జ్యోతి

జ్యోతి

రచన: ఐశ్వర్య రెడ్డి

జ్యోతి కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళింది,తన ఫ్లాట్ కి బెల్ కొట్టగానే, డోర్ ఓపెన్ చేసిన తన రూమ్ మేట్ సుమ ను చూసి, సుమ నాకు పర్మిషన్ దొరికింది, ఐదు సంవత్సరాలుగా కష్టపడితే ఇప్పుడు నాకు ఇండియా వెళ్లడానికి అవకాశం లభించింది  తెలుసా అని సంతోషంతో తబ్బిబ్బవుతు లోపలికి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది జ్యోతి ,ఇన్ని రోజుల కైనా నీ పిల్లల్ని కలుసుకుంటావని కానీ  బాధగా  కూడా ఉంది. నా ప్రెండ్  వెళ్లి పోతున్నందుకు అంది సుమలత బాధపడకు సుమ
మీ నాన్న పోయారని కదా నువ్వు ఇక్కడికి వచ్చి  కష్టపడి డబ్బులు పంపిస్తూన్నావు, ఇంకో
సంవత్సరము నువ్వు కష్టపడితే నీ తమ్ముడు చదువు అయిపోవడం, నీ చెల్లి పెళ్ళి కి డబ్బు అన్ని సమకూరుతాయి. అవును జ్యోతి మా అమ్మ బాధ చూడలేక నాకు తెలిసిన వారు చెపితే ఇక్కడ కు వచ్చాను. నేను ఇంత కష్టపడింది, మా అమ్మ తమ్ముడు చెల్లి కోసమే, వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు అంది సుమ కళ్ల నిండా నీళ్లతో నువ్వు ఇండియా వచ్చాక ఇద్దరం కలుసుకుందాం లే నువ్వేం బాధపడకు సుమా అంది జ్యోతి. సుమ నీకు తెలుసా నేను ఎన్ని రోజులుగా కలలు కంటున్నాను నా పిల్లలు ను చూడాలని, పాపం పసి పిల్లల్ని వదిలేసి వచ్చాను దుబాయ్ కి, ఇప్పుడు ఎలా ఉన్నారో ఏమో, ఇంకా ఎందుకు బాధ పడతావు జ్యోతి ఇప్పుడు వెళ్తున్నావుగా, ఇంక నీ పిల్లల దగ్గరే ఉండు ఎలాగు నువ్వు మళ్ళీ దుబాయ్ కి రావు కదా అంది సుమ. ఇంకా రావడమా ఈ నరకం చాలదా, అక్కడ ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాను కానీ మళ్ళీ రాను, అప్పుడు కూడా బలవంతంగా నా మొగుడు పంపించాడు, తాగుబోతు, తిరుగుబోతు, ఊరినిండా అప్పులు చేసి ఉన్న భూమి ఇల్లు అంతా ఊడ్చేశాడు ఇంకా అప్పులోల్ల తిట్లు భరించలేక ఏడుస్తుంటే, తన బందువు ఓకామె  చెప్పిన దాన్ని బట్టి, అప్పటికప్పుడు నన్ను ఒప్పించి, పసిపిల్లలను నేను చూసుకుంటాను, అని  నన్ను పంపించాడు మూడు సంవత్సరాల పాప, సంవత్సరన్నర బాబు, ఎయిర్ పోర్ట్ లో నా చేతుల నుండి లాగేసుకున్నాడు, ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా నా ప్రాణం పోతున్నట్టు అవుతుంది. పిల్లాడు పాలు కూడా మానలేదు, ఎంత నరకం అనుభవించానో, చాలు నా పిల్లలు అనుభవించింది కూడా చాలు, ఇంక నా పిల్లల తోటి ఉంటాను. నేను వారిని వదిలి ఎక్కడికి వెళ్లను, అంది సంతోషంగా అన్నీ సర్దుకోంటూ.
ఇప్పుడు హ్యాపీగా రెస్ట్ తీసుకో, రెండు రోజులు టైం ఉంది కదా సర్దుకోవడానికి అంది సుమ
లేదు సుమా ఇప్పటినుండి సర్దుకుంటేనే అన్నీ అవుతాయి మళ్ళీ మర్చిపోతాను, రేపు పిల్లలకు కావలసిన బొమ్మలు బట్టలు అన్ని తీసుకోవాలి ,
ఇన్ని రోజుల తర్వాత వెళ్తున్నాను కదా పిల్లలు మా అమ్మ ఇది తెస్తుంది, అది తెస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు, అంటూ అయ్యో నా మతిమండా మా ఆయనకు చెప్పాలి కదా మర్చిపోయాను అంటూ ,వెంటనే తన భర్త కు ఫోన్ చేసింది జ్యోతి.
ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసాడు తన భర్త అయిన సుధాకర్ ఆ జ్యోతి చెప్పు బాగున్నావా!
ఆ బాగున్నానండి ,పిల్లలు ఎలా ఉన్నారు, నాతో అసలు  మీరు మాట్లాడించటం లేదు పిల్లలని
అందుకే నేను వస్తున్నాను ఇంకా అంది జ్యోతి.
నువ్వు రావడమేమిటి 5సంవత్సరాల కాంట్రాక్ట్ కదా.
ఐదు సంవత్సరాలు పూర్తయింది మరిచిపోయారా
అవునా ! సరే ఎప్పుడు వస్తున్నావు, ఎల్లుండి ఉదయం బయలుదేరుతున్నాను అండి, మనము ఉంటున్న పాత ఇంటికే కదా రావల్సింది. నువ్వు అయితే రా ఎయిర్ పోర్ట్ లో దిగాక నేను తీసుకెళ్తాగా, నువ్వు దిగే టైం కి నేను ఎలాగూ వస్తాను కదా అన్నాడు తన భర్త సుధాకర్, సరేనండి అంది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగింది
అటూ ఇటూ చూసింది చాలా సేపు, తన  కోసం ఎవరు రాలేదు. భర్తకు ఫోన్ చేసింది ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఏంటి ఈయన రాలేదు అనుకుంటూనే కళ్లలో నుండి గంగ కురుస్తుంది. తెలిసిన చుట్టాలకు ఒక్కొక్కరిగా ఫోన్ చేయ సాగింది. ఒక్కొక్కరు ఒక్క విషయం చెబుతున్నారు. నీ భర్త  నువ్వు  వెళ్లిన వెంటనే ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. నీ పిల్లల్ని అమ్మేశాడు అని,చాలా  కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్న తర్వాత జ్యోతి కి బుర్రంతా తిరిగి నట్లయింది.
రెక్కలు ముక్కలు చేసుకొని రక్తమాంసాలు కరిగిస్తూ ఒక్క రూపాయి కష్టపడి సంపాదించింది. ఇల్లు కట్టుకోవాలి పిల్లలను మంచిగా చదివించాలని  ఎంతో కష్టపడింది. ఒక్క రూపాయి తన దగ్గర ఉంచుకోకుండా అన్ని డబ్బులు పంపింది భర్త కు
ఇప్పుడు భర్త జాడ లేదు, తను ఉండటానికి ప్రస్తుతానికి వాళ్ల బాబాయి ఇల్లు ఉంది. హైదరాబాద్ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరులో అక్కడికి కారు మాట్లాడుకుని వెళ్ళింది. జ్యోతిని చూచి వాళ్ళ బాబాయ్ పిన్ని చాలా సంతోషపడ్డారు. క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడం తినడం పూర్తయిన తర్వాత జ్యోతి వాళ్ళ బాబాయ్ తో ఏమైంది బాబాయ్ ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడిగింది. నాకు కూడా తెలియదు అమ్మ
నువ్వు దుబాయ్ వెళ్ళిపోగానే మీరు ఉన్న ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లి పోయాడు. అప్పటి నుండి మాకు కూడా తన గురించి సరిగ్గా ఏమీ తెలియదు, అసలు ఇంతవరకు నేను చూడలేదు కాకపోతే మనకు తెలిసిన ఒక అతనికి మొన్న హైదరాబాదు లో కనిపించాడట అదేదో అడ్రస్ చెప్పాడు అమ్మ, అక్కడ ఏదో షాప్ పెట్టుకున్నాడంట, రేపు అతనికి ఫోన్ చేసి ఎక్కడ చూసావు అని అడుగుతాను
అయినా జ్యోతి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు,   ఇద్దరు పిల్లల్ని వదిలి పెట్టి అంతదూరం వెళ్లావు ,భర్త మాటలు నమ్మి కష్టపడ్డావు, ప్రతి రూపాయి పంపించావు, నీ డబ్బులతో అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు పిల్లలని ఏం చేసాడో ఏమో
కనీసం పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడావా. లేదు బాబాయ్ ఇన్ని సంవత్సరాలలో పిల్లలతో నన్ను ఎప్పుడు మాట్లాడించలేదు, పడుకున్నారు అని, స్కూల్ కి వెళ్ళారు అని, బయట ఆడుతున్నారు అని ఇలా ఏదోఒకటి చెప్పాడు అంది జ్యోతి. నువ్వేం బాధపడకు జ్యోతి నేను తెలుసుకుంటాలే అని చెపుతుంటే, చాలా పోద్దుపోయింది. బోజనానికి రండి అని పిన్ని పిలవవగానే బోజనాలు  కానిచ్చి పడుకున్నారు. జ్యోతి కి నిద్ర రావటం లేదు.
ఎప్పుడు తన పక్కన పిల్లాడు పడుకొని  ఉన్నట్టు, పాప ఎప్పుడూ అమ్మ అమ్మ అని పిలుస్తున్నట్టు ఎప్పుడు పిల్లల గురించి ఆరాటం వాళ్ళని చూడాలని  ఎంత తొందర పడిందో ఇప్పుడు అంత దూరం చేసాడు దేవుడు, దేవుడా నా పిల్లలు ఎక్కడ ఉన్నారు నా భర్త నన్ను ఎందుకు ఇంత మోసం చేశాడు, నా పిల్లలు నాకు కనబడేటట్టు చూడు .
ఆ దుర్మార్గుడు నా డబ్బులు అన్నీ తీసుకొనివ్వు కష్టపడి మళ్లీ సంపాదించుకుంటాను. కానీ నా పిల్లల్ని మాత్రం  నాకు దూరం చేయకు అని రాత్రంతా పడుకొని ఏడుస్తూనే ఉంది . పొద్దున 10 గంటలకు ఏమైంది బాబాయ్ ఏమైనా తెలిసిందా ఆయన గురించి, ఆ తెలిసింది అమ్మ ఇదిగో ఈ అడ్రస్ లో అతని షాప్ ఉంది. సరే బాబాయ్ నేను వెళ్తాను. నువ్వు ఒక్కదానివే కాదు  తమ్ముడిని తీసుకొని వెళ్లు, బాబాయి ఎందుకు నేనొక్కదాన్నే వెళ్ళగలను కదా! వెళ్లగలవు తల్లి, కాకపోతే తమ్మున్ని కూడా తీసుకెళ్ళు ఎందుకైనా మంచిది అన్నాడు వాళ్ళ బాబాయ్. సరే అని ఇద్దరూ బండి మీద వెళ్లారు ఆఅడ్రస్ కి అది ఒక బట్టల షాపు అక్కడ కౌంటర్లో ఒక లేడి కూర్చుంది. జ్యోతి భర్త ఎక్కడ కనబడలేదు, అప్పుడు జ్యోతి
అరె తమ్ముడు మీ బావ పేరు చెప్పి ఎక్కడ ఉంటాడు అతడి వివరాలు ఏమిటి అని ఒక ఫోటో చూపించి అడిగిరా ,ఆ క్యాష్ కౌంటర్ లో కూర్చున్న ఆవిడను చెప్పింది జ్యోతి. వాళ్ళ తమ్ముడు చిన్న వెళ్లి క్యాష్ కౌంటర్ లో కూర్చున్న  ఆవిడను, ఏమండీ ఇక్కడ సుధాకర్ అని ఎవరైనా ఉన్నారా ,ఈ షాప్ ఆయనదేనని  విన్నాము అని అన్నాడు. ఏంటి సుధాకరా, మా ఆయనే రోజు  ఇక్కడే  ఉంటారు.
ఈరోజు పని ఉండి రాలేదు అంది ఆవిడ, మళ్లీ పోటో చూపించి అడిగాడు చిన్న. మా ఆయనేనండి  ఎన్ని సార్లు చెప్పాలి. అయిన మీరు ఎవరు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు  అడిగింది ఆవిడ
మేము ఆయనకు దూరపు చుట్టాలవుతామండి   అని వచ్చేశాడు చిన్న జ్యోతి దగ్గరకు ఆ షాపు ముందే చెట్టునీడలో కూర్చుని సుధాకర్ వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు పిల్లలు కార్ లో వచ్చి అమ్మ అమ్మ అంటూ అరుస్తూ ఆ క్యాష్ కౌంటర్ లో ఉన్న ఆవిడ దగ్గరికి పరిగెత్తారు. అక్క వాళ్ళు నీ పిల్లలే కదా చూడు అన్నాడు చిన్న. అవున్రా  అవును  బన్నీ చిన్ని ఇద్దరు ,మరి ఆవిడనీ   అమ్మ అంటున్నారు
అక్క ఏముంది రా నన్ను డబ్బులు, సంపాదించడానికి పక్కకు పెట్టాడు. ఆమెను  నా పిల్లలకి తల్లి ని చేశాడు. నేను ఇలా బొమ్మ నై మిగిలాను, ఏమిటి అక్క ఈ అన్యాయం అన్నాడు చిన్న, ఏం చేయాలి రా, నాకు  నా పిల్లలని ఒకసారి దగ్గరికి తీసుకోవాలని ఉందిరా పద రా ! అంది జ్యోతి వస్తున్న ధుఖాన్ని ఆపుకుంటూ షాప్ లోకి వెళ్ళారు ఇద్దరూ కలిసి ఏ సారీస్ కావాలండి మీకు అని అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అడిగింది. అన్ని రకాలు చూపించండి అని చెప్పింది జ్యోతి కానీ తన చూపులు  పిల్లల మీద ఉన్నాయి.పిల్లలు ముద్దు ముద్దుగా వాళ్ళ అమ్మ కాని అమ్మ తో మాట్లాడుతున్నారు.మేడం మేడం మీరు ఇక్కడ చూడండి ఆటు చూస్తున్నారు అంది సేల్స్ గర్ల్
ఆ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి వాళ్ళు ఎవరు అని అడిగింది జ్యోతి, మా ఒనర్ గారి పిల్లలు అండి చాలా మంచి పిల్లలు ఎంత ముద్దు ముద్దు గా మాట్లాడతారు మళ్లీ ఎంత అందమో వారిది
నిజంగా అంత మంచి పిల్లలు ఉన్నా మా ఓనరమ్మ చాలా అదృష్టవంతురాలు అని మెచ్చుకుంది. గుండె చెరువైంది జ్యోతి కి తలంతా  బాదుకోని ఏడ్వాలనిపిస్తూంది.అయిన తనను తాను సంబాలించుకోని పిల్లల దగ్గరకు వెళ్లి
తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న చాక్లెట్లు తీసి
పిల్లలు ఈ చాక్లెట్ తీసుకోండి అని చెప్పింది.
ఆ పిల్లలు తీసుకోకుండా వాళ్ళ అమ్మ మొఖం చూశారు. అమ్మ తీసుకోండి అని సైగ చేస్తే ఆ పిల్లలు చాక్లెట్ తీసుకున్నారు. ఇద్దరు థాంక్స్ ఆంటీ అని చెప్పారు. జ్యోతి షాప్ నుండి బయటకి వచ్చి తమ్ముడు బండి తీయరా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పింది. మనసంతా ఎవరో మెలి పెట్టి నట్లుగా  ఎవరికి చెప్పుకోలేని ఎటు తెల్చుకోలేని సందిగ్ధంలో
కన్నతల్లి కడుపు కోత, ఆకాశమంత ఆక్రందన మనసులో భరిస్తూ నిలకడగా నే ఉంది. మళ్లీ తెల్లవారగానే తన భర్త  కోసం అదే షాపు ముందర వెయిట్ చేస్తుంది. ఈ సారి తమ్ముడు తో రాలేదు ఒక్కతే వచ్చింది ,చావో రేవో  తెల్చుకుందామని
సుధాకర్ వచ్చి షాపు ఓపెన్ చేస్తున్నాడు తన పక్కనే వెళ్లి నిల్చుంది జ్యోతి,చూసి ఆశ్చర్యపోయాడు సుధాకర్. నేను నీతో మాట్లాడాలి అంది జ్యోతి. ఇక్కడ కాదు పదా అని తన కార్ ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు  సుధాకర్ ఊరికి దూరంగా ఇద్దరూ ఒకచోట నిల్చున్నారు. ఏమిటి సుధాకర్  నా పిల్లలకి ఎవరినో అమ్మను చేశావు
నేను ఉండాల్సిన ప్లేస్ లో ఎవరో ఉన్నారు అసలు ఏంటి ఇదంతా , నేను నా కష్టంతో పంపించిన ప్రతీ  రూపాయి తో సుఖపడుతున్నావ్ నన్ను మాత్రం ఇలా బజార్లో పడేసావ్ వాడుకొని అంది కోపంగా  జ్యోతి నేను మగవాన్ని ఐదు సంవత్సరాలు ఎలా ఉంటాను అనుకున్నావు ఆడదాని తోడు లేకుండా
నాకు మాత్రం కోరికలు వుండవా! ఎన్ని రోజులు ఆగాలి నీ కోసం పిల్లలు అమ్మ అమ్మ అంటున్నారు. ఎక్కడినుండి తీసుకరాను నిన్ను అందుకే బాగా ఆలోచించి ఆమెని పెళ్లి చేసుకున్నాను, ఆమెకు బోలెడంత ఆస్తి ఉంది. కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదు, అందుకే నా పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటుంది. అలాగే నాకు మంచి భార్య లా ఉంటుంది ఇంతకంటే ఇంకేం కావాలి అందుకే పెళ్లి చేసుకున్నాను అన్నాడు సుధాకర్ ,అవునా మరి నా పరిస్థితి ఏంటి అంది జ్యోతి.ఇన్ని రోజులు ఎలా బతకావో అలానే  జ్యోతి, నీకేంటి మంచి ఉద్యోగం ఫారన్లో పిల్లల్ని,భర్తను వదిలేసి ఉండడం  నీకు  అలవాటైపోయింది కదా ! ఇంకా ఏముంది నీకు బాధ అన్నాడు సుధాకర్, చాలా గొప్పగా మాట్లాడావు సుధాకర్ ఊరినిండా నువ్వు చేసిన అప్పుల కోసం నన్ను బలిపశువును చేశావు, నా పిల్లలకి నన్ను దూరం చేశావు. నన్ను ఒంటరిదాన్ని చేశావు
నా డబ్బులు అన్నీ వాడుకున్నావు. నన్ను ఇలా మోసం చేయడానికి నీకు మనసేలా  వచ్చింది.
ఆపు జ్యోతి , నీ డబ్బులు నేనేమి వాడుకోలేదు
ఈరోజు నాకు షాపు ఇల్లు  కారు , ఇప్పుడు నా భార్య స్థానంలో ఉన్న ఆవిడే తీసుకు వచ్చింది
నువ్వు పంపిన డబ్బులు అప్పులు కట్టడానికే సరిపోలేదు, ఈ రోజు నీ పిల్లలు నేను ఇంత లగ్జరీగా బతుకుతున్నాం అంటే కారణం ఆవిడ, నువ్వు మా కోసం ఏమి చేయలేదు అన్నాడు సుధాకర్
ఇలా మాట్లాడటానికి నీకు నోరెలా వస్తుంది సుధాకర్ అంది జ్యోతి ఏడుస్తూ , ఏంటి జ్యోతి నీకు ఏదో తక్కువ ఐనట్టు మాట్లాడుతున్నావ్, అక్కడ షేక్లతో నువ్వు ఏం చేయలేదా ! ఖాళీగానే ఉన్నావా ఏంటి
పడక సుఖం, డబ్బు సుఖం, తిండి సుఖం అన్నీ అనుభవించావు కదా అనగానే, జ్యోతి సుధాకర్ దగ్గరికి వచ్చి ఆ చంప ఈ చంప వాయించి
ఒరేయ్ నీచుడా నువ్వు ఇంతసేపు మనిషివి అనుకుని మాట్లాడుతున్నాను. కానీ ఇంత దిగజారి పోయావని నాకు తెలియదు. నీ మాటలు నమ్మి నా పిల్లల్ని వదిలిపెట్టి నేను వెళ్లాను రా నీ కోసం
కానీ ఈ రోజు నా పిల్లలకి నన్ను దూరం చేసావు ఇంకా నేను చెడిపోయానని మాట్లాడుతున్నావా
నేను చెడిపోలేదు రా పగలు రాత్రి నా పిల్లల కోసం ఏడుస్తూ బతికాను. భౌతికంగా అక్కడ ఉన్నా…..నా మనసంతా నా పిల్లల దగ్గరే ఉంది రా, ఇంత దారుణంగా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. నా కళ్ళముందు నుండి వెళ్లి పోరా
వెళ్ళిపో, నీ మొహం చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది వెళ్ళిపో అంటూ ఏడూస్తూ కూలబడింది జ్యోతి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!