బాధ్యత

బాధ్యత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అద్దంకి లక్ష్మి

   గోపాల్ రావు గవర్నమెంట్ లో క్లర్కుగా పనిచేసేవాడు. ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి సీత పన్నెండో తరగతి, రెండోవాడు శీను టెన్త్ క్లాస్. మూడో అమ్మాయి ఎనిమిదవ తరగతి. భార్య సుశీల ఎంతో పొదుపుగా సంసారం చేసేది. చదువుకోలేదు, అమాయకురాలు. ఇంతలో పిడుగుపాటుగా గోపాల్ రావుకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు. కుటుంబం అస్తవ్యస్తమైపోయింది. తల్లి మానసికంగా కృంగిపోతోంది. ‘పెద్ద కూతురుగా తన బాధ్యత ఏమిటి అని సీత ఎంతో ఆలోచించుకుంది’. ఇప్పుడు తన తల్లి మీద కుటుంబం బాధ్యత పడింది. ఆమె చదువుకోలేదు. ఈ బాధ్యత బరువు ఎలా మోస్తుంది. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చింది సీత. దాంతో సీత చదువు ఆపేసి సంసార బాధ్యత నెత్తిన వేసుకుంది. కంపెనీలో క్లర్కుగా పని చేసి సంసారాన్ని పోషించి తల్లికి కష్టం లేకుండా చూసుకునేది. సీతతో పనిచేస్తున్న వెంకట్ ఆమెను, ఆమె సహనశీలతను ఎంతగానో ప్రేమించేవాడు. పెళ్లి చేసుకుందాం అంటూ అడుగుతుండేవాడు. కానీ సీత నిశ్చయమైన అభిప్రాయము తెలియజేసింది. “జీవితంలో ప్రేమ, పెళ్ళే ముఖ్యం కాదు తనకున్న బరువు బాధ్యతలను ముందు తీర్చుకోవాలి.
తన తండ్రి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతే ఆ కుటుంబ బాధ్యత అంతా తను నెరవేరుస్తున్నాను అది అయ్యేవరకు పెళ్లి ప్రేమ సంగతే ఎత్తేది లేదు అని కచ్చితంగా చెప్పేసింది”.  తమ్ముడు మంచి తెలివైనవాడు మంచి మార్కులతో పాస్ అవుతూ ఉండేవాడు. తమ్ముని స్కాలర్షిప్పుల తో ఇంజనీరింగ్ చదివించింది. తల్లికి ఎప్పుడు ధైర్యం చెబుతూ ఆమెకి ఏ లోటు లేకుండా చూసుకునేది. తల్లి అమాయకురాలు సీత మీద భారం వేసి ప్రశాంతంగా సంసారాన్ని నడిపేది. చెల్లెలుకి డిగ్రీ వరకూ చెప్పించింది. తమ్ముడుకి పెద్ద కంపెనీలో జాబ్ దొరికింది. చెల్లెలి కూడా బ్యాంకులో ఉద్యోగం దొరికింది.  10 సంవత్సరాలు కష్టపడితే సంసారం స్థిరపడింది. పెద్ద కూతురుగా తాను తన బాధ్యత తీర్చుకుంది. తమ్ముడికి, చెల్లెలికి, ముందుగా పెళ్లిళ్లు చేసి వారిజీవితాలు స్థిరపరచింది. వెంకట్ అంత వరకు ఆమె గురించి వేచియున్నాడు. అసలైన ప్రేమ అంటే అదే. ఎన్నో సంబంధాలు వచ్చాయి. తల్లిదండ్రులు బాగా పోరు పెట్టారు. అయినా తాను సీతనే పెండ్లాడతానని నిశ్చయించుకున్నాడు.సీతా వెంకట్ల పెండ్లి వైభవోపేతంగా జరిగింది. బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు సీత యొక్క బాధ్యత, విశాల హృదయాన్ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు. తల్లిని తన దగ్గర పెట్టుకుని, ఆమెకు ఎంతో సేవలు చేసేది. కూతురి కున్న సహనము, ఓర్పు ఈ రోజుల్లో కొడుకులకు కూడా లేదని బంధుమిత్రులు ఎంతో ప్రశంసించారు. “ప్రేమంటే కేవలం మాటలే కాదు, బాధ్యత బరువు, ప్రేమానురాగాలు చూపించాలి.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!