వంట పనులు చేయవచ్చు కదా!” అని బుద్ధి చెప్పి వెళతారు” అన్నది పరిమళ. “మరి మీ పిల్లలు వాళ్ళ నాన్నని అలా రూమ్లో బందీ చేస్తే పిల్లలు బాధ పడరా!” అన్నది రమణి.
“మా పిల్లలకి కూడా అతను అలా ఇంట్లో ఉండడం ఇష్టమే. అతను బయటకెళ్ళి డ్రింక్ చేసి వస్తే పిల్లలను కోప్పడతాడు. ఇంట్లో అంతా గందరగోళం చేసి, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అందుకే అతను ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి పిల్లలతోనూ నాతోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తున్నాడు. చాలా బాగుంటాడు. అందుకే నేను అతనిని అలా ఉంచడం ఎవరికీ అభ్యంతరం లేదు. అతనికి కూడా తనపై తనకు నమ్మకం లేదు. అతను ఇంటి నుండి బయటకు వెళ్తే అతనికి తెలియకుండానే తాగడానికి ప్రయత్నిస్తాడు. అందుకని అతనికి కూడా బయటకు వెళ్లాలని పెద్దగా ఆసక్తి లేదు” అన్నది పరిమళ.  “మరి నీకనిపించదా! అతడు అందరిలాగా ఉద్యోగం చేసి, డబ్బులు సంపాదించి, మిమ్మల్ని పోషించాలని. అలా ఇంట్లోనే ఉంటే బాధగా అనిపించదా” అన్నది రమణి. “ఎందుకు బాధ. ఎందరో భర్తలు తమ భార్యలను పోషిస్తున్నారు.  భర్తలు భార్యలను పోషించినప్పుడు, భార్యలు భర్తను ఎందుకు పోషించకూడదు” అన్నది పరిమళ.
“ఇలా ఎన్ని రోజులు మరి” అన్నది. “అతనికి జ్ఞానోదయమై ఇక జన్మలో తాగానని ఉద్యోగాన్ని వెతుక్కుని చక్కగా చేసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ మళ్ళీ మొదట కొచ్చి తన ఆరోగ్యం పాడు చేసుకుంటే, నన్ను పిల్లలను ఇబ్బంది పెడితే, మళ్లీ ఇదే పరిస్థితి ఉంటది. మా ఆయన అంటే నాకు, మా పిల్లలకు చాలా ప్రేమ. అందుకని నా ఉదాసీనతతో మా ఆయన దారి తప్పి ఆరోగ్యం పాడు చేసుకుని, మళ్ళీ ఇంట్లో గొడవలు చేసే కంటే, మాకు ఇలా చూసుకోవడం ఏమి ఇబ్బంది లేదు. ఆయనకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఆయనకు కానీ ఆయన తల్లిదండ్రులకు గాని ఏమీ అభ్యంతరము లేదు. అతని ఆరోగ్యమే మాకు ముఖ్యం అన్నారు వాళ్ళు. మా అమ్మ, నాన్నలు ‘నీ భర్తను మార్చుకునే విషయంలో మేము కల్పించుకోదల్చుకోలేదు’ అని హామీ ఇచ్చారు. ఇప్పుడు మా వారిని మధ్య మధ్యన షాపింగ్ కి, సినిమాలకి తీసుకెళుతున్నాను. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. నా భర్త అంటే నాకు ప్రాణం. అందుకే అతనిని ఒంటరిగా బయటకు పంపి, నా సంసారంలో చిక్కులు తెచ్చుకోలేను. నా పిల్లలను మంచిగా చదివించి, మంచి భవిష్యత్తును ఇస్తాను. నాకు చేతనైనంత వరకు మా ఆయనను పోషిస్తాను” అన్నది పరిమళ. “ఏమో నీ పద్ధతి చాల వింతగా ఉన్నది. తాగు బోతుల భార్యలందరు వాళ్ళతో పోట్లాడి, రచ్చ చేసి వాళ్ళ వ్యసనాన్ని మాన్పించడానికి ప్రయత్నించడం చూశాను. కాని నీలాగ బంధీని చేసి వ్యసనం మాన్పించాలని అనుకునే వాళ్ళని ఎవరిని చూడలేదు” అన్నది రమణి. ఈ విధంగా చేయడానికి నేనెంత క్షోభననుభవించానో నీకేమి తెలుసు!. ఎన్నో ప్రయత్నాలు చేసి ఏవి ఫలించక ఈ విధంగా చేస్తున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!