గోదారోడి గోడు

గోదారోడి గోడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

“మహారాజశ్రీ పూజ్యులైన నాన్నగార్కి,
నమస్కారములతో వ్రాయునది ఏమనగా!”
నిన్న ఉదయం పదిగంటలకల్లా ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాము. మన చిట్టిలంకలో బయల్దేరిన మేము పడవలో రాజమండ్రి చేరుకొని, ఎప్పటిలాగే గోదావరి ఎక్స్ప్రెస్ లో కాజీపేట చేరుకొని, ఆ తరువాత జమ్మూతావి జనతా ఎక్స్ప్రెస్ లో రామగుండం చేరుకొని, బస్సులో గోదావరిఖని చేరుకొన్నాము‌. ఈ రోజు ‘బి’ షిఫ్ట్ పంప్ హౌస్ డ్యూటీలో ఉండి, మీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నా మనసంతా నీరుకారినట్లై, అది కళ్ళవెంబడి జాలువారి, ఈ గోదారి నీటిలో కలిసిపోయింది. బహుశా ఈ నీరు మన ఊరికి చేరేసరికి నేను వ్రాస్తున్న ఈ ఉత్తరం మీకు చేరగలదు. “నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఇలా ఉద్యోగరీత్యా స్థిరపడిపోయినా, నలుగురు పిల్లల తండ్రినైనప్పటికీ, ఏమిటో ఎందుకో తెలియని బాధతో నా మనసు మాత్రం కుదుటపడడం లేదు”. అమ్మను, మిమ్ములను, పొలాలను, పశుసంపదను, ఆప్యాయంగా పలకరించే చుట్టాలు కానటువంటి బంధువులను, స్నేహితులను మరువలేకపోవుచున్నాను. “ఈ నలభై ఏళ్ళుగా దిగువగోదారికీ, ఎగువగోదారికీ సుమారు రెండువందల పర్యాయాలకు పైగా ప్రయాణాలు చేసినా ప్రతీసారి వీడ్కోలుకీ మీరిద్దరూ మా ఇద్దరితో పాటు కళ్ళు చెమర్చుకోవడం రివాజుగా వస్తోంది. “పరవాలేదు, ఇక్కడి పనుల్లోపడి మెల్లమెల్లగా ఆ బాధలు మరచిపోతాను”. అమ్మ చేసి ఇచ్చిన మినపసున్నుండలు, మీరు మన చేనులోంచి తవ్వి తీసి ఇచ్చిన తేగలు, కడియం జామకాయలు, వగైరాలు ఎప్పటివలె ఇక్కడ ఇరుగుపొరుగు వారికి పంచడమైనది. మనం ఇచ్చేవాటికి ఎదురు చూడకుండా వీళ్ళందరూ నిర్మలమైన మనస్సుతో ఆదరించడం, ఆప్యాయత చూపడం, “ఏ విషయంలోనైనా లొసుగులు లేకుండా కచ్చితంగా ఉండడం వీళ్ళ గొప్ప లక్షణాలు.” వీళ్ళని వదిలి రావాలన్నా మనసంతా పీకుతుంటాది. “ఒకొక్కసారి అనిపిస్తుంటాది గోదారి నీళ్ళు అటువంటివేమోనని! సగటు గోదారోడి గోడు ఇలాగే ఉంటాదేమో! “అమ్మకు నమస్కారములు. వీలు చూసుకుని అక్కడి సమాచారములతో తిరిగి ఉత్తరం వ్రాయండి. ఎప్పటిలాగే మీరు సరదాపడే విధంగా చాలా ఎక్కువ సమాచారాన్ని “ఈ పావలా పోస్ట్ కార్డ్ లో చిన్న చిన్న నల్లపూసలు పేర్చినట్లు వ్రాసేను. ఆ నేర్పరితనం, “ఆ ఓరిమితనం మీ ఇరువురి నుండి నాకు వరంగా లభించిందని సగర్వంగా తలుచుకుంటాను.
ఇట్లు
మీ అబ్బాయి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!