అసలు విషయం

అసలు విషయం

రచన :: కవితదాస్యం

వెంకట్ తో పెళ్లి నిశ్చయ మయినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్ కి పెద్దగా చదువు లేదు. చేసేది వ్యవసాయం తన ఫ్రెండ్స్ కి తెలిస్తే తనని చులకనగా చూస్తారనే భయం.
తన ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు. వాళ్ల ఇళ్లలో అంతా ఫారిన్ వస్తువులే, కట్టుబొట్టు అంతా హైక్లాస్ గానే ఉంటుంది.
తన సంబంధం గురించి ఫ్రెండ్స్ కి ముందే చెబితే సమస్య లేదనుకుని అందరికీ చెప్పేస్తుంది.
“యు ఆర్ రియల్లీ గ్రేట్” అంటూ అందరూ అఖిలని ఒకటే పొగిడేశారు. తనని ఆటపట్టిస్తున్నారు అంటూ అఖిల ప్లీజ్ చులకన చేయకండే, ఉన్న విషయం చెప్పాను అంతే. ఇంకా నేను అతనిని పెళ్లి చేసుకోలేదు కదా అంది. అఖిల మేం నిన్ను నిజంగానే అభినందిస్తున్నాo, నీ ఎంపిక చాలా బాగుంది. నిజానికి మేము ఫారెన్ సంబంధాల మోజుపడి చేసుకున్నాం,కానీ ఎంతో అసంతృప్తితో బతుకుతున్నాం .సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేక పోతున్నాం ,మేం చేసుకున్న వాళ్లు అక్కడ వెలగపెట్టేవి చిన్నాచితక మునిసిపాలిటీ ఉద్యోగాల్లాంటివే. దేశం కాని దేశంలో కుక్కిన పేను ల్లా అభద్రతాభావంతో ఉద్యోగాలు చేస్తూ బతకాలి.
కానీ నువ్వు చేసుకునే వెంకట్ తను పుట్టి పెరిగిన ఊళ్లోనే దర్జాగా, సొంత వ్యవసాయం చేసుకుంటూ పదిమందికి సహాయపడుతూ, మహారాజులా ఉన్నాడు. ఇంతకన్నా కావాల్సిం దేముంది అన్నారు.
వారి మాటలకి వెంకట్ మరింత ఉన్నతంగా కనిపించాడు అఖిలకి. ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!